16, ఆగస్టు 2011, మంగళవారం

సమస్యా పూరణం -428 (కమలజునకు భార్య)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కమలజునకు భార్య కమలయె గద!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20 వ్యాఖ్యలు:

 1. చదువు లిచ్చును సతియయ్యి శారదాంబ
  కమలజునకు; భార్య కమలయె గద
  సిరుల నిచ్చును హృది నిలిచి హరికి, జూడ
  శక్తి నిచ్చును పార్వతి శంకరునకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. చిన్న సవరణ తో ..

  చదువు లొసగును ఆలు యై శారదాంబ
  కమలజునకు; భార్య కమలయె గద
  సిరుల నిచ్చును హృది నిలిచి హరికి, సతిగ
  శక్తి నిడుగద పార్వతి శంకరునకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పంచ పాండవు లెందరు ? పరగ జెప్పి
  పట్టు కొని పొండు లక్ష రుపాయ లనెడు
  టీవి క్విజ్జున జెప్పెను ఠీవి యొకడు
  'కమలజునకు భార్య కమలయె గద! '

  ప్రత్యుత్తరంతొలగించు
 4. సంపత్ కుమార్ శాస్త్రిఆగస్టు 16, 2011 9:44 AM

  విష్ణుమూర్తి, చూడ పితృదేవుడైనొప్పు
  కమలజునకు, భార్య కమలయెగద,
  జగతి నెల్ల బ్రోచు, సజ్జనురక్షించు,
  ధర్మమునునిలుపును ధరణి యందు.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. వాక్కు వాక్కుయందు వసియించుశారద
  కమలజునకు భార్య ;కమలయెగద
  అజుని కన్నతల్లి;ఐననేమిఫలము
  విత్తముండుచోట విద్యగనము !!!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సంపత్ కుమార్ శాస్త్రిఆగస్టు 16, 2011 7:09 PM

  హనుమచ్చాస్త్రి గారు,

  హృదినిల్చి అని వుండాలి కద...... లేకపొతే గణము సరిపోదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. సంపత్ కుమార్ శాస్త్రిఆగస్టు 16, 2011 7:12 PM

  అయినా సరిపోదేమో శాస్త్రి గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ రెండు పూరణలూ సమస్య పాదం ఆటవెలది ఐనా తేటగీతిలో వైవిధ్యంగా ఉన్నాయి.
  మొదటి పూరణలో ‘ఒసగును + ఆలుయై’ అని విసంధిగా వ్రాసారు. ‘ఒసగును భార్యయై’ అంటే సరి!
  రెండవ పూరణలో ‘ఠీవి + ఒకడు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఠీవి నొకడు’ అందాం.
  ఇక మీ తేటగీతి పాదాలకు నా ఆటవెలది రూపాలు ...
  1)
  చదువు లొసగు తల్లి శారదాంబయె సతి
  కమలజునకు; భార్య కమలయె గద
  సిరుల నిచ్చు మెచ్చు శ్రీహరికి, సతిగ
  శక్తి నొసగు నంబ శంకరునకు.
  2)
  పంచ పాండవులన నెంచి యెందరొ చెప్పి
  లక్ష రూప్యముల ఫలము గొనుడను
  టీవి క్విజ్జులోన ఠీవిఁ జెప్పె నొకండు
  'కమలజునకు భార్య కమలయె గద! '

  ప్రత్యుత్తరంతొలగించు
 9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  ‘పితృదేవుడై + ఒప్పు‘ అనేది ‘పితృదేవుడై యొప్పు’ అవుతుంది.
  *
  మంద పీతాంబర్ గారూ,
  ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  ‘వాక్కునందు’ అని ఉండాలనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. కవి మిత్రులారా,
  చింతా రామకృష్ణారావు గారు తమ ‘ఆంధ్రామృతం’ బ్లాగులో ‘కట్టమూరి’వారి అవధాన సమస్యల పరంపరలో ఈ రోజు రెండవ పూరణ నిచ్చారు.
  "పత్రముతో కోయ ఒరిగె వటభూరుహమున్"
  వారి బ్లాగును దర్శించి, అక్కడే పై సమస్యను పూరించవలసిందిగా మనవి.
  దాని లింకు ...
  http://andhraamrutham.blogspot.com/2011/08/2.html

