12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

సమస్య – 1942 (పతినిఁ గోరు కాంత...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పతినిఁ గోరు కాంత భ్రష్టురాలు.

36 కామెంట్‌లు:

  1. గురువు గారికి నమస్కారములు....
    ఒకటి వెనుక ఒకటి ....విషాదకర సంఘటనలు సంభవించడం మిక్కిలి విచారకరం....అయినా...మనచేతుల్లొ యేముందని
    యెప్పుడేది జరిగితే అప్పటికా విధంగా స్పందించాల్సిందే తప్ప నిలువరింప లేముగా!

    వీధు లందు దిరుగు వినయమన్నది లేక
    పదుగు రున్న చొట పైట జార్చు
    కాసు కొరకు తరచు కన్నుమీటుచు పర
    పతిని గోరు కాంత భ్రష్టురాలు ........1.

    దానములను జేసి ధర్మమ్ము దప్పక
    వ్రతము జేయు జతగ పతిని గోరు
    కాంత భ్రష్టురాలు కాదురా గుణవతి
    దైవ రూప మామె ధరణి లోన. .........2.

    రిప్లయితొలగించండి
  2. కానలందుఁ దిరుగు కమనీయ రూపునిన్
    వలచి వచ్చితినని పలకరించి
    మేను మరచి కామమెగయగన్ జానకీ
    పతినిఁ గోరు కాంత భ్రష్టురాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారు మీ పూరణ అద్భుతముగా నున్నది. అభినందనలు.

      తొలగించండి
    2. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
    3. గురుదేవులకు మరియు కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

      తొలగించండి
  3. కవిమిత్రులారా, నమస్కృతులు.
    మా నాన్నగారి మరణంతో ప్రారంభం... ఒకరి తరువాత ఒకరుగా ఆత్మీయులు మరణిస్తున్నారు. మా చెల్లాయి అత్తగారు, తరువాత మా మేనబావ మామగారు, మొన్న తమ్ముడు, నిన్న మా బావమరది... ఇలా వరుసగా బంధువులు చనిపోవడం, వారి చావులకు, తదుపరి కార్యక్రమాలకు వాళ్ళ వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిరావడం, దూర భారమైన ఈ ప్రయాణాల వల్ల అలసిపోవడం, అస్వస్థత ... ఈ కారణాల వల్ల బ్లాగుకు ఏమాత్రం సమయాన్ని కేటాయించలేకపోతున్నాను. నిజం చెప్పాలంటే ఆత్మీయుల మరణం కంటే ఇదే నన్ను బాధ పడుతున్నది. సమస్యలను, పద్యరచన శీర్షికలను మాత్రం షెడ్యూల్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు మా తమ్ముడి మూడవ రోజు కార్యక్రమానికి వెళ్తున్నాను. రేపు మా బావమరది కార్యక్రమానికి వెళ్ళాలి. దయచేసి నా అశక్తతను సానుభూతితో దృష్టిలో పెట్టుకొని పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. పోచిరాజు కామేశ్వర రావు గారు, మరి ఒకరిద్దరు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు. మిగిలిన వారు కూడా చురుకుగా పాల్గొని పద్యాలను సమీక్షించండి. నేను ‘బాగుంది’ అనడం సాధారణం, కాని మీరు ప్రశంసిస్తే అది మిత్రులకు ఉత్సాహదాయకంగా, ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ బ్లాగు పద్యరచనకు సంబంధించి ఒక చర్చావేదిక. దీనిని వినియోగించుకొనవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. కాలధర్మాన్ని మనము మార్చలేము. కష్ట సమయములోనే మనసును చిక్కబట్టుగొని యుండాలి. మీరు ధైర్యముగా యుండి మీ బంధువులకు ధైర్యము చెప్పండి.

      తొలగించండి
    2. పోచిరాజు కామేశ్వరరావు గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
    3. నమస్కారములు ఏపరిస్తితులు ఎలాఉన్నా కాస్త మనస్సాంతి ఇక్కడేదొరుకుతుంది .మీరు ధైర్యంగా తట్టుకుని ఆరోగ్యం జాగ్రత్తగా చూకోవాలని కోరుతున్నాము. మాకందరికీ ఇదిఒక నిధి .మనశాంతి మనచేతుల్లోనె ఉంది ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోమని కోరుతూ దీవించి అక్క .

