5, నవంబర్ 2011, శనివారం

తెలుగు పలుకు

తెలుగు పలుకు

త్ర్యంబక క్షేత్రత్రయాన్వితంబగు రాష్ట్ర
మందు వెల్గొందెడు నమృత భాష
రాజీవ సంభవురాణి భారతి కంఠ
కలనాద రసమయ లలిత భాష
వేనవేలేండ్లుగా విస్తరించుచు మహా
కల్పవృక్షము వోలె క్రాలు భాష
ప్రాగ్దేశ సమ్మాన్య భాషా ప్రపంచాన
సద్యశమ్మునుగన్న సరళ భాష
పాయసమ్ములు, తేనెలు, పండ్లు, జున్ను,
పంచదారల నేనియు మించు మిగుల
తీయ తీయని పలుకుల తెలుగు భాష
విశ్వవాఙ్మయ భూషగా వెలుగు భాష

రచన
శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారు

15 కామెంట్‌లు:

  1. నమస్కారములు.
    తీయనైన తెలుగు పలుకులను సొగసైన సీసంలో మరింత సొగసుగా ,తెలుగు వెలుగుల ,తేనే సోనలు విర జిమ్మిన " శ్రీ పండిత నేమాని వారికి " జోహార్లు. + శిరసాభి వందనములు.

    రిప్లయితొలగించండి
  2. నేమాని పండితులవారూ చాల చక్కగా సెలవిచ్చారు.

    పాప నవ్వువోలె పాల మీగడ వోలె
    మంచి గంధ మట్లు మల్లె లట్లు
    వీణ పాట రీతి విన సొంపుగా నుండు
    తీయ తేనె లొలుకు తెలుగు పలుకు.

    రిప్లయితొలగించండి
  3. లలితమైన తెలుఁగు పలుకుల వెలుఁగులు
    దిశల నిండుననుచుఁ దెలుపునట్టి
    పద్యరత్న మొసఁగు పండిత నేమాని
    వారి కిదె యొనర్తు వందనములు.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    సొంపైన పద్యం చెప్పారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. తీయని సీసం తో తెలుగు వెలుగులను తెలిపిన నేమాని వారికి నమస్కారములు.

    తెలుపు వోలె వెలుగు తెలుగు భాషయె జూడ
    తెలుపు దీని లోని తీయ దనము
    నలుపు జేయనెంచు నజ్ఞాన మూర్తు(ర్ఖు)ల
    నలుప వలెను తెలుగు నిలుప వలెను.

    రిప్లయితొలగించండి
  6. శంకరార్యా ! తెలుగు పలుకు తేనెలొలుకుతోంది !

    రిప్లయితొలగించండి
  7. హనుమచ్చస్త్రిగారూ చాలా మంచి భావం, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ పండిత నేమాని వారి పదములు పనస తొనలే ! పాదములు అమృత ధార ! పద్యమొక కల్ప తరువు!
    గురువు గారి పలుకులు సుధామయములు. మిస్సన్నగారి పద్యము హృద్యము. శాస్త్రి గారి పద్యము మనోహరము.

    నా ప్రయత్నము ;

    నారదాది మునులు నారాయణుని జేరి
    మధుర మైన భాష మాకు నిమ్ము
    అనుచు గోరగ నత డాంధ్రము బలికించె
    భారతమ్మ చేత బ్రహ్మ నడిగి

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.

    తెలుగు భాషలోని తియ్యందనంబును
    తెలుపునట్టి పద్యములను వ్రాసి
    యలరఁ జేసినాఁడ వౌర గోలి హనుమ
    చ్ఛాస్త్రి! కవితఁ జెప్పు మేస్త్రి వయ్య!
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మనోహరంగా ఉంది మీ పద్యం. అభినందనలు.

    బ్రహ్మ నడిగి హరియె భారతి నోటను
    పలుకఁజేసె ననఁగఁ దెలుఁగు భాష
    మెరయు గన్నవరపు నరసింహ మూర్తి! నీ
    పద్య మలరె సుజన హృద్యమగుచు.

    రిప్లయితొలగించండి
  10. గురువు గారూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. పండితమాన్యులై పరగు భవ్యులు సన్యసి రావు మిత్రులు
    ద్దండ కవిత్వ తత్వనిధి. ధన్యత నొందిరి తెల్గు తల్లినే
    నిండు మనంబునన్ గని. పునీతులఁ జేసిరి తెల్గువారలన్.
    మెండగు తెల్గు కీర్తి కని మెచ్చగ చేసిరి. ధన్యవాదముల్.

    రిప్లయితొలగించండి
  12. శంకరార్యులకు, మిస్సన్న గారికి, గన్నవారపు వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  13. తెలుగు పలుకు అనే పద్యమును గూర్చి సహృదయముగా స్పందించిన (మిత్రులు) మహనీయులందరికి నా హృదయపూర్వక శుభాశీస్సులు.

    నేమాని రామజోగి సన్యాసి రావు

    రిప్లయితొలగించండి
  14. శ్రీ నేమాని మహాశయులు అందించిన తెలుగుపలుకు పద్యం మధురంగా వుంది. వారికి ధన్యవాదాలు. వారి తేటగీతి చదివినపుడు కరుణశ్రీ గారి పద్యాలు గుర్తుకొచ్చాయి. మనం తెలుగువారిగా పుట్టటం అదృష్టం. అప్పయ్య దీక్షితులు గారన్నట్లు, "ఆంధ్రత్వమాంధ్ర భాషాచ బహు జన్మతప: ఫలం", అదే విశ్వనాధ సత్యనారాయణ గారి మాటల్లో "బహుజన్మకృత పుణ్య పరిపాకమున జేసి ఆంధ్రుడై ధాత్రిలో నవతరించు". ఆంధ్రుడై పుట్టినందుకు గర్విద్దాం, దివ్యమై చావు లేనిది తెలుగు భాష అని చాటి చెబుదాము.
    -చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి