ప్రాసమైత్రి
పద్యపాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు. ప్రతిపాదంలో రెండవ
అక్షరం ఒకే హల్లై ఉండడం ప్రాసమైత్రి. యతిమైత్రిలో వలె కాకుండా కేవలం హల్లు యొక్క సామ్యం
ఉంటే చాలు. అచ్చుల సామ్యం అవసరం లేదు. మొదటిపాదంలో
ప్రాసాక్షరానికి ముందు లఘువుంటే మిగిలిన పాదాల్లో లఘువే ఉండాలి. గురువుంటే గురువే ఉండాలి.
ఉదా...
(అ)
సు(ర)మునిగణవినుతపదా!
ము(రాం)తకా! చక్రహస్త! పురవైరిసఖా!
క(రి)రక్షక! కిరిశిక్షక!
సు(రు)చిరపీతాంబరధర! శోకవినాశా!
(పై పద్యంలో ప్రాసస్థానంలో ర,రా,రి,రు అని రకారం ఉంది. ప్రాసాక్షరానికి ముందు అన్నీ లఘువులే)
(ఆ)
ఆ (మం)దిడి యతఁ డరిగిన
భూ(మీ)సురుఁ డరిగెఁ దుహినభూధరశృంగ
శ్యా(మ)ల కోమల కానన
హే(మా)ఢ్య దరీ ఝరీ నిరీక్షాపేక్షన్.
(పై పద్యంలో ప్రాసస్థానంలో మ,మీ,మ,మా అని మకారం ఉంది. ప్రాసాక్షరానికి ముందు అన్నీ గురువులే)
మొదటిపాదంలో ప్రాసస్థానంలో సంయుక్తాక్షరం ఉంటే మిగిలిన పాదాలలోను
సంయుక్తాక్షరమే ఉండాలి.
ఉదా...
ఆ(ర్యు)లు దేవతల్ మునుల కా రమ విందు నొసంగుచుండఁగా
కా(ర్య)నిమగ్నురా లగుచుఁ గాంతుని భారతి పల్కరించ దా
చ(ర్య) సమర్థనీయ మని చప్పునఁ దాఁ బరిహాస మాడుచున్
భా(ర్య)కు భాష రా దనుచు బ్రహ్మయె పల్కె సభాముఖమ్మునన్.
(పై పద్యంలో ప్రాసస్థానంలో ర్యు,ర్య,ర్య,ర్య అని అన్నీ సంయుక్తాక్షరాలే ఉన్నాయి).
మొదటిపాదంలో ప్రాసస్థానంలో ద్విత్వాక్షరం ఉంటే మిగిలిన పాదాలలోను
ద్విత్వాక్షరమే ఉండాలి.
ఉదా...
అ(న్నా)తిఁ గూడ హరుఁడవె
య(న్నా)తిని గూడకున్న నసురగురుడవే!
య(న్నా) తిరుమలరాయా
క(న్నొ)క్కటి కలదు కాని కౌరవపతివే.
(పై పద్యంలో ప్రాసస్థానంలో న్నా,న్నా,న్నా,న్నొ అని అన్నీ ద్విత్వాక్షరాలే ఉన్నాయి).
మొదటిపాదంలో ప్రాసస్థానంలో అనుస్వారంతో కూడిన అక్షరం ఉంటే మిగిలిన
పాదాలలోను అనుస్వారంతో కూడిన అక్షరమే ఉండాలి.
ఉదా...
కాం(చె)న్ వైష్ణవుఁ డర్ధయోజన జటాఘాటోత్థ శాఖోపశా
ఖాం(చ)జ్ఝాట చరన్మరుద్రయ దవీయఃప్రేషితోద్యచ్ఛదో
దం(చ)త్కీటకృత వ్రణ చ్ఛలన లిప్యాపాదితాధ్వన్య ని
స్సం(చా)రాత్త మహాఫలోపమ ఫల స్ఫాయద్వటక్షాజమున్.
(పై పద్యంలో ప్రాసస్థానంలో ంచె,ంచ,ంచ,ంచా అని అన్నీ అనుస్వారంతో కూడిన చకారమే ఉంది).
స్థూలంగా ఇవి తెలుసుకుంటే చాలు. ప్రాసభేదాలు అని కొన్ని ఉన్నాయి.
వాటిని గురించి వివరంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు క్రింది లింకులను నొక్కి చూడండి.
ప్రాసయతి
యతి వేయవలసిన స్థానంలో ప్రాసను వేస్తే అది ప్రాసయతి అనబడుతుంది.
ఉదాహరణకు ఆటవెలది అనే పద్యంలో నాలుగవ గణం మొదటి
అక్షరం యతిస్థానం. అక్కడ యతి వేయకుండ ప్రాసమైత్రిని
పాటిస్తే అది ప్రాసయతి.
ఉదా...
(ర)ఘుకులాబ్ధిసోమ! (రా)వణాంతక! రామ! (యతిమైత్రి)
(ఆంజ)నేయ హృదయ (రంజ)క! హరి! (ప్రాసయతి)
(శి)వుని విల్లు విఱిచి
(సీ)తను పెండ్లాడి (యతిమైత్రి)
(వని)కిఁ దరలినావు (జన)కునాజ్ఞ.
(ప్రాసయతి)
పై పద్యంలో 1వ, 3వ పాదాలలో నాలుగవ గణం మొదటి అక్షరాలకు (ర-రా; శి-సీ లకు) యతిమైత్రి పాటింపబడింది. కాని 2వ, 4వ పాదాలలో నాలుగవ గణం మొదటి అక్షరాలకు (ఆ-ర; వ-జ లకు) యతిమైత్రి లేదు. ఆ పాదాలలో (ఆంజ-రంజ; వని-జన) ప్రాసమైత్రి పాటింపబడింది.
ఉత్పలమాల మొదలైన వృత్తాలలో, కందపద్యంలో ఈ ప్రాసయతి
నియమం లేదు. కేవలం ఆటవెలది, తేటగీతి,
సీసం మొదలైన పద్యాలలోనే ఉంది. ఆ పద్యాలను గురించి చెప్పుకున్నపుడు
వివరంగా తెలుసుకుందాం.
గురువులకు ధన్య వాదములు
రిప్లయితొలగించండిధన్య వాదాలండీ కంది వారు !
రిప్లయితొలగించండిఎంత వరకు రైటో తెలియదు !
ప్రాసను సులభముగ ప్రస్తుతించెను గదా
వేసితి నిటు ప్రాస వేడు కొనగ
ఇది యొకపరి వేసి నదియొక పరి సరి
జూడ నిటుల వచ్చె చుంచు బాల !
జిలేబి