6, నవంబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 516 (ననుఁ బూజించిన వారె)

వారాంతపు సమస్యాపూరణం
కవిమిత్రులారా,
ఈ వారాంతానికి పూరించవలసిన సమస్య ఇది ..
ననుఁ బూజించిన వారె పొందుదు రనం
తంబైన సత్సంపదల్.

52 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    అర్జునునితో శ్రీకృష్ణపరమాత్మ కురుక్షేత్రంలో :

    01)
    ______________________________________________

    కనుమో యర్జున ! విశ్వరూపమిదె ! సా - కల్యంబు చూపించెదన్ !
    కనగా నోచరు నెవ్వరైన భువి ! భా - గ్యంబన్న నీదే సుమా !
    పునరుత్పత్తిక యుండబోదు ! మదమున్ - మోహంబు నాశంబగున్ !
    ననుఁ బూజించిన వారె పొందుదు రనం - తంబైన సత్సంపదల్ !
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  2. సమస్య పాదంలో యతిమైత్రి కుదురుతోందా??

    నేనేమైనా పొరబడుతునానా??

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  3. కామేశ్వర శర్మ గారూ,
    యతి విషయంలో సందేహం లేదు. అది బిందుయతి. బిందుపూర్వకమైన వర్గాక్షరాలు ఆయా వర్గాల అనునాసికాక్షరాలతో చెల్లుతాయి.
    ంక, ంఖ, ంగ, ంఘ - ఙ.
    ంచ, ంఛ, ంజ, ంఝ - ఞ.
    ంట, ంఠ, ండ, ంఢ - ణ.
    ంత, ంథ, ంద, ంధ - న.
    ంప, ంఫ, ంబ, ంభ - మ.

    రిప్లయితొలగించండి
  4. మా బాగా కుదురుతోంది శర్మగారూ !

    దీనిని "అనుస్వార యతి "యందురు !

    పంచక వర్గాక్షరములు
    పంచమ వర్ణముల గూడి - పరగ నటించున్ !
    వంచింపక పెఱ నాలుగు
    సంచితముగ బిఱుద సున్న - లంటిన చోటన్ !
    (భీమన ఛందము)

    ప్రతి వర్గములోను మొదటి నాలుగక్షరములకు పూర్వము నిండు సున్న యున్నచోవానికి ఆయా వర్గానునాసికము(పంచమ వర్ణము)యతి చెల్లును

    రిప్లయితొలగించండి
  5. శ్రావణ లక్ష్మీ వ్రతము గూర్చి అమ్మవారే స్వయముగా చెపుతున్నట్లుగా ఊహ.

    అనుమానంబిసుమంతకూడదు జగద్వ్యాప్తంబు నాశక్తి, సం
    జనితంబైన విశుద్ధ భక్తి పథమున్, సన్మార్గులై మీరు శ్రా
    వణలక్ష్మీ వ్రతమాచరింపగ శుభంబైవెల్గరే యిద్ధరన్
    నను బూజించిన వారె పొందుదురనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  6. వినుమా అర్జున! విశ్వరూపుని ననున్ విష్ణున్ త్రయీవేద్యునిన్
    గనుమా సర్వజగత్పతిన్ భువన యోగక్షేమ నిర్వాహకున్
    మనమందాదర మొప్పగా నిలిపి సంభావించి ధ్యానించుచున్
    నను బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్

    రిప్లయితొలగించండి
  7. ఘనమౌయద్రికి పుట్టి ముద్దుగ మహాగారాల పూబంతిగా
    ననురాగమ్ముల కూతురై పెరిగి దానాశించిపూజించి మా
    యెనలేనట్టి మహేశుకున్ తరుణి దానిల్లాల యెన్, మా యప
    ర్ణనుపూజించినవారె పొందుదురనంతంబైన సత్సంపదల్

    రిప్లయితొలగించండి
  8. విషయమెరిగించిన వసంత కిషోర్ గారికీ శంకరార్యులకూ ధన్యవాదం.

