9, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 520 (ముని పదముల దాకి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

88 కామెంట్‌లు:

  1. ఇనకుల తిలకుడు కినుకతొ
    విను జలధిని యింకజేతు వేగమె యనగా
    కనికరము జూపు మని రా
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    రిప్లయితొలగించండి
  2. నా పూరణ .....
    (సముద్రపానం చేసిన అగస్త్యుని ప్రస్తావతో ...)

    మును కాలకేయు లొక్కట
    వననిధిలో దాగియుండ వాసవునకు వా
    రినిఁ జూపఁ ద్రాగవచ్చిన
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    రాముని ప్రస్తావనతో చక్కని పూరణ. బాగుంది. అభినందనలు.
    ‘కినుకతొ’ను ‘కినుకను’ అంటే సరి! ‘తో’ను ‘తొ’ అనరాదు.

    రిప్లయితొలగించండి
  4. ముని వేషము దాల్చిన శ్యా
    ముని, రఘుకుల వార్ధి సోము, భూరి సుగుణ ధా
    ముని, దనుజ విరాముని, రా
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి
  5. అయ్యా! హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీ పూరణ బాగున్నది. జలధిని తరువాత యడాగమము రాదు. నిన్ దృతము కదా.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    అనుప్రాసాలంకార శోభితమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. హనుమచ్ఛాస్త్రి గారూ,
    అక్కడ ‘విను జలనిధి నింకఁజేతు’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! చంద్రశేఖర్ గారూ! మీ పద్యమును ఇలా సవరించేను.
    (నిన్నటి సమస్య)
    మర్యాదల నే సకల సు
    చర్యల క్షీరాబ్ధికన్య సంపన్నిలయన్
    ఆర్యా! సరసిజనాభుని
    భార్యా పద పూజ జేతు బదుగురు మెచ్చన్

    చపల శబ్దము లక్ష్మికి వర్తిస్తుంది గానీ మనము ఆహ్వానించేటప్పుడు ఆమెను స్థిరంగా మన యింట ఉండాలనే కోరుకొనాలి. అందుకే చపల అని వాడ వద్దు అంటాను. వాడ రాదు అనను.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని వారూ,
    చంద్రశేఖర్ గారి పక్షాన మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. మును పొంగెను నా మనమను
    వననిధి నా యెదను నిలిచి వ్రాయించగ రా
    ముని కథ నాచే నా రా
    ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి
  11. శ్రీ నేమాని మహాశయా! శతకోటి ధన్యవాదాలు. నమోవాక్కాలు. నిన్నటి మీ వ్యాఖ్య, ఈ రోజు మీరు దిద్దిన మెరుగు నన్ను సరైన దిశలో చాలా ఆలోచింప జేశాయి.
    గణములు ప్రాసలు యతి ల
    క్షణములు పద దోషములును సరిజే యుచునా
    ఘృణిజూపిన నేమానికి
    ప్రణుతించెద నెల్లపుడును పండిత వర్యా!

    రిప్లయితొలగించండి
  12. అందమగు బ్లాగు నిలిపిరి
    యందరి హృదయముల నిలిచి యానందము పెం
    పొందు గతి శంకరయ్యా!
    కంది సుకుల కంధి చంద్ర! కవివర! జేజే

    రిప్లయితొలగించండి
  13. పొనరిన పుణ్యపు ఫలమున
    దన ముందట విల్లు నెక్కు తాపస మిత్రున్
    వనజాక్షునిగ నెఱిగి రా
    ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్ !

    రిప్లయితొలగించండి
  14. శ్రీ పండిత నేమాని వారి పూరణ చాలా శోభాయమానముగా యుంది.
    గురువు గారి పూరణ చాలా బాగుంది. శాస్త్రి గారూ చక్కని పూరణ.

    రిప్లయితొలగించండి
  15. నిన్నటి వ్యాఖ్యలలో మాన్య మహోదయులు శ్రీ మల్లంపల్లి శరభయ్య గారి ప్రస్తావన వచ్చినది. వారు మహా పండితులు. సాక్షాత్కరించిన సరస్వతీ మూర్తులు. నిరాడంబరులు. వారు పాల్గొన్న 3 - 4 సభలకు నేను వెళ్ళేను. అలాగ వారి దర్శన భాగ్యము పొందేను. కాస్త నత్తిగా మాటాడేవారు. సాహిత్య రత్నాకరులు అయిన వారు ఎన్నడూ ధన సంపదల గూర్చి పట్టించుకొన లేదు. విశ్వ విద్యాలయం వారు ఒక మారు వారికి ఒక మహాకావ్యమును పంపి 2 రోజుల వ్యవధిలో వ్యాఖ్యను అడిగేరుట - వారు అలాగే వ్రాసి ఇచ్చేరు. మహా ప్రతిభాశాలి. చారికి నా మనః పూర్వక నమస్సులు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా డాక్టరు నరసింహ మూర్తి గారూ!
    మీ బిజీలో ద్రుతమును మరచిపోతున్నారు. ద్రుతము అంటేనే తొందర కదా. మీ ప్రశంసా వాక్యములలో "శోభాయమానముగా యుంది" అని యడాగమము చేసేరు. ద్రుతమును ఆహ్వానించకపోతే అది ఒప్పుకోదు కదా. అందుచేత శోభాయమానముగా నున్నది అందాము. మీ ప్రశంసలను కూడా నేను వదలుట లేదు చూచారా.

    రిప్లయితొలగించండి
  17. డా. మూర్తి మిత్రులు రాత్రి 8:00 గంటలు దాటితే అశ్వారూఢులవుతారని వినికిడి :-)

    రిప్లయితొలగించండి
  18. మనం తెలుగు పదాలతోకూడా 'గూగుల్' శోధన చేయవచ్చును. "మల్లంపల్లి శరభయ్య" అని శోధిస్తే నూటికి పైగా పేజీలు వచ్చాయి. "మల్లంపల్లి సోమశేఖర శర్మ" అంటే వేయికి పైగా పేజీలు వచ్చాయి. వికీ పేజీ te.wikipedia.org/wiki/మల్లంపల్లి_సోమశేఖర_శర్మ కూడా వచ్చింది. "మల్లంపల్లి వీరేశ్వర శర్మ" అంటే యెక్కువ పేజీలు రాలేదు కాని ముఖ్యంగా "ఈమాట" వెబ్-జైన్ పేజీ వచ్చింది. ఇవేవీ యింకా చూడలేదు.

    అన్నట్లు ఈరోజు వచ్చిన పూరణలు యింకా చదువలేదు. కాని కార్యాలయానికి వేళ అవుతోంది. కొన్ని చదివాను.
    నేమాని వారి పూరణ బహుసొగసుగా తోచింది.