  ప్రత్యుత్తరంతొలగించు
 11. చంద్రశేఖర్ఆగస్టు 16, 2011 7:55 PM

  మాస్టారూ, సందేహం - పత్రముతో కోయ నొరిగె...: (కోయను+ఒరిగె) అంటే అర్థం మారిపోతుందా? "కోయ ఒరిగె" సమంజసమేనా? అయితే యే అర్థములో తీసుకోవాలి? వివరించగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. చంద్రశేఖర్ గారూ,
  ‘కోయ(న్)’ అన్నప్పుడు ‘కోయగా, కోయుట అనే పనిని చేయను’ అని రెండు అర్థాలను గ్రహించవచ్చు. ఇలా విపరీతార్థాలను సాధించడమే కదా సమస్యాపూరణలోని చమత్కారం!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇంకా కొందరు మిత్రులు హోంవర్క్ చేయలేదేమో? బడి ఎగ్గొట్టారు :-)
  లేక లేట్ కమర్స్ .. అనుకుంటా!

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బలికె హరియె, "వాణి పత్నిగఁ దగు మన
  కమలజునకు", భార్య కమలయెగద
  విబుధునకునుఁ దగిన వెలది యా శారద
  నిచ్చిఁ జేసె పెండ్లి నిజమె సుమ్ము.

  గురువుగారూ, రోజూ సమస్యాపూరణాలే కాకుండా, దత్తపది, వర్ణన లాంటివి కూడా ఇస్తే కొంచెం ఉత్సాహంగా ఉంటుందని నా భావన. కొత్త వృత్తాలు కూడా అదనంగా ఇస్తే ఆసక్తి ఉంటే పూరించవచ్చు. లేదా వదలవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. కమల నాభుఁ డితఁడు కమలాక్షుఁ డీతఁడు
  కంస హారి చైద్య ఖల విదారి
  కౌస్తుభ మణి ధారి, కనఁ, తండ్రి మరునకు,
  కమలజునకు; భార్య కమలయె గద!

  ప్రత్యుత్తరంతొలగించు
 16. సంపత్ గారూ ! ధన్యవాదములు.టైపాటు చూసుకోలేదండీ.
  శంకరార్యా ! ధన్యవాదములు. కార్యాలయమునకు త్వరగా వెళ్ళవలసి వచ్చి హడావుడి గా పూరించడంలో పొరపాటున ఆట వెలది తేట గీత మైంది .
  చక్కటి మార్పు చేసినందులకు కృతజ్ఞతలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. నుదుటి వ్రాతల పనిఁ నువుజూడమనియిచ్చె
  కమలజునకు, బార్యకమలయె గద
  విభవముఁగను జగతిఁ,విద్యకోడలి దయౌఁ,
  యోగ నిద్ర నొదుగు యోగమదియె.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. శివుని శిరము పైన సతినంచు కూర్చుంది
  గంగ ననుచు నామె బెంగ లేక
  తరచి చూచినంత తగినది గౌరియె
  కమలజునకు భార్య కమలయె గద !

  ప్రత్యుత్తరంతొలగించు
 19. శ్రీపతిశాస్త్రిఆగస్టు 17, 2011 7:08 AM

  శ్రీగురుభ్యోనమ:

  పద్యములను వ్రాయు ప్రజ్ఞ నిచ్చినతల్లి
  కమలజునకు భార్య, కమలయెగద
  సిరులనిచ్చు జనని శ్రీహరి ప్రియపత్ని
  జయము గూర్చు వారు జగతికెపుడు

  ప్రత్యుత్తరంతొలగించు
 20. మందాకిని గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  మీ కోరిక ప్రకారమే ఈరోజు ‘దత్తపది’ని ఇచ్చాను. వర్ణన వంటివి ఇవ్వాలనే ‘పద్యరచన’ అనే శీర్షికను ప్రారంభించాలనుకున్నాను. కాని అందుకోసం చాలా ఎక్కువ సమయం ‘నెట్’కు వినియోగించవలసి ఉంటుంది. ప్రస్తుతం వేరే పనుల్లో వ్యస్తుణ్ణై తీరిక లేక ఆ శీర్షికను ప్రారంభించలేదు. కాస్త తెరపి లభించగానే మొదలుపెడతాను. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  అత్యుత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
  *
  ఊకదంపుడు గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరక్కయ్యా,
  ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. ధన్యవాదాలు.
  కాని మొదటి పాదంలో యతిదోషం, సమస్య సమర్థింపబడినట్లు లేదు. వీలైతే ఈ సాయంత్రం వరకు సవరిస్తాను.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు