12, నవంబర్ 2011, శనివారం

సమస్యా పూరణం - 52౩ (కాంతులకున్ కాంతిగూర్చు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.
(ఈరోజు యాదగిరి శ్రీ లక్ష్మీనృసింహ క్షేత్రానికి వెళ్తున్నాము. రేపు ఉదయం వరకు నాకు బ్లాగు చూసే అవకాశం దొరకక పోవచ్చు. కావున దయచేసి కవిమిత్రులు పరస్పర గుణదోష విచారణ చేయవలసిందిగా మనవి)

30 కామెంట్‌లు:

  1. అంతస్తిమిరాపహకున్
    స్వాంతంబున గాంతినింపు జ్ఞానప్రభకున్
    శాంతి సుఖప్రదకు, సకల
    కాంతులకున్ గాంతి గూర్చు కాంతకు జేజే

    రిప్లయితొలగించండి
  2. వెంకట రాజారావు . లక్కాకులశనివారం, నవంబర్ 12, 2011 11:11:00 AM

    అంతము జేసి చెడుగును- ప్ర
    శాంతత జేకూర్చి భువికి- శ్యామలగా ,శ్రీ
    కాంతల మూలపు టమ్మగ
    కాంతుల కున్ కాంతి గూర్చు కాంతకు జేజే !

    రిప్లయితొలగించండి
  3. కాంతుల మూలము తానై
    వంతులుగా సకల జగతి బాధ్యత మ్రోయన్
    కాంతలు మువ్వురు వారల
    కాంతులకున్ గాంతి గూర్చు కాంతకు జేజే !

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నేమాని పండితులకు నమస్కారములు.
    మీ ఫోను వచ్చ్హిన తర్వాత మా అల్లుని ల్యాప్ ట్యాప్ తీసుకొని ఈ పూరణ చేశాను.ఎలా ఉందో మీరీ చెప్పాలి.


    అంతకు వైరికి పత్ని ల-
    తాంతాయుధు తండ్రి భార్య యబ్జాసనుకు-
    న్నెంతయు ప్రియసతి యై తన
    కాంతులకున్ గాంతి గూర్చు కాంతకు జేజే

    రిప్లయితొలగించండి
  5. పంతము బట్టిన ద్రౌపది
    కుంతలముల ముడిని వీడి కోపము జూపన్
    కాంతులు జేసిరి సమరము
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    రిప్లయితొలగించండి
  6. అంతర్బహిశ్చతత్వమ
    నంతదయాపూర్ణ, రాక్షసాంతక, భువిప
    ర్యంతము నిఖిల జగంబుల
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే.

    రిప్లయితొలగించండి
  7. శాస్త్రిగారూ కాంతలు మువ్వురు అంటే త్రిమూర్తుల సతులనేనా మీ ఆభిప్రాయం

    రిప్లయితొలగించండి
  8. శ్రీపతిశాస్త్రిశనివారం, నవంబర్ 12, 2011 7:43:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    అంతము నాదియు లేనిది
    అంతర్గత శక్తి తానె యందరిలోనన్
    శాంతము నిండిన మోమున
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    రిప్లయితొలగించండి
  9. ఆమె ఒకప్పటి సరస్వతీ శారద
    ఒక శుభోదయాన జీవనం మారింది
    బ్లాగ్ లోకపు జ్యోతక్క అయ్యింది
    కాంతలకున్ కాంతి గూర్చు కాంతకు జేజే

    రిప్లయితొలగించండి
  10. శ్రీపతిశాస్త్రిశనివారం, నవంబర్ 12, 2011 8:21:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    నిన్నటి రోజున శ్రీ శ్యామలీయం గారు సూచించిన ఒక సమస్యను పూరించే ప్రయత్నముగా వ్రాసినాను. తప్పులను దయతో సవరించప్రార్థన.

    పరివారంబును వెంట దెచ్చికొనినన్ పట్టంగగా సాధ్యమే
    కరవీరంబుల ద్రోణ పుష్పములతోన్ ఖట్వాంగు నర్చించుచున్
    పరితాపంబును వీడి ప్రజ్వలునుడై భాసిల్లు చున్ చంద్ర శే
    ఖర లింగంబును కౌగలించుకొన దీర్ఘాయుష్య మబ్బుంగదా

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పండిత నేమాని వారి పూరణ అద్భుతము. మిత్రుల పూరణలు చాలా బాగున్నాయి.వక్ర బుధ్ధితో ;

    అంతము లేని దురాశల
    వంతులు నిడి పంచుకొనిరి భారత నిధులన్
    బంతము బూనని లక్ష్మీ
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే !

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతిశాస్త్రిశనివారం, నవంబర్ 12, 2011 9:29:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    శ్రీ జిలేబి గారి భావనకు పద్య రూపంగా

    అంతరమందున శారద
    వింతగ వీక్షించె బ్లాగు విద్యలు వెలుగన్
    అంతటి కరుణా మాతకు
    కాంతలకున్ కాంతి గూర్చు కాంతకు జేజే

    రిప్లయితొలగించండి
  13. శాంతిప్రదకు నవిద్యా
    భ్రాంతిధ్వంసకును చంద్రభాస్కరతారా
    కాంతిదకును షట్త్రింశ
    త్కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!


    శ్రీవిద్యా విషయకమైన వివరణ. శ్రీపరాభట్టారికాదేవి శాంతిప్రద. ఇచ్చట శాంతి యనగా మోక్షము. తల్లి అవిద్యాభ్రాంతిధ్వంసన శీల. అనగా తల్లి యనుగ్రహమే అవిద్యయను ముఖ్యభ్రాంతిని ద్వంసము చేసి జీవునకు స్వస్వరూపజ్ఞానము ననుగ్రహించుచున్నది. ఆ స్వస్వరూపావబోధయగుట చేతనే సాధకునకు ప్రపంచముపశాంతమై మోక్షస్థితి కలుగుచున్నది. ఆమె చంద్రభాస్కరతారాకాంతిద. అనగా సమస్త తారావ్యూహమునకును, చంద్ర సూర్యులకును ప్రకాశన శీలమును కలుగజేయినది. ఇచ్చవియశ్చక్రమునకు సాధకునితో అబేధత్వము కల్పించుకొనుట సంప్రదాయము గావున తారాచంద్రాదికవ్యూహమనగా శరీరమే. మరియు విశేషవ్యాఖ్యకిది చోటు కాదు. శ్రీదేవి షట్త్రింశత్కాంతులకు కాంతిని కలుగజేయినది. ఇచ్చట కొంత విశేషముగా వ్యాఖ్యానించవలసియున్నది. షట్త్రింశతి యనగా మున్నూట యరువది (360). ఈ సంఖ్య యేమనగా నమ్మవారి తేజఃకిరణసంపుటి మున్నూట యరువది తిధులుగా నగుచున్నది. ఆ తేజఃపుంజముల యందు మూలాధారక్షేత్రమునందు పృధ్వీతత్వముగా నేబది యారు, మణిపూరకమందు జలతత్వంముగా నేబదిరెండు, స్వాధిష్టానమునం దగ్నితత్వముగా నరువది రెండు, అనాహతమున వాయుతత్వముగా నేబదినాలుగు, విశుధ్ధచక్రమున వియత్తత్వముగా డెబ్బదిరెండు, ఆజ్ఞాచక్రమునందు మనోరూపముగా నరువదినాలుగు. మెత్తము కలసి మున్నూట యరువది. ఈ విధమగా మున్నూట యరువది తిధులుగా కాంతిస్వరూపము వెలయుచుండగా శ్రీదేవి కాలస్వరూపమగు శ్రీచక్రరాజము నందు జగద్బీజస్వరూపయై కాంతులన్నిటికి మూలమైన కాంతి యగుచు విరాజిల్లుచున్నదని భావము.

    రిప్లయితొలగించండి
  14. మిత్రులకు అభినందనలు. అందరి పూరణలు చదివేను. బాగున్నాయి.
    1. శ్రీ రాజారావు గారు : మూలపుటమ్మగా భావము బాగుంది, కానీ శ్యామల అంటే నల్లని రంగు కలది అని అర్థము వస్తోంది.
    2. హనుమఛ్ఛాస్త్రి గారు మిగిలిన వారు ఎందరో ముగురమ్మల మూలపుటమ్మ గానే వర్ణించేరు.
    3. మిస్సన్న గారి ధార పూర్వములాగ కనిపించలేదు. కాస్త తడబడ్డారు. ముగురమ్మలని వర్ణించడానికి ప్రాసకొరకు ఇబ్బంది పడ్డారు.
    4. జిగురు సత్యనారాయణ గారు ద్రౌపది ప్రస్తావన తేవడము బాగుంది.
    5. సంపత్ కుమార్ శాస్త్రి గారు సమాసములను ప్రయోగించుటకు ప్రయత్నము చేసేరు.
    6. శ్రీపతి శాస్త్రి గారు అంతర్గత శక్తిని ఆవిష్కరింప చేసేరు. అలాగే జిలేబి గారి భావానికి పద్యరూప కల్పన చేసేరు.
    7. తమ్ముడు నరసింహమూర్తి ధోరణే వేరు. పంతము పూనని లక్ష్మీ కాంతులట. పెద్దలతో మాకెందుకు తగవులు అని ఆ ముగ్గురు తల్లులు/తండ్రులు అనుకొని యుంటారు.