    రిప్లయితొలగించండి
  19. మును దండి జేరి యచ్చట
    నొనర్చె సత్యాగ్రహమ్ము నుత్సాహముతో
    మన గాంధి మహాత్ముండా
    ముని పదముల దాకి వార్థి పొంగుచు నలరెన్ !!!

    రిప్లయితొలగించండి
  20. శ్రీ పండిత నేమాని వారికి ధన్యవాదములు. మీరు చెప్పినది యర్ధ మయింది. పరదేశములో పరభాషతో వేగుకొస్తున్నాము. ఎప్పటికైనా తెలుగు రాకుండా పోతుందా ? నా ప్రయత్నము చేస్తాను.
    చంద్రశేఖర్ గారి హాస్యానికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  21. మనుజుని రూపము దాల్చితి
    దనుజుల సంహారమునకు, దాటుము రామా
    నను నీవని భక్తిని రా
    ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి
  22. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 09, 2011 10:38:00 AM

    మును వైకుంఠుని పాదము
    లను కడిగియు నల్లుడంచు లచ్చినొసంగన్
    తన యోగమని ఘనశ్యా
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి
  23. అనియత బల సంపన్నుడు,
    ఘనచరితుడు,రాక్షసకుల కాలాంతకుడై
    చను,సద్గుణమునివనసో
    మునిపదముల దాకి వార్ధి పొంగుచునలరెన్.

    మునివనసోముని = మునులనే వనములకు చంద్రుడైనవాడు,

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! సంపత్కుమార్ శాస్త్రి గారూ!
    మీ పద్యము చదివేను - మా అభినందనలు. 2వ పాదములో కాలాంతకుడై అని వాడేరు. కాలుడు అంటే యముడు, అంతకుడు అన్నా యముడే. కాలాంతకుడు అంటే శివుడు అనే అర్థము వచ్చుచున్నది. మీ భావము ఏమిటో ఆ పదమును సరిచెయ్యాలో చూడండి.

    రిప్లయితొలగించండి
  25. సపత్కుమారశాస్త్రిగారు తమపద్యంలో "రాక్షసకుల కాలాంతకుడై చను" అనటానికి బదులుగా సులువుగా "రాక్షసకుల కాలుండనగం జను" అంటే సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  26. ఏదో క్రొత్తగా చెప్పాలని వెఱ్ఱి తాపత్రయం. ఇది యెలాగుంటుందో చెప్పండి.

    తన కనగ తగును గగనం
    బున కనగను తగును నీల మోహన దేహం
    బనక తమ రధికు లని రా
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్

    అసలే యతులతో నాకు చిక్కులు వస్తున్నాయి. కందపద్యంలో నాలుగింట రెండుపాదాలలో యతినియమం లేకపోవటం నాకు లాభం. మిగతా రెండింటిలో ఒకటి సమస్యాపాదం కాబట్టి నా యతిప్రయాస ఒకే అంతా ఒక్క రెండవ పాదంలోనే. పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ లకు యతిమైత్రి ఉంది కాబట్టి బ్రతికిపోయానననే అనుకుంటున్నాను. చూడాలి నా అదృష్టం యెలాగుందో యీ సారి.

    రిప్లయితొలగించండి
  27. పీతాంబర్ గారూ మన్నించాలి.
    "రామపాద మెఱుపును" అనకూడదండీ.
    'పాదము' తత్సమ పదం అంటే సంస్కృతంనుండి తెచ్చేసుకున్న మాట. కాని 'మెఱుపు' తెలుగు మాట.
    కాబట్టి యీ రెండింటినీ కలిపితే పాదపుమెఱుపు అవుతుంది.

    రిప్లయితొలగించండి
  28. చనుచుండగ వారధిపై
    ఘన రావణు ద్రుంచి వేగ కనుగొన సీతన్,
    యిన కుల దుగ్దాంబుధి సో-
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    కనుగొని జానకి నద్దరి
    నిన చంద్రుని జేర వేగ నెగురగ పాద-
    మ్మునిడ గిరిని కపికుల సో-
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    రిప్లయితొలగించండి
  29. మిస్సన్నగారు మన్నించాలి.
    సీతన్, ఇనకుల --> సీతన్, యినకుల అని చెప్పటం సరిగాదు.
    సీతన్ + ఇనకుల --> సీతను + ఇనకుల --> సీతనినకుల అవుతుంది.
    మీరు సీతన్ అన్న తరువాత పాదం విరచినా, దానికి దన్నుగా కామా ఉంచినా
    ప్రయోజనం లేదు. ఇదివరకే మనం చర్చించుకున్నట్లు, విరామ చిహ్నాలు తెలుగులో (అంటే గ్రాంధికభాషలో) లేవు.

    తరువాతి పద్యంలో "అద్దరనిన చంద్రుని" అన్నారు. అద్దరిన్ + ఇన చంద్రుని అని మీ భావం అనుకుంటాను. కాని ఇనకుల చంద్రుని కుదించి ఇనచంద్రుని చేయరాదని నా అభిప్రాయం. నాదే పొరపాటు కావచ్చును.

    రిప్లయితొలగించండి
  30. ఇంకొక చిన్న విషయం. మిస్సన్నగారు "ఘన రావణు" బదులు "ఘను రావణు" అంటే సరిగా ఉంటుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  31. శ్రీ నేమాని గురువర్యా,

    తప్పిదమునెఱిగించినందులకు ధన్యవాదములు. సాధారణముగా "వాడు కాలాంతకుడు " అంటే "వాడు యముడు" అనే అర్థములో వాడుతున్నట్లుగా అనుకొనేవాడిని. అందువలననే ఆ విధంగా ప్రయోగించినాను.

    శ్యామలీయం గారూ,

    మీయొక్క సవరణ సర్వదా ఆమోదయోగ్యమే. ధన్యోశ్మి.

    చిన్న సవరణతో...................

    అనియత బలసంపన్నుడు,
    ఘనచరితుండఖిలలోకగణ్యుడు, లంకా
    వని జేరగ పోయెడు రా
    మునిపదముల దాకి వార్ధి పొంగుచునలరెన్.

