7, ఆగస్టు 2011, ఆదివారం

సమస్యా పూరణం -419 (శ్రావణ మాసమందు)

వారాంతపు సమస్యాపూరణం
కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ....
శ్రావణ మాసమందు నగ
జాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్.
ఈ సమస్యను పంపిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

 1. ఆ వనజాక్షు లందరును హాయిగ జేరుచు నొక్కచో సుహృ
  ద్భావన, సౌఖ్యముల్ గలుగ భౌముని వారము మ్రొక్కినారుగా
  శ్రావణ మాసమందు నగ జాతకు; మ్రొక్కిరి శుక్ర వారముల్
  భావన జేయుచున్ మదిని భాగ్యము గల్గెనటంచు లక్ష్మికిన్.

  రిప్లయితొలగించు
 2. హనుమచ్చాస్త్రి గారూ ఏమైనా మీరూ, మీ పద్యం ఎప్పుడూ ఫస్టే.

  రిప్లయితొలగించు
 3. లెస్స బల్కితిరి మిస్సన్న గారూ !

  శ్రావణ మాసమందుటను శాస్త్రులు చెప్పిరి మంచి పద్యముల్ !

  రిప్లయితొలగించు
 4. మిస్సన్న గారూ ! మూర్తి గారూ ! ధన్యవాదములు.
  అంతా మీ అబిమానం . శంకరార్యుల బ్లాగు మహాత్మ్యం.

  రిప్లయితొలగించు
 5. జీవనమెల్లఁ గొల్చితిని శ్రీవరలక్ష్మిని నాదుమానసమ్
  మ్మావరదాయినిందిరను, మాగృహమందున లేదు యీ వ్రతమ్
  శ్రావణ మాసమందు. నగజాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్
  భావనఁ జేసి పెద్దలును పార్వతి మాతయె నన్ని రూపముల్.

  రిప్లయితొలగించు
 6. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, ఆగస్టు 07, 2011 11:51:00 AM

  ఏవిధమైన పూజకును హేరుకుడాదియుపాసనుండుగా
  నావిధమున్ వినాయకుడునంబ సమేతుడు గాగ వచ్చె, సం
  భావితమైన యిట్టిదగు భాగ్యము దల్చుచు భక్తకోటి యా
  శ్రావణ మాసమందు నగజాతకు మ్రొక్కిరి శుక్రవారముల్.

  రిప్లయితొలగించు
 7. వరలక్ష్మి వ్రతము చేసే పద్ధతి మాయింట లేనందున మనసునందే పూజ చేసుకుంటాను.
  మా ఇంటి పెద్దలు అన్నీ ఆ శక్తి రూపములే నని భావించి పార్వతిని శుక్రవారాలు కొలిచారు
  అని నా పద్య భావము.

  రిప్లయితొలగించు
 8. శ్రావణమాస మందుదధిజాతకు మ్రొక్కుట శుక్ర వారముల్,
  పావన సోమవారములు పార్వతి పూజలు కార్తికమ్ములో-
  నీ విధి చోద్య మయ్యెగద!నేడు గడుంగడు భక్తి మీరుటన్
  శ్రావణ మాసమందు నగ జాతకు మ్రొక్కిరి శుక్రవారముల్

  రిప్లయితొలగించు
 9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని ధారతో సుందరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  మందాకిని గారూ,
  చక్కని భావనతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
  ‘మానసమ్/ మ్మా వరదాయిని’ ఇక్కడ పాదాంతమకారం అవసరం లేదు. ‘మానస/మ్మావరదాయిని’ అంటే సరి! ఇక మూడవ పాదంలో ‘మాగృహమందున లేదు యీ వ్రతమ్’ అని ముప్రత్యయం లేకుండా హలంతంగా వ్రాసారు. ‘మా గృహమందు వ్రతమ్ము లేదులే’ అంటే సరిపోతుం దనుకుంటాను. ఏమంటారు?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
  వరలక్ష్మీవ్రత ప్రారంభంలో పసుపు గౌరమ్మను పెట్టి వినాయకునితో పాటు పూజించే సంప్రదాయం ఉంది కదా!
  *
  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  మీ పూరణ బహుబాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించు
 10. గురువు గారూ, ధన్యవాదములు
  మానసమ్ " టైపాటు. అది అక్కరలేదు.
  వ్రతమ్ విషయంలో మీ సవరణ బాగున్నది.

