22, నవంబర్ 2011, మంగళవారం

ప్రాసభేదాలు - 5

                             ప్రాసమైత్రి - 5
17)  సంధిగత ప్రాస -
ప్రాస వ్యంజన ప్రధానం. సంధిలో ఆగమ, ఆదేశములుగా వచ్చిన హల్లు ప్రాసస్థానంలో ఉంటే దానికే ప్రాసమైత్రి కూర్చాలి. ‘నెయ్యము + అలుక = నెయ్యపు టలుక’ అన్నప్పుడు ‘ట’ ప్రాసస్థానంలో ఉన్నప్పుడు మిగిలిన పాదాలలో ప్రాసగా ‘ట’వర్ణాన్నే ప్రయోగించాలి. అలాగే ‘వాఁడు + చచ్చె = వాఁడు సచ్చె’ అన్నప్పుడు ప్రాసస్థానంలో మిగిలిన పాదాల్లో ‘స’వర్ణమే ఉండాలి.
ఉదా.
సింగం బాఁకటితో గుహాంతరమునం జేడ్పాటుమై నుండి మా
తంగస్ఫూర్జితయూథదర్శనసముద్యత్క్రోధమై వచ్చు నో
జం గాంతారనివాసఖిన్నమతి నస్మత్సేనపై వీఁడె వ
చ్చెం గుంతీసుతమధ్యముండు సమరస్థేమాభిరామాకృతిన్. (భార. విరా. 4-95)
 
18) వర్గ ప్రాస -
అప్పకవి స్వవర్గప్రాసలో ద-ధలకు, ధ-థలకు ప్రాసమైత్రిని చెప్పినాడు. టవర్గాక్షరాలలో కూడా ఇటువంటి ప్రాసమైత్రి కనుబడుతున్నది. కవర్గంలో క-గలకు, ఖ-ఘలకు ఇలాగే మిగిలిన వర్గాలకు చెల్లుతాయని కొందరు లాక్షణికుల మతం.
ఉదా.
అ)
పెటిలి సువర్ణపర్వతము పెక్కుదెఱంగుల వ్రయ్యునట్టు ల
ప్పుడు వివిధప్రకారముల .... (భార. ఆది. 8-259)
ఆ)
ఏడక్షౌహిణు లెన్నఁ బాండవబలం బేకాదశాక్షౌహిణుల్
రూఢిం గౌరవసైన్య మీ యుభయమున్ .... (భార. ఆది. 1-69)
 
19) శకార ప్రాస - 
ఊష్మాలైనందువల్ల శసలకు అభేదం చెప్పబడుతున్నది. పూర్వకావ్యాలలో వీనికి ప్రాసమైత్రి చెల్లిన ప్రయోగాలు ఉన్నందున శకారప్రాస స్వీకరింపదగినదే అని కొందరి అభిప్రాయం.
ఉదా.
అ) నాసికాస్యాంగ దృక్ *భ్రూశిరోజ (భాగ. 2-158)
ఆ)
మీసలు మెలిబెట్టుచుఁ గడు
రోసమ్ములు గ్రమ్ముకొనఁ బురోభాగములం
దాశ లద్రువ కేక లిడుచు
దూసిన కత్తులను ... (ప్రబంధరాజ వేంకటేశ్వర విజయవిలసము - 789) 

 *మరి రెండు మూడు ప్రాసభేదాలను లాక్షణికులు చెప్పినా అవి అంత ముఖ్యమైనవి కానందున విడిచివేయడం జరిగింది.
పై ప్రాసభేదాలు కేవలం అవి ఉన్నాయని మీకు పరిచయం చేయడానికే. ఎలాగు ప్రాసభేదాలలో ఉంది కదా అని మీరు అనుసరించవద్దు. క్రింది విషయాలను గమనించండి. 
1) ప్రాసమైత్రి హల్లులకే కాని అచ్చులకు కాదు.
2) ప్రాసాక్షరం సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, అనుస్వార యుక్తాలైతే మిగిలిన పాదాలలోను అలాగే ఉండాలి.
౩) ప్రాస పూర్వాక్షరం గురు లఘువులలో ఏది ఉంటే మిగిలిన పాదాల్లోను అలాగే ఉండాలి.
4) ర-ఱల భేదం పాటించడం లేదు కనుక ఈ రెంటికి ప్రాసమైత్రి కూర్చవచ్చు.
5) ప్రాసాక్షరం ముందు అరసున్న ఉంటే మిగిలిన పాదాల్లోను అరసున్న ఉండే పదాలను వేసే ప్రయత్నం చేయండి. అలా వేయకున్నా దోషం కాదు.

దీనితో ‘ప్రాసమైత్రి’ పాఠం పూర్తయింది. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

7 కామెంట్‌లు:

  1. ప్రయాస గా తలపక ఓపికగా ప్రాసల గురించి సోదాహరణము గా తెలిపిన మీకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. శంకరార్యా ! చక్కని పాఠానికి ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  3. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మమంగళవారం, నవంబర్ 22, 2011 8:48:00 AM

    శ్రీ శంకరయ్యగారూ
    ఓపికగా ఈ పాఠాలను మాకందజేసినందులకు ధన్యవాదం.
    నాదో చిన్న సందేహం.
    అప్పకవీయంలో ప్రాస గురించి చెపుతూ రేఫకూ (ర) శకట రేఫకూ(ఱ) ప్రాస చెల్లదని చెప్పేరు. మీ పాఠంలో ర, ఱ లకు భేదం పాటించడంలేదు కనుక ఆ రెంటికీ ప్రాస వేయవచ్చని ఉంది. భేధం పాఠించకపోతే పాఠించమని చెప్పాలేగానీ వ్యాకరణ నియమాన్నే మార్చెయ్యడం ఎంతవరకు సమంజసం? అలాగే శ, స లకు ప్రాసకుదిర్చిన సందర్భాన్ని సోదాహరణముగా చూపుతూనే ఆ రెంటికీ ప్రాస కుదర్చవద్దు అని అన్నారెందుకు??

    దయచేసి వివరించ గలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆదిభట్ల కామేశ్వర శర్మ గారు రేఫకూ (ర) శకట రేఫకూ(ఱ) కు కవి బ్రహ్మ తిక్కన గారే ప్రాస వాడినపుడు సందేహమెందుకు?
      "పై ప్రాసభేదాలు కేవలం అవి ఉన్నాయని మీకు పరిచయం చేయడానికే. ఎలాగు ప్రాసభేదాలలో ఉంది కదా అని మీరు అనుసరించవద్దు." అని చెప్పారు కాబట్టి సాధ్యమైనంత వరకు సంశయాత్మక ప్రాసలు వాడవలదని భావము. ఇది నా అభిప్రాయము.

      తొలగించండి
  4. శంకరు నాభరణము నే

    నంకముగా బెట్టుకొనిన శంకరు సామీ!

    బింకమగు మీదు రచనకు

    శంకలు నే జూపలేను సత్యము వినుమా !

    రిప్లయితొలగించండి
  5. పై పద్యము నాలుగవ పాదమునకు "వంకలు నే జెప్ప లేను వందన మయ్యా !" అని పాఠాంతరము

    రిప్లయితొలగించండి
  6. ప్రాస మీద మంచి పాఠము చెప్పేరు గురువుగారూ.

    రిప్లయితొలగించండి