14, నవంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 526 (వాని యనినంతనే)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
         వాని యనినంతనే మోక్ష పదమొసంగు.
(ఇక్కడ ‘వాని’ శబ్దం ద్రుతాంతం కాదు)
ఈ సమస్యను పంపిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

14 కామెంట్‌లు:

 1. ఈ సమస్య శ్రీ శంకరాచార్యులవారి సౌందర్యలహరిలోని ఒక శ్లోకము ఆధారముగా చెప్పబడినది. ఆ శ్లోకము:
  భవాని! త్వం దాసే మయి వితరదృష్టిం సకరుణా
  మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితియః
  తదైవ స్త్వం తస్యై దిశసి నిజ సాయుజ్య పదవీం
  ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం

  భవానీదేవి వాత్సల్యము ఇందు వర్ణింపబడినది. అమ్మా! భవానీ! నాయందు కరుణతో వితరణ దృష్టితో ఈ వరమునీయుమమ్మా! అని అడుగుదా మనుకొనుచూ భవానిత్వం అని మొదలిడుటతోనే, భవాని త్వం అంటే నేను నీవే అగుచున్నాను అనే అర్థము కాబట్టి ఆ భక్తుడు అమ్మ సాయుజ్యముక్తిని పొందుచున్నాడు. చూచేరా ఇందులోని వాగ్వైచిత్రి. శుభం భూయాత్.

  రిప్లయితొలగించండి
 2. భక్తిభావము నిలుపుచు బార్వతి గని
  గారవమ్మున గొలుచుచు గౌరి దనరి
  ఆదరమ్మున నుతియించి యద్రి సుత భ
  వాని యని నంతనే మోక్షపద మొసంగు

  రిప్లయితొలగించండి
 3. దారపుత్రాదిబంధముల్ దూరమిడిచి
  నిశ్చలంబైన మనసున నీ గురించి
  జపతపంబుల జేయుచు "శరణమో భ
  వాని" యనినంతనే మోక్ష పదమొసంగు
  భగవతీ! దేవి! పార్వతీ! వందనములు.

  రిప్లయితొలగించండి
 4. శబ్ద వైచిత్రి శంకరాచార్య కృతము
  గనుడు సౌందర్యలహరిలో జనని! త్వం భ
  వాని యనినంతనే మోక్షపదమొసంగు
  నట్టి భక్తునికిన్ జగదంబ లలిత

  రిప్లయితొలగించండి
 5. చదువు సంధ్యలు సమయపూజాదివిధులు
  శూన్యమగుగాక నా తల్లి శోకమోహ
  భూత బాధలు తొలగించి బ్రోవుమో భ
  వాని యనినంతనే మోక్ష పదమొసంగు.

  రిప్లయితొలగించండి
 6. అయ్యా! సంపత్కుమార శాస్త్రి గారూ!
  దారపుత్రాది బంధముల్ దూరమిడిచి - అనుటలో విడిచికి బదులుగా ఇడిచి అని ప్రయోగించినారేమో. అలాగే దారా శబ్దమును దార అని వాడేరు. విడిగా వాడునపుడు దార అని తత్సమమును ఉపయోగించవచ్చును. కాని దారాపుత్రాది బంధములు అని సమాసము చేయవలె గదా. నా సూచన: "వదలి దారాసుతాదులౌ బంధములను" అని సరిజేస్తే బాగుంటుందని.

  రిప్లయితొలగించండి
 7. హృదయ కమలము వికసించు నింపు దలపు
  మదియు భాసించు దనచెంత మధుర భక్తి
  మేను పులకింప దన నామ గానమున భ
  వాని యనినంతనే మోక్ష పదమొసంగు

  రిప్లయితొలగించండి
 8. మిత్రులారా!
  శ్రీ శంకరయ్య గారు విచారముగా ఉంటే మన అందరి మనసులు కూడా కాస్త మూగ బోవడము సహజము. ఆ తీరుగానే ఉన్నది నేడు మిత్రులు కొద్ది మంది మాత్రమే పాల్గొనుట. పాల్గొనిన 3గురు మిత్రులు చక్కగా పూరించేరు - బ్లాగుని అలరింపజేసేరు.
  1. తమ్ముడు నరసింహ మూర్తి 2 విధాల పూరణలలో భక్తి భావమును హృదయ వికాసమును ఆవిష్కరించెను.
  2. సంపత్కుమార్ శాస్త్రి గారి పూరణలో జప తపాలని శరణాగతిని ప్రదర్శించేరు.
  3. శ్యామలీయము గారి తరహా ప్రత్యేకమే - శోక మోహాది బంధ నివృత్తి కోరుతూ చేసేరు.
  మంచి భావాలతో ధారాశుద్ధితో చాలా బాగున్నాయి.
  అందరికీ అభినందనలు. శుభం భూయాత్.

  రిప్లయితొలగించండి
 9. జనని లోకాల పాలించు సాంబు రాణి
  వినుమ నామొరలు మన్నించి విశ్వమందు
  జన్మ మీయక దరి జేర్చు శరణమో భ
  వాని యనినంతనే మోక్ష పదమొసంగు

  రిప్లయితొలగించండి
 10. శ్రీ పండిత నేమాని అన్నయ్యగారికి నమస్సులు,ధన్యవాదములు. హనుమఛ్ఛాస్త్రి గారూ ,మీ పూరణ మధురముగా ఉంది.

  రిప్లయితొలగించండి