23, నవంబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం - 536 (ఆమెకును నామె కూతునకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
           ఆమెకును నామె కూఁతున కతఁడె భర్త.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

 1. చిత్ర మొక్కటి చూచితి చిత్రమందు
  రెండు పాత్రలు వేసెను రిషి కపూరు
  బాగు నటననను చూపెను పాత్రలందు
  ఆమెకును నామె కూతున కతడె భర్త

  రిప్లయితొలగించండి
 2. పుడమి పట్టికి పతి రామ భూవరుండు
  నియమ సంపన్ను డేకపత్నీవ్రతుండు
  నయ్యు వ్యవహార సరళిలో నధిపుడగుట
  నామెకును నామెకూతున కతడె భర్త

  రిప్లయితొలగించండి
 3. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _____________________________________

  అన్న సుతునకు నత్యంత - నాదరమున
  ఆడుబిడ్డను భార్యగా - నామె దెలుప
  అల్లు డానందమున మ్రొక్కె - నామె పతికి
  నామెకును ! నామె కూఁతున - కతఁడె భర్త !
  _____________________________________
  ఆడుబిడ్డ = కూతురు
  అల్లుడు = మేనల్లుడు

  రిప్లయితొలగించండి
 4. నేమానివారి స్ఫూర్తితో :

  02)
  _____________________________________

  రాము డాత డయోథ్యకు - రాయ డతడె !
  రమణి సీతకు మురిపెంపు - రమణు డతడె !
  రాణి సీతకు జననౌట - రత్నగర్భ
  యామెకును,నామె కూఁతున - కతఁడె భర్త !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 5. రాము డానాడు భూజాత రమణుఁడు మును
  వర వరాహుఁడా భూదేవి వల్లభుండు
  వార లిరువురు హరి యవతారములన
  నామెకును నామె కూతున కతడె భర్త
  యయ్యె వేర్వేరు యవతార యంశలందు!
  మనవి: ఐదవ పాదం వదిలేసి చదువుకొన్నా పరవాలేదు.

  రిప్లయితొలగించండి
 6. వసంత కిశోర్ గారూ!
  జననౌట అన కూడదు. జననియే అన్నా అన్వయము సరిపోతుంది కాబట్టి జననియే అని మార్చాలని నా సూచన.

  చంద్రశేఖర్ గారూ!
  అవతార = అంశ = అవతారాంశ అని సవర్ణదీర్ఘ సంధి.
  భూదేవికి భర్త శ్రీమహావిష్ణువే. వరాహరూపుడు అయినప్పుడే మాత్రమే కాదు - ఎల్లప్పుడునూ. స్వస్తి

  రిప్లయితొలగించండి
 7. పోతనగారే "ఇల్లాలం గిటి వైన కాలమున మున్నేనంచు ఘోషింతు వో తల్లీ...." అని వ్రాసారు కదండి. అందుచేత పెద్ద దోషం యేమీ కాదేమో. కాని యితరదోషాలు మరియు నడక కొంచెం సరిచూసుకోవలసినదే.

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారి పూరణ
  | పుడమి పట్టికి పతి రామ భూవరుండు | నియమ సంపన్ను డేకపత్నీవ్రతుండు
  | నయ్యు వ్యవహార సరళిలో నధిపుడగుట | నామెకును నామెకూతున కతడె భర్త
  పరమసుందరంగా ఉంది.

  రిప్లయితొలగించండి
 9. నేమానివారికి ధన్యవాదములతో :

  02అ)
  _____________________________________

  రాము డాత డయోథ్యకు - రాయ డతడె !
  రమణి సీతకు మురిపెంపు - రమణు డతడె !
  రాణి సీతకు జననియే - రత్నగర్భ
  యామెకును,నామె కూఁతున - కతఁడె భర్త !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 10. నేమానివారి బాటలోనే -

  పరమ ధర్మావతారుఁడై బరగు నట్టి
  రామచంద్రుని యిల్లాలు భూమిజాత
  అరయ నాతడె భూకాంతు డగుట జేసి
  ఆమెకును నామె కూఁతున కతఁడె భర్త.

