8, నవంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 519 (భార్యాపదపూజఁ జేతు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

48 కామెంట్‌లు:

  1. నా పూరణ .....

    ఆర్యులు గురువులు వరదా
    చార్యులు దయచేసినారు; సన్మాన మిఁకన్
    కార్యము; రమ్మిటు ముద్దుల
    భార్యా! పదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  2. ఆర్యులు జెప్పగ వింటిని
    భార్యా సహితముగ నేడు బంధుజనముతో
    కార్య సఫలతకు శివ నిజ
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  3. ఆర్యా! మీ భార్యా సహిత అచార్య పదపూజ అదిరింది.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా పద పూజ సకల
    కార్యారంభమున విజయ కారకమగు నం
    తర్యామిని కామేశ్వర
    భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  5. ఆర్యా! నాకిల దైవము
    భార్యే! నా భాగ్య రేఖ భార్యే ! బలమున్
    భార్యే! ప్రకటింపగ నిది
    భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్,

    రిప్లయితొలగించండి
  6. సరదాగా ఇంకొకటి:

    భార్యను జూచిన వణకుదు
    భార్య నెదిరి నిలువలేని బలహీనుడ నే
    భార్య నను కట్టు కొంగున
    భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్,

    రిప్లయితొలగించండి
  7. కార్యము రావణ నాశము
    భార్యగ నేతెంచె రామ భద్రున కిలలో
    నార్య మహా విష్ణువు ప్రియ
    భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ నేమాని వారి పూరణ చక్కగా ఉన్నది.
    మిస్సన్నగారూ ! మూడ్ లోఉన్నట్టున్నారు.వరుసగా మూడు పూరణలతో 'హ్యాట్రిక్' సాధించారు.మూడవ పద్యం మూడవ పాదం లో "విష్ణు ప్రియ" అంటే సరిపోతుందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    పర్యంకము దిగి రమ్మా
    అర్యమునకు అర్ఘ్య మిడితి - నాలయమునకున్
    ఆర్యకు మ్రొక్కుల నిడగా
    భార్యా,పద ! పూజ జేతు - బదుగురు మెచ్చన్ !
    _____________________________________
    అర్యముడు = సూర్యుడు
    ఆర్య = పార్వతి

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! మిస్సన్న గారూ నాకొక సందేహము. మీ పద్యములను వ్రాయించుచున్నది కూడా మీ భార్యామణియే యేమో? అన్యథా భావించకండి. చొరవ తీసుకొన్నందుకు క్షంతవ్యుణ్ణి.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న మహాశయా !
    పతివ్రతలే గాని పత్నీవ్రతులు లేని లోటు దీర్చారు !
    అభినందనలు !

    భార్యా విధేయ వర్యా
    మర్యాదగ భార్య పట్ల - మసలితి వయ్యా !
    ఆర్యా! మిస్సన్నన్నా !
    భార్యా పదపూజ నీకు - పరువము బెంచున్ !

    రిప్లయితొలగించండి
  12. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, నవంబర్ 08, 2011 9:30:00 AM

    ఆర్యా! నను బెండ్లాడి ,స
    పర్యల్ గడు జేసి ,నాకు పాపల గని ,నే
    చర్యన్నను వెన్నంటిన
    'భార్యాపద' పూజ జేతు బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  13. మర్యాదల నే సకల సు
    చర్యల క్షీరా బ్దికన్యఁ చపలను భక్తిన్
    ఆర్యా! లక్ష్మీకాంతుని
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  14. ఈ రోజు క్షీరాబ్ది ద్వాదశి. మాష్టారు ఇచ్చిన సమస్య శ్రీమహాలక్ష్మి పాదపూజ చేసిన సందర్భానికి తగినట్లు గా సరిపోయింది.

    రిప్లయితొలగించండి
  15. సూర్యుడు, చంద్రుడు కనులుగ
    శౌర్యము కరుణ కురిపించు చల్లని తల్లీ!
    ఆర్యాణీ! శివ దేవుని
    భార్యా! పదపూజ జేతు పదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  16. వామాచారులైన శాక్తేయులు స్త్రీమూర్తికి భౌతికంగా పూజ చేస్తారని విన్నాను. ఆ ప్రకారముగా ఈ నా పూరణ:

    ఆర్య యనుచు భావించుచు
    భార్యను పూజింపవలెను వామాచారుల్
    మర్యాద యద్ది రమ్మా!
    భార్యా! పద పూజ జేతు బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  17. అమ్మా మందాకిని గారూ!
    మీ పద్యము బాగుంది. ఆర్యాణీ అనుట కన్న "ఆర్యా" అంటేనే సరియైన ప్రయోగము అవుతుంది.