    రిప్లయితొలగించండి
  32. **********************************************************************
    పండిత నేమాని గారూ,
    మనోవార్ధిని పొంగించిన మీ పూరణ స్వీయవిషయశోభితమై అద్భుతంగా ఉంది. అభినందనలు.
    నన్ను సంబోధించి చెప్పిన పద్యరత్నానికి ధన్యవాదాలు.
    అందులో ‘నిలిపిరి + అందరి’ అన్నప్పుడు యడాగమం రాదు కదా! ‘అందమగు బ్లాగును నిలిపి / రందరి ..’ అంటే బాగుంటుంది కదా!
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    నేమాని వారిని ప్రస్తుతించిన మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    ‘విల్లు నెక్కు" ను ‘విల్లు నెత్తి’ అంటే ...?
    **********************************************************************
    డా. విష్ణునందన్ గారూ,
    ముని వంటి గాంధీ ప్రస్తావనతో మీ పూరణ అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    సముద్రునిచే అల్లుని కాళ్ళు కడిగించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! ‘శ్యామలీయం’ గారి సవరణ సముచితంగా ఉంది.
    సవరించిన పూరణ చక్కగా ఉంది.
    **********************************************************************
    శ్యామలీయం గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. బాగుంది మీ పూరణ. బు, మోల యతిగురించి మొన్నటి నా ఛందస్సు పాఠం చూడండి. మీ ప్రయోగం సరియైనదే.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    రెండవ పూరణను ఇలా మొదలు పెడదాం ‘కనుగొని జానకి నద్దరి / నినకులశశి(వరు) జేర వేగ ...’
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  33. తనయుని తలపై దాల్చియు
    తనయను నురమందు దాల్చి ధరణిన్ నెల్లూ
    రున వెలసిన' హరిహర 'నా
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్

    మన్నించాలి పాఠకులు .దీనికి ఐతిహ్యమేమీ లేదు. అసలు 'హరిహర నాధుడు 'తిక్కన గారి సృష్ఠి కదా!

    కూర్తురు శుభములు తేజో
    మూర్తులు శివ కేశవులు సుముఖులై కోర్కెల్
    దీర్తురు సంపద లిత్తురు
    కార్తీక పౌర్ణమి నాడు కవి మిత్రుల కున్

    రిప్లయితొలగించండి
  34. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ఐతిహ్యం ఎలా ఉన్నా మీ పూరణ మాత్రం చాలా బాగుంది. అభినందనలు.
    శుభాకాంక్షల పద్యానికి ధన్యవాదాలు. చివరి పాదంలో ‘కపౌర్ణ’ అని జగణం పడింది. కందంలో 2,4 వ పాదాల్లో సరిగణంగా జగణాన్ని వాడరాదు.

    రిప్లయితొలగించండి
  35. చిన్న సందేహం. "విల్లు నెత్తి" సాధువేనా? "వింటి నెత్తి" అనాలేమో?

    రిప్లయితొలగించండి
  36. గురువు గరూ ధన్యవాదములు. నాకు నచ్చిన పద్యాలలో మొల్ల రామాయణములో
    కదలకుమీ ధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర పద్యములో భూవరు డీశుని చాప ' మెక్కిడున్ ' అనే పదము వింతగా నాకర్షించినది. భారతములో కూడా 'ఎత్తు ' బదులు 'ఎక్కు ' అని చదివి నట్లు గుర్తు. అందుకే అలా వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  37. శ్యామలీయం గారూ, వివరించండి. విల్లు అంటే ధనస్సు అని, విల్లుకు సంబధించినవి చెప్పి నప్పుడు వింటి (ఉదా; వింటి నారి )ప్రయోగము చేస్తామని నా ఊహ. శంకరయ్య గారి బ్లాగు నిజంగానే రసవత్తరముగా నున్నది.

    రిప్లయితొలగించండి
  38. గురువు గారు, ధన్యవాదములు.

    మూర్తిగారు,
    చాపమెక్కిడున్ అన్నప్పుడు ఎక్కుపెట్టిన విషయం గూర్చి చెపుతున్నారనుకుంటా. ఎత్తు బదులు ఎక్కు గాదు.
    విల్లునెత్తి, వింటినెత్తి రెండింటిలోను అర్థలో పం రాదనుకుంటాను.
    గురువు గారు చెప్తే విందాము.
    చెప్పటం తెలియకపోయినా అత్యుత్సాహంకొద్దీ ఈ వ్యాఖ్య. :-))

    రిప్లయితొలగించండి
  39. **********************************************************************
    శ్యామలీయం గారూ,
    విల్లు నెత్తి, విల్లు నెక్కుపెట్టి, విల్లును విఱిచి మొదలైన ప్రయోగాలు సాధువులే అని నా అభిప్రాయం.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అది ‘చాపము + ఎక్కు + ఇడున్’. ‘ఎక్కి’ అనేదానికి ‘అధిరోహించి’ అనే అర్థం తప్ప ఎక్కుపెట్టి అనే అర్థం రాదు. అందువల్ల అక్కడ ‘ఎత్తి’ అంటే బాగుంటుందని సూచించాను.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  40. నా మిడిమిడి జ్ఞానం గురించి ముందే ఒప్పుకుంటూ -
    విల్లు + ఎత్తి --> విల్లెత్తి అనీ
    విల్లును + ఎత్తి --> వింటిని + ఎత్తి --> వింటినెత్తి అనీ అనుకుంటాను
    విల్లును ఎత్తటం అనే క్రియ వేరు, ఎక్కుపెట్టటం అనే క్రియ వేరు.
    మొదటిది వింటిని పైకి లేపటం అనే పనిని తెలియజేస్తుంది.
    రెండవది బాణం విడవటానకి వింటినారికి బాణాన్ని సంధించి నారిని వెనుకకు లాగటాన్ని తెలియజేస్తుంది.

    రిప్లయితొలగించండి
  41. దిన దిన వర్ధమానమయి తేజమెసంగగ సభ్య కోటికిన్
    మనముల గాంతి నింపుచు ప్రమాణములెన్నియొ దాటు ప్రక్రియల్
    తనరగ జేయుచున్ తెలుగు తల్లికి సేవలు చేయుచున్ ముద
    మ్మునొసగు శంకరాభరణమున్ వినుతించుచు గూర్తు నంజలిన్

    రిప్లయితొలగించండి
  42. శ్యామలీయం గారూ , ఒక వివరణ .

    మొదటి రూలు వలన - ఒక పాదం నుండి మరో పాదానికి ఒక సమాసం తోనో , లేదా నకారప్పొల్లు తరువాత ఒక హల్లు తోనో తప్ప , అచ్చు తో ప్రారంభించడం వీలు పడదు , అది ఎల్ల వేళలా కుదరదు కూడా !

    తెలుగులో విరామ చిహ్నాలు లేవన్నది నిజమే కాని , తెలుగైనా మరే యితర భాష యైన - వాక్యం లో విరామమన్నది ఉంటుంది కదా ! చిహ్నం పెట్టినా , పెట్టక పోయినా , చదివేప్పుడు ఒక ఊనిక కొరకు ఆగడమే విరామం . అది లేని వాక్యమూ ఉండదు . పద్యమూ ఉండదు !

