25, నవంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 538 (చీమల పదఘట్టన విని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

 1. చీమలు పామును జంపుట
  ఏమారక జూచె గుహకు యెదుటనె రేయిన్
  యేమని చెప్పుదు కలలో
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.

  రిప్లయితొలగించండి
 2. తరలి:
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్ జుమీ
  పాముల బుస నాదమువిని పక్షివిభుడు భీతిలెన్
  దోమలగని మత్తగజము తూలిపడెను నేలపై
  ఏమిది కలికాల మహిమ మేజుమి తలపోయగా!

  రిప్లయితొలగించండి
 3. హనుమచ్ఛాస్త్రి గారూ, "గుహకు యెదుటనె" అనరాదనుకుంటానండీ. గుహకు + ఎదుటనె --> గుహకెదుటనె (ఉత్తున కచ్చు పరంబగునపుడు సంధి నిత్యము). అదలా ఉండనిచ్చి, 'గుహకు' అని దేనికి? గుహ + ఎదుటనె --> గుహ యెదుటనే అనేది సహజంగా ఉండే ప్రయోగం. పాదాన్ని పునర్నిమ్మిస్తే:
  ఏమారక జూచె గుహకు యెదుటనె రేయిన్ --> ఏమారక జూచెను గుహ యెదుటనె రేయిన్

  నేమాని వారి పూరణ సమస్యకు తగ్గట్లే ఉంది. అసాధ్య సమస్యకు ఆశ్చర్య పూర్వక పూరణ సహజం.

  రిప్లయితొలగించండి
 4. ఏమందును కలికాలము
  నీ మార్జాలంబు బెదరె నెలుకను కనగాన్,
  దోమకు బెదరురు మనుషులు,
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.

  రిప్లయితొలగించండి
 5. ఏమని జెప్పుదు నొక పరి
  సామజమును గూల్చ గలిగె శాపము హరికిన్
  చీమయె యంతకుడౌ నని
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్ !

  రిప్లయితొలగించండి
 6. నా పూరణ ....
  కంప్యూటర్ గ్రాఫిక్స్ తో ‘జెయింట్ ఆన్ట్స్’ అనే సినిమా వచ్చిందనుకుందాం.

  ఏమని చెప్పను? ‘రాక్షస
  చీమ’ లనెడి చిత్రమున నశేషముగఁ దగన్
  సామజములఁ బోలిన బలు
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.

  రిప్లయితొలగించండి
 7. చిత్రం! గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణలో, నా పూరణలో ప్రాసస్థానంలో ఒకే పదాలు వచ్చాయి.

  రిప్లయితొలగించండి
 8. గురువు గారూ కారణము మనము ఒకే నెలలో జన్మించడమే ! ఒక్క దినము తేడాతో !

  రిప్లయితొలగించండి
 9. ఆమాడ్కి నగ్ని పర్వత
  ధూమాగ్నులు ప్రజ్జ్వరిల్లి దుర్భరమగుచున్
  భీమార్భటు లెసగెను బ్రా
  చీ మల పద ఘట్టన విని సింహము బెదరెన్

  -----సుజన-సృజన

  రిప్లయితొలగించండి
 10. ఇది చిత్తగించండి:

  స్వామిని సింగము ననుకొని
  వేమరు కార్మికుల దులిపి విడచిన నొకటై
  యీ మారు సమ్మెకట్టిన
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్.

  రిప్లయితొలగించండి
 11. గన్నవరపు వారి కమనీయ కధనమ్ము ,
  గోలి వారి కలయు, గురువు శంక
  రయ్య ఫిల్ము, బుధ తరళి, సంపతయ్య కా
  ల మహిమ - లరయనగు లలితములుగ

  -----సుజన-సృజన

  రిప్లయితొలగించండి
 12. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, నవంబర్ 25, 2011 12:53:00 PM

  సామాన్యమైన కోతుల
  భీమముగని రావణుండు భీతిల్లె మదిన్
  రాముని మహిమేమందును
  చీమల పదఘట్టన విని సింహము బెదిరెన్

  రిప్లయితొలగించండి
 13. మిత్రులారా!
  నేను రచించిన పద్యకావ్యము శ్రీమదధ్యాత్మ రామాయణము మరికొన్ని శతకములు మొ.వి. ఈ క్రింది వెబ్ సైట్లో చూడ గలరు:

  panditha nemani@info

  రిప్లయితొలగించండి
 14. శ్రీకామేశ్వర శర్మగారి సామాన్యమైన ..... పద్యం అసామాన్యమైనదిగా ఉంది. బాగుంది. అయితే 'మహిమేమందును' అనటం సరికాదేమో? యడాగమం రావాలనుకుంటాను.