    రిప్లయితొలగించండి
  18. ధన్యవాదాలండీ. సవరించాను.

    సూర్యుడు, చంద్రుడు కనులుగ
    శౌర్యము కరుణ కురిపించు చల్లని తల్లీ!
    ఆర్యా!మా శివ దేవుని
    భార్యా! పదపూజ జేతు పదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  19. ఇక సొంత గొడవ, మా ఆవిడకి నేనీ పద్యం వ్రాస్తున్నట్లు తెలియదు.
    భార్యారాధకుడ నిక స
    పర్యల జేతునది లేక పస్తులె గతిరా
    కార్యాకార్యము లెరుగక
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్..
    మనవి: మరి "పదుగురు మెచ్చున్" యెలా అంటారా? అవును, పాపం పెళ్ళానికి యెంత సహాయ పడతాడో అని స్త్రీ జనం తెగమెచ్చుకొంటారు గదా!

    రిప్లయితొలగించండి
  20. చర్యలుగైకొందురుమా
    కార్యాలయమునశెలవనకార్తికమయినన్
    ఆర్యాగీతులభవుకట
    భార్యా! "పద"పూజ జేతు పదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  21. అయ్యా శ్రీ చంద్రశేఖర్ గారూ! శుభాశీస్సులు.
    "లక్ష్మీ కాంతుని భార్యా" అంటే లక్ష్మీ దేవి భర్తకు భార్య అని వినిపించుట లేదా? ఏమిటో .. ఈ ప్రయోగము మార్పుచేస్తే బాగుంటుంది కదా. అలాగే చపల అనే పదము కన్నా ఇంకా మంచి పదము ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  22. సూర్యుని వలె వెలిగెడి కవి
    వర్యుండగు విశ్వనాథ వర శిష్యా ! ప్రా
    చార్యా ! మల్లంపలి శర
    భార్యా ! పద పూజ జేతు పదుగురు మెచ్చన్ !!!

    మల్లంపల్లి శరభయ్య గారని , రాజమండ్రి వారు . పెద్ద విద్వాంసులు , విశ్వనాథ వారి సన్నిహితులు ... వారినొకసారి మా వూరికి ఆహ్వానించి , మా సాహిత్య సంస్థ ద్వారా - 'విశ్వనాథ కవితా వైభవం ' మీద ప్రసంగింపజేసే అదృష్టం దక్కింది . వారిని సంస్మరించుకునే నెపమే కానీ , వారిటీవలనే అంటే 2007 లో పరమపదించారు !

    ఇక్కడే మరొక సూక్ష్మ విషయం . చాటువుల్లోనూ , సరదా సమస్యా పూరణల్లోనూ ఐతే ' చేతు ' అంటే చెల్లుతుంది కాని , పటిష్ట ప్రౌఢతర పద్య కావ్యాల్లో ' చేయుదును ' అనడానికి మారుగా ' చేతు ' అనే ప్రయోగం లేదు . ఇదీ నిన్నటి ' అయెన్ ' లాంటిదే . కాకపోతే మోయుదును కు - మోతు , కోయుదును కు కోతు , మేయుదును కు మేతు అంటే ఎలాంటి తప్పో ఇదీ అంతే !
    మరి ఈ పదం ఎలా వచ్చిందీ అంటే - పూచు , లేచు , కాచు , వైచు - ఇలా చివర ' చు ' ఉన్న పదాలకు విధ్యర్థకమైన క్రియారూపం గా పూతు , లేతు , కాతు , వైతు ఇత్యాది రూపాలు సిద్ధిస్తాయి .
    సరే - ' పొన్న పూల నీకు పూజ జేతు ' అంటూ ఒక ప్రసిద్ధ చాటువే ఉంది కనుక - అర్వాచీనులు తమ తమ సరదా పద్యాల్లో ప్రయోగిస్తామంటే కాదూ కూడదనడానికి వీల్లేదు !

    రిప్లయితొలగించండి
  23. మిస్సన్న గారు మన్నించాలి 'భార్యే!' అన్నది సాధు ప్రయోగం కాదు. భార్యయే అనటమే మన గ్రాంధిక పధ్ధతి. మీ 'కార్యము రావణ నాశము ...' పద్యంలో 'ఆర్య' అని సంబోధించినది శ్రీమహాలక్ష్మిని గూర్చి యనుకుంటాను. తప్పుగాకపోవచ్చును గాని యీ 'ఆర్యా' పదసంబోధితగా పార్వతిని చెప్పటమే సంప్రదాయమని నా యుద్దేశ్యం. అదీ కాక నాకీ పద్యం అన్వయం కావటం లేదు.

