27, ఆగస్టు 2011, శనివారం

సమస్యా పూరణం -439 (వానకాలమ్ము వచ్చిన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె.
ఈ సమస్యను సూచించిన
లక్కాకుల వెంకట రాజారావు గారికి
ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    __________________________________

    వాయుగుండము లేర్పడి - వరుస గాను
    వానధారలు ముంచెత్తె - వసుధ నంత !
    వారమంతయు తగ్గిన - వాజజంబు
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________
    వాజజము = ధనము

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్:
    ఉష్ణతాపమ్ము దీరగ ఊపిరాడె
    నంచు జనులుహా యిగనుండ! యకట బేర
    సారములుపోయె నంచును సణగి గొణుగి
    వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!
    మనవి: వైద్య రత్నాకర కవి మిత్రులకు క్షమాపణలతో; ఆయితే
    వానాకాలంకూడా వారికి మంచిదే, రోగుల సంఖ్య యేమీ తగ్గదంటారా, అదీ నిజమే!

    రిప్లయితొలగించండి
  3. కిశోర్ జీ ! బాగుంది. వాయుగుండం గండం ....

    వానకాలమ్ము జబ్బులు బాగ వచ్చు
    హెచ్చు రోగులు ఫీజులు పెచ్చు వచ్చు
    మంచమందున పడు రోగ మదియ తనకు
    వానకాలమ్ము వచ్చిన; వైద్యుఁ డేడ్చె.

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖరా ! బావుంది !
    శాస్త్రీజీ ! బావుంది !

    పైది ప్రైవేటు డాక్టరైతే,యిది ప్రభుత్వ డాక్టరు పరిస్థితి :

    02)
    __________________________________

    వింత రోగము ప్రబలెను - వేగముగను
    వ్యాధిగ్రస్థులు నిండిరి - వార్డు లందు !
    విరతి లేకుండ పనిజేయ - విసుగు తోడ
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________

    రిప్లయితొలగించండి
  5. ఇక్కడ వానా కాలములో పాక కేగిన వైద్యుడి గురించి ;

    ఆతపత్రము లేకనె యాత్ర పడుచు
    పైత్య మెక్కువ రోగికి పాక కేగి
    ప్రీతి వైద్యము నొసగగ ఫీజు నీరె
    వాన కాలమ్ము వచ్చిన ,వైద్యు డేడ్చె !

    రిప్లయితొలగించండి
  6. కిశోర్ జీ, హనుమఛ్ఛాస్త్రి గారూ,చంద్రశేఖరులూ, మీ పూరణలు అదిరాయి. కాజా సురేష్ గారూ నిన్న చక్కని పద్యము చెప్పారు. ఈవేళ వానలు కురిపించండి.వర్షాలు లేక మా చెట్లకి నీళ్ళు పొయ్యడానికి గంటన్నర పట్టింది.

    రిప్లయితొలగించండి
  7. ఏడు రోజులు వదలక ఏరు పొంగె
    పట్నమందున ప్రాక్టీసు పడక జేరె
    స్వంత గ్రామము జూడగ నింతి తోడ
    వాన కాలమ్ము వచ్చిన ,వైద్యు డేడ్చె !

    రిప్లయితొలగించండి
  8. మూర్తీజీ ! మీ పాక వైద్యం బావుంది ! పాపం ఫీజే ?
    శాస్త్రీజీ !ఇది కూడా బావుంది !

    వైద్య ప్రముఖుల conference కు బయలుదేరిన ఒక డాక్టరు గారు :

    03)
    __________________________________

    వైద్య విఙ్ఞాన పరిషత్తు - వేది కందు
    వెజ్జులందరు జేరిరి - విబుధవరులు !
    వరద లొచ్చిన పొంగెను - వాగులన్ని
    వెళ్ళుటకు దారి లేకున్న - వేళ నొక్క
    వానకాలమ్ము వచ్చిన; - వైద్యుఁ డేడ్చె !
    __________________________________

    రిప్లయితొలగించండి
  9. కిశోర్ జీ ధన్యవాదములు ' ఒచ్చిన ' శాస్త్రి గారు పట్టుకొంటారు!

    రిప్లయితొలగించండి
  10. కిశోర్ జీ మీ పూరణ లన్నీ చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  11. మూర్తీజీ ! ధన్యవాదములు ! యిదిగో సవరించాను !

    వైద్య ప్రముఖుల conference కు బయలుదేరిన ఒక డాక్టరు గారు :

    03అ )
    __________________________________

    వైద్య విఙ్ఞాన పరిషత్తు - వాటి కందు
    వెజ్జులందరు జేరిరి - విబుధవరులు !
    వరద వచ్చెను పొంగెను - వాగులన్ని
    వానకాలమ్ము వచ్చిన; - వైద్యుఁ డేడ్చె
    వెళ్ళుటకు దారి లేకున్న - వేళ నొకడు !

    __________________________________

    రిప్లయితొలగించండి
  12. చంద్ర శేఖర్ గారూ ! మంచి పూరణ .
    కిషోర్ జీ ! ధన్యవాదములు.
    మూర్తి గారూ ! ఫీజు (నీరె ) " నీరైన" పూరణ బాగుంది.
    నా మార్కు "ఒచ్చిన " ను "నా కొదలి " నందులకు ధన్యవాదములు.
    కిశోర్జీ ! ఒదలిని వదలండీ.... దయచేసి నావద్దకు పంపకండి !

    రిప్లయితొలగించండి
  13. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    ఒదిలేశా -కాదు -కాదు- వదిలేశా !

    రిప్లయితొలగించండి
  14. వసంత మహోదయా! హనుమంతుడు - నారసింహుడు ఒకటే. అందుకే అన్నారు - వందే వానర నారసింహ ఖగరాట్...వాళ్ళిద్దరూ కలిసి మీ పనిపడుతున్నారు. జాగ్రత్త సుమీ :-)

    రిప్లయితొలగించండి
  15. వానాకాలం power cut పాట్లొక వైద్యునకు :

    04)
    __________________________________

    ఆయిలే లేక జనరేట - రాగి పోయె
    ఆపరేషను జరిగెడు - నవసరమున
    ప్రాణములు పోయె రోగికి - పవరు పోవ !
    పట్టరాని కోపంబున - ప్రజలు జేరి
    పాప మా వైద్య ప్రముఖుని - పట్టి గొట్ట
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె!
    __________________________________

    రిప్లయితొలగించండి
  16. చంద్రశేఖరా ! మీ సలహాకు ధన్య వాదములు !
    కోతుల్ని ,సింహాల్ని పట్టే బోన్లు కొనుక్కుంటా !

    రిప్లయితొలగించండి
  17. కాలముకలిసి రాకవర్షాలు లేని
    వానకాలమ్ము వచ్చిన,వైద్యు డేడ్చె,
    యేడ్చె రైతన్న, జనులెల్ల యేడ్చిరకట
    యెట్లు గడచును జీవించుటెట్లుననుచు !!!

    రిప్లయితొలగించండి
  18. ధర్మాసుపత్రి నడిపే వైద్యులు :

    05)
    __________________________________

    ధనము కోసము జూడక - ధర్మముగను
    ధరణి వైద్యులు , సేవల - దనరుచుండు !
    ధన్య జీవులు లోకాన - ధర్మ పరులు !
    దర్పమించుక లేనట్టి - ధరణి పతులు !

    తాము సుఖములు గోల్పోయి - క్షేమ మొసగ
    వ్యాధి బాధల రోగుల - బాగు జేయు
    వ్యాప్తి జెందిన రోగాలు - వాడలందు
    వాన కాలమ్ము వచ్చిన ! - వైద్యుఁ డేడ్చె
    వ్యాధి నెవరైన చనిపోవ - బాధ నొంది !
    __________________________________
    ధరణి పతి = హరి ( వైద్యో నారాయణో హరిః)

    రిప్లయితొలగించండి
  19. మొదటిది ప్రైవేటు డాక్టరైతే,యిది ప్రభుత్వ డాక్టరు పరిస్థితి :

    02అ)
    __________________________________

    వింత రోగము ప్రబలెను - వేగముగను
    వరుస రోగులు పెరిగిన - వార్డు లందు
    విరతి లేకుండ , బనిజేయ - విసుగు తోడ
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________

    రిప్లయితొలగించండి
  20. జిగురు సత్యనారాయణశనివారం, ఆగస్టు 27, 2011 12:08:00 PM

    వాగు కడ పూరి పాకయె వైద్యశాల
    ఏరు పొంగిన లోనికి నీరు వచ్చు
    నీరు వచ్చిన వైద్యుడు నిలువ లేడు
    వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!!

    రిప్లయితొలగించండి
  21. నా పూరణ ...

    రైతు లెపుడు విత్తనముల వేతురయ్య?
    ధనికుఁడై దీర్ఘరోగియౌ మనుజుఁ డొకఁడు
    మరణమును పొంది నపు డేమి జరిగెనయ్య?
    వానకాలమ్ము వచ్చిన; వైద్యుఁ డేడ్చె.

    రిప్లయితొలగించండి
  22. రోగముల బారి పడకుండ, బాగు కోరి
    మందు మాకులనిచ్చినాడందరికిని
    వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ, డేడ్చె
    బాలుఁడా మందు పడదంచు వద్దటంచు.

    రిప్లయితొలగించండి
  23. సంపత్ కుమార్ శాస్త్రిశనివారం, ఆగస్టు 27, 2011 2:14:00 PM

    భూమి పులకించు, సెలయేళ్ళు పొంగి పారు,
    కర్షకానంద ముఖముల గానవచ్చు,
    వాన కాలమ్ము వచ్చిన, వైద్యుడేడ్చె
    డి తన రోగినో దార్చి తా టీక వేసె.

    టీక = సూది మందు

    రిప్లయితొలగించండి
  24. వసంత కిశోర్ గారూ,
    ఇప్పటి వరకు చేరిన మీ ఐదు పూరణలు బాగున్నాయి.
    ఐదుగురు వైద్యులను ఐదు రకాలుగా ఏడ్పించిన మీ నైపుణ్యానికి అభినందనలు.
    3వ పూరణలో ‘వాటి కందు’ అన్నచోట ‘వాటిక యట’ అందాం.
    4వ పూరణలో ‘వైద్యప్రముఖుని’ అన్నచోట ‘ప్ర’కు ముందున్న ‘ద్య’ గురువై గణదోషం వస్తుంది. ‘వైద్యశేఖరు’ అంటే సరి!
    5వ పూరణలో ‘తనరుచుండు’కు బహువచన రూపం ‘తనరుచుంద్రు’.

    రిప్లయితొలగించండి
  25. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, ఆగస్టు 27, 2011 2:36:00 PM

    కడుపునొప్పిరోగి కడుపు గంటు బెట్టి
    యాపరేషను జేయగా పేపరందు
    నతడు కిడ్నీని దీసిన హస్త లాఘ
    వాన ' కాలమ్ము ' వచ్చిన వైద్యు డేడ్చె

    రిప్లయితొలగించండి
  26. జిగురు సత్యనారాయణశనివారం, ఆగస్టు 27, 2011 2:40:00 PM

    జల్లు లెక్కువైన తనకు జలుబు సేయు
    వెజ్జు రోగిగ మారెను వింత యనుచు
    పలుచ దనముఁ జేసి ప్రజలు పల్కుననుచు
    వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె!!

    రిప్లయితొలగించండి
  27. చంద్రశేఖర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    నాకు తెలిసినంత వరకు వైద్యులకు వానాకాలమే చేతినిండా పని, తద్వారా అధిక సంపాదన! [మూర్తి గారూ, మన్నించాలి :-) ] ఆ కాలంలోనే జలుబులు, అతిసారాలు, వైరల్ ఫివర్ తదితరాల వల్ల ఆసుపత్రులు కిటకిటలాడుతూ ఉంటాయి. (చూ. గోలి వారి పూరణ).
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    స్వభావోక్తితో మీ రెండు పూరణలు బాగున్నాయి. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    వాహ్! చమత్కార మున్న పూరణ. బాగుంది. అభినందనలు.
    మీ పూరణలోని శ్లేష అదిరింది. ‘ఫీజును + ఈరె; ఫీజు - నీరె (c/0 గోలి వారి వ్యాఖ్య). అద్భుతం!
    ‘ఇక్కడ’ అన్నారు. అంటే అమెరికాలో పాక లున్నాయా? ఫాం హౌజా?
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీరు వైద్యుణ్ణే కాదు అందరినీ ఏడ్పించారు. చాలా బాగుంది. అభినందనలు.
    చివర ‘జీవించు టెట్టు లనుచు’ అంటే బాగుంటుంది.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    వైద్యుణ్ణి ఏడ్పించని పూరణ మీ దొక్కటే! శ్రేష్ఠమైన పూరణ. అభినందనలు.
    (ఎన్ని రకాలుగా ఆలోచించినా నాకు తట్టని ఆలోచన మీది!) నమస్సులు!
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మన్నించాలి. వైద్యుణ్ణి మీరు కూడా ఏడ్పించలేదు కదా! చింతా వారొక్కరే అనుకున్నాను.
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ అందరికంటే వైవిధ్యంగా ఉంది. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ‘చులకన’ అవుతానన్న వైద్యుని ఏడుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. బాలలందరు నాడిరి పడవ యాట
    వాన వచ్చిన సంబరపడిరి; వచ్చె
    వానకాలమ్ము; వచ్చిన వైద్యుడేడ్చె
    చిలిపి యాటల బాలురఁ జేరి యాడి.