  నేమానివారి వెబ్-సైట్ సరియైన చిరనామా:
  http://panditha-nemani.info/

  రిప్లయితొలగించండి
 15. రాజారావు గారు మీ కమనీయ మైన పద్యానికి కృతజ్ఞతలు. ఎందుకో అర్ధరాత్రి మెలకువ వచ్చి పద్యాన్ని సవరించా లని పించింది.

  ఏమని చెప్పుదు నొక పరి
  సామజమును గూల్చఁ గలిగె శాపము హరికిన్
  జీమ యగు జముడు నత్తఱిఁ
  జీమల పదఘట్టన విని సింహము బెదరెన్ !

  రిప్లయితొలగించండి
 16. శ్రీ శ్యామలీయము గారు చీమలకు ఎఱ్ఱ చొక్కాలు తొడిగారు. ఆయన పద్యమును యిలా సవరిస్తే యెలా యుంటుందో ,

  స్వామిగ సింగము నెఱుగుచు
  వేమరు భృత్యకులు గొఱికి విడిచిరి యొకటై
  యీమారు సమ్మె యనగా
  చీమల పదఘట్టన విని సిం హము బెదరెన్

  రిప్లయితొలగించండి
 17. శ్రీ శ్యామలీయం గారూ! మా రామాయణము గురించి సరియైన వెబ్ వివరములు ఇచ్చినందులకు కృతజ్ఞతలు. 7 నెలల దీక్షలో పూర్తిచేయ గలిగేను. 2009లో సంక్రాంతి నాడు మొదలుబెట్టి వినాయక చవితికి పూర్తి చేసేను. జగద్గురువుల అనుగ్రహ వాక్యములను కూడ పొందేను. సుమారు 2,400 పద్యములు వ్రాసేను. వృత్త వైవిధ్యము నాకు ఇష్టము; సుమారు 50 రకముల వృత్తములను వాడేను. పండితులే కాదు సామాన్యులు కూడా ఆనందముగా చదువుచున్నాము అని నాకు చెప్పుచున్నారు. మన బ్లాగు మిత్రులు శ్రీ శంకరయ్య గారు, శ్రీ చింతా రామకృష్ణారావు గారు, మా తమ్ముడు డా. నరసింహ మూర్తి. శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ మిస్సన్న గారు, శ్రీమతి నేదునూరి రాజేశ్వరిగారు ప్రభృతులు చదివిన వారే. మీరు కూడ వీలు వెంబడి చదివి ఆనందించగలరని మా ఆకాంక్ష.

  రిప్లయితొలగించండి
 18. చీమల కెఱ్ఱటి చొక్కా
  లేమని తొడగితిరి నాగ యేమన వచ్చున్
  ధీమంతముగల మా యీ
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్

  రిప్లయితొలగించండి
 19. నేమానివారికి రామాయణకథా రచన చేసినందుకు అభినందనలు. నా బోంట్లకు అంతటి శక్తి యెక్కడిది. కాని చదివి ధన్యుడను కావటం శ్రీరామచంద్ర ప్రభువులవారి దయవలస సాధ్యమే నని విశ్వసిస్తున్నాను. ప్రస్తుతం యీ లౌకిక వృత్తిలో చిక్కుబడిన జీవితం ఉదయాద్యస్తమయ పర్యంతం, యింకా సరిగా చెప్పాలంటే ఉదయాదినిద్రాపర్యంతం యీ కంప్యూటరు ముందు కూర్చొని విసుగూ విరామం లేకుండా పని చేయటానికే సరిపోతున్నది. అయినా యెంతో కొంత ప్రయత్నం చేసి వీలుచూసుకొని తప్పక చదువుతాను.

  రిప్లయితొలగించండి
 20. నరసింహమూర్తగారు మన్నించాలి. "భృత్యకులు" అనే పదం సాధువు కాదేమోనని నా అనుమానం.

  రిప్లయితొలగించండి
 21. నిజమేనండీ శ్యామలీయము గారూ, శబ్దరత్నాకరములో భృత్యుడు అనే ఉంది.భృత్యకుడు పదము లేదు. మీరు విడచిన,తొడగిరి అని ప్రయోగించారు. నేను విడిచిన,తొడిగిన అని ప్రయోగించాను. ఏవి ఒప్పో కూడా ఒకసారి మీరు గాని,అన్నగారు గాని,గురువుగారు గాని పరిశీలించి చెప్పగలరా ? నాకు ఆతృత తప్ప భాషా జ్ఞానము తక్కువే. నేను మరి యిలా సవరించాను. పరిశీలించండి. పనికి వెళ్ళాలి నేను.