  ఔచిత్యం తప్పకుండా వేరు విధంగా పూరణ కవకాశం ఉందేమో తీరికగా పరిశీలించాలి.

  రిప్లయితొలగించండి
 11. చిన్న సవరణ తో...

  చిత్ర మొక్కటి చూచితి చేరి యందు
  రెండు పాత్రలు నటియించె రిషి కపూరు
  అమ్మ, కూతురు కథయది యందులోన
  ఆమెకును నామె కూతున కతడె భర్త

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పద్యం స్ఫూర్తితో, నా శైలిలో:

  చలన చిత్రంబు నందిట్లు కలుగ వచ్చు
  నాయకు డుభయపాత్రాభినయము చేయ
  తల్లికూతుళ్లు తల్లికూతుళ్లు కాగ
  ఆమెకును నామె కూఁతున కతఁడె భర్త.

  రిప్లయితొలగించండి
 13. తాను తపమెంత చేసెనో మేనకమ్మ
  తల్లి పార్వతి తనయయై తనకు బుట్టె
  హరుడు సర్వేశ్వరుండయ్యె నల్లు డగుచు
  నామెకును - నామె కూతున కతడె భర్త

  'ఆమెకును నామె కూతున కతడె భర్త '
  యనుచు కీర్తింతు రేమి రామా ! మహాత్ము
  నేక పత్నీ వ్రతుని నిన్న నేకు డనుచు -
  చతురతకు చోటు లేదిట సత్కవులకు

  సుజన-సృజన

  రిప్లయితొలగించండి
 14. రాజారావుగారు రాములవారి గురించి యిలా వాపోవటం అర్ధంచేసుకోదగ్గదే. మోక్షగుండరామాయణం అని ఒక సంగీతప్రధానమైన రామాయణకృతి ఒకటి ఉంది. అందులో ఆశ్చర్యకరంమైన విషయం ఒకటుంది. మన రాములవారు సీతమ్మను వివాహం చేసుకున్నాక, మేనమామల కుమార్తెలను మరొక 128 మందిని కూడా పాణిగ్రహణం చేసారట. ఈ పుస్తకం నాకు తి.తి.దే. వారు 1978లో కాబోలు తిరుమలలో యేదో సమావేశానికి వెళ్ళినపుడు బహూకరించిన పుస్తకాలలో ఒకటి. ఈ రామాయణంలోని ప్రసిధ్ధమైనకీర్తన "నీ కుమారకుని మాకు యిమ్ము దశరధా!" అనేది ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో అప్పట్లో తరచుగా వినిపిస్తూ ఉండేది ఎంత యేకపత్నీవ్రతుడగుగాక కవులు నిత్యం రాములవారిని భూజాని, భూకాంతుడు, భూమీశుడు వగైరా పేర్లతో "భూమికి భర్త" అని పిలిచి తీరుతారు - వారు నిరంకుశులు గదా. అయినా దానికి సమర్ధింపుగా 'నా విష్ణుః పృధివీ పతిః" అని సమన్వయం ఉందనుకోండి. అంటే, ఎంతో కొంత విష్ణ్వంశ లేకపోతే రాజయోగం లేదని తాత్పర్యం. సాక్షాత్తు శ్రీమన్మహావిష్ణువు రాజరికానికి వస్తే చెప్పేదేముంది.

  రిప్లయితొలగించండి
 15. వావి వరుసలు లేవంచు స్వర్గమందు
  నచ్చర యొకర్తు కథ చెప్పె నందులోని
  పాత్రలను గూర్చి చెప్పుట చిత్ర మకట
  ఆమెకును నామెకూతున కతడె భర్త

  రిప్లయితొలగించండి
 16. నా పూరణ .....