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  9. యతి విషయకమైన సందేహాలకు సదుపయోగకారి యైన సూచిక:
    -> http://te.wikipedia.org/wiki/యతి
    ప్రాస విషయకమైన సందేహాలకు సదుపయోగకారి యైన సూచిక:
    -> http://te.wikipedia.org/wiki/ప్రాస

    రిప్లయితొలగించండి
  10. ఘన శేషాహి విశేష తల్పమున యోగానంద నిద్రాళువై
    వనమాలా యుత కంబు కంఠియయి , శ్రీ వత్సాంకితుండై , రమా
    వనితా సత్కృత పాద సంవహనుడై , భాసిల్లు మందస్మితా
    ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్ !!!

    రిప్లయితొలగించండి
  11. నను గూళ్ళల్లి భజించు సాలె పురుగున్, నన్గొల్చు నాగేంద్రమున్,
    ఫణినిన్ చేకొననే ముదమ్మునను భక్తిన్ కార్తికంబందునన్
    తినకైనన్ తినఁ లేకనైనను మదిన్ తీరైన భక్తాళురై
    ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  12. మందాకిని గారూ ధన్యవాదాలు. మీ అపర్ణ విరుపు మనోహరం.

    రిప్లయితొలగించండి
  13. మిస్సన్నగారు,
    ఇప్పుడే చిన్న సందేహం వచ్చింది. భక్తాళి బహువచనం కదా, రు వస్తుందా? భక్తాళి యైనను అని వస్తుందేమో.
    విష్ణునందన్ గారి పూరణలో ఒక న తక్కువైందేమో.


    ధన్యవాదాలండి.

    రిప్లయితొలగించండి
  14. మందాకిని గారూ నిజమే కానీ భక్తాళురు, శ్రద్ధాళురు వంటి ప్రయోగాలున్నాయను కొంటున్నాను. సందేహాన్ని గురువుగారే తీర్చాలి.
    విష్ణు నందను గారి పూరణలో మందస్మితానను అన్న తర్వాత అరసున్న ఉందికదా. దానితో సరిపోయింది. ఆననున్ అన్నమాట.

    రిప్లయితొలగించండి
  15. ఘనమౌ పుర్రెను చేతబట్టి యడుగున్ కాసింత యన్నంబునే
    కన నేత్రంబున నిప్పు గ్రక్కు నొడలన్గప్పేను గా చర్మమే
    విన భస్మంబును మేన దాల్చు జడుడే వీనిల్లు కాడందు రై
    నను బూజించిన వారె పొందుదురనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  16. వెంకట రాజారావు లక్కాకులఆదివారం, నవంబర్ 06, 2011 9:35:00 PM

    ఘనుడా సాయి -మహాను భావుడు- సదా కారుణ్య పూర్ణామృతా
    నన భాస్వంతుడు -సాయి సత్కృపలు బొందన్ - కాదు కాదెన్నడె
    న్నను బూజించిన వారె - పొందుదురనంతంబైన సత్సంపదల్
    విన బూజింపని వారు కూడ - సములే వేల్పుల్ కృపన్ సాయికిన్?

    రిప్లయితొలగించండి
  17. వినరే విశ్వము సృష్టి చేసి పిదపన్ విశ్వంభరత్వమ్మునన్
    గనరే లోకములెల్ల గాచితినిగా కంఠంబులో నిల్పుచున్
    ఘన హాలాహల ఘోరమైన విషమున్ గల్పింతు నే సౌఖ్యముల్
    నను పూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్

    రిప్లయితొలగించండి
  18. ఆహా ! తెలుగులో మళ్ళీ నా పేరు వ్రాయ గలిగినందులకు సంతోషముగా ఉంది. మందాకిని గారి పద్యము మిగిలిన పద్యాలకు భిన్నముగా ఉండి సుందరముగా ఉంది ( అమ్మని కొలుస్తే అందముగా ఉండదా !)
    గుంపు ,గుంపులు అనే ప్రయోగములలో మిస్సన్న గారి భక్తాళురు ప్రయోగము సరి యైనదే నని నాకు తోస్తుంది. డా.విష్ణునందనుల వారి దర్శనము ఆనందము కలిగిస్తున్నాది.