    ఈ రోజు వచ్చినవి చాలా తక్కువ పూరణలే - అయినా మంచి భావములను ఆవిష్కరింప చేసేరు. అందరికీ పేరుపేరునా మా ప్రశంసలు.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా శ్యామలీయం గారూ - మీ పద్యము వ్యాఖ్య ఇప్పుడే చూచేను. మంచి భావముతో పద్యము, మంచి ఆధ్యాత్మ విషయాలతో వ్యాఖ్య నిజంగా అద్భుతములే. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు.
    రాజ శేఖర శర్మ గారూ ! మీరన్నది నిజమే .

    రిప్లయితొలగించండి
  17. శ్రీపతిశాస్త్రిశనివారం, నవంబర్ 12, 2011 10:24:00 PM

    శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  18. ఈరోజు ఉదయాది బంధువుల యింటికి పోయి యుండుటచే, శంకరాభరణము బ్లాగును పలుకరించు సరికే రాత్రి 9:30దాటినది. చూడగా చాల మంచి సమస్య. భొజనము కొంచెము సేపు వాయిదా వేసుకొని ముందుగా పూరణ ప్రకటించితిని. ఒక మంచి పద్యము వ్రాయు నవుకాశము కూడ గొప్ప యదృష్టమే యని నా భావన. ఈ సమస్య దొరకినందుకు చాల సంతోషము గలిగినది.

    శ్రీనేమానివారికి నా పద్యము నచ్చినందులకు మిక్కిలి కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  19. మిత్రులకు మనవి. ఈ రోజు నా బ్లాగ్లో అపర రామదాసు - వాసుదాసు అనే పోస్టింగు వేశాను. వీలు వెంట చూడగలరని మనవి. వారి మందరము-ఆంధ్ర రామాయణము 24,000 శ్లోకాలకు 24,000 పద్యాలూ వ్యాఖ్యాసహితముగా అచ్చు వేశారు. నేను సుందర కాండ, అరణ్యకాండ కొద్దిగా చదివాను. ఆ పుస్తకాలు పద్యరచన మీద ఆసక్తి వున్నవారు చదవ దగ్గవి. అవి దొరుకు చోటు ఫోను నెంబర్ నా పోస్టింగు లో ఇచ్చాను. తెనాలి దగ్గర వారి ఆశ్రమమునకు వెళ్ళినపుడు అక్కడి స్వామీజీ కోరిక మేరకు నేను నా బ్లాగులో ఈ పుస్తక సమాచారము పెట్టటం జరిగింది. వారికి ఇంటర్నెట్, కంప్యూటర్ ప్రపంచం తెలియదు. ఏదో నావంతు సహాయంగా చేస్తున్న కృషి. అంతే.
    http://lansekhar.blogspot.com/2011/11/blog-post_12.html

    రిప్లయితొలగించండి
  20. స్వాంతంబునన్వధువుల
    త్యంతార్తిన్ గౌరిఁగూర్చిధ్యానింపంగాన్
    సంతసము,నంత, వారల
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    రిప్లయితొలగించండి
  21. చక్కని సమస్య నిచ్చిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
    ప్రశస్తమైన పూరణలు పంపిన పండితనేమాని గారికి, లక్కాకుల వెంకట రాజారావు గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, మిస్సన్న గారికి, జిగురు సత్యనారాయణ గారికి, సంపత్ కుమార్ శాస్త్రి గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, శ్రీపతి శాస్త్రి గారికి, శ్యామలీయం గారికి అభినందనలు.
    అందరి పూరణలను పరామర్శించిన నేమాని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
    అమూల్యాధ్యాత్మికవిషయాలను తెలిపిన శ్యామలీయం గారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. బ్లాగ్ జ్యోతి కాంతులకు జేజేలు పలికిన జిలేబి గారికి ప్రత్యేక అభినందనలు.
    జిలేబి గారి భావానికి ఛందోరూపం ఇచ్చిన శ్రీపతి శాస్త్రి గారికి ధన్యవాదాలు. అదే పద్యం కొద్ది మార్పుతో ....

