15, నవంబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం - 527 (పసిబాలుఁడు సంగరమున)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
        పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

43 కామెంట్‌లు:

  1. మిసమిస మీసము మెఱయగఁ
    బసఁ జూపెనుఁ బ్రాభవమ్ము బాణకుశలతన్
    వెస నభిమన్య కుమారుడు
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్

    రిప్లయితొలగించండి
  2. అసదృశ విక్రముడగజా
    తసుతుండు గుహుండు కూల్చె తారకుని బళా!
    వెస నారునాళ్ళ వాడగు
    పసిబాలుడు సంగరమున బగతుల నణచెన్

    రిప్లయితొలగించండి
  3. అసమాన బాలచంద్రుఁడు
    కిసలయమౌ కీర్తి యెసగఁ గేళిగఁ ద్రిప్పెన్
    కసి రిపుమస్తకముల నట
    బసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.

    పలనాడు యుద్ధ భూమిలో బాలచంద్రుఁడు శత్రువుల శిరస్సులను కోపముతో బొంగరాల వలె త్రిప్పాడుట !

    రిప్లయితొలగించండి
  4. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారూ ధన్యవాదములు. కుమారస్వామి కధ చెప్పిన శ్రీ పండిత నేమాని అన్నయ్య గారి ప్రతిభ అద్భుతము.

    రిప్లయితొలగించండి
  6. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మమంగళవారం, నవంబర్ 15, 2011 9:25:00 AM

    దశరధ నందను సేనలు
    కుశసోదరు గొట్టి పట్టుకొనిపోచూడన్
    వసుధాతనూజ పుత్రుడు
    పసిబాలుడు సంగరమున పగతుల నణచెన్

    పై పద్యంలో అసమ్మతమైన ప్రయోగాలు ఏమైనా ఉంటే పెద్దలు తెలియచెయ్యండి.

    రిప్లయితొలగించండి
  7. నా రెండవ పూరణకు చిన్న సవరణ ,

    అసమాన బాలచంద్రుఁడు
    కిసలయమౌ కీర్తి యెసగఁ గేళిగఁ ద్రిప్పెన్
    గసి రిపుమస్తకములు వడి
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.

    పలనాడు యుద్ధ భూమిలో బాలచంద్రుఁడు శత్రువుల శిరస్సులను కోపముతో బొంగరాల వలె త్రిప్పాడుట !

    రిప్లయితొలగించండి
  8. మసరుకవిసి చాణూరుడు
    కసిగా తొడగొట్టి దూకఁగ యశోద సుతుం
    డసమాన పరాక్రముఁ డా
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.

    రిప్లయితొలగించండి
  9. వసుధన భిమన్యుడప్పుడు
    పసఁ జూపి యశమునుఁ గాంచి బాల్యము నందే
    అసమనయనుఁ జేరెనహో,
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.

    పసివాడని జూడకనే
    కసి తీరగ కంసుడపుడు కదిలెను దానే
    వసుదేవుని తనయునిపై;
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్.

    శర్మగారు,
    ప్రాసాక్షరపు గుణింత చిహ్నమేదైనా రావచ్చు కానీ అక్షరమే మారకూడదనుకుంటానండీ.

    రిప్లయితొలగించండి
  10. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మమంగళవారం, నవంబర్ 15, 2011 10:42:00 AM

    మందాకినిగారూ, నమస్తే

    ఈ పద్యం ఒక్కమారు పరికించండీ

    సిరితా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్
    సిరితా బోయిన పోవును
    కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ

    రిప్లయితొలగించండి
  11. అయ్యా శ్రీ ఆదిభట్ల వారూ!
    సరళమ్ముగ నారికేళ సలిలము భంగిన్ - అని పాఠాంతరము.
    కొన్ని కొన్ని ఆర్య ప్రయోగంబులు అని ఉంటాయి.
    ఎవరెట్లా పోతే మనకేమి - మనము సంప్రదాయమును చక్కగా పాటిద్దాము. మనకు తగినంత దక్షత ఉన్నది అని చూపుదాము.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ ఆదిభట్లవారూ!
    మీ పద్యమును ఇలా సవరించుదాము:

    పసివాని లవుని రఘువర
    వసుధేసుని సేన లాజి వడిగొనిపోవన్
    .... .... ....
    .... .... . ..