    ఈ విరామస్థానాలున్నవే అందుకు ! చిహ్నం ఉంటే ఏమి , లేకపోతేనేమి ? ఆపే చోట ఆపగలిగితే చాలు కదా !

    ఇమ్ముగ చదువని నోరును
    అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరున్ ( నోరును + అమ్మా అని = నోరునమ్మా అని , ఉత్తునకు సంధి నిత్యము ; కానీ కాలేదు - ఎందుకంటే అది పాదాంతం , విరామ స్థానం ! )

    ఓడలు బండ్లును వచ్చును
    ఓడలు నా బండ్ల మీద నొప్పుగ వచ్చున్
    ఓడలు బండ్లును వలెనే
    వాడంబడు గలిమి లేమి వసుధను సుమతీ !

    ( మొదటి పాదాంతం నుండి రెండవ పాదారంభానికి - ఉత్వ సంధి లేక పోవడాన్నీ , రెండవ పాదాంతం నుండి మూడో పాదారంభానికి నకారప్పొల్లు తో కూడి , అచ్చుతో ప్రారంభమయ్యే పాదారంభాన్ని - (అచ్చు మిస్సన్న గారి వలెనే ) గమనింపవచ్చు )

    ఘనతర చెంచుమలాన్వయు
    డనఘుడు ' జయరామి రెడ్డి ' యను నాయకుడు
    ర్విని బాలించుచు నుండెను
    అనువుగ ' నొస ' మన్న నగర మాస్థానముగన్ ( ఉయ్యాలవాడ నర సింహా రెడ్డి చరిత్ర , శతావధాని కీర్తి శేషులు పాణ్యం నరసరామయ్య కృతం ) - 3 వ పాదం తుదిని , 4 వ పాదం మొదలు ను పరిశీలింపవచ్చు - సంధి లేదు - అది విరామ స్థలం .

    తనకు సాహిత్య గురువు , విద్వద్వరుండు
    సంస్కృతాంధ్ర కవిత్వ విశారదుండు
    "ఓబుళాచార్యుల " ను వైష్ణవోత్తముండు
    దనరుచుండెను రెడ్డి యాస్థానమందు ! ( పై కావ్యం లోనే ) 2 వపాదం చివర , మూడో పాదం మొదలూ గమనింపవచ్చు .


    ఇంకా పెక్కు పద్యాలు జ్ఞప్తికి వచ్చినప్పుడు విశదపరచగలను .
    పొనీ శతక పద్యాలకు అంత విలువ లేదని అన్నా (సాహిత్యం లో శతక పద్యాలకదో చిన్న చూపు ) , మన పద్యాలు సుమతీ శతకకారుడి తరువాతే కదా ! ఏతావాతా చెప్పవచ్చేదేమంటే , 1. పాదాంతం లో నకారప్పొల్లున్నా , తరువాత పాదారంభాన్ని యడాగమం చేయకుండా విసంధి చేసి వ్రాయడం .
    2 . తెలుగు పద్యాల్లో విరామ చిహ్నాలనేవి లేవు కానీ , విరామ స్థానాలున్నాయి - అవి మనం ఎక్కడ కాసేపాగి ఊపిరి తీసుకోవచ్చో అందుకు అనువుగా ఉంటాయి . అక్కడ ఆగాలా , లేక ' సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ' లా దూసుకుపోవాలా అన్నది కవి ఇష్టం !

    ఎందుకు చెప్పవలసివచ్చిందంటే , చెప్పకపోతే కొన్ని అభిప్రాయాలు శిలాక్షరాలైపోయి - స్థిరపడిపోతాయి కాబట్టి !!!

    రిప్లయితొలగించండి
  43. తమ్ముడు నరసింహమూర్తి పద్యము గూర్చి, ఇలా సవరిస్తే హాయిగా అన్వయము కుదురుతుంది:

    ధనువున బాణమును దొడిగి
    తన ముందట నిలిచియున్న తాపస మిత్రున్
    వనజాక్షునిగ నెరిగి రా
    ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి
  44. శ్యామలీయం గారూ,
    నేను విల్లును ‘ఎక్కి’ అంటే ఎక్కుపెట్టడం అనే అర్థం రాదు కనుక విల్లును ఉపయోగించడానికి పైకి లేపినాడనే అర్థంలోనే‘ఎత్తి’ అని సూచించాను.
    ఇక ‘ఎక్కుపెట్టుట’కు మీరు చెప్పిన అర్థం సరి కాదు. సాధారణంగా సర్వవేళలా అల్లెత్రాడు వింటికి రెండు వైపులా కట్టి ఉండదు. ఒకవైపునే కట్టి ఆ నారిని విల్లుకు చుట్టి ఉంచుతారు. విల్లును ఉపయోగించాలనుకున్నప్పుడు ఆ చుట్టను విప్పి వింటి క్రిందికొనను నేలకు ఆనించి ఒకచేతితో బలంగా విల్లును వంచి, మరొక చేతితో ఆ అల్లెత్రాడును పై కొనకు ముడివేయడమో, కొక్కానికి తగిలించడమో చేస్తారు. దీనినే ఎక్కుపెట్టడం అంటారు. నిఘంటువులు ఎక్కుపెట్టడం అంటే ‘జ్యాసంధానము’ అనే అర్థాన్నిస్తున్నాయి. మీరన్నట్లు బాణాన్ని వింటికి తగిలించి అల్లెత్రాడును వెనక్కిలాగడాన్ని గురుచూడడం అంటారేమో!

    రిప్లయితొలగించండి
  45. విష్ణునందనుల వారికి నమోవాకములు.
    ఈ "ఇమ్ముగ చదువని నోరును | అమ్మా అని పిలిచి అన్నమడుగని నోరున్ "
    అనేది గ్రాంధికంగా నయితే "ఇమ్ముగ చదువని నోరును | యమ్మా అని పిలిచి యన్నమడుగని నోరున్" అని వ్రాయవలసి యుంటుంది.

    తెలుగులో విరామ చిహ్నాలు లేవన్నది ఆక్షేపించటానికి కాదని నా మనవి. విరామచిహ్నాలను సంధికార్యాలను అడ్డుకోవటానికి ప్రయోగించరాదని నా యభిప్రాయమని చెప్పటానికే. భారతాదిక ప్రామాణిక కావ్యాదులలో ప్రత్యక్ష విరామచిహ్నాలుండవన్నది సరే కాని, పరోక్ష విరామచిహ్నాలనిలా సదుపయోగం చేసుకున్నదాఖలాలున్నాయా అని నా ప్రశ్న. విజ్ఞులు తెలియ జేయ గోరుతాను.

    ఘనతర చెంచుమలాన్వయ ... పద్యంలో పాణ్యంవారు సంధిచేయలేదు కాని. ఉండెననువుగ అని సంధి తప్పక జరుగుతుందని నా విశ్వాసం. అయితే పెద్దల ప్రయోగాన్ని నేను తప్పు బట్టలేను కాని నాకైతే సంతృప్తికరంగా లేదని మనవి. ఇలాగా తనకు సాహిత్య గురువు... పద్యంలో కూడా. అయితే పాణ్యం వారు కొంత వ్యావహారికశైలిని పాటించదలచారేమో. ఇక పోతే ఓడలు బండ్లును... పద్యం ఉన్నది ఉన్నట్లుగా ప్రాచీనశైలిగాదని నా అభిప్రాయం. అయితే సుమతీ శతకాదులు కొన్ని ప్రౌఢులకోసం ఉద్దేశించినవ కావని స్పష్టం కాబట్టి లాక్షణికత విషయంలో శతకకారుడే స్వాతంత్ర్యం తీసుకొని యుండవచ్చునేమో.

    అయ్యా, ముందే నేను మనవి చేసుకున్నట్లు నాది అక్షరాలా మిడిమిడి జ్ఞానమే. కాబట్టి నా అభిప్రాయాలు శిలాక్షరాలు కానేరవు. అలాంటి ప్రమాదం నుండి నాతో సహా అందరినీ తప్పించేందుకు పెద్దలు మీరంతా ఉన్నారన్న భరోసా మాకు తప్పకుండా ఉంది.

    రిప్లయితొలగించండి
  46. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు.లోపమును సూచించిన నేమాని వారికి ధన్యవాదములు.

    సవరణతో...

    ఇనకుల తిలకుడు కినుకను
    గని జలనిధి నింకజేతు గనుమా యనగా
    కనికరము జూపు మని రా
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    రిప్లయితొలగించండి
  47. శంకరుల వారికి ధన్యవాదాలు. ఎక్కిడటానికి అర్ధంలో జ్యాసంధానమే కాని శరసంధానం లేదు.

    రిప్లయితొలగించండి
  48. శ్యామలీయంగారికీ , మిగిలిన కవిమిత్రులందరి కోసమూనూ -
    మరికొన్ని ఉదాహరణలు -

    1. ఆడిదము సూరకవి - సూరకవి యుగంగా ప్రసిద్ధి - సూరకవి తిట్టు కంసాలి సుత్తి పెట్టు అన్నంత పేరుగల తిట్టుకవి 17 , 18 శతాబ్దులు

    సారతర ప్రబంధము లసంఖ్యముగా నొనరించునట్టి యీ
    సూర కవీంద్రునిన్ జునిగి చూతమతంచును మాటిమాటికిన్
    ఈరసమెత్తి దుష్కృతుల నిచ్చిన వారల నోరు మొత్తుడీ
    మీరును మీరు మీరు మరి మీరును మీరును మీరలందరున్ ! ( 2వ పాదాంతం మరియు 3వ పాదాది )

    2. తురగా రామకవి - రామకవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ అని ప్రసిద్ధి 1720 ప్రాంతం.

    కూటికి కాకులు వెడలెను - ఏటావల మూక చేరి యేడువ దొడగెన్
    కాటికి కట్టెలు చేరెను - లేటవరపు పోతరాజు లేడా లేడా ?! ( 1వ పాదాంతం , 2వ పాదాది )

    3. ముక్తేవి పెరుమాళ్లయ్య కవి - 1750 ప్రాంతం

    లక్షల తరబడి ఆవలి - పక్షంబున గుర్రములును బలములు వచ్చెన్
    ఈ క్షణమున నీవే చని - శిక్షింపుము శత్రుహంత శ్రీ హనుమంతా ! ( 2 వ పాదాంతం , 3వ పాదాది )

    4. రాళ్లబండి పట్టాభిరామరాజు - 1784 - 1814
    వెలమదొరల పొందు వేయేండ్లు చేసిన - కాసు వీసమైన గానరాదు
    మెచ్చెనేని మంచి ముచ్చట జెప్పును - అలిగెనేని ప్రాణ హాని జేయు ( 3 వ పాదాంతం , 4వ పాదాది )

    పాణ్యం నరసరామయ్య గారిది ఫక్తు గ్రాంధిక శైలి . మన పూర్వకవుల త్రోవ వారికి అనుసరణీయమూ.....మనకు కూడ ... తెలుగు చాటువు పుట్టు పూర్వోత్తరాలు తీస్తే కనిపించిన కొన్ని ఉదాహరణలివి - ఇంకా చాలానే ఉన్నాయి .
    నిరభ్యంతరం గా విసంధి చేసి వ్రాయవచ్చును - పాదాంతం ఐన తరువాత , కాస్త వూపిరి నిలుపుకుని , మరో పాదాన్ని ఆరంభించడానికి .ముఖ్యంగా పాదాంతమైన నకారప్పొల్లు తరువాత ! లేదూ మాకేమి అలా అవసరం లేదన్నా - ఏం పర్లేదు . ఏకవాక్యం గా లాగించేయవచ్చు . అదీ సంగతి !
    అయినా సంప్రదాయమదే ఐనప్పుడు తప్పేమీ లేదు !

    రిప్లయితొలగించండి
  49. చాటువులు , శతకాలు ప్రామాణికమా అన్నది ప్రశ్న ! కాదు కానీ , మనం వ్రాసేవి దాదాపు చాటువులే అని.....మరీ మాట్లాడితే పైనుదహరించిన మహాకవుల కన్నా కొంచెం తక్కువేననీ జవాబు ! ఏమో ఇంకా మనసు పెట్టి వెదికితే ఈ ప్రయోగాలెన్ని కనిపిస్తాయో తెలీదు మరి

    రిప్లయితొలగించండి
  50. కూర్తురు శుభములు తేజో
    మూర్తులు శివ కేశవులు సుముఖులై కోర్కెల్
    దీర్తురు కవి మిత్రులకున్
    కార్తీకపు పౌర్ణమి తిధి ఘన పర్వమునన్

    రిప్లయితొలగించండి
  51. చర్చను ఉపయుక్తంగా కొనసాగించు చున్న శ్యామలీయం గారికి, విష్ణు నందన్ గారికి, మాస్టరు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  52. ఉపసంహారం :