    వసంత కిశోర్ గారి 'పర్యంకము దిగి ... పద్యంలో' యీ కందంలో పాదాలన్నీ దీర్ఘాక్షరలాతో ప్రారంభం కావలసి యుందన్న సంప్రదాయం మర్చిపోయారు. అలాగే లక్కాకుల రాజారావుగారు కూడా 'ఆర్యా! నను బెండ్లాడి...' పద్యంలోనూ దీన్ని మరచారు. మన తెలుగు వారూ డిటో. ఆశ్చర్యం యేమిటంటే నేమానివారుకూడా 'ఆర్యా పద పూజ...' పద్యంలో దీన్ని పాటించలేదు. నిజానికిది కేవలం సంప్రదాయం మాత్రమే గాని నియమం కాకపోవచ్చునేమో. విజ్ఞులు చెప్పాలి.

    మందాకిని గారి సూర్యుడు, చంద్రుడు.... పద్యం బాగుంది. రెండవపాదొలో ద్వితీయగణం నల కావటంవలననేమో నడక కొంచెం కుంటింది. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే.

    ఊకదంపుడుగారూ, శెలవు సరయిన పదం కాదు. సెలవు సాధువు.

    రిప్లయితొలగించండి
  24. మిత్రులారా!
    ప్రాస నియమము గురించిన అవగాహన అందరికీ కావాలి. ప్రాస అక్షరము 'ర్య" సంయుక్తాక్షరము అయింది కాబట్టి దాని ముందరి అక్షరము హ్రస్వము అయినా లేక దీర్ఘము అయిన ఎటువంటి దోషము ఉండదు.

    రిప్లయితొలగించండి
  25. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, నవంబర్ 08, 2011 12:38:00 PM

    నా పద్యం 2 వ పాదం చివరి' నే 'కు బదులు' యే 'చదువ గలరు

    రిప్లయితొలగించండి
  26. ధైర్యము వచ్చును, బహువిధ
    చౌర్యమ్ములు జేయవచ్చు చతురత మీరన్
    ఆర్యా,యిక రాజీవుని
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్!!!

    (రాజీవుని భార్య = సోనియా గాంధి )

    రిప్లయితొలగించండి
  27. ఆర్యా వర్తము నందున
    కార్యములను సాధించు కొఱకు కార్తిక పూజల్ !
    ఆర్యుని పూజకు ముందర
    భార్యా పద పూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్ !

    రిప్లయితొలగించండి
  28. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    మీ మూడు పూరణలూ వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    ‘శ్యామలీయం’ గారన్నట్టు ‘భార్యే’ అసాధువే. అక్కడ ‘భార్యయె’ అంటేనే బాగుంటుంది.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మిస్సన్న గారిపై చక్కని పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    నేమాని వారి అభ్యంతరాన్ని గమనించారు కదా! అక్కడ ‘క్షీరాబ్ధిశయను..’ వంటి పదాన్ని దేన్నైనా ప్రయోగించవచ్చు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    డా. విష్ణునందన్ గారూ,
    ప్రాచార్యులను స్మరించుకున్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘మల్లంపల్లి’ ప్రస్తావన నాకు మా కళాశాలలో ఆచార్యులు ‘శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ’ గారిని గుర్తుకు తెచ్చింది. ధన్యవాదాలు.
    ‘చేతు’ ప్రయోగాన్ని గురించిన మీ విశ్లేషణ జ్ఞానదాయకంగా ఉంది. ఇకనుండి శబ్దాల విషయంలో కాస్త ‘ఒళ్ళు దగ్గర పెట్టుకొని’ ఉంటాను. ధన్యవాదాలు.
    **********************************************************************
    ‘శ్యామలీయం’ గారూ,
    ప్రాస విషయంలో నేమాని వారి అభిప్రాయమే అనుసరణీయం. నన్నయ్య గారి క్రింది భారతపద్యాన్ని చూడండి.
    అర్థమ యనర్థమూలం
    బర్థమ మాయావిమోహనావహము నరుం
    డర్థార్జనదుఃఖమున న
    పార్థీకృతజన్ముఁ డగుట పరమార్థ మిలన్.
    పై పద్యంలో మొదటి మూడు పాదాల ప్రథమాక్షరాలు లఘువులు. నాలుగవ పాదం గురువుతో ప్రారంభమయింది.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    ప్రశస్తమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘కార్యములను’కు బదులు ‘కార్యము సాధించుకొఱకు’ అంటే సరి!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  29. ఆర్యా గీతాచార్యా!
    ఆర్యా శ్రీ రామ భద్ర! అగణిత శౌర్యా!
    ఆర్యా హరి! పంకజనా-
    భార్యా! పద పూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  30. శంకరయ్య గారూ , ' డిగ్రీలు లేని పాండిత్యంబు వన్నెకు రానట్టి పాడు కాలాన బుట్టి ' అని ఏ మల్లంపల్లి సోమశేఖర శర్మ గారినైతే విశ్వనాథ వారు ప్రశంసించారో , ఆ సోమశేఖర శర్మ గారికి ఈ శరభేశ్వర శర్మ గారు చాలా దగ్గర బంధువులు . నాకా చుట్టరికమేమో గుర్తు లేదు కాని , తెలిసిన వాళ్లెవరైనా ఉంటే , చెప్పగలిగితే ధన్యవాదాలు !