    రిప్లయితొలగించండి
  13. వసుధేశుని ,, అని ఉండాలి (సరిజేయాలి)

    రిప్లయితొలగించండి
  14. కామేశ్వరరావుగారూ,

    మీరు ఉటంకించిన సుమతి శతక పద్యము సకలజన సమ్మతమై విరాజిల్లుతున్నదే. కాదనలేము. కానీ ఒక్క మాట. ఎట్లైతే మహభారతములోని పద్యాలను చెబుతూ యతి ప్రాసలగురించి ఒక నిర్ణయానికి వస్తామో ఆ విధంగా సుమతి శతకములోని పద్యాలను తీసుకొనలేము కదా.

    ఒక సారి ఈ పద్యము గూర్చి మా ఇంట్లో చాలానే చర్చ జరిగింది. పెద్దల అభిప్రాయము ప్రకారము, సుమతి శతకములోని పద్యాలకు ( ముఖ్యముగా ఈ పద్యానికి ) చందస్సు కన్నా అర్థ భావములే ప్రధానములు. వీటిలోని యతిమైత్రులను మనము ప్రామాణికములుగా తీసికొనలేము అని చెప్పినారు. అంతేగాక ర ల లకు ఉచ్చారణాభేదము చాల స్వల్పముగా
    ఉన్నందువలన అవిధమైన ప్రయోగముజరిగి వుంటుందని నా అభిప్రాయము.

    "సరళముగనె నారికేళ సలిలము భంగిన్" అని వుండవచ్చని ఒక ఊహ.

    పెద్దలు, గురువులు నిర్ణయించాలి.

    రిప్లయితొలగించండి
  15. తాడిగడప శ్యామలరావుమంగళవారం, నవంబర్ 15, 2011 11:28:00 AM

    కామేశ్వర శర్మగారు 'కుశసోదరు' బదులు 'కుశుసోదరు' అనాలనుకుంటాను. మీ పద్యం యొక్క అన్వయం 'వసుధాతనూజ పుత్రుడు' యీ 'కుశుసోదరు'నకు యేమయినా అవుతాడో కాడో అస్పష్టం. యేమీ కాడన్నట్లే సూచితం. మీరు శ - స లకు ప్రాస కూర్చారు. ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురుతుంది కాని స-శ లకు కాదు. సమస్యలో ప్రాసాక్షరం స కాబట్టి అదే వాడవలసియుంది. ప్రాసవిషయంలో కొంత చర్చ యిచ్చట జరిగింది. చాటు శతకాదులు లాక్షణికంగా ప్రామాణికాలు కావు. పైగా అవి జనం నోళ్ళలో నాని అసలు పాఠాలుగానే మనవద్ద ఉన్నాయనికూడా చెప్పలేం.

    రిప్లయితొలగించండి
  16. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మమంగళవారం, నవంబర్ 15, 2011 11:41:00 AM

    విషయమెరిగించిన పెద్దలందరికీ కృతజ్ఞుణ్ణి.

