17, ఫిబ్రవరి 2016, బుధవారం

పద్యరచన - 1171

కవిమిత్రులారా,
“తల్లీ! నిన్నుఁ దలంచి పుస్తకముఁ జేతం బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
ఫుల్లాబ్జాక్షి! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!”
పై పద్యభావాన్ని మరొక ఛందస్సులో వ్రాయండి.

54 కామెంట్‌లు:

 1. పలుకుల సత్యము నిత్యము
  పిలుపుల సొబగుగ జిలేబి వితరణ గానన్
  తలపున చదువుల తల్లిని
  కొలుతును పొత్తము కరమగు కోమలి గానన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ పద్యం నిర్దోషమే కాని భావం తృప్తికరంగా లేదు. 'వితరణ' శబ్దం ఎందుకు? 'పొత్తము ధరించు కోమలి కనుకన్' అనండి.

   తొలగించండి
 2. పలుకులు సత్యము నిత్యము
  పిలుపులు నీదగు మధురపు భిక్షయు గానన్
  తొలుతన చదువుల తల్లిని
  కొలుతును పొత్తము కరమున కోమలి గానన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   సవరించిన మీ పద్యం బాగున్నది. చివరి పాదంలో పైన నేను సూచించినట్లు సవరించండి.

   తొలగించండి
 3. 1.
  చిత్తము లోనిన్ను నిలిపి
  పొత్తము చేబూనినాను భూరిగ జదువున్
  యుత్తమ వాక్కుల నిచ్చుచు
  నిత్తెము నను గావుమమ్మ నీరజ నేత్రా!

  2.
  విధిమానసరాణి దలచి
  పదిలముగా పుస్తకమ్ము పట్టితి జేతన్
  మదిలో నిండుగ నిలువుము
  పదుగురు మెచ్చెడు విధమగు వాక్కుల నిమ్మా!

  3.
  నిన్ను జేరితి గోరి గొల్చితి నీదు పాదము భారతీ
  కన్న తల్లిగ దీనలోకుల గాంచుతల్లివి నీవనీ
  నిన్నుదల్చుచు పుస్తకమ్మును నేను చేతన బట్టితిన్
  వన్నెలొల్కెడు వాక్కునివ్వవె వాసరాపుర వాసినీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారూ,
   మీ మూడు పద్యాలు బాగున్నవి.
   మొదటి పద్యంలో 'చదువున్ + ఉత్తమ' అన్నప్పుడు యడాగమం రాదు. మూడవ పద్యంలో 'నీవనీ' అనడం వ్యావహారికం. 'నీవెలే' అనండి. 'చేతను బట్టితిన్' అనండి.

   తొలగించండి
  2. విరించి గారు చక్కటి పద్యాలనందించారు. అభినందనలు.

   తొలగించండి
  3. గురువు గారికి పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదములండీ

   గురువు గారూ సవరించిన పద్యాలు


   1.
   చిత్తము లోనిన్ను నిలిపి
   పొత్తము చేబూనినాను భూరిగ జదువు
   న్నుత్తమ వాక్కుల నిచ్చుచు
   నిత్తెము నను గావుమమ్మ నీరజ నేత్రా!

   2.
   విధిమానసరాణి దలచి
   పదిలముగా పుస్తకమ్ము పట్టితి జేతన్
   మదిలో నిండుగ నిలువుము
   పదుగురు మెచ్చెడు విధమగు వాక్కుల నిమ్మా!

   3.
   నిన్ను జేరితి గోరి గొల్చితి నీదు పాదము భారతీ
   కన్న తల్లిగ దీనలోకుల గాంచుతల్లివి నీవెలే
   నిన్నుదల్చుచు పుస్తకమ్మును నేను చేతను బట్టితిన్
   వన్నెలొల్కెడు వాక్కునివ్వవె వాసరాపుర వాసినీ

   తొలగించండి
 4. కొలిచెద తల్లీ నిన్నే
  నిలచెద వనినమ్మి యుంటి నెమ్మిని మదిలో
  బలికించ సూనృత ములనే
  పులకించి చదువు గొనుటకు పొత్తము బట్టెన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రాజేశ్వరి అక్కయ్యా,
   పద్యం బాగున్నది. మూడవ పాదంలో గణదోషం. 'సూనృతములే' అనండి.

