6, ఆగస్టు 2011, శనివారం

చమత్కార పద్యాలు - 120 (ప్రహేళిక)

శ్లో.
సర్వ స్వాపహరో న తస్కరగణో రక్షో న రక్తాశనః
సర్పో నైవ బిలేశయో೭ఖిలనిశాచారీ న భూతోపి చ |
అంతర్ధానపటు ర్న సిద్ధపురుషో నాప్యాశుగో మారుతః
తీక్ష్ణాస్యో నతు సాయక స్తమిహ యే జానంతి తే పండితాః ||

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం ...
సీ.
సర్వమ్ము దోఁచు, తస్కరుఁడని యనరాదు;
రక్తమ్ముఁ గొను, కాదు రాక్షసుండు;
బిలమందు శయనింపఁగలదు, పామును గాదు;
తమమందు దిరుగు, భూతమ్ము గాదు;
నెగడి యంతర్ధాన మగును, సిద్ధుఁడు గాదు;
కడు వేగమునఁ బోవు, గాలి కాదు;
మోము వాడిగ నుండు, ములికి కానేకాదు;
*పడకఁ జేరునుగాని పత్ని గాదు
తే. గీ.
దరిసి మేల్కొల్పు, కాదు వైతాళికుండు;
చంపఁగోరెద, మది కాదు శాత్రవుండు;
శివుఁడు కొండపై, విష్ణువు శేషుపైన
నుండఁగాఁ జేసె నది యేదియో తెలుపుఁడు.
సమాధానం - (అందరికీ తెలిసిందే!) నల్లి.
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
నల్లులకుఁ జేతు కోటివందనము లిపుడు.

28 కామెంట్‌లు:

 1. శాస్త్రి గారూ,
  అనుస్వారం ముందు ఉన్న ద కు, న కు యతి సామ్యం ఉంది.

  రిప్లయితొలగించండి
 2. మాస్టరు గారూ ! క్షమించండి.
  మందాకిని గారూ! అనుమాన నివృత్తి జేసిన మీకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 3. జనుల రక్తము బీల్చెడు స్వార్ధ రాజ
  కీయ శక్తుల జూడగ న్యాయముగను
  దోచు మేలుగ దోచెడు దోమ, జలగ
  నల్లులకుఁ జేతు కోటివందనము లిపుడు

  రిప్లయితొలగించండి
 4. నులక మంచపు సందుల పులకరించి
  విందు గుడువఁగ జేరుచు వెన్ను దట్టి
  రక్తదానము గఱపినె ! భక్తి మీర
  నల్లులకుఁ జేతు కోటి వందనము లిపుడు

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  కోటి నల్లులు కూడా ఒకల్లుడి పాటి జెయ్యవు :

  01)
  _________________________________

  వల్లమాలిన ప్రేమలే - పెల్లుబుకగ
  పిల్ల నిచ్చి నే జేసితి - పెండ్లి తనకు !
  అధిక రక్తము పీల్చుటన్ - అల్లు వాడు
  మిమ్ము మించిన వాడౌట; - మిగుల ప్రీతి
  నల్లులకుఁ జేతు కోటివం - దనము లిపుడు !
  _________________________________

  రిప్లయితొలగించండి
 6. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, ఆగస్టు 06, 2011 12:04:00 PM

  మహాశివరాత్రి జాగరణకు సహకరించిన నల్లులకు ........
  అనే అర్థములో...................

  నమక చమకపు మంత్రాది నామ జపము
  భక్తి జేసితి శివరాత్రి పర్వదినము,
  నాదు నిదురను హరియించ, నాటి రాత్రి,
  నల్లులకు జేతు కోటి వందనములిపుడు.

  రిప్లయితొలగించండి
 7. సర్వ జీవుల యందును శక్తి రూప
  మందు కొలువయి యుండును మాధవుండు
  పులుల యందును, కోతుల మూకలందు,
  పాములందును, నెగిరెడి పక్షులందు,

  కుక్కలందును, పాడెడి కోకిలమ్మ
  నుండు, కీటకమగు దోమనుండు. చీమ,
  జలగ, జీవము గల్గిన జాతు లకును,
  నల్లులకు జేతు కోటి వందనములిపుడు.