    పూరిపాకను నివసించు ముద్దు బాబు
    వాన యందును తడిచెను పాప,డిపుడు
    వాన కాలమ్ము; వచ్చిన వైద్యుడేడ్చె
    బాబు మూల్గుట జూచుచు బాధ కలిగి.

    రిప్లయితొలగించండి
  30. మంద పీతాంబరా !స్తుతి మంతులయ్య
    కలిసిరానట్టి కాలాన నలుగు జనుల
    కష్ఠ సుఖముల స్పందించు కవులు మీరు
    బిట్టు సవరణ - 'జీవించు టెట్టులనుచు'

    రిప్లయితొలగించండి
  31. రోజు రోజుకు పెరిగిరి రోగులనగ
    పెట్టె నిండెను మెండుగ లాభమంచు
    పట్టు చీరెలు కొనమని భార్య పోరు
    వాన కాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె !

    " ఆరుద్ర గారి
    ఆలి కొన్నది కోక
    అంతరిక్షపు నౌక
    అంత కంటెను చౌక ! " అన్న రీతిలొ

    రిప్లయితొలగించండి
  32. శ్రీ రాజారావు గారు మీ పద్య రూపక ప్రశంసకు మరియు సూచించిన సవరణకు కృతఙ్ఞతలు .
    మీ పూరణలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి మీకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  33. శంకరార్యా ! ధన్యవాదములు.
    వైద్యుని రకరకాలుగా ఏడ్పించిన కవిమిత్రులన్దరకు ధన్యవాదములు.
    ఈ పూరణలు చుసిన వైద్యులు మమ్ములను మన్నింతురు గాక.
    కిషోర్ జీ ! మీరు బోను తీసుకు రాగానే చెప్పగలరు. జాగ్రత్త పడతాము. అప్పటి వరకు మాత్రం ....అవకాశం ఇస్తారు కదూ ! ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  34. చంద్రశేఖర్:
    సాగుబడి రైతు చక్కగ సంతసించు
    వానకాలము వచ్చిన; వైద్యు డేడ్చు
    రోగి పరలోక గతుడైన, రోగహారి
    కూడ మనసున్న మనిషియె కూడబలుకు!
    మనవి: నేను ఒక కార్డియాలజిస్టు ఫ్రెండ్ని అడిగాను, "పేషంట్ పొతే మీరు ఏడుస్తారా" అని, అప్పుడ ఆయన అన్న మాటలు, "మేము కూడా మనుషులమే కదా, ఒక్కొక్కసారి పేషంటు బంధువులకన్నా మేమే ఎక్కువ బాధ పడతాము. అయితే పైకి కన్నీళ్లు కనిపించవు అంతే " .

    రిప్లయితొలగించండి
  35. గురువు గారూ ధన్యవాదములు.ముందు ఫీజు నీక అని వ్రాసి ఫీజు లేక పోతే పోయింది ఈక లెందుకని ఫీజు నీరె అని మార్చాను. శ్లేష బాగా కుదిరింది. అమెరికాలో పాకలు లేకపోయినా పేదరికము ఉంది, పైత్యము కూడా ఎక్కువ గానే ఉంది ( మీకు తెలిసినదే !).
    కిశోర్ జీ మీ పద్యాలలో మమ్మల్ని ఎప్పుడో బంధించారు. అందుకే మధ్య మధ్యలో కిచకిచలు,గాండ్రిపుల వంటి పిల్లికూతలు వినిపిస్తుంటాము.

