15, నవంబర్ 2011, మంగళవారం

అవీ - ఇవీ (పాండవ పక్షపాతి)

                         పాండవ పక్షపాతి
‘తురుపుముక్క’ బ్లాగులో కోడీహళ్ళి మురళీమోహన్ గారు చిలకమర్తి లక్ష్మీనరసింహ రావు గారి ‘మనోరమ’ పత్రికనుండి తీసికొని ప్రకటించిన ఈ ఐతిహ్యానికి నేను సరదాగా చేసిన పద్యరూపం ....
సీ.
భువనవిజయ సభన్ భూజాని కృష్ణరా
                     
                    యలు కవీంద్రులఁ జూచి యడిగె నిట్లు
"శ్రీరాము తమ్ములు శ్రేష్ఠులా? ధర్మజు
                    తమ్ములు శ్రేష్ఠులా? ధర్మ మరసి
తెలుపుఁ" డనఁగ నష్టదిగ్గజమ్ములు రెండు
                    పక్షమ్ము లైరి సంవాద మెసఁగె
రాయలే తుద కనె "రాముని తమ్ము లా
                    తనికంటే నన్నింటఁ దక్కువె కద!
ధర్మరాజును మించు తమ్ములైనను వార
                    లన్నమాటను మీర రెన్నఁడైన
తే.గీ.
కనుక ధర్మజు తమ్ములే ఘను" లటన్న
రామకృష్ణుఁ డనియె నిట్లు రాయలఁ గని
"యౌర! కృష్ణావతారమ్మునందె గాదు
ప్రభువు నేఁడును పాండవ పక్షపాతి!"


తురుపుముక్క బ్లాగులో చూడండి .....
http://turupumukka.blogspot.com/2011/11/blog-post_09.html

7 కామెంట్‌లు:

  1. చమత్కారభరితమైన కథ. మీ పద్యరూపం చక్కగా ఉండి అలరించింది గురువుగారూ!

    రిప్లయితొలగించండి
  2. ఆ పద్యము చమత్కారముగా బాగుగనే యున్నది. కొంచెము నిశితముగా ఆలోచించండి:

    సర్వభూతాల యెడ తాను సముడననుచు
    గీతలో మున్ను తెలిపెను కృష్ణమూర్తి
    భేదభావమ్ము లేనియా యాదిదేవు
    పక్షపాతిగ దెలుపుట పాడియౌనె?

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ,
    ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,

    చిలకమర్తి లక్ష్మీనరసింహ రావు
    చెప్పిన కథే యటంచును చెప్పినాడ
    నంతియే గాని సరదాకె యంటి; కాను
    హరిని పక్షపాతిగఁ జూచునట్టివాఁడ.

    రిప్లయితొలగించండి
  4. కేవలం పద్యము కట్టే ప్రయత్నమే కానీ, వాదోపవాదములకునో లేక పురాణ పురుషులను న్యూనపరచుటకునో కాదని మనివిచేసుకుంటూ

    అన్నననుసరించిరిగద అరణ్యములకు
    ధారవోసిరాజ్యముసుయోధనునకు;మరి
    అన్నననుసరించెనొకడు యాతని రాజ్య
    ముఁగనెమరొకండు రాముఁతోబుట్టువులల.

    భవదీయుడు

    రిప్లయితొలగించండి
  5. ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    అయితే మొదటి పాదంలో ‘అరణ్యములకు’ అన్నచో గణదోషం. ‘అడవి కేగ’ అంటే సరి. మూడవపాదంలో ‘ఒకడు + ఆతని’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘ఆతని రాజ్య’ అన్నప్పుడూ గణదోషం. ‘అన్న ననుసరించెనె యొకం డతని రాజ్య’ అందాం.

    రిప్లయితొలగించండి