    సరే శతకాలను వదిలేద్దాం. మరొక్క పద్యం చాలా ప్రసిద్ధమైనది చూడండి

    బాల రసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్
    గూళలకిచ్చి యప్పడుపుకూడు భుజించుటకంటె సత్కవుల్

    ఈ పద్యములో "ల" "ళ" లకు ప్రాస పడింది.
    దీనివిషయం ఏమంటారు మరి?
    నేను ఇలా ప్రశ్నిస్తున్నది కేవలం విషయ సముపార్జనకోసమే గానీ వాదనకోసం కాదని పెద్దలకు సవినయంగా మనవిచేసుకుంటునాను

    రిప్లయితొలగించండి
  17. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మమంగళవారం, నవంబర్ 15, 2011 11:50:00 AM

    నమస్తే శ్యామలరావుగారూ
    నేను కుశ సోదరు అన్నది కుశునియొక్క అనే షష్టీ తత్పురుషను మనసున పెట్టుకుని, అంటే రామ బాణము రామ నామముల లాగ. కుశు సోదరు అంటే కుశుని సోదరు అనే ద్వితీయ విభక్తి అవుతుందని అభిప్రాయపడ్డాను.

    కుశసోదరుడు అనగా లవుడనీ, వసుధా తనూజ పుత్రుడు అనగా కుశుడే అనీ నేను అన్వయించుకున్నాను.

    ఇకపోతే స, శ లకు ప్రాస కుదరదని నాకు ఇప్పటివరకూ తెలియదు. న ణ, ల ళ లవలెనే ఇదికూడా కుదురుతుంది అని అనేసుకుంటునాను ఇన్నాళ్ళూ. వివరం చెప్పిన మీకు ధన్యవాందం

    రిప్లయితొలగించండి
  18. కామేశ్వరరావుగారూ,

    నాకు తెలిసి, "లళ" లకు, "నణ" లకు ప్రాస కుదురుతుంది. ఇది సర్వదా ఆమోదయోగ్యమే. పురాణ ప్రబంధాలలో కూడ ఈ రకమైన ప్రయోగాలున్నాయనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  19. కామేశ్వర శర్మగారు నా వ్యాఖ్య సరిగా గమనించలేదు. అలాగే సంపత్కుమార శాస్త్రిగారు కూడా.
    బాల రసాలసాల పద్యంలో "ల" "ళ" లకు ప్రాస పడింది దీనివిషయం ఏమంటారు మరి? అన్నారు శర్మగారు.
    నాకు తెలిసి, "లళ" లకు, "నణ" లకు ప్రాస కుదురుతుంది అన్నారు శాస్త్రిగారు.
    నేను నా వ్యాఖ్యలో ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురుతుంది కాని స-శ లకు కాదు అని చెప్పనే చెప్పాను గదా!!

    రిప్లయితొలగించండి
  20. హసియించెను తన ప్రియగురు
    వు సమక్షమునందు కౌరవులపాండవులన్
    వెస, విలువిద్యార్జన తా
    పసిబాలుడు సంగరమున బగతుల నణచెన్.


    వెస = వెంటనే
    విలువిద్యార్జన తాపసిబాలుడు = విలువిద్యార్జనము అనే తపము చేయుచున్న బాలుడు ( ఏకలవ్యుడు )

    గురువు గారూ,

    ఈ సమాసము సాధువేనా?? తప్పైతే తెలుపమని మనవి.

    రిప్లయితొలగించండి
  21. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మమంగళవారం, నవంబర్ 15, 2011 7:53:00 PM

    శ్యామలరావుగారూ, నమస్కారం.
    మన పోస్టింగులు కాస్త ముందువెనుకలయిన కారణాన మీ సూచన నేను చాడనట్లుగా అనిపించింది.

    అయ్యా నాది మరో చిన్న సందేహం. ఒకటిన్నర దశాబ్దాలపాటు ఎలక్ట్రికల్ మరియూ కంట్రోల్ సిస్టం ల లో కమిషనింగ్ ఇంజినీరుగా పనిచేసిన కారణాన కొంత టెక్నికల్ లాజిక్ వాడడం నా బుర్రకు అలవాటైపోయింది. వ్యాకరణం విషయంలో అలా అలోచించడం నూటికి నూరుపాళ్ళు తప్పే అని తెలిసినా అదేమిటో అలవాట్లో పొరపాటుగా ఇటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. అందుచేత పెద్దమనసుతో నన్ను అర్ధం చేసుకోండి.