  రిప్లయితొలగించండి
 8. సర్వమున తాము తమయందు సకల జగతి
  తామరాకున సలిలమ్ము తనరు భంగి
  జలధి కద్రికి నల్లు రై జగతి గాచు
  నల్లు లకు జేతు కోటి వందనము లిపుడు

  రిప్లయితొలగించండి
 9. మూర్తి గారు , కిషోర్ గారు , సంపత్ గారు మరియు మందాకినీ గారి పూరణలు బాగున్నాయి.
  రాజా రావు గారూ ! అద్భుతమండీ ! మేము నల్లుల దగ్గరే తిరుగు తున్నాము. మీరు మాత్రం ఎక్కడికో ... వెళ్లి వచ్చారు.
  అందరకు అభినండంనలు.

  రిప్లయితొలగించండి
 10. మిత్రబృందానికి వందనాలు.
  అందరి పూరణలూ చదివాను. అద్భుతంగా ఉన్నాయి.
  మళ్ళీ మధ్యాహ్నం నుండి జ్వరం తిరగబెట్టింది. పూర్తిగా నీరసంగా ఉండడం వల్ల మీ మీ పూరణలను విడివిడిగా వ్యాఖ్యానించలేక పోతున్నాను. రేపు ఉదయానికి ఆరోగ్యం కుదుట పడితే అందరి పూరణలను పరామర్శిస్తాను. మిత్రులు పరస్పరం గుణదోషవిచారణ చేస్తున్నారు కదా! సంతోషం!
  నన్ను తాత్కాలికంగా మన్నించండి.

  రిప్లయితొలగించండి
 11. డా.మూర్తి మిత్రమా!
  "నులక మంచపు సందుల పులకరించి..." పదాల కూర్పు బాగుంది. పాపం, నల్లులను కూడా సమదృష్టితో చూచి విందు ఇచ్చారు.
  రాజారావుగారు, మీ సర్వ జీవ సమభావం మెచ్చదగినదే! నల్లులు మీకు ఇంటికి వచ్చి మరీ అభినందనలు తెలిపివుంటాయి :-)

  రిప్లయితొలగించండి
 12. శంకరార్యా ! ధన్యవాదములు !
  ఆరోగ్యం కుదుట బడే వరకూ
  విశ్రాంతి దీసు కొనుడు !

  రిప్లయితొలగించండి
 13. మిత్రులు హనుమచ్ఛాస్త్రి గారికి,చంద్రశేఖరులకు ధన్యవాదములు. శ్రీ రాజారావు గారు జలధి కల్లుడు,అద్రికి అల్లుడు ల గురించి చెప్పి తన్మయింపచేసారు. కిశోర్ జీ మీ అల్లుడు ఆంగ్ల మాధ్యమికములో విద్యాభ్యాసము చేసి ఉంటారని,హిందీ భాషా ప్రావీణ్యులనియు, మీ పద్యములు చదవరనియు భావిస్తున్నాను. లేకపోతే మరో పైంటు త్రాగేస్తారు. మంచి మాటలతో మంచి చేసుకొండి.

  గురువుగారూ ఆరోగ్యము చూసుకొండి. కిడ్నీ రాళ్ళు వలన ఇన్ ఫెక్షను కలుగుతే యాంటిబయాటిక్కుల అవసరముండ వచ్చు.మంచి వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించు కొని మందులు వాడు కొనండి.

  రిప్లయితొలగించండి
 14. ఆడ మగ చిన్న పెద్దల తేడ లేక
  కుట్టి రక్తము పీల్తురు బొట్టు బొట్టు
  ప్రజల పీడించు నేతల పట్టికుట్టు
  నల్లులకు జేతు కోటివందనము లిపుడు

  రిప్లయితొలగించండి
 15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మరి ‘పేను’ను మరిచారు ... :-)
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  రక్తదానాన్ని నేర్పిన నల్లుల పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
  రక్తదానము ‘గఱపినె’ ... ‘గఱపెనె’కు టైపాటా?
  *
  వసంత కిశోర్ గారూ,
  అల్లుని కంటె నల్లులే మేలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘పీల్చుటన్ + అల్లు వాడు’ ... ‘పీల్చుట నల్లుఁ డనఁగ’ అంటే ఎలా ఉంటుంది?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  మందాకిని గారూ,
  సర్వప్రాణులలో సర్వేశ్వరుని దర్శించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  శివకేశవపరంగా మీరు చేసిన పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  మంద పీతాంబర్ గారూ,
  ప్రజాకంటకులను కుట్టే నల్లులపై మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. అజ్ఞాత గారూ,
  మీ మణిప్రవాళ పేరడీ శ్లోకంలో అనుష్టుప్ లక్షణాలు ఏమాత్రం లేవు. సవరించే అవకాశం ఉన్నా అది వ్యక్తిదూషణ, ‘కెలుకుడు’కు సంబధించింది కావడం వల్ల తొలగించాను. మన్నించండి.
  గతంలో ఒకసారి ఇలాంటి కెలుకుడు వ్యాఖ్యలు పెట్టి నా బ్లాగును వివాదాస్పదం చేయవద్దని విజ్ఞప్తి చేసాను. ఆ విషయాన్ని మరోసారి సవినయ నమస్కారాలతో గుర్తుకు తెస్తున్నాను. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 17. నా ఆరోగ్యం గురించి పరామర్శించిన కవిమిత్రు లందరికి ధన్యవాదాలు. ఇప్పుడు ఫరవాలేదు.

