ప్రాసమైత్రి - 3
9) ఉభయ ప్రాస -
వ్యాకరణసూత్రాలను బట్టి స, న లకు ష, ణలు ఆదేశమౌతాయి. ఆదేశ షకారానికి సహజ షకార సకారాలు, ఆదేశ ణకారానికి సహజ ణకార నకారాలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
అ) విషమ (వి+సమ) లోని ఆదేశ షకారానికి సహజ ష, సలతో ప్రాసమైత్రి ...
వసుధా .... సా, రసదళ ...., విసరాంబుజ ....., విషమ (సాంబవిలాసము)
ఆ) ప్రాణ (ప్ర+ఆన) లోని ఆదేశ ణకారానికి సహజ న, ణలతో ప్రాసమైత్రి ...
i) ప్రాణములఁ బాపె నాహవ*క్షోణియందుఁ
బ్రాణవల్లభఁ గొని చన్న *దానవేంద్రు (అప్ప. 3-332)
ii) దుర్ణయమున శకుని*కర్ణదుశ్శాసనుల్ ... (భార. ఆది. 3-120)
iii) కర్ణుండు రేఁచి పెట్టఁగ
దుర్నయపరులైన శకుని దుశ్శాసను లీ ... (భార. ఉద్యో. 2-248)
iv) పెనఁగు ...., ఫణులు ... (కుమార సంభవము. 4-101)
v) దనుజుల గర్వరేఖయును ..... ని
ర్గుణతను జేయ నుమ్మలికఁ గోల్తల కోపక పాఱి రార్తులై (భాగ. షష్ఠ. 276)
10) అనునాసిక ప్రాస -
సహజమైన నకార, మకార ద్విత్వాక్షరాలకు (న్న, మ్మ లకు) బిందుపూర్వకాలైన న, మలతో క్రమంగా ప్రాసమైత్రి కూర్పవచ్చు.
ఉదా.
అ) మిన్నేఱు .... ధా, తంనాభి ...., సాన్నిధ్యము ...., సన్నుతి ... (అప్ప. 3-341)
ఆ) i) తమ్ముల ... కుసు, మమ్ముల .... భ, క్తింముర ...., సమ్మదమున (అప్ప. 3-342)
ii) కమ్మని లతాంతముల*కుం మొనసి వచ్చు మధు*పమ్ముల ... (భార. ఆది. 5-138)
iii) అమ్మునీశు నివాసశక్తి ...... జే
సెం మహానది దీర్ఘికా సరసీనదంబులు నిండఁగాన్. (భార. ఆరణ్య. 3-113)
iv) ఇమ్ముగ సర్వలోకజను లెవ్వని ... వం
ద్యుం ముని నప్పరాశరుని ....... (భార. ఆది. 1-76)
అయితే ఇటువంటి ప్రయోగాలు అసాధారణం కావున అప్పకవి తప్ప మిగిలిన లాక్షణికు లెవ్వరూ ఈ ప్రాసను అంగీకరించలేదు.
11) ప్రాసమైత్రి ప్రాస -
పూర్ణబిందుపూర్వక బకారానికి (ంబ కు), ద్విత్వమకారానికి ప్రాస వేయవచ్చునని కొందరు లాక్షణికులు చెప్పారు.
ఉదా.
i) గుమ్మతావులు వెదచల్లు*నంబుజములు
శంబరారాతి చేతి వా*లమ్ము లనఁగ. (అప్ప. 3-343)
ii) అమ్మఖవాజి ...., మో, వం బసి .... (జైమిని భార. 7-145)
12) ప్రాసవైరం - రేఫ శకటరేఫాలకు (ర-ఱ లకు) ప్రాస చెల్లదని లాక్షణికులు చాలా మంది చెప్పినారు. అందుకు శకట సాధురేఫ నిర్ణయాలు చేసినారు. కాని రకార, ఱకార సాంకర్యం అనివార్యమై తిక్కన కాలంనుండి కావ్యాలలో అశేషంగా యతిప్రాసల మైత్రి కూర్పబడింది. ఆధునిక కాలంలో వీని వైరుధ్యం లేదనే చెప్పవచ్చు. కావున వీని మైత్రి అంగీకరింపవచ్చు.
ఉదా.
i) ఊఱక మీఱ నాడెదవు యుక్త మయుక్తము నాత్మఁ జూడఁగా
నేరవు సర్వలోకముల ...... (భార. ఆరణ్య. 4-199)
ii) ఉఱవడిఁ దఱిమిరి మద్రే
శ్వరుఁడు గదిసి దీప్తశక్తి వైచెం పెలుచన్. (భార. ద్రోణ. 1-175)
iii) మఱి యట్టి జలజభవునకుఁ
గర మంతఃకరణ గాత్రకములై వరుసన్. (భాగ., తృ.స్కం. 772)
మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.