  తల్లియును గూఁతురును తమ ధవుల నేఁచఁ
  గనియె నొక బంధువు; హితవాక్యమ్ముఁ జెప్పె
  నామెకును నామె కూఁతున కతఁడె "భర్త
  దైవ మని యెంచి కనుఁడు భద్రమ్ము మీరు"

  రిప్లయితొలగించండి
 17. మనతెలుగు-చంద్రశేఖర్బుధవారం, నవంబర్ 23, 2011 5:49:00 PM

  పండితులకు ఒక ప్రశ్న-ఈ రోజు సమస్య పాదంలో "భర్త" అని వుంది కదా. భార్యకు భర్త అనే అర్థంలోనే చూడాలనే అనిపిస్తోంది. మరి రాములవారిని (ఆ మాటకొస్తే యే రాజునైనా)ధరణికి నాయకుడని గానీ, అధిపుడనే అర్థమే కానీ భర్త యెలా అవుతాడు? నానార్థాలలో ధరణీపతి, ధరణీనాథుడు వగైరా చూస్తాం, కానీ అది భార్యకు భర్త అనే అర్థం కాదు కదా!

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా ! చక్కని విరుపుతో పూరించారు ! అభినందనలు !

  03)
  _____________________________________

  తల్లి పనిచేయు చోటనే - తనయ కమర
  మంచి యుద్యోగ మొక్కటి - మగువ లలరె !
  చండ శాసను డైనట్టి - చండిదాసు
  డామెకును,నామె కూఁతున - కతఁడె భర్త !
  _____________________________________
  భర్త = master(యజమాని) = చండిదాసు

  రిప్లయితొలగించండి
 19. నేను పండితుడను కాదుకాబట్టి బ్రతికిపోయాను. కలుగజేసుకోవలసిన పనిలేదు. అయినా నాకు తోచినది వ్రాస్తున్నాను. భార్య అనే మాటకు వ్యుత్పత్తి యెలా గంటే "భరించ బడునది" అని. భర్త అనె మాటకు "భరించువాడు అని". ఈ మాటలు చెబుతూ కవిత్రయంలో ప్రద్వేషిణీ వృత్తాంతంలో ఒక పద్యం కూడా ఉంది. విజ్ఞులు అవుసరమైతే సవరించాలని మనవి. రాజు భూమి యొక్క భారాన్ని భరిస్తున్నాడు కాబట్టి యిక్కడ భార్యాభర్తల సంబంధం చెప్పబడుతోందని నా భావన. మరేమయినా విశేషం ఉందేమో పండితవాక్యం సెలవీయవలసినదే.

  రిప్లయితొలగించండి
 20. ఇదిగో నేను ప్రస్తావించిన పద్యం (శ్రీమహా భారతం…ఆది పర్వం.226.)

  పతియు భరియించు గావున భర్తయయ్యె
  భామ భరియింపబడు గాన భార్య యయ్యె
  బరగ నవి మన యందు విడ్వడియె నిన్ను
  నేన యెల్లకాలము భరియింతు గాన

  రిప్లయితొలగించండి
 21. 04)
  _____________________________________

  తల్లి కారోగ్య మిమ్మని - తనయ ముడుపు
  తనయ పెండిలి జరిపింప - తల్లి ముడుపు
  కట్టి ,యిరువురు వేడిరి - కమల నాభు
  "కొండ కొత్తుము దీర్చిన - కోర్కి మాదు !"
  పరమ పావను డందరి - ప్రభువు గాన
  ఆమెకును,నామె కూఁతున - కతఁడె భర్త !
  _____________________________________
  భర్త = lord(దైవము)

  రిప్లయితొలగించండి
 22. శంకరార్యా ! భర్త దైవమని చెప్పించిన మీ పూరణ మంచి విరుపుతో మెరిసింది.
  రాజారావు గారూ ! హిమవంతుని భార్య పేరు మేనా దేవి అనుకుంటాను. పొర పాటైతే క్షమించండి.