    కొద్దిసేపటి క్రితం చదివేను ఒక పుస్తకంలో. ప్రాస వైరము అనే విషయమును నిర్వచిస్తూ సాధురేఫకు (ర) శకటరేఫతో (ఱ) ప్రాస వేయరాదని ఉంది. కానీ మీరు చెప్పినది మరోలా ఉంది.

    అలాగే ఉభయ ప్రాసమును నిర్వచిస్తూ ఉదాహరణగా ఈ పద్యం చెప్పడం జరిగింది

    వసుధా కళత్రునకు సా
    రసదళ నేత్రునకు మరుదరాతి మదతమో
    విసరాంబుజ మిత్రునకున్
    విషమ శిలీముఖ సహస్ర నిభగాత్రునకున్

    ఇక్కడ "స" కు "ష" తో ప్రాస పడింది. శ, ష మరియు స లు ఒకే కోవకు చెందిన అక్షరాలు కనుక వాటికి ఒకదానితో ఒకటికి ప్రాస కుదర్చువచ్చునేమో అని నేను టెక్నికల్ గా అనుకుంటునాను.
    మీకు వీలైతే ఈ విషయం మీద మరింత విపులంగా చెప్పండి సార్ మీకు పుణ్యం ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  22. కవిమిత్రు లందరూ రకరకములుగా పసిబాలురను సంగరమున దూకించారు. నాకెవరూ మిగలలేదు.మిత్రుల ప్రా (శ ) స చర్చ ఉపయుక్తముగా నున్నది.
    నా పూరణ...

    కసితో ఝాన్సీ లక్ష్మీ
    గస బెట్టుచు నశ్వ మెక్కి కరవాలము తో
    వసనము ననుండ మూపున
    పసిబాలుడు, సంగరమున బగతుల నణచెన్.

    రిప్లయితొలగించండి
  23. మన తెలుగు - చంద్రశేఖర్మంగళవారం, నవంబర్ 15, 2011 9:10:00 PM

    శాస్త్రిగారూ,
    ఏం లేదంటూనే మంచి విరుపుతో అదరగొట్టారుగా! "గస బెట్టుచు" ఈ గస పదం పల్నాడులో చాలా తరుచుగా వాడుతుంటారను కొంటాను. వినుకొండ నుండి మా స్నేహితుడొకడు తెగ వాడేవాడు, మొట్టమొదట వాడి దగ్గరనుండి విన్నాను మరలా ఈ రోజు. బాగుంది.

    రిప్లయితొలగించండి
  24. కామేశ్వర శర్మగారూ,
    శ-ష-స-హ ఈ నాలగింటినీ కలేసి ఊష్మములు అని పిలుస్తారు.
    వీటిలో వీటికి ప్రాస కుదరదు. ఉమ్మడిగా ఇవి ఒక గ్రూపు కట్టినా సరే.

    త్రిక సంధి సూత్రంలో వీటి ప్రసక్తి వస్తుంది.

    ఊష్మములనగా శ-ష-స-హ లు
    రేఫ లనగా ర-ఱ లు.

    ఆ-ఇ-ఏ లు త్రికంబు నాబడు.
    త్రికము మీది ఊష్మ రేఫేతరంబైన అసంయక్త హల్లునకు ద్విత్వంబు బహుళంబుగా నగు.

    ఇంతకు మించి ఊష్మములను గూర్చి వ్యాకరణంలో ఇతర ప్రసక్తులున్నాయేమో తెలియదు. నాకు వచ్చిన వ్యాకరణం అసలే అంతంత మాత్రం.