    ఉత్సాహ . సెనగపిండి యుల్లిపాయ చిన్న మిర్పకాయలున్
    జొనిపి యందు నల్లమింత జొనిపి ముద్ద జేసియున్
    అనల తప్తమైన నేతియందు వైచి వేచినన్
    జను పకోడి యనెడి పేర జక్కనైన ఖాద్యమై - తిరుపతి వేంకటేశ్వరులు ( 2వ పాదాంతం , 3వ పాదాది )

    తిరుపతి శాస్త్రి నిర్యాణ సందర్భంలో చెళ్లపిళ్ల వారు -

    అల దివాకరునకు బోలె నస్తమయము - ఉదయమున్ గూడ నిజమునకుండబోవు
    నీ యశః కాయమునకని నేనెరిగియు - పామరత జేసి విలపింప వలసె సఖుడ ! ( 1వ పాదాంతం , 2 వ పాదాది )

    రిప్లయితొలగించండి
  53. మాస్టారూ, ధన్యవాదాలు. విల్లు ఎప్పుడూ ఎక్కుపెట్టి వుండదని, వీణ ఎప్పుడూ సారించి వుండదని చెప్పిన మా గౌరీనాథ శాస్త్రి మాస్టారి పాఠం జ్ఞాపకం తెప్పించారు. ఈ తరం యువకులు ముఖ్యం గా తెలుసుకోవలసిన technical point ఇది.

    రిప్లయితొలగించండి
  54. వినె నేమో రాయిని భా
    మను జేసిన రామ పాద మహిమను గుణ ధా
    ముని రాముని రవికుల సో
    ముని పదములు దాకి వార్ధి పొంగుచు నలరెన్ !!!

    రిప్లయితొలగించండి
  55. శ్రీఆదిభట్ల కామఏశ్వర శర్మబుధవారం, నవంబర్ 09, 2011 9:58:00 PM

    పీతాంబర్ గారి పద్యములో రాయిని అనే మాటను రాతిని అని మారిస్తే?? పెద్దలు కాస్త వివరింప మనవి.

    రిప్లయితొలగించండి
  56. డా. విష్ణునందన్ గారు, తెలుగు పద్యం యెంత పరిశీలనగా (critical reading) చదవాలో ఈ రోజు మీరు ఉటంకించిన ఉదాహరణలు, వివరణలు తెలుపుతున్నాయి. మా చిన్నప్పుడు అరసున్నాలు వదిలేసి పద్యం వ్రాస్తే మాష్టారు కొట్టేవారు. ఎందుకో ఇప్పుడు తెలుస్తోంది. అది గుర్తుకొచ్చింది.
    మీతో ఏకీభవిస్తున్నాను. నకారపు పొల్లు అంతమందు వుండటం నిషేధం కాదని, విరామ చిహ్నాలు పెడితే తప్పు కాదని.
    మిత్రులతో పంచుకొందామని: ఇంకొక చిన్న మాట. కాలానుగుణ్యంగా మన నిత్య భాషా భావ ప్రకటనలు (body language, word choices) చాలా మార్పు చెందాయి. ఉదాహరణకి, మా అమ్ముమ్మ మాట్లాడుతుంటేనే యే తేటగీతి పద్యమో, ద్విపదో, పోతన గారి వచనమో చదువుతున్నట్లుండేది. మచ్చుకి, "ఏమిటిరా, సుందోపసుందుల్లాగా ఆ బొమ్మ కోసం కొట్టుకోవటం, ఉద్దాలకుడు-చండిక చందంగా వుంది" అనేది. ఆ మాటలిప్పుడు లేవు..

    మా గురువులు నరసింహావధాని గారు మాట్లాడుతుంటేన సమాసాలు, సంస్కృతం, ఛందస్సు, ఉదాహరణలూ వాటంతటవే దోర్లుకోచ్చేవి. వారు తిడుతున్నా మేము వినటానికి సంతోష పడేవాళ్ళం. ఆ భాష అంత బాగుండేది. "అపభ్రంశపు వెధవ, మ్లేచ్చుడా" అనేవారు. అప్పట్లో "ఆహా నన్నే మ్లేచ్ఛుడన్నారు" తాతగారు అనుకొనేవాళ్ళం. వాటి intensity ఇప్పుడు తెలుస్తోంది. మరి ఈ రోజున ఆ తెలుగు లేదు. చదువరులకు సహాయం గా వుండే విరామ చిహ్నాలు పెట్టి పద్యంలో అనుచిత పదవిరామాలను (ఉ. రామునితో, కపి) కొంత వరకు ఆపవచ్చుకూడా. అది మంచే చేస్తుందని నా అభిప్రాయం. దీనికి శాస్త్ర నిబద్ధత మీరు చూపించారు, మరొక్కసారి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  57. "వాక్యావసానంబున సంధి లేమి దోషంబుగాదని యార్యు లండ్రు - బాలవ్యాకరణం - సంధి. 55 సూ."
    "నస్యాద్వాక్యవిరామేతు సంధ్యభావోపి దోషకృత్. అథర్వణాచార్యులు"
    వ్యాక్యాంతంలో సంధి లేకపోవడం దోషం కాదని పెద్ద లంటారు.
    ‘సర్వతీర్థాభిగమనంబు సర్వవేద
    సమధిగమము సత్యంబుతో సమము గావు
    ఎఱుఁగు మెల్ల ....’ (మహా భారతం)
    పడగ నున్న హనుమ భయవిహ్వలుఁడు కాఁడు
    అరదమునకు సూతుఁ డచ్యుతుండు’ (మహా భారతం)

    రిప్లయితొలగించండి
  58. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 09, 2011 10:25:00 PM

    శ్రీ చంద్రశేఖర్ గారి వ్యాఖ్య చదివాక, నిజమే నాడు అమ్మా అమ్మమ్మా మాట్లాడిన భాష నేడు లేదుకదా అనిపించి గుండె బరువెక్కింది. నాటి వాడుక భాషను కాపాడుకోవడం కోసం నేను ఒక చిన్న ప్రయత్నం చేసేను. ఇది అప్రస్తుతమేమో అనిపించినా, చొరవచేసి వేసేస్తునాను. ఇది నా స్వీయమైన శ్రీ సచ్చిదానంద విజయములోని పద్యం.

    ధాటిగ కూతవేటు చనుదవ్వులనున్న జలాశయమ్ముకున్
    సూటిగనేగిరాగ రవి సోలెడుకాల మదేటికాయె నీ
    కేటికి జాలమాయె నెటనేమరియుంటివి నీవటంచు నా
    బోటినిగాంచి యజ్జనని బొంకక తెల్పుమటంచు పల్కగన్

    ఇందులో ప్రస్తుతం వాడకంలో లేని ఎన్నో పదాలు క(వి)నిపిస్తాయి.