    రిప్లయితొలగించండి
  19. మూర్తి మిత్రమా ధన్యవాదాలు.
    సవరించిన నా పూరణ:

    నను గూళ్ళల్లి భజించు సాలె పురుగున్, నన్గొల్చు నాగేంద్రమున్,
    ఫణినిన్ చేకొని బ్రోవనే ముదము గూర్పన్, కార్తికంబందునన్
    తినకైనన్ తినఁ లేకనైనను మదిన్ తీరైన భక్తాళురై
    ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  20. మూర్తిమిత్రమా ఇప్పుడు నేనుకూడా ఎందుకు ఊరుకోవాలని మీ పూరణను శల్య పరీక్ష చేశా నన్న మాట. హాలాహలము, విషము పర్యాయపదాలేమో అని అనుమానం. విషమున్ అన్న తర్వాత కల్పింతునే అంటే సరి పోతుంది.

    రిప్లయితొలగించండి
  21. మిస్సన్న గారూ ధన్యవాదములు. హాలాహలము ఒక విషము గాని విషమునకు పర్యాయ పదము కాదు కదా ? విషమున్ ద్రుతము పై సరళాదేశ సంధితో కల్పింతు గల్పింతు అవదా ?

    శల్య పరీక్ష చేస్తే సవరణ కూడా మీ బాధ్యతే !

    రిప్లయితొలగించండి
  22. మిస్సన్న గారూ,విషమున్ తర్వాత, కల్పింతు నే సౌఖ్యముల్ అనేది కొత్త వ్యాఖ్య గాబట్టి సరళదేశము రాదా ?

    రిప్లయితొలగించండి
  23. మూర్తి గారు,
    స్పందనకు, మెచ్చుకోలుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. మూర్తి మిత్రమా విషము గల్పించు లేదా విషమున్ కల్పించు అని నా ఉద్దేశ్యం.
    మన సందేహాలు గురువుగారే తీరుస్తారు.

    రిప్లయితొలగించండి
  25. ప్రథమ మీది పరుషములకు గసడదవలగు అన్న సూత్రం ప్రకారం విషము గల్పించి అవుతుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  26. మూర్తి మిత్రమా ఇంకా శల్య పరీక్ష పూర్తీ కాలేదు. ఇంతకీ విషమున్ అన్న పదంతో ఆ వాక్యం పూర్తయిందని మీరే అన్నారుగా. మరి క్రొత్త వాక్యానికి ఆదిలో సరళం ఎందుకు వస్తుంది?

    రిప్లయితొలగించండి
  27. నిజమే మిస్సన్న గారూ, ధన్యవాదములు. కల్పించినివి సౌఖ్యములు,విషము గాదు. చిక్కు, శ్యామలీయము గారు శలవిచ్చినట్లు పద్యాలలో చుక్కలు కామాలు ఉండవు.అందు వలన వ్యాఖ్య కొత్త అయినా అది కొత్త వాక్యము గాదు.అందుచే సంధి చెయ్యాలా,అక్కఱ లేదా అని అనుమానము. మీరు చెప్పినట్లు సవరించాను. గురువు గారు ఏమి చెబుతారో చూద్దాము.

    వినరే విశ్వము సృష్టి చేసి పిదపన్ విశ్వంభరత్వమ్మునన్
    గనగా లోకములెల్ల గాచితినిగా కంఠంబులో నిల్పుచున్
    ఘన హాలాహల ఘోరమైన విషమున్, కల్పింతు నే సౌఖ్యముల్
    నను పూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్

    రిప్లయితొలగించండి
  28. మిస్సన్న గారూ, శల్య పరీక్ష అంటే , కర్ణుడినే కదా శల్యుడు పరీక్షించినది. అర్జునిని పొగుడుతూ కర్ణునిలో లోపాలు యెత్తి చూపిస్తూ కర్ణుని ఆత్మవిశ్వాసానికి తూట్లు పొడుస్తాడు.అంతేనా,ఇంకేమైనా విశేషము ఉంటే చెప్పండి, భారతములో నిపుణులు మీరు !