    రిప్లయితొలగించండి
  25. కామేశ్వర శర్మగారూ, ఇంకొక మాట. "టెక్నికల్ లాజిక్ వాడడం నా బుర్రకు అలవాటైపోయింది. వ్యాకరణం విషయంలో అలా అలోచించడం నూటికి నూరుపాళ్ళు తప్పే" అని అనుకోకండి. నేను కంప్యూటదు సాఫ్టువేర్ రంగంలో 36యేళ్ళుగా వీరంగం వేస్తున్నాను. నా మాట నమ్మండి వ్యాకరణం కూడా చాలా లాజికల్ వ్యవహారం.

    పాణిని అష్టాధ్యాయికి మా రంగంలో ప్రత్యేక గౌరవం ఉంది.
    దానిని మొట్టమొదటి "context free grammar" గా పరిగణిస్తారు.
    "context free grammar" అనేది computer languages అనేవి software కు సంబంధించిన ఒక విధమైన భాషాశాస్త్త విషయకమైన విభాగం.

    రిప్లయితొలగించండి
  26. చూడండి: చింతా రామ కృష్ణా రావుగారి ఆంధ్రామృతం బ్లాగులో ఛందో బద్ధ పద్య రచనకు ఉపకరించు ప్రాసలు
    http://andhraamrutham.blogspot.com/2008/10/blog-post_7845.html
    (నేదునూరి రాజేశ్వరి గారు లోగడ చూసినదే)
    మరొకటి శిరాకదంబంలో బిందు పూర్వక హకార ప్రాస ను గూర్చి
    http://sirakadambam.blogspot.com/2010/04/blog-post_6657.html

    రిప్లయితొలగించండి
  27. శిరాకదంబంలో బిందు పూర్వక హకార ప్రాస ను గూర్చిన లింకు యిచ్చాను గదా. దానిలో శ్రీశ్రీగారి వ్యాఖ్యానం ఉంది. ఒకచోట వారంటారూ "దీర్ఘాక్షరంతో ప్రారంభమైన కంద పద్యంలో నాలుగింట జగణం వెయ్యకూడదని కొందరికి తెలియదు." అని. సమంజసంగానే ఉంది. దీనిని గూర్చి అవసరమైతే చర్చించవచ్చు. శ్రీశ్రీకి ఛందస్సు మీద మంచి అధికారం ఉందని తెలుసు.

    రిప్లయితొలగించండి
  28. **********************************************************************
    కవిమిత్రులకు మనవి ...
    ఈ రోజు ప్రాసను గురించిన చర్చ బాగుంది. ఇది చూసిన వెంటనే ‘ఛందస్సు’ శీర్షిక క్రింద ప్రాసమైత్రిని గురించిన సమగ్ర పాఠం సిద్ధం చేయడం మొదలు పెట్టాను. ఈ పాఠం పెద్దగా ఉన్నందున కొన్ని భాగాలుగా రేపటినుండే ప్రకటిస్తాను. చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  29. **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీరు ప్రయోగించిన ప్రాస ‘శకార ప్రాస’. దీనిని ముఖ్యలాక్షణికులు అంగీకరించకున్నా ‘ఆనందరంగరాట్ఛందము’ అంగీకరించింది. దీని లక్షణ, లక్ష్యాలను ఛందస్సు పాఠంలో నాలుగవ భాగం చూడండి. నాలుగు రోజుల తర్వాత ప్రకటింపబడవచ్చు.
    అయినా పండిత నేమాని వారి సవరణ శిరోధార్యం.
    ‘కుశసోదరుడు’ అనడంలో దోషం లేదు.
    **********************************************************************
    చంద్ర శేఖర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘తాపసి బాలుడు’ అని కాక ‘తాపసబాలుడు’ అంటే సమాసం దోషరహితం అవుతుంది.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    నిస్సందేహంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘లక్ష్మీ’అనకుండ ‘లక్ష్మియె’ అంటే సరి!
    **********************************************************************
    ఈ రోజు పూరణలకంటె ఎక్కువగా ప్రాస చర్చకు చెందిన వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నాయి. చర్చలో పాల్గొన్న మందాకిని, శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ, పండిత నేమాని, సంపత్ కుమార్ శాస్త్రి, ‘శ్యామలీయం’ తాడిగడప శ్యామలరావు గారలకు ధన్యవాదాలు.
    రేపటినుండి నా ‘ప్రాసమైత్రి’ పాఠాన్ని పరిశీలించండి.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  30. పసి నాట సన్యసించెను
    వెస నరి షడ్వర్గ మణచి వెలుగొందెను తా
    పసి యై శంకర పాదులు
    వసి బాలుడు సంగరమున బగతుర నణచెన్