  రిప్లయితొలగించు
 11. శ్రీ వసుధాఖ్యవై, ధరను శ్రీల నిడన్ వరలక్ష్మి వై, సుహృ-
  ద్భావము నేలు బ్రాహ్మివయి, భారత ధాత్రిని వేద మాతవై,
  పావనమైన శ్రీ గిరిని భ్రామరివై జగమేలు దంచు నీ
  శ్రావణ మాసమందు నగ జాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్.

  రిప్లయితొలగించు
 12. ఆవెలిగుబ్బఁశైలతనయాసఖియల్ వరలక్ష్మిమాతనే
  భావనజేసిశ్రధ్ధగ ప్రభాతమునన్ వ్రతమాచరించుచున్,
  ఆవరదాయినిన్ గొలిచి నందున వాయన మిచ్చువేళలో-
  శ్రావణమాసమందు నగజాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్.

  రిప్లయితొలగించు
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,

  నిన్ననే - కొన్ని పాత పూరణలు చూస్తూ అనుకున్నాను .. ఎంత బాగా వ్రాస్తున్నారో అని ( గొడుగు కలిగి కూడ, సరిగమల నిగమ శర్మ.. మొ||)
  అనేక ధన్యవాదములు...

  రిప్లయితొలగించు
 14. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 07, 2011 11:19:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  శ్రీవరలక్ష్మినిన్ గొలువ శ్రీకరమౌను శుభంబు కల్గెడిన్
  శ్రావణ శుక్రవారములు శ్రద్ధగ పూజలనాచరించినన్
  పావన పుణ్యమూర్తి యగు పార్వతినాథుడు దాను జెప్పె నా
  శ్రావణమాసమందు నగజాతకు, మ్రొక్కిరి శుక్రవారముల్

  రిప్లయితొలగించు
 15. మిస్సన్న గారూ,
  మీ ‘పద్యం - హృద్యం’ బ్లాగులోని ‘చిన్మయరూపిణి’ని దర్శింపజేసారు. హృద్యమైన పద్యంతో పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  ఊకదంపుడు గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. ధన్యవాదాలు.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.

  రిప్లయితొలగించు
 16. గురువుగారూ ధన్యోస్మి. మీ బోటి గురువుల కృప, జనని కరుణ!

  రిప్లయితొలగించు
 17. శ్ర్రీ వరలక్ష్మి రూపమునుఁ జిత్తముఁనిల్పుచుఁ బూజ చేతురీ
  శ్రావణమాసమందు; నగజాతకు మ్రొక్కిరి శుక్రవారముల్
  గావుమటంచు నా లలిత గాన్, మరి శారద వంచు గొల్తురే,
  పావనమూర్తివై జనుల పాపము బాపవె శక్తిరూపిణీ.

  రిప్లయితొలగించు
 18. శంకరార్యా! ధన్యవాదములు.
  శ్రావణ శోభ తో బ్లాగును వెలిగిస్తున్న కవిమిత్రు లందరకు అభినందనలు.
  ఊకదంపుడు గారూ! ఓపికగా పాత పూరణలు కూడా చూస్తూ మీ అభినందనలు తెలుపుతూ ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 19. ఏ విధి యైననేమి?కమలేందుముఖార్చిత పుష్పమౌ కడన్
  భావము సల్పి చేసిరొకొ భామిను లింపుగ సోమవారమున్
  శ్రావణమాసమందు నగజాతకు మ్రొక్కిరి; శుక్రవారముల్
  శ్రీవరలక్ష్మికిన్;శనికి రీతిగ భారతికిన్యథావిధిన్;

  రిప్లయితొలగించు
 20. మందాకిని గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  రవి గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించు
 21. బావురు మంచుచున్ నవత బంజర హిల్సున వేడుకోలులో
  వేవురు దేవ రూపముల వేరగు మాసములల్లజాలకే
  కావుము మమ్మటంచుమని కమ్మగ కూడుచు దేవళమ్ములో
  శ్రావణ మాసమందు నగజాతకు మ్రొక్కిరి శుక్ర వారముల్

  రిప్లయితొలగించు