    రిప్లయితొలగించండి
  29. నా పూరణ .....

    వినుఁడో భక్తవరేణ్యులార యిది! హృద్వీధిన్ తిరంబైన భ
    క్తిని గీలించి సదైకచిత్తమున సంకీర్తించి పంచాననున్
    ఘనుఁడైనట్టి షడానన్ గొలిచి లోకస్తుత్యనామున్ గజా
    నను పూజించినవారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  30. శల్య సారథ్యం అనేది ఒకటి ఉంది . అంటే మన వెన్నంటే ఉంటూ మనని అనునిత్యం సూటిపోటి మాటలతో వేధిస్తూ , చులకన గా మాట్లాడుతూ లోపాయకారిగా మన ప్రత్యర్థికి మేలు చేయడం .
    ఇక పోతే మరొకటి - స్తన శల్య పరీక్ష . కేవలం కండరాలతో కూడి , ఎముకే లేని ప్రదేశం లో ఎముక కోసం వెదకడమంటే , ఏమైనా దొరుకుతుందేమో అని నిశితంగా పరీక్ష చేయడమన్న మాట . అదిన్నూ విపరీతార్థంలో . అనవసరంగా తప్పులు వెదకడాన్ని స్తన శల్య పరీక్ష అంటారన్న మాట . దీన్ని శల్య పరీక్ష అనడం కంటే ' స్తన శల్య పరీక్ష ' అనడమే మంచిది ! రెండు ఒకే రకమైన పదాల వల్ల వచ్చిన సందిగ్ధ పరిస్థితి ఇది . అక్కడ 'శల్యుడు ' = మాద్రీయుడైన రాజు . ఇక్కడ శల్యము= ఎముక . అదీ తేడా !

    రిప్లయితొలగించండి
  31. మందాకిని గారూ , అక్కడ ' ఇల్లాలయెన్ ' కూడదు . ఒకసారి చెప్పిన జ్ఞాపకం ఏమంటే ' అయెన్ ' అనే శబ్దమే లేదు . తెలుగు గ్రాధిక రూపాల్లో - అయ్యెన్ , ఆయెన్ అనేవే ఉన్నప్పుడు అసలీ ' అయెన్ ' శబ్దం ఎలా వచ్చిందో తెలీడం లేదు . ఏదేమైనా ఇదేదో వ్యాకరణానికి సంబంధించిన విషయం కంటే , అసలు తెలుగు లో లేని పదాన్ని ప్రయోగించడమే అవుతుంది .

    " అపి మాషం మషం కుర్యాత్ ఛందో భంగం న కారయేత్ " అన్నట్టుంటుంది !!!

    రిప్లయితొలగించండి
  32. శంకరయ్య గారూ మధురమైన పూరణ . మనలో మన మాట , ఇదే పద్యంలో నేనైతే ' లోక స్తుత్య నామున్ ' బదులుగా ' విఘ్న ధ్వంసకుండౌ ' అని వ్రాసి ఉండేవాడినేమో ... ( సవరణ ఎంత మాత్రమూ కాదు ... మన్నించాలి ! ) ఎందుకో చదివేటప్పుడే అలా స్ఫురించింది మరి ! అభివాద పరశ్శతం .

    రిప్లయితొలగించండి
  33. మిస్సన్న గారికి , డా. గన్నవరపు నరసింహ మూర్తి గారికి - ప్రత్యేకాభివందనాలు !!!