    రిప్లయితొలగించండి
  31. ఎసగిన యుత్సాహంబున
    నొసగిన శస్త్రాస్త్రవిద్యలోర్మిఁబడసి,తా
    మసగణముఁ ద్రోలమనఁ దా
    పసి,బాలుడు సంగరమున బగతుల నణచెన్.

    రిప్లయితొలగించండి
  32. వసివాడక చెలరేగుచు
    నసదృశ వీరాంగ నాయె నపుడా ఝాన్సీ
    అసి హస్తంబున, వీపున
    పసిబాలుడు! సంగరమున బగతుల నణచెన్.

    రిప్లయితొలగించండి
  33. క్షమించాలి హనుమచ్చాస్త్రి గారి పూరణ నిపుడే చూశాను.

    రిప్లయితొలగించండి
  34. **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ఆదిశంకరుల ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘వీరాంగన + ఆయె’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘అసదృసవీరాంగన యయె’ అందాం.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  35. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 16, 2011 8:42:00 AM

    శంకరార్యా
    నమస్కారం
    మీరు చెప్పబోయే ఆ శకార ప్రాస పాఠం గురించి ఎదురుచూస్తూ ఉంటాను. నిన్ననే నా పుస్తకాల అర వెదికితే అదృష్టవశాత్తు అప్పకవీయం దొరికింది.అందులో స ష లకు ప్రాస వెయ్యవచ్చు అని చెప్పడం జరిగింది కానీ శ కారపు ప్రస్తావన అసలు లేదు. తార్కికంగా అలోచిస్తే స శ లకు ప్రాస వెయ్యకూడదు అని చెప్పలేదు కనుక వెయ్యవచ్చు అని గుణించుకున్నాను నేను. ర ఱ లకు మాత్రం ప్రాస చెల్లదని స్పష్టంగా వ్రాసి ఉంది. మరెందుకో శకారాన్ని విస్మరించడం జరిగింది.

    నాకు దొరికిన కొద్ది వ్యవధిలో నేను ఆ భాగం పూర్తిగా చూసేనో లేక కొంత ఎక్కడైనా మిస్ అయ్యేనో అనుమానమే

    రిప్లయితొలగించండి
  36. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 16, 2011 8:44:00 AM

    పండిత నేమానివారూ
    నమస్కారం
    మీ సూచన శిరోధార్యం.
    చక్కని సూచనకు ధన్యవాదం.

    రిప్లయితొలగించండి
  37. గురువుగారూ మీ సవరణకు ధన్యవాదాలు.
    కానీ అయెను అన్న పదం సమ్మతం కాదని
    విష్ణునందను గారన్నట్లు గుర్తు............

    రిప్లయితొలగించండి
  38. ముసలి మనోహర జోషిని
    విసుగుల అద్వానినపుడు విచ్చలవిడిగన్
    కసరుచు విసురుచు త్రోయుచు
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్

    రిప్లయితొలగించండి
  39. భవిష్య పురాణము (2024):

    విసుగును జెందక పోరున
    ముసిముసి నగవులను జల్లి బుడుతల యెదుటన్
    కసిగొని సోనియ గర్భపు
    పసిబాలుఁడు సంగరమునఁ బగతుల నణచెన్

    రిప్లయితొలగించండి