   తొలగించండి
 5. మత్త కోకిల:
  తల్లి! నిన్నుఁ దలంచి పొత్తము దాల్చనెంచితి నీవు నా
  యుల్లమందున పల్లవించుచు నుక్తి శబ్దపు పెంపు శో
  భిల్ల బల్కుము నాదు వాక్కున ప్రీతి జూపుచు భారతీ!
  పుల్ల నీరజ నేత్రి!మాటల బోటి!బాసర వాసినీ!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ పద్యం మనోహరంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 6. పొత్తము బట్టితి చేతను
  చిత్తము భగవతి చదువుల చిత్రిక గానన్
  సత్తును గూడిన పలుకుల
  మెత్తగ మీగడ వలెగన మేధను నిమ్మా

  రిప్లయితొలగించండి
 7. కందము:
  తల్లీ! తలచితి నిను, నా
  యుల్లంబందున నిలుచుచు నుక్తి రసము శో
  భిల్లం బల్కుము వాక్కున
  ఫుల్లాబ్జాక్షీ!భగవతి! పూర్ణేందు ముఖీ!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిగురు సత్యనారాయణ గారూ,
   మీ రెండవ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

   తొలగించండి
 8. ఫుల్లాబ్జాక్షి! సరస్వతి !
  నుల్లాసము గనె జిలేబి నూతన వేళన్
  అల్లారు ముద్దుగ పలుకు
  లెల్లా చట్టున విరియన లెస్సగ నిమ్మా !

  జిలేబి

  రిప్లయితొలగించండి

 9. పూర్ణేందుబింబ ఆనన
  పూర్ణము సంపూర్ణముయన పూర్తిగ తెలిసెన్
  చూర్ణము నిమ్మా భగవతి !
  మార్నింగు పనులకు వెడలి మాపున వత్తున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జిలేబీ గారూ,
   మీ ప్రయత్నం ప్రశంసనీయం.
   ‘ఫుల్లాబ్జాక్షి...’ పద్యంలో రెండవపాదంలో ఉల్లాసమును ‘నుల్లాసము’ అన్నారు. ‘ఎల్లా’ అనరాదు. ‘ఎల్లన్’ అనండి. చివరిపాదం అర్థం కాలేదు.
   ‘పూర్ణేందు...’ పద్యంలో ‘బింబ ఆనన’ అని విసంధిగా వ్రాశారు. అక్కడ ‘పూర్ణేందు బింబ వదనా’ అనండి. అలాగే ‘సంపూర్ణము లన’ అనండి. ఏ ‘చూర్ణము’ను మీరు కోరింది? చివరి పాదాన్ని ‘కర్ణరసాయనము గాగ గానము సేతున్’ అందామా? ‘మార్నింగ్’ అనడం బాగాలేదు, అందుకని...

   తొలగించండి
 10. తల్లీ పొత్తము బట్టితి
  నుల్లంబున నిన్ను దలచి యుక్తులనే శో
  భిల్లగ బల్కగ జేయుము
  ఫుల్లాబ్జాక్షీ ! భగవతి ! పూర్ణేందు ముఖీ !

  రిప్లయితొలగించండి
 11. తల్లీ పొత్తము బట్టితి
  నుల్లంబున నిన్ను దలచి యుక్తులనే శో
  భిల్లగ బలుకిడ వాణీ !
  ఫుల్లాబ్జాక్షీ ! భగవతి ! పూర్ణేందు ముఖీ !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
   మీ పద్యం చాలా బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 12. రిప్లయిలు
  1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. శార్దూలవిక్రీడితము లోని మొదటి గురువును రెండు లఘువులు జేసిన (యతిప్రాసలకు భంగము కాకుండ) మత్తేభమగును. దీనియాధారముగా వ్రాసిన ఛందేతర పద్యము.