    రిప్లయితొలగించండి
  34. **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘కనగా నోచరు నెవ్వరైన’ ... ‘నోచరెవ్వరైన’ కావాలి. అక్కడ ‘కనగా నోచరిదెవ్వరైన’ అంటే సరి!
    ‘ఉత్పత్తి + ఇక’ అన్నప్పుడు సంధి లేదు. ‘పునరుత్పత్తియె యుండబోదు’ అందాం.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    గీతాచార్యుని వాక్యంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని ‘నను’ను అప‘ర్ణను’ చేయడం సరికాదు.
    ‘ఘనమౌ యద్రికి’ అన్నదాన్ని ‘ఘనశీతాద్రికి’ ఆంటే ఇంకా బాగుంటుంది కదా!
    **********************************************************************
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘కంబుకంఠి యయి’ అన్నది ‘కంబుకంఠుఁడయి’ అంటే బాగుంటుందేమో!
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో యతి తప్పింది. (సవరించారు కదా!)
    మందాకిని గారి సందేహం అర్థవంతమే. భక్త + ఆళి(లి) = వరుస, సమూహం;
    మీరన్నట్టు భక్తాళికి, శ్రద్ధాళువుకు సంబంధం లేదు. శ్రద్ధాళువు (ఏ. వ.) = విశ్వసించేవాడు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ‘ఎన్నను’ అంటూ సాయినాథునిపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘విషమున్ గల్పింతు’ అన్నది సరియైనదే. విషమున్ తో వాక్యం పూర్తయినా కాకున్నా అక్కడ సరళాదేశం తప్పక జరుగుతుంది. ఇక హాలహలము అంటే ఒక విధమైన విషం. అరటిపండు అన్నప్పుడు అరటి అంటే పండు అనే అర్థం కాదు కదా.. ఇదీ అంతే!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  35. డా.విష్ణునందన్ వారి వివరణకు కృతజ్ఞతలు. వైద్యవృత్తిలో ఉండి యింత విజ్ఞానము సంపాదించిన మిమ్ములను చూస్తే ఆశ్చర్యము ఆనందము కలుగక తప్పవు. మీకు మరోసారి అభినందనలు !

    రిప్లయితొలగించండి
  36. గురువు గారూ, నమస్సులు. మీ వివరణకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  37. డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు. మీ సూచన (సవరణ కాదన్నారు మరి!) నా పూరణకు అలంకారమే.

    రిప్లయితొలగించండి
  38. విష్ణునందన్ గారు, గురువు గారు,
    కృతజ్ఞురాలను. అయెన్ తప్పు ప్రయోగమని మరచి ప్రయోగించినందుకు మన్నించండి.
    అపర్ణను అంటే నను వస్తుందని అనుకున్నాను. మన్నించండి.

    మరో పూరణ.
    కనకమ్మన్నను మోజుగల్గి, సుఖ సౌఖ్యాలెల్ల కాంక్షించుచున్,
    ధనధాన్యాదులఁ, పాడిపంటలను, బాధాముక్త సంసారముల్
    గన నాశించిన; భక్తి భావన లతో కామాక్షి పాదంబులై
    నను పూజించినవారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  39. గురువుగారూ ధన్యవాదాలు. ఇప్పుడు రెండు విషయాలు తెలుసుకొన్నాను. ౧. భక్తాళురై అన్న ప్రయోగం తప్పు అని.
    ౨. మిడిమిడి జ్ఞానంతో శల్య పరీక్ష చెయ్య కూడదు అని.
    మీ పూరణ అద్భుతంగా ఉంది. మేమందరం ఒకరినే పూజిస్తే మీరు ఒకే పూరణలో ముగ్గుర్ని పూజించారు.
    అయితే మీ తర్వాతి పాఠం సరళాదేశ, గసడదవాదేశ సంధుల మీద చెప్పండి.
    మూర్తి మిత్రమా మన్నించాలి. మీ పూరణ నిర్దోషమని తేలింది.

    విష్ణు నందను గారూ ధన్యవాదాలు. శల్య పరీక్ష అంటే ఎముకలను బాగున్నాయో లేదో అని పరీక్షించడం అనుకొనే వాడిని. ఇప్పుడర్థం అయ్యింది.