  స్వామిగ సింగము నెఱుగుచు
  వేమరు సేవకులు గొఱికి విడిచిరి యొకటై
  యీమారు సమ్మె యనగా
  చీమల పదఘట్టన విని సిం హము బెదరెన్

  రిప్లయితొలగించండి
 22. నా మనుమడు తెచ్చెను సి.డి.
  ఏమందును దాని జూడ నెన్నొ విచిత్రాల్,
  భీమాకారపు రక్కసి
  చీమల పద ఘట్టన విని సింహము బెదరెన్.
  --------
  శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారి సమస్యకు నా పూరణం

  ------
  యమున దాల్చె నొక్క యామిని దివ్యమౌ
  కాంత రూప రేఖ కట్టె నొడల
  చారు వర్ణ చేల చంచ లాంచలమా
  యమున కేల వస్త్ర మాభరణము .
  కేల=చేతిలో

  రిప్లయితొలగించండి
 23. ఈరోజు సమస్యను శ్రీ చంద్రశేఖర్ గారు ఇచ్చేరు. బాగుంది. మరి వారి పూరణను కూడా ఇస్తే బాగుంటుంది అని వారికి తోచలేదా? సమస్యను ఇచ్చి చేతులు దులిపుకోవుటయేనా? ???

  రిప్లయితొలగించండి
 24. ఈరోజు సమస్యను శ్రీ చంద్రశేఖర్ గారు ఇచ్చేరు. బాగుంది. మరి వారి పూరణను కూడా ఇస్తే బాగుంటుంది అని వారికి తోచలేదా? సమస్యను ఇచ్చి చేతులు దులిపుకోవుటయేనా? ???

  రిప్లయితొలగించండి
 25. చీమల పద ఘట్టన వినిపించిన మిత్రులందరకూ అభినందనలు.
  శ్యామలీయం గారూ! నిజమే! సవివరముగా విశ్లేషించి మీరు చేసిన సవరణకు ధన్యవాదములు.
  రాజారావు గారూ ! ధన్యవాదములు.
  కమనీయం గారూ ! అది నేను ఇచ్చిన సమస్య కాదు. శంకరాభరణం లోనిదే! గతములో నేను పూరించినది. నేను ఇచ్చిన తేది ప్రకారము శంకరాభరణం లోని సమస్యకు పూరణము అని వ్రాయండి. గమనించగలరు.

  రిప్లయితొలగించండి
 26. నేమాని వారూ, సమస్యను యిచ్చు పృఛ్ఛకుడు తాను స్వయంగా పూరణతో సిధ్ధంగా రావాలని అవధాననియమం అని విన్నాను. నిజమే కావచ్చు ననుకుంటాను. ఎందుకంటే ఒకవేళ సమస్యను అవధాని సవాలు చేస్తే సరసమైన పూరణను పృఛ్ఛకుడు వెంటనే చెప్పి సభను ఒప్పించ వలసి ఉంటుంది.

  ఈ బ్లాగులో సమస్యలు సూచించే వారు, తమ పూరణనో లేదా తగిన పూరణావకాశాన్నో యేదో ఒకదాన్ని కూడా శంకరయ్యగారికి ప్రతిపాదించటం సబబు అని అనుకుంటున్నాను.

  ఇకపోతే చంద్రశేఖర్ గారు బహుశః కార్యాంతరనిమగ్నులు కావలసి రావటం వలన తమ పూరణను యీ రోజు బ్లాగులో ప్రకటించలేక పోయి ఉండవచ్చు నని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 27. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, నవంబర్ 25, 2011 10:41:00 PM

  ఆర్యులారా!
  భృత్యకుడు అనే మాట మీద నాకు కూడా చిన్న అనుమానం కలిగిన మాట నిజమే. అది పక్కనపెడితే అసలు ఈ సమస్యలో ఉన్న "పదఘట్టన" అనే పదముమీద కాస్త స్పందించండి. నేను విన్నదీ నేర్చుకొన్నదీ కూడా పదఘట్టనము అని. మరి ఈ ఘట్టన అనే మాట సాధువేనా?. శబ్దరత్నాకరం దీని గురించి మరో విధంగా చెబుతోంది.