  రిప్లయితొలగించండి
 23. 05)
  _____________________________________

  వింత యాచార మపుడుండె - వేశ్య కులము
  వారి కులమును బుట్టిన - వనజ ముఖుల
  గుడిని కల్యాణ మొనరింత్రు - కూర్మి తోడ
  పరమ పావనుడే వారి - పతియె గాగ !
  "దేవదాసి" నాట్యములను - దివ్యముగను
  జేసి మురియుదు రందరూ - చిత్త మలర !---(కావున)
  ఆమెకును,నామె కూఁతున - కతఁడె భర్త !
  _____________________________________

  రిప్లయితొలగించండి
 24. శంకరాభరణం సమస్య 536 నా పూరణం;
  ధాత్రి సుత శ్రీరాముని ధర్మ పత్ని
  జానకీదేవి ధారుణీ జాత కాదె
  హరియె భూదేవి కి మనోహరుడు కాన
  ఆమె కును నామె కూతున కతడె భర్త

  --------------
  గోలిశాస్త్రి గారి సమస్యకు నా పూరణం;
  బాధల విముక్తి కొరకై
  సాధుజనుడు గంగ దెచ్చి చల్లుచు దలపై
  శ్రీధరు నభిషేకించెను
  మాధవుని శిరమ్ము నెక్కె మందాకినియే
  -------------------

  రిప్లయితొలగించండి
 25. శ్రీ గోలి హన్య్మఛ్ఛాస్త్రి గారూ!
  హిమవంతుని భార్యను మేనా మరియు మేనకా అనికూడా పిలుస్తారు.

  రిప్లయితొలగించండి
 26. మిత్రులకు విన్నపము

  శ్రీమన్నారాయణు డొక్కడే పృధివీ పతి . భూదేవిని పెండ్లి యాడిన భర్త . తదితరులకు రాజ్యాధికార మాయన దాక్షిణ్యమే . పుడమిపై రాజు లందరాయన ప్రతి నిధులే . న విష్ణు....-యను దాని తాత్పర్య మిదియే .ఏ రాజుకూ భూదేవిని భార్యగా నూహింప తగదు . రామావతార విషయం లో సీతమ్మ తల్లిని తప్పఇంకొకరిని రాముని భార్యగా నూహింప రాదు .
  రాముని పరంగా ఇంకొక విధమైన పూరణ ఉంది . నారాయణుని భార్యగా భూదేవిని , రాముని భార్యగా భూపుత్రిని చెప్పి సమస్యను పరిష్కరించడం . ఇది యుక్తం గానే ఉంది . నా భావన చెప్పేను . నేను కవిని గాను, పండితుడ నంతకన్నాకాను . బుధులకు నమస్సులతో...

  రిప్లయితొలగించండి
 27. శ్రీ రాజారావు గారి సూచనను పద్యరూపంలో పెట్టే ప్రయత్నం.

  రామ మూర్తిగా పుట్టె నారాయణుండు
  భూమి పుత్రిక సీతమ్మ పొలతు లార
  భూమికి హరి భూపుత్రికి రాము డౌను
  ఆమె కును నామె కూతున కతడె భర్త

  రిప్లయితొలగించండి
 28. మంచి విద్యయు కొల్వును మంచి గుణము
  మంచి రూపము గలవాని మగువ చూచి
  మంచి సంబంధ మని యెంచె మనము నందు
  నామె కును నామె కూతున కతడె భర్త.

  ఆమెకును నామె=తనలో తాను

  రిప్లయితొలగించండి
 29. పూర్ణ తల్లిపాదములను ముసలి యంట
  కనుచు ముదితలొకరికొకరనుకొనిరట
  కళ్ల నీళులు ధారలు కారుచుండ
  నామె కును, "నామె కూతున కతడె భర్త".

  (పూర్ణ = పూర్ణమ్మ)

  రిప్లయితొలగించండి
 30. శ్రీ పండిత నేమాని అన్నయ్యగారి పూరణ బహు సుందరముగా నున్నది. ఆయన బాటలోనే ,

  హరియె రాముడై దిగి రాగ హర్ష మొంది
  సిరిని గర్భము ధరియించి మురిసె ధాత్రి
  భూసుతను జేఁగొనుట నయె భూవరుండు
  నామెకును నామె కూతున కతడు భర్త !

  రిప్లయితొలగించండి