    మందాకినీ గారు మీ సందేహం నిజమని తేలింది. నా పూరణను సవరించడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  40. అందరికీ వందనములతో సవరించిన నా పూరణ:

    నను గూళ్ళల్లి భజించు సాలె పురుగున్, నన్గొల్చు నాగేంద్రమున్,
    ఫణినిన్ చేకొని బ్రోవనే ముదము గూర్పన్, కార్తికంబందు నన్
    తినకైనన్ తినియైన బ్రోవుమని యార్తిన్, భక్తి నెవ్వారలై
    ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్.

    రిప్లయితొలగించండి
  41. మిస్సన్న గారూ ,
    వైద్యులకు కూడా అప్పుడప్పుడు పరీక్ష లవసరమే !ఈ సారి మీ యెలమంచిలి వచ్చినప్పుడు మీకు ఓ స్టెథస్కోపు బహూకరిస్తాను. మీ దయ వలన నాకు చిర కాలంగా ఉన్న సందేహము తీరింది. నేను యేమీ అనుకోను, నా పద్యాలలో మీకు ( మిత్రు లెవరికైనా సరే ) దోషాలు కనిపిస్తే తప్పక చూపించండి. గురువు గారు మాత్రము యెంత కన్న అన్ని తప్పులూ చూడగలరు ?

    రిప్లయితొలగించండి
  42. మిత్రమా ధన్యవాదాలు. స్టెథస్కోపు తో పరీక్షించే అవసరం ఏముంది? మావన్నీ మైక్రోస్కోపు తో చేసే పరీక్షలు!

    రిప్లయితొలగించండి
  43. శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !
    విష్ణునందనులవారి విష్ణు పూజ
    మీరు సలిపిన గజానన పూజ
    మిత్రులందరి పూజలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  44. అందరికీ నమస్కారం !
    ఇది నా పూరణ

    వినుడోపౌండ్రక వాసుదేవుడఘుడై ప్రేలెన్ సభా ప్రాంగణం
    బున నీరీతి 'మురారి మించు యనఘున్ పుణ్యాత్ముడన్ నేను నా
    ఘనతన్ కీర్తనలాడనిచ్చెద మహా కళ్యాణముల్, లోకమున్
    ననుఁ బూజించిన వారె పొందుదు రనంతంబైన సత్సంపదల్ '

    రిప్లయితొలగించండి
  45. **********************************************************************
    మందాకిని గారూ,
    మిస్సన్న గారూ,
    సవరించిన మీ పూరణలు ఇప్పుడు సర్వలక్షణశోభితాలై అలరిస్తూ ఉన్నాయి. అభినందనలు.

    **********************************************************************
    కళ్యాణ్ గారూ,
    పౌండ్రకవాసుదేవుని వృత్తాంతాన్ని పూరణకు ఎన్నుకొనడం బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    తృతీయపాదాంతంలోని ‘లోకమున్’ అన్వయించడం లేదు. అక్కడ ‘సౌఖ్యమున్’ అంటే సరి!
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  46. గురువుగారు,
    ధన్యవాదాలు.
    నను అపర్ణను చేయకూడదన్నారు. అందుకే నేను సవరించలేదు. కొత్త పూరణ చేశాను. :-)

    రిప్లయితొలగించండి
  47. గురువుగారూ ఒక్కొక్క సమస్యకూ ౫౦ కి పైగా పూరణలూ/వ్యాఖ్యలూ వస్తున్నాయంటే చూడ ముచ్చటగా ఉంటోంది. విద్వత్కవివర్యులు కూడా
    శంకరాభరణం లో పాలుపంచు కోవడం యెంతటి మహద్భాగ్యం!

    రిప్లయితొలగించండి
  48. శంకర ఉవాచ:

    చనుచున్ కైలస పర్వతాగ్రమునకున్ శాస్త్రీయ మార్గమ్మునన్
    కొనుచున్ కొబ్బరి కాయలన్ విరివిగా కొట్టించి లింగమ్ముకున్
    వినరా! రాహులు! మందబుద్ధి ఘనుడా! వీక్షించి ధ్యానమ్మునన్
    ననుఁ బూజించిన వారె పొందుదు రనం
    తంబైన సత్సంపదల్

    రిప్లయితొలగించండి