21, నవంబర్ 2011, సోమవారం

నా పాటలు - (అయ్యప్ప పాట)

                      నవవిధ భక్తి మార్గాలు 

ఒకే గమ్యమును చేరుటకై మన
          కున్నవి ఎన్నో దారులు
నా దైవం అయ్యప్పను చేరగ
          నవవిధ భక్తి పథమ్ములు
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

మహిమలు చూపిన మణికంఠుని కథ
          మరి మరి ‘శ్రవణం’ చేద్దాము
దీనుల గాచే స్వామి లీలలను
          మానక ‘కీర్తన’ చేద్దాము
దయ కురిపించే శాస్తా నామం
          తప్పక ‘స్మరణం’ చేద్దాము
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

పావన పంపాతీర నివాసుని
          ‘పాదసేవనం’ చేద్దాము
పదునెట్టాంబడి పైన వెలసిన
          ప్రభువుకు ‘అర్చన’ చేద్దాము
పందళరాజ కుమారుని కెన్నో
          ‘వందనము’లనే చేద్దాము
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

వావరు స్వామిని మన్నన చేసిన
          వానికి ‘దాస్యం’ చేద్దాము
శబరికొండపై వెలసిన వానికి
          సతతం ‘సఖ్యం’ చేద్దాము
అందరి బాధలు హరించు విభునికి
          ‘ఆత్మనివేదన’ చేద్దాము
శరణం శరణం స్వామియె శరణం!
          స్వామియె శరణం అయ్యప్పా!        
|| ఒకే ||

2 కామెంట్‌లు:

  1. గురువు గారికి ధన్యవాదములు, నా కొరకు ఓ పాటను ఇచ్చినందుకు
    చాల బాగున్నది, తప్పక "కీర్తన" చేయుదును
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి
  2. అయ్యప్ప స్వామీ పాటలు చాలా బాగున్నాయి. అసలు భజనలో కూర్చుంటే లేవ బుద్ధి కాదు. ఇక్కడ కుడా కొందరు బాబా గుడిలో వేసు కుంటారు. కానీ వెళ్ళే భాగ్యం కలగ లేదు. రాసిన వాళ్ళు , పాడే వాళ్ళు ధన్యులు

    రిప్లయితొలగించండి