    అలాగే నాదో సందేహం. ఈ మధ్య చాలా మంది పాఠకుడు లేదా పాఠకులు అని వ్రాయటం కోసం చదువరి లేదా చదువరులు అని వ్రాస్తునారు. ఇది ఎంతవరకు సమంజసం?. పెద్దలు కాస్త వివరించాలి. పాఠకుకుడు, చదువరి అనే పదాలకు వేర్వేరు అర్ధాలు ఉన్నాయి కదా??

    రిప్లయితొలగించండి
  59. మన తెలుగు - చంద్రశేఖర్బుధవారం, నవంబర్ 09, 2011 10:39:00 PM

    శర్మగారూ, పాఠకుడు-చదువరి నా అభిప్రాయం వివరిస్తాను. ముందుగా పెద్దలేమంటారో చూద్దాం.

    రిప్లయితొలగించండి
  60. తనరారగ తనవారిని
    మును ద్వారక నుంచి గావ మున్నీట ఘనా
    ఘనవర్ణుని యదు కుల సో-
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి
  61. పాఠకుఁడు = చదువువాఁడు; చదివించువాఁడు, అధ్యాపకుఁడు, ఉపాధ్యాయుఁడు; పురాణాది వాచకుఁడు, జనులకు పురాణములు చదివి వినిపించువాఁడు; ఆచార్యుఁడు, ధర్మభాషకుఁడు.
    చదువరి = విద్యావంతుఁడు, పండితుఁడు. (గీ. చదువరులు గాని విప్రులు చాల ముగ్ధు, లకట ... హరివంశము,ఉత్తరభాగము ౧౦-౨౪౪; గీ. ... పండితాభ, ధాన మగుఁ దెల్వికాఁడు పెద్ద చదువరి యె, ఱుక ... ఆంధ్ర భాషార్ణవము ౨.౧౭౦); బట్టువాఁడు, వంది (సీ. బట్టులు చదువరుల్ బట్లు క్రిక్క లనంగ వందుల కగు ... సాంబ నిఘంటువు, మానవ. ౬).

    రిప్లయితొలగించండి
  62. ఆహా ... ఈనాటికి నా బ్లాగు ధన్యతను పొందింది. శాస్త్ర చర్చలు అందరికీ ఉపయోగపడే విధంగా సాగుతున్నాయి. ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగించ వలసిందిగా కవిమిత్రులకు మనవి.

    రిప్లయితొలగించండి
  63. రాజారావు గారూ,
    సవరించిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  64. గురువుగారూ, విష్ణునందను గారూ, శ్యామలీయం గారూ విజ్ఞులు, వేత్తలూ, భాషా సాహిత్యభిమనులూ అయిన మీరు జరిపిన చర్చ, వెల్లడించిన అభిప్రాయాలూ, చెప్పిన నిజాలూ నాబోటి అల్పజ్ఞులకు మహోపయోగంగా ఉంది. ఎంతో మంచి విషయాలను చర్చించారు. శంకరాభరణం ఇంత ఆరోగ్యకరమైన చర్చలకు వేదిక కావడం మహదానందాన్ని కల్గిస్తోంది. మీ చర్చ లోని సారాన్ని గ్రహించి భాషా ప్రియత్వాన్ని పెంచుకోవదమూ, ఆనందాన్ని పంచుకోవడం మా అందరి విధి.

    రిప్లయితొలగించండి
  65. శ్రీ పండిత నేమాని వారు నన్ను తమ్ముడూ అని సంబోధించడము ఆనందముగా నున్నది. చక్కని అన్వయముతో పద్యాలను అందముగా మలచడము ఆయనకు వెన్నతో బెట్టిన విద్య. అన్నయ్య గారూ కృతజ్ఞతలు.

    గురువు గారూ మీ వివరణలకు ధన్యవాదములు. చర్చల వలన చక్కని ఫలితాలుంటాయి.
    మందాకిని గారు ఆతృతతో చెప్పినా బాగానే చెప్పారు. పద్యరూపములో అయితే యింకా బాగా చెప్పగలిగే వారు.
    చక్కని చర్చకు నాంది పలికిన శ్యామలీయం గారికి, అనేక పద్యాలను పకోడీలను తినిపించిన డా.విష్ణునందనులు వారికి ప్రత్యేక అభివందనములు.

    అందఱికీ వందనములు.

    రిప్లయితొలగించండి
  66. ఇనునకు నర్ఘ్యము నీయగ
    చని గౌతము డడుగిడి జలనిధి లోనన్ !
    మనమున దలచగ భానుని
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్ !

    సోదరులకు అభి నందనములు , గురువులు , పూజ్యులు , పండితులకు శిరసాభి వందనములు. ఈ రోజు మన " శంకరాభరణము " కన్నుల పండువుగా , వీనుల విందుగా వెలుగొందు చున్నది .
    ఇనుమడించిన ఉత్సాహంతో నేనూ వ్రాసానే గానీ . అందులో ఎన్ని తప్పులో తెలియదు. మన్నించ గలరు .

    రిప్లయితొలగించండి
  67. అణిమా ద్య ష్టైశ్వర్య యుతుఁడు
    ఘనపారావార లంఘనోద్యుక్తు౦డా
    హనుమంతుని దుష్కర క
    ర్ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    రిప్లయితొలగించండి
  68. నేమాని పండితుల స్ఫూర్తితో మరో ప్రయత్నం:

    కని మైనాకుని విఘ్నం-
    బని యనుకొని మదిని కినిసి బలిమిని తాకం-
    గని భక్తిని మారుతి నా-
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    రిప్లయితొలగించండి
  69. చంద్రశేఖర్ గారు పద్యములో 1వ పాదములో గణాలూ 2వ పాదములో యతి లేదు.

    రిప్లయితొలగించండి
  70. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________

    ఘనమగు కార్తిక పున్నమి
    జనులకు నాహ్లాద మొదవ - చంద్రిక లొచ్చెన్ !
    మనమున ముదమున నా , సో
    ముని పదముల దాకి వార్ధి - పొంగుచు నలరెన్ !
    _____________________________________
    చంద్రిక = వెన్నెల
    పదము = కిరణము

    రిప్లయితొలగించండి
  71. రాజేశ్వరి అక్కయ్యా,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘చని గౌతము డడుగిడి జలనిధి లోనన్’అన్నదానిని ‘చని గౌతము డడుగి(డగనె) జలనిధి లోనన్’ అంటే సరి!
    *
    చంద్రశేఖర్ గారూ,
    ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు. అభినందనలు.
    మొదటి పాదంలో గణదోషం, రెండవ పాదంలో యతిదోషం.
    ‘అణిమాద్యష్టైశ్వర్యుం
    డురుపారావార లంఘనోద్యుక్తు౦డా’ అంటే ఎలా ఉంటుంది?
    *
    మిస్సన్న గారూ,
    ‘మారుతి నాముడు’ బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  72. వసంత కిశోర్ గారూ,
    కవితా చంద్రికలు వెల్లివిరిసిన మనోహరమైన పూరణ. బాగుంది. అభినందనలు.
    ‘కార్తిక పున్నమి’ని ‘కార్తిక పూర్ణిమ’ అంటే బాగుంటుందేమో! ‘ఒచ్చెన్’ గ్రామ్యం కదా! ‘చంద్రిక లలరెన్’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  73. ఈ రోజు మన బ్లాగులో ఇప్పటికి 78 వ్యాఖ్యల రికార్డ్ !
    అందరికీ ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  74. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
    త్వరలోనే వంద వ్యాఖ్యలను దాటాలని నా ఆకాంక్ష !