   ధరణిన్ నిన్నుఁ దలంచి పుస్తకముఁ జేతం బూనితిన్ నీవు నా
   యురమం దింపుగ నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దమ్ము లే
   విరియం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!
   పురుదైవంబ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!

   తొలగించండి
  2. తల్లీ పొత్తము పట్టితి
   యుల్లము నన్నిలిచి సురుచి రోక్తులు సంశో
   భిల్లగ పల్కుము ప్రీతిం
   జల్లగ నను జూడుమమ్మ చదువుల తల్లీ

   తొలగించండి
  3. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పద్యాలు అద్భుతంగా ఉన్నాయి. అభినందనలు.
   ‘పట్టితి| నుల్లమున న్నిలిచి...’ అనండి.

   తొలగించండి
  4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. పొరపాటు గమనించలేదు.

   తొలగించండి
  5. తల్లీ పొత్తము పట్టితి
   నుల్లము నన్నిలిచి సురుచి రోక్తులు సంశో
   భిల్లగఁ బల్కుము ప్రీతిం
   జల్లగ నను జూడుమమ్మ చదువుల తల్లీ

   తొలగించండి
 13. నిన్ను మనమున భావించి సన్నయమున
  జేతబట్టితిబొత్తము,చిరునగవున
  నన్నుదీవించియొసగుము,నచ్చువిధము
  మంచివాక్కును,శబ్దముల్మందిపొగడ
  సకల సద్గుణనికురంబ! శారదాంబ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు సుబ్బారావు గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘శబ్దముల్ మహితగతిని’ అనండి.

   తొలగించండి
 14. కార్తీక పూర్ణిమా కమనీయ చంద్రికా
  స్పదమైన చిరునవ్వు పరిఢవిల్ల
  విజ్ఞాన విభవంబు వెలుగొందు పద్మాక్షు
  లతిలోక సౌందర్య మతిశయిల్ల
  బ్రహ్మదేవుని సృష్టి భారంబు తగ్గించు
  కడగంటి చూడ్కుల గ్రాలుగంటి
  సత్యలోకాధీశు సహధర్మచారిణి
  విద్యాధిదేవియై వెలుగుచుండ

  పద్మపీఠుని ఇల్లాలు పద్మనేత్రి
  వివిధ విజ్ఞాన వీధుల వెలుగు తల్లి
  భారతీదేవి, భక్త సౌభాగ్య జనని
  మధుర వాక్కుల నానోట మసలవమ్మ.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పియెస్సార్ మూర్తి గారూ,
   మీ సీసపద్యం బాగున్నది.
   ‘పద్మాక్షులు’...? ‘కడగంటి చూడ్కుల గ్రాలు సుదతి’ అనండి.

   తొలగించండి
 15. తల్లి!మది నిన్ను దలచి పుస్తకము నేను
  చేత బూనితి నా సూక్తి జృంభణముగ
  పల్క జేయుము శబ్దముల్ స్పష్టముగను
  సరస సాహితీ వాక్కుల శారదాంబ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
   మీ పద్యం బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 16. * గు రు మూ ర్తి ఆ చా రి *
  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


  జననీ ! నిన్ను దల౦చి, పూనితిని >హస్త౦బ౦దునన్ బుస్తక౦
  బును|నా చేతము న౦దు నీ విక. సత౦బున్ నిల్చి,స ద్వాక్కులన్
  ఘనమౌ రీతిని పల్క జేయుము |జగన్మాతా!దయారూపిణీ!
  వనజాతోద్భవు రాణి! వాణి! సుషమద్వాణీ!విప౦చీ ధరీ!