    అంతరమందున శారద
    వింతగ వీక్షించె బ్లాగు విద్యలు సర్వం
    బంతటి జ్యోతక్కకు బ్లాగ్
    కాంతలకున్ కాంతి గూర్చు కాంతకు జేజే

    రిప్లయితొలగించండి
  23. అయ్యా! శ్యామలీయం గారూ!
    నిన్నటి మీ వ్యాఖలో అమ్మ యొక్క 360 శరణకోణాల ప్రస్తావన చేసేరు(సౌందర్యలహరి). షష్ట్యుత్తర త్రిశతి అంటే 360 అవుతుంది. షట్త్రింశత్ అంటే 36 అవుతుంది కదా. అమ్మ యొక్క 36 తత్త్వములను వివరిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  24. గురువు గారూ ఊకదంపుడు గారిని మఱచిపోయారు. చక్కని పద్యము వ్రాసారుగా !
    శ్రీ పండిత నేమాని అన్నయ్య గారికి నమస్సులు.

    రిప్లయితొలగించండి
  25. మూర్తి గారూ,
    నిజమే. ధన్యవాదాలు.
    *
    ఊకదంపుడు గారూ
    మీ పూరణ అద్భుతంగా ఉంది. ప్రత్యేక అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. నా పూరణ యైన
    శాంతిప్రదకు నవిద్యా
    భ్రాంతిధ్వంసకును చంద్రభాస్కరతారా
    కాంతిదకును షట్త్రింశ
    త్కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    పద్యమును గూర్చి నేమానివారి పరిశీలనకు ధన్యవాదములు. అవును షట్త్రింశతి అంటే 36మాత్రమేకదా. షష్ట్యుత్తర త్రిశతి అంటే 360 యగుచున్నది. సవరణకు ఒకటి రెండు విధానములున్నవి. చంద్రభాస్కరతారాకాంతిద యని వియద్విషయ ప్రస్తావనచేసినందుకు గాను కేవలము నాకాశతత్వ మందలి 72 కిరణములను ప్రస్తావించట యక పధ్ధతి. ఇట్లు పరిష్కరించిన పద్యం:

    శాంతిప్రదకు నవిద్యా
    భ్రాంతిధ్వంసకును చంద్రభాస్కరతారా
    కాంతులగు ద్విషట్త్రింశ
    త్కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    ఇచ్చట ఆకాశతత్వంమందలి 72 కిరణాలములచేత రాకాసూర్యచంద్రులకు అమ్మవారు కాంతి గూర్చుచున్నదని యేర్పడుచున్నది.

    రెండవ పధ్దతిలో యధావిధిగా షష్ట్యుత్తర త్రిశతిని ప్రస్తావించుట. ఇదికొంత కష్టసాధ్యమైనపని. యెందుకనగా కందములో నున్నచోటు చాలచిన్నది. ఈ షష్ట్యుత్తర త్రిశతి యన్న సమాసమునకు చోటు సరిపెట్టుట దుష్కరము. కావున దీనిని తెలుగు మాటలలోనే చెప్పవచ్చును గదా

    శాంతిప్రదకు నవిద్యా
    భ్రాంతిధ్వంసకును చంద్రభాస్కరతారా
    కాంతులు మున్నూర్లరువది
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    ఈలాగు చేసినచో అన్వయమునందు మన మేరకమయిన మార్పును కలిగించుటలేదు. యధావిధి గానే యున్నది.

    రిప్లయితొలగించండి
  27. నేమాని పండితార్యా మీ అభిప్రాయము సత్యము.

    శ్యామలీయమ్ గారూ జోహార్లు.

    రిప్లయితొలగించండి
  28. ఎంతని మెచ్చెద నీమెను?
    పంతులు రాహులుని మెడను పట్టుచు గెంటెన్
    ఇంతి మన "స్మృతి ఇరానీ"!
    కాంతులకున్ కాంతి గూర్చు కాంతకు జేజే!

    రిప్లయితొలగించండి