    రిప్లయితొలగించండి
  31. ఆర్యుల యాచారమ్మగు
    భార్యయె పతి పాదపూజ పచరించుట యీ
    పర్యాయము మాత్రము నే
    భార్యా పదపూజ జేతు బదుగురు మెచ్చన్.

    రిప్లయితొలగించండి
  32. ఆర్యా! కవితాచార్యా!
    ఆర్యా! సత్పద్యలేఖానాత్త సుచర్యా!
    ఆర్యా! సద్గుణగణ శో
    భార్యా! మిస్సన్న! నీకు నభివందనముల్.

    రిప్లయితొలగించండి
  33. శ్రీనేమాని మహాశయా! ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలను గమనిస్తే, నేను పద్యం వ్రాసేటప్పుడు నా ప్రక్కనే వుండి గమనించినట్లని పించింది. మొత్తం పద్యానికి ఆ రెండు పదాలు యెలా వెయ్యాలా అని ఆలోచించటానికే టైం పట్టింది. యతిస్థానం కాబట్టి మొదట "చపల" బదులు "జలధిజ" అని వేద్దామనుకొన్నాను. కానీ క్షీరాబ్ది అంతకుముందే వచ్చేసింది. ఇక రెండవ పదం "లక్ష్మీకాంతుని" లక్ష్మి శబ్దం సూచనా ప్రాయంగా తీసుకొద్దామనే అలా recursive గా (క్షమించాలి, తెలుగు పదం తెలియటంలేదు) ప్రయోగించాను.
    సవరించిన పూరణ:
    మర్యాదల నే సకల సు
    చర్యల క్షీరాబ్దికన్యఁ సంపదల తల్లిన్
    ఆర్యా! సరసిజనాభుని
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  34. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    సవరించిన పూరణలో ‘సంపదల తల్లిన్’ అన్నప్పుడు గణదోషం. అంతకుముందు ఉన్న ‘చపల’లో దోషం లేదు. చపల లక్ష్మికి పర్యాయపదమే.

    రిప్లయితొలగించండి
  35. డా. విష్ణునందన్ గారు మల్లంపల్లి వారి ప్రస్తావన తేవటం ఆనందదాయకం. శ్రీ శరభయ్య గారు పేరుకి విశ్వనాధ వారి శిష్యులే గాని, వారిని విశ్వనాధ వారు చాలా గౌరవించేవారు. గొప్పగా చూసుకొనేవారు. విశ్వనాధ వారు తమ రచనలను మొదట శ్రీ శరభయ్య గారికే వినిపించేవారని ప్రతీతి. సోమశేఖర శర్మ గారు శిలాశాసనాలు, శిలా ఫలకాల మీద పరిశోధనలు చేసిన వారు. విశ్వనాధ వారు ఆంధ్రప్రశస్తి వ్రాసినప్పుడు అది సోమశేఖర శర్మ గారి ఆమోదం పొందాకనే వేశారని విన్నాను.
    ఇక సోమశేఖర శర్మ గారు శరభయ్య గారికంటే పెద్దవారు. వారిద్దరూ తూ.గో. జిల్లా వారని, ఒకే వంశ స్థులని తెలుసు. కానీ వారిద్దరి మధ్య సంబంధం తెలియదు.

    రిప్లయితొలగించండి
  36. ఆర్యా ! శంకర నామా-
    చార్యా ! సద్గురు వరేణ్య! సత్కవివర్యా!
    మర్యాదకు చిరునామా !
    స్థైర్యమునకు మారు పేర ! సల్పెద నుతులన్.