  రిప్లయితొలగించండి
 28. తాడి గడప వారి దమ్మున్న చీమలు ,
  ఆది భట్ల రామ పాద మహిమ ,
  శ్రీయుత కమనీయ సీడీ విశేషాలు
  జదువ పూరణాలు చవులు గొలిపె

  నేను పూరించిన పద్యం లో 'ప్రాచీ-మల 'అంటే తూరుపు పర్వత పాదాలలో అగ్నిపర్వతం బ్రద్దలైన శబ్దాలు వినిపించి అందున్న సింహం బెదిరిందని -నాభావన

  రిప్లయితొలగించండి
 29. శ్యామలీయము గారూ మనకు లౌకిక జీవనము తప్పదు. ఉదయము నుంచి రాత్రి వరకు పని చేసి తరువాత పద్యాలను పరిశీలించి వ్యాఖ్యలు వ్రాసి శ్రమ తీసుకొన్నందులకు మీకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 30. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  అప్సరసల నాట్యముతో తపో భంగమొందిన విశ్వామిత్రుడు :

  01)
  __________________________________

  భామలు తమ నాట్యముతో
  గోమును గురిపించినంత - కోపము విడిచెన్
  కామాతురుడై మౌనియె !
  చీమల పదఘట్టన విని - సింహము బెదరెన్ !
  __________________________________

  రిప్లయితొలగించండి
 31. నా మరో పూరణ .....

  ఈ మహిత భరతభూమిని
  తామసమున నాక్రమించు దైత్యులఁ దఱుమన్
  ధీమంతు లేకమైరే!
  చీమల పదఘట్టన విని సింహము బెదిరెన్.

  (ఈ పూరణకు నేపథ్యంగా భారత స్వాతంత్ర్య పోరాటాన్ని కాని, చైనా దురాక్రమణను కాని స్వీకరించవచ్చు)

  రిప్లయితొలగించండి
 32. కవిమిత్రులకు మనవి ...
  ‘అజ్ఞాత’ల వ్యాఖ్యలకు దయచేసి మీ రెవ్వరూ స్పందించకండి. మన బ్లాగును వివాదాలకు అతీతంగా నిర్వహించాలనుకున్నాం కదా! ఛందోవ్యాకరణాది భాషాసాహిత్యాంశాలపై చర్చలు, వాదప్రదివాదాలు కొనసాగిద్దాం. అంతే కాని ఎవరో ఏదో అన్నారని ఆవేశంతో మనమేదో అనడం, దానికి ఆ అజ్ఞాతల ప్రతిస్పందన, ఖండన మండనలు ఇవన్నీ వ్యక్తిగత దూషణలకు దారితీయడం బ్లాగులోని సంస్కారపూరిత వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వ్యాఖ్యల మాడరేషన్ పెట్టి వ్యాఖ్యలను ఎప్పటి కప్పుడు పరిశీలించి ప్రకటిద్దామంటే మరికొన్ని రోజులు నేను బ్లాగుకు ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి.
  అర్థం చేసికొని అజ్ఞాతల వ్యాఖ్యలకు బాధపడడం కాని, కోపం తెచ్చుకొనడం కాని, ప్రతిస్పందించడం కాని చేయవద్దని మనవి.

  రిప్లయితొలగించండి
 33. శంకరయ్య గారు,

  బ్లాగ్ లో settings comments who can comment అన్న చోట మీరు అజ్ఞాతలని తప్పించవచ్చు. మీ బ్లాగులో అజ్ఞాతలు కామెంట కూడదనుకుంటే . మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. కాకుంటే ఈ చిన్ని మార్పు చేసి చూడండి. వాళ్ళేదో రాస్తారన డం కన్నా దానికి మనం మొదట ఎందుకు ఆస్కారం ఇవ్వవలె?

  చీర్స్
  జిలేబి.

  రిప్లయితొలగించండి
 34. మాడరేషన్ , వెరిఫికేషన్ వద్దను కుంటే వాటిని సెలెక్ట్ చెయ్యకుండా who can comment లో selectively you can limit.

  ప్రయత్నించి చూడండి.

  రిప్లయితొలగించండి
 35. కామః క్రోధాది యరులు
  ధీమంతుని మదిని గూడి దీనుని జేయున్
  నీమమ్మిది యెట్లన్నన్
  చీమల పదఘట్టన విని సింహము బెదరెన్

  రిప్లయితొలగించండి
 36. కోమలి మమతా దీదియె
  రాముని శబ్దమ్మును విని రచ్చను జేసెన్
  భామా! యిది యెట్లన్నన్:
  "చీమల పదఘట్టన విని సింహము బెదరెన్"

  రిప్లయితొలగించండి