  రిప్లయితొలగించండి
 18. గురువుగారూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి.

  శ్రీ రాజారావు గారి పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ,
  వారి పూరణ భావాన్ని బహుధా ప్రశంసిస్తూ,
  మన్నించమని కోరుతూ

  గురువుగార్కి

  చిన్న సందేహం
  అల్లుళ్ళను అల్లులు అనవచ్చునా

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  అనరాదు. అల్లుడుకు బహువచనం అల్లురు, అల్లుండ్రు. (వ్యావహారికంలో అల్లుళ్ళు).

  రిప్లయితొలగించండి
 20. గురువుగారూ ధన్యవాదాలు.
  బహుశా నేను శ్రీ రాజారావు గారి పద్యపు నాల్గవ పదాన్ని అర్థం
  చేసుకోలేక పోయా ననుకొంటున్నాను.

  రిప్లయితొలగించండి
 21. శంకరార్యా ! ధన్యవాదములు. మీ ఆరోగ్యము కుదుటబడినందుకు సంతోషముగా నున్నది.

  రిప్లయితొలగించండి
 22. మిస్సన్న గారూ,
  మీరు సరిగానే అర్థం చేసుకున్నారు. రావు గారు ‘అల్లుండ్రు’ అనే అర్థంలోనే ‘అల్లులు’ అన్నారు. వసంత కిశోర్ గారు కూడా ఒక పూరణలో అదే అర్థాన్ని తీసుకున్నారు. అది దోషమే! కొన్ని దోషాలను చూసీ చూడనట్టు వదలివేస్తుంటాను (మొహమాటంతో).

  రిప్లయితొలగించండి
 23. గురువుగారూ సందేహ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
  తప్పు లెంచా లన్నది నా ఉద్దేశ్యం కాదు.
  నాకు నిఘంటువు చూసే అవకాశం లేక మరొక విశేషార్థం గల
  నల్లులు లేక అల్లులు అనే మాట ఉందేమోనని అనుకొన్నాను.
  ఎందుకంటే శ్రీ రాజారావు గారే పై పాదంలో అల్లురు అనే మాట వాడేరు కదా.
  రాజారావు గారు మంచి కవి.
  గురువుగా మీరు ఆ మాత్రం మినహాయింపు లేక సడలింపు యివ్వడం సముచితం.
  నేను వ్రాసిన చాలా దోషాలు మీరు పట్టించుకోని సంగతి కూడా నాకు తెలుసును.
  కిశోర మహోదయుని పద్యం నేను గమనించ లేదు.

  రిప్లయితొలగించండి
 24. ఏమైనా అల్ప ప్రాణి నల్లి మీద ఇన్ని వైవిధ్యమైన, మనోహరమైన పూరణలను మిత్రులన్దిస్తారని ఏమాత్రం ఊహించ లేదు. చాలా ఆనందం కల్గింది.

  రిప్లయితొలగించండి
 25. ఇంకొక నిదానం టపాకాయ.
  దీనికి కూడా కారణం, ఆగష్టు నాటికి నేనీ బ్లాగుకు అపరిచితుడను కావటమే.
  నల్లిని గూర్చి చిలకమర్తివారి పద్యం:

  శివు డద్రిని శయనించుట
  రవిచంద్రులు మింట నుంట రాజీవాక్షుం
  డవిరళముగ పాము పైన
  పవళించుట నల్లి బాధ పడలేక సుమీ.

  రిప్లయితొలగించండి
 26. ‘శ్యామలీయం’ గారూ,
  చక్కని పద్యాన్ని గుర్తు చేసారు. ధన్యవాదాలు.
  కాని మూడవ పాదంలో గణదోషం ఉంది. ‘ముపైన’ బేసిస్థానంలో జగణం.
  అది ‘అవిరళముగ శేషునిపై / పవళించుట నల్లి బాధ ....’

  రిప్లయితొలగించండి