    రిప్లయితొలగించండి
  37. డా. విష్ణునందన్ గారూ,
    నేను ‘సోమశేఖర శర్మ’ అన్నాను కదూ. మన్నించాలి. అది ఎప్పుడూ అందరి నోళ్ళల్లో మెదిలే పేరు కావడంతో పొరపాటున ఆ పేరే వచ్చింది. నేను చెప్పదలచుకున్నది ‘నలచరిత్ర’ కావ్యాన్ని రచించిన శ్రీ మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి గురించి. వీరు తెనాలి, లేదా గుంటూరులో ఉండేవారు. కొంత కాలం వరంగల్ ప్రాచ్యకళాశాలలో పనిచేసారు. అప్పుడు నేను ఆ కళాశాల విద్యార్థిని.
    ఈరోజు ఉదయం లేవగానే నేను విన్న పాట ‘ఏమి సేతురా లింగా ఏమీ సేతు’ అనేది. ఈనాటి సమస్య ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నంత సేపు ఆ పాటే నా మనసులో మెదులుతూ ఉంది. దాంతో అనుకోకుండానే ‘చేతు’ పదం సమస్యలో వచ్చింది. అప్పటికి అది సాధుశబ్దమే అని అనుకున్నాను లెండి!

    రిప్లయితొలగించండి
  38. నేమాని పండితార్యా! అందుకు సందేహమా? నా భార్యకు చూపించే మొదటి రెండు పూరణలూ పెట్టాను. (ఆవిడ అనుమతివ్వ లేదనుకోండి, అది వేరే విషయం)

    రిప్లయితొలగించండి
  39. కిశోర మహోదయా!

    భార్యకు విధేయతది నా
    మర్యాదను పెంచు ననుచు మాన్యులు పలుకన్
    ధైర్యము కలదే కాదన
    నార్యా వాసంత మిత్ర యౌనది నిజమే.

    రిప్లయితొలగించండి
  40. గోలి హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు. మీరన్నట్లు విష్ణుప్రియ మరింత పొందికగా ఉంది.

    రిప్లయితొలగించండి
  41. శ్యామలీయం గారూ మీరు సూచించినట్లు భార్యే అనుపదాన్ని భార్యయె గా మార్చుకొన్నాను. గురువుగారు కూడా అదే చెప్పారు.
    ఇక రావణ నాశము పూరణ లో మూడవ పాదాన్ని' ఆర్యుండగు శ్రీహరి ప్రియ-'
    అని మార్చుకొంటాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  42. గురువుగారూ ఒక్కొక్క సమస్యకూ ౫౦ కి పైగా పూరణలూ/వ్యాఖ్యలూ వస్తున్నాయంటే చూడ ముచ్చటగా ఉంటోంది. విద్వత్కవివర్యులు కూడా
    శంకరాభరణం లో పాలుపంచు కోవడం యెంతటి మహద్భాగ్యం!

    రిప్లయితొలగించండి
  43. విష్ణునందన్ గారూ మహా కవులు శ్రీ మల్లంపల్లి శరభేశ్వర శర్మ గార్నీ, శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మ గార్నీ, శ్రీ మల్లంపల్లి వీరేస్వర శర్మ గార్నీ, మహామహులు విశ్వనాధ వార్నీ గుర్తు చేసి చాలా సంతోష పరిచారు.

    రిప్లయితొలగించండి
  44. భార్యయె కాళిక వేషము
    ఆర్యా! నేనేమొ మరి మహాకవి పాత్రన్
    సూర్యా! వేయుచు నుంటిమి
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  45. శ్యామల రావు గారు,
    మీ వ్యాఖ్య సరియైనదిగానే ఉన్నది.ధన్యవాదాలు.
    శాస్త్రిగారు,
    కాళిదాసు నాటకం చూపించేశారు. అభినందనలు.

    మొత్తం మీద అందరూ భార్యా పదపూజ ఊహల్లో అయినా ఉత్సాహంగానే చేశారు. :-))

    రిప్లయితొలగించండి
  46. గురువు గారూ, ధన్యవాదములు.
    శ్యామలీయం గారూ, ధన్యవాదములు, గుర్తుంచుకుంటాను.

    రిప్లయితొలగించండి
  47. ఆర్యా! బాటా షాపున
    మర్యాదగ జాబు జేయు మాన్యుండ ను నా
    భార్య పదములను కొలువగ
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి
  48. ఆర్యా! ఏమిల్లంట్రము!
    సూర్యోదయ సమయమందు సుఖమిమ్మనుచున్
    మర్యాద మీర శ్వశురుని
    భార్యాపదపూజఁ జేతుఁ బదుగురు మెచ్చన్

    రిప్లయితొలగించండి