  { సుషమత్ = కోమలమగు, మనోఙ్ఞమైన ;
  విప౦చి = వీణ. }

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గురుమూర్తి ఆచారి గారూ,
   మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.

   తొలగించండి
 17. తలచితి నమ్మఁ బుస్తకముఁ దాల్చియు చేత, మనమ్మునన్ సదా
  నిలచియు భవ్యవాక్యముల నేర్వగ నుక్తులు, శబ్దరాజి శో
  భిలఁ బలుకార కంఠమున ప్రీతిగ నో జగదేకమోహినీ!
  జలరుహలోచనీ! విమల శారద! పూర్ణిమ చంద్ర చుబ్రమా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘చుబ్రము’ అన్నది మూతి అనే అర్థంలో కేవలం బి.ఎన్.రెడ్డి గారి పర్యాయపద నిఘంటువులో ఉంది.

   తొలగించండి
 18. పట్టితి పుస్తకమ్ము కడు భక్తి భజించుచు నిన్ను శారదా
  పట్టుగ నీవు నా మదిని వాసము గా యొనరించి నిల్వుమా
  పెట్టము వాక్కు శీర్షమున విద్దెల తల్లి విధాత ప్రే యసీ
  బెట్టుగ పల్కు మమ్మ ఘన వేదము లన్నియు నాదు వక్త్రమున్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పద్యం బాగున్నది.
   ‘వాసముగా నొనరించి’ అనండి.

   తొలగించండి

 19. 1.మదిలోనిన్నే దలచుచు
  నుదయాస్తములందు నుడివెద నోరారంగా
  పదిలముగా సతతము నా
  మదిలో నుండినుడిపించు మంచి పలుకులన్.
  2శారదమ్మ నిన్ను శాయశక్తుల గొల్తు
  మంచివాక్కు లొసగు మమ్మ మాకు
  పదుగురెదుట నిలిచి ప్రతిభఁకనపరచు
  శక్తి నొసగవమ్మ చదువులమ్మ.
  3.చదువు సంధ్యలొసగు చల్లని మాయమ్మ
  భక్తి శ్రద్ధలొసగు వాణి మాత
  పుస్తకమ్ము నెపుడు బుద్ధితో చదువంగ
  మనసు నొసగు మమ్మ మరువకుండ.
  4విధికి రాణి వీవు విద్యాధనము నివ్వు
  జగము లెల్ల నిన్ను సన్ను తించు
  కమలనేత్రి మమ్ము కాపాడు కరుణతో
  జంద్రవదన నీకు శరణు శరణు.
  5ఆ.వె:చదువు సంధ్యలొసగు శారదాంబకు మ్రొక్కి
  వ్రాయబూనితేను పద్యములను
  దీవనొసగు మమ్మ దేవి భారతిదేవి
  కరము వేడుకొందు కనికరించు.

  6.అ.వె:నలువ రాణి వీవు నగుమోముతో మమ్ము
  కరుణ చూపవమ్మ కలికి వాణి
  మంచి వాక్కు నొసగి మాధవు పైభక్తి
  కలుగ చేయ వమ్మ కమలపాణి.

  7.ఆ.వె:మంచి మాటలెపుడు మాచేత పలికించు
  మంచి విద్య నేర్వ మనసు నివ్వు
  పదుగురెదుట పల్కు పాండిత్య మబ్బగా,
  శక్తి నొసగు మమ్మ శారదమ్మ.

  8ఆ.వె:చేతి యందు వీణ చిలుక ముంజేతిపై
  అంచ నెక్కి తిరుగు నంచ ఆన
  స్ఫటిక మాలదాల్చి సద్భక్తులను బ్రోచు
  శారదాంబ నిన్ను సన్నుతింతు.

  9.ఆ.వె:మాఘ మాసమందు మనుజులెల్లరు చేరి
  కోరి కొలుతురమ్మ కూర్మి తోడ
  ఆర్తి బాపి జనుల కాశిస్సు లందిమ్ము
  సకల లోక వంద్య శారదాంబ.