    అక్కయ్య గారు నా ఏడుపు నేను ఏడవకుండా యతి కోసం మీ పద్యానికో చిన్న సవరణ :

    రోజు రోజుకు పెరిగిరి రోగులనగ
    పెట్టె నిండెను డాబుగ కట్ట దలచి
    పట్టు చీరెలు కొనమని భార్య పోరు
    వాన కాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె !

    రిప్లయితొలగించండి
  36. హృదినికోయువేళహృదయములుగలిసెఁ
    గాని చెప్పలేడు, కాంత వలెనె;
    సమయ మెంతొలేదు, సంపూర్ణమౌవిద్య
    వానకాలము వచ్చిన; వైద్యు డేడ్చు!!!

    రిప్లయితొలగించండి
  37. బాగుంది మూర్తి గారూ ! " పెట్టె , కట్ట " నాకు తట్ట లేదు. చూసారా ? ఒక్కొక్కరి భావాలు ఒక్కొక్క లా ఉంటాయి మరి.,
    మొన్న కుడా " సాంద్ర తీరాన నే జేరి సేద తీర " అంటే సరిపోనేమో ! మంచి పద్యం .సరిగా వ్రాయలేదన్న బాధ . ఈ మధ్య బొత్తిగా ప్చ్ !
    ఆరుద్ర గారి కవిత బాగుంది కదూ !

    రిప్లయితొలగించండి
  38. ఆక్కయ్య గారూ మీరు చక్కని పద్యాలు చెప్పుకు పొండి. గురువుగారు చూసుకొంటారు మిగిలినవి.
    ఊకదంపుడు గారూ నమస్కారములు. మీకు ఆటవెలదిపై మక్కువని నాకు తెలుసు. కాని యీ సారి తేటగీతిని నుడువుడు.

    రిప్లయితొలగించండి
  39. పాత సైకిలు నొకదాని పైన యెక్కి
    పల్లెటూళ్ళలో తిరిగెడు వైద్యుడొకడు
    రోడ్డులన్నియు తెగిపోయి రొచ్చు గలుగ
    వానకాలమ్ము వచ్చిన వైద్యుఁ డేడ్చె.

    రిప్లయితొలగించండి
  40. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
    శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
    శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    మూర్తీజీ ! ధన్యవాదములు !

    ఇదీ ప్రభుత్వ డాక్టరు పరిస్థితి :

    6)
    __________________________________

    ఆపరేషను చేయుట - కైదు వేలు
    ఇమ్మనడిగెను చిక్కెను - ఏసిబీకి !
    చెదర ధైర్యము , యొడలికి - చెమట పట్ట
    వానకాలమ్ము, వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________

    రిప్లయితొలగించండి
  41. ఇదీ ప్రైవేటు డాక్టరు పరిస్థితి :

    7)
    __________________________________

    రాత్రి పవలును రోగుల - రక్ష సేయు
    వెజ్జుడింటికి రాకున్న - వేదన బడి
    చెలియ యలుకను పుట్టిల్లు - చేరిపోవ
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________
    చెలియ = భార్య

    రిప్లయితొలగించండి
  42. హరి గారూ మీ పూరణ "పాత సైకిలు నొకదాని పైన యెక్కి" బాగుంది.

    రిప్లయితొలగించండి
  43. ఇదింకొక ప్రైవేటు డాక్టరు పరిస్థితి :

    8)
    __________________________________

    స్లాబు కన్నంబు లోనుండి - బాగు గాను
    వాన కురియగ తడిసిన - వార్డు లందు
    వెతలు పడలేక రోగులు - వెడలి పోవ
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________

    రిప్లయితొలగించండి
  44. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 28, 2011 7:34:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    ఎండకాలము తర్వాత నేమి వచ్చు ?
    జ్వరము తగ్గగ మందులు వ్రాసిరెవరు ?
    వైద్యు డేతెంచ నేంజేసె బాలుడంత ?
    వానకాలమ్ము, వచ్చిన వైద్యు, డేడ్చె

    రిప్లయితొలగించండి
  45. ఇదింకొక ప్రైవేటు డాక్టరు పరిస్థితి :

    8అ)
    __________________________________

    స్లాబు కన్నంబు లోనుండి - చల్ల గాను
    వాన కురియగ తడిసిన - వార్డు లందు
    వెతలు పడలేక రోగులు - వెడలి పోవ
    వానకాలమ్ము వచ్చిన - వైద్యుఁ డేడ్చె !
    __________________________________

    రిప్లయితొలగించండి