    రిప్లయితొలగించండి
  75. మాస్టారూ, చక్కని సవరణకి ధన్యవాదాలు. అందరూ శ్రీ రాముని మీద పద్యాలు వ్రాస్తే మరి సముద్రం ఆరు సార్లు దాటిన (రెండు సార్లు సుందర కాండలో, రెండు + రెండు సార్లు యుద్ధ కాండలో) మా సుందర హనుమ మీద వ్రాయాలన్న కోరిక ఫలించింది.

    రిప్లయితొలగించండి
  76. మారుతి నాముని పదముల దాకి వార్ధి

    శంకరార్యా ! ఇదెలా వీలవుతుంది ? అదీ ముఖ్యంగా

    మైనాకుని విఘ్నంబని యనుకొని మదిని కినిసి బలిమిని తాకినప్పుడు !

    రిప్లయితొలగించండి
  77. చాలా పెద్ద చర్చయే జరిగినది. శ్రీవిష్ణునందనులవారు పుష్కలముగా నుదహరించినారు. అన్నియును ప్రసిధ్ధులవే. వాటిలో కొన్ని సందర్భముల యందు సంధి గావించినను పద్యలక్షణమునకు భంగము కలుగుట లేదు. కొన్ని చోట్ల విసంధిగా నుంచకపోయిన లక్షణము చెడుచున్నది. నియమమును నిష్కర్ష చేసినందుకు శంకరయ్యగారికి ధన్యవాదములు. వాక్యావసానమున సంధి యవుసరములేదన్నది నిజమే. పరమ సహజమే. కాని పద్యముల యందు వాక్యావసానమతి యరుదుగా జరుగుచుండును. అనగా నూటికి కోటకి నట్టి పద్యమొక డుండ వచ్చునేమో. సామాన్యధర్మము నుటంకించుటకో లేక విధినిషేధాదుల నేకరువు పెట్టుట వంటి వాటికో వేర్వేరు వాక్యముల నొక ఛందముననుంచి వ్రాయునప్పుడు కవులు పాదాంతముల యందు వాక్యాంతములు రావించుచు పద్య నిర్మాణము చేయవచ్చును. అట్టి యెడ పాదాద్యక్షరములు తప్పక నచ్చులు గావచ్చును. పాద మధ్యమున నచ్చులు రావచ్చునా యని నా శంక. అట్లు రావని నా యభిప్రాయము. ఇది తప్పు గావచ్చును. విజ్ఞులు తెలియజేయ ప్రార్ధన.

    మిస్సన్న గారి పద్యమును మరల పరిశీలించినచో
    చనుచుండగ వారధిపై | ఘన రావణు ద్రుంచి వేగ కనుగొన సీతన్, |
    యిన కుల దుగ్దాంబుధి సో | ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్.

    ఇచ్చట నాకు వాక్యావసానమేమియును కనబడుట లేదు. పద్య మంతయు నేక వాక్యమే యనిపించుచున్నది. ఇది నా హ్రస్వదృష్టి గావచ్చును. యడాగమము నసందర్భము కావున పరిహరించగా, "సీతనినకుల" యనియే యేర్పడుచున్నది.

    చాటు పద్యముల విషయములో నిదమిథ్థముగా నిర్ణయించుట కష్టము. సూరకవిగారిదే మరియొక చాటువు చివరిపాదమిట్లుండును.
    "అదపాకా అత్త ఊరు ఔనే పాపా"
    ఇది కవిగారు దారిమధ్యమున కనబడిన చాకెతతో ప్రసంగించుచు చెప్పిన పద్యమని ప్రతీతి.

    ఈ చర్చలో మిత్రులు విష్ణునందనులవా రొనరించిన విపుల వ్యాఖ్యలు గొప్పగానున్నవి. వారు ప్రతిభామూర్తులు. నన్నప్రతిభుని జేసినారు. వారి కనేక వందనములు.

    రిప్లయితొలగించండి
  78. గురువుగారూ నా రెండవ పూరణను నిర్దోషంగా సవరించినందుకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  79. వసంత మహోదయా ! మారుతి నాముని పదముల..........
    అది కేవలం నా ఊహ మాత్రమే. అంటే హనుమంతుడు రామకార్యం మీద పోతూ ఏ చిన్న విఘ్నం కూడా సహించక భేదిన్చుకుంటూ వెడుతూంటే క్రింద సముద్రుడు అతని పాదములను తాకి సంతోషాన్ని వ్యక్తం చేశాడని నా భావం.

    రిప్లయితొలగించండి
  80. కవిమిత్రులందరికీ వందనాలు.
    ఒక్కరోజులో 85 వ్యాఖ్యలు! ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యలు ఒక్కరోజులో వచ్చిన బ్లాగులు ఉండవచ్చు. అయితే అవి ఎక్కువగా రాజకీయ వాద ప్రతివాదాలో, పరస్పర దూషణలో అయి ఉంటాయి.
    సాహిత్యపరమైన బ్లాగులో చురుకుగా పద్యరచనలు చేస్తూ, ఛందోవ్యాకరణాది విషయ పరిజ్ఞానాన్ని పెంచుతూ సంస్కారపూరితమైన భాషతో, అభిప్రాయాలతో చర్చల్లో పాల్గొంటూ ఒక సత్సంప్రదాయాన్ని నెలకొల్పిన మీ కందరికీ కృతజ్ఞతలు. కృషి మీది! ... కీర్తి నాది! ... అన్నట్టుంది.

    రిప్లయితొలగించండి
  81. కనలేము కాలుని గతులు
    ఘనమగు ప్రకృతి చలనపు ఘటనల లోనన్
    శనివలె కూరు సునామియ
    ముని పదముల దాకి వార్ధి పొంగుచు నలరెన్

    రిప్లయితొలగించండి