  10.ఆ.వె:భాసర పురమందు వాసిగా వెలసిన
  శారదమ్మ నీకు శరణు శరణు
  కచ్చపమను వీణ కరమందు దాల్చిన
  వాణి మాత నీకు వందనమ్ము.
  11.ఆ.వె:పాట యైన గాని పద్యాల స్పర్ధైన
  నీదు కరుణ యున్న నెగ్గ గలము
  సభల యందు నైన సంగరమున నైన
  విజయ మొసగు మమ్మ విద్దెలమ్మ
  12.ఆ.వె:హరికి కోడ లీవు హరిణాక్షి వాగ్దేవి
  అత్త గాదె నీకు నాదిలక్ష్మి
  మీయిరువురి దయను మేము కోరెదమమ్మ
  మమ్ము బ్రోవ రండు మాతలార.
  అన్నయ్యగారూ నమస్తే.మొదటి నాలుగు పద్యాలు ఇప్పుడీసమస్యకు వ్రాసినవి.మిగిలిన 8 వసంతపంచమి రోజున వ్రాసినవి.పరిశీలించగలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
   మీ పద్యాలు బాగున్నవి.
   మొదటిపద్యం రెండవపాదంలో గణదోషం. ‘...నుదయాస్తములన్ నుడివెద నోరారంగన్’ అనండి. ‘నుడిపించు’ అన్న పదం లేదు. ‘పలికించు’ అనండి.
   రెండవపద్యంలో ‘శాయశక్తుల’ అనడం దోషమే. ‘సద్భక్తితో గొల్తు’ అనండి.
   ఐదవపద్యంలో ‘దీవన+ఒసగు’ అన్నపుడు సంధి లేదు. ‘దీవన నిడు మమ్మ’ అనండి.
   ఎనిమిదవపద్యంలో ‘తిరుగునట్టి చాన’ అనండి.

   తొలగించండి
 20. వినుమోతల్లి నినున్ దలంతునెపుడున్|విజ్ఞాన పొత్తంబులన్
  గనహస్తంబున నుంచ బూనితిని సంకల్పాన సంప్రీతియౌ
  తన యుల్లంబున పల్కుచున్ పలుకు లత్యానంద సంధానివై
  పొనరున్గూర్చు సరస్వతీ|భగవతీ|పూర్ణేందు బింభాననా|

  రిప్లయితొలగించండి
 21. తల్లి! తలంచితి, కరముఁ దాల్చితి పొత్తము, నీవు
  నుల్లమునందున నిల్చి యుక్తుల నొప్పుగఁ బల్కు!
  ఫుల్ల సుమంపు నయనముఁ బొంగు దయామృతధార
  నుల్లసమందుదునమ్మ! యుద్ధరణమ్మదె తల్లి!

  రిప్లయితొలగించండి
 22. జననీ! పుల్లాబ్జాక్షీ!
  నిను దల్చుచు బట్టుకుంటి నే పొత్తంబున్
  మనమున సద్భావములిడి
  జనులెల్లరు మెచ్చు నటుల జ్ఞానము నిమ్మా!!!

  రిప్లయితొలగించండి
 23. సరదాకి:

  అమ్మా! పట్టితి పుస్తక
  మమ్మా! నాహృదిని నిల్చి మధుర పదమ్ముల్
  కమ్మని రీతిని పల్కుము
  బమ్మని కుముదేశ వదన! వారిజ నయనా!

  రిప్లయితొలగించండి


 24. ఫుల్లాబ్జాక్షి! భగవతీ!
  యుల్లంబందు నినునిల్పి నూతనముగ శో
  భిల్లం బల్కగ వేడెద
  మల్లియ మధురిమ పదముల మరిమరి యిమ్మా


  జిలేబి

  రిప్లయితొలగించండి