      తొలగించండి
  4. కంది శంకరయ్య గారికి
    మీకు ప్రగాఢ సానుభూతి.

    ఈ సమయం లో మీరు మీ ఆరోగ్యము ను జాగ్రత్త గా చూసుకోవాలి;

    బ్లాగుని గురించి చింత వలదు ;

    ఈ సమయం లో మీ వంటి పెద్దవారి సహానుభూతి మే ఆత్మీయులకి ఎంతైనా అవసరం ; కాబట్టి మీరు మీ సమయాన్ని దానికి తప్పక కేటాయించాలి దాని తో బాటు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి ;

    నమస్సులు
    జిలేబి

    రిప్లయితొలగించండి


  5. వినుజి లేబి నిజము విస్తరాకు కథను
    పరస తినిగ నగను ప్రభువు విభుడు
    పెద్ద పదవి వసతి పధ్ధతి గా "పర
    పతి" ని కోరు కాంత భ్రష్టు రాలు !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారూ,
      ‘పరపతి’తో మీ పూరణ బాగున్నది. కాని భావమే సుగమంగా లేదు. కొంత గజిబిజిగా ఉంది.

      తొలగించండి
  6. గురుదేవులకు ప్రణామములు మీకు నా ప్రగాఢ సానుభూతి తెలియ జేయుచున్నాను.ఈ మీ మనోవ్యధ నాకు తెలియును.మా దగ్గర బంధువుల మరణంతోనేను చాలా కలత జెందాను.మీరు
    ఈ సమయంలో మీ ఆరోగ్యము ను జాగ్రత్త గా చూసుకొండి.

    రిప్లయితొలగించండి
  7. ధనమె మూల మంచు ధరణి నెల్లప్పుడు
    లంచముల జనులను ముంచి యైన
    పుడమి నందునున్న భోగభాగ్యమ్ములఁ
    బతినిఁ గోరు కాంత భ్రష్టురాలు.

    రిప్లయితొలగించండి
  8. సాధ్వియనగబడును సాటివారలయందు
    పతినిగోరుకాంత ,భ్రష్టురాలు
    అదుపునాజ్ఞలేక నాకతాయిగృహిణి
    శీలరహితయింతిచీడ భువికి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పూరణ బాగుంది.
      ‘భ్రష్టురాలు+అదుపు’ అని విసంధిగా వ్రాయరాదు. ‘భ్రష్టురాలె| యదుపు...’ అనండి. ‘లేని యాకతాయి’ అంటే సరి.

      తొలగించండి
  9. నీతినియమముల ను కాతరు చేయక
    తనపతిని గురించి తలచకుండ
    కరముమోహమడర పొరుగింటి మీనాక్షి
    పతినిగోరు కాంత భ్ర ష్టురాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పూరణ బాగున్నది.అభినందనలు.

      తొలగించండి
  10. చెప్ప రాని తిక్క చెడు బుద్ధితోడను
    వలపు పెంచు కొనియు బావ పైన
    నీతి రీతి విడచి నీడ నిమ్మని యక్క
    పతినిఁ గోరు కాంత భ్రష్టురాలు.

    రిప్లయితొలగించండి
  11. శాస్తపత్ని యగుచు సవతి సుతు సారంగ
    ధరుని గోరిన పిన తల్లి వోలె
    కోడి గమ్ములాడ గుప్తముగా నుప
    పతిని గోరు కాంత భ్రష్టురాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘సవతిసుతు సారంగ’ అన్నచోట గణదోషం. ‘సవతికొడుకు శార్ఙ్గ|ధరుని’ అనండి.

      తొలగించండి
  12. పుట్టు మనుజుడు తప్పక గిట్టుభువిని
    చింతనొందకు గురువర! సుంతయైన
    మానసంబునుదిటముగ మలచుకొనుచు
    జీవనంబునుసాగించుశివునిదలచి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు సుబ్బారావు గారూ,
      మీ పద్యం కర్తవ్యబోధకంగా ఉంది. ధన్యవాదాలు.

      తొలగించండి
  13. . శాంతిసహనమందె సంసారమే సాగ?
    భార్య భర్తయనిడి బంధమగును|
    డబ్భు దర్పమందు నుబ్బుచు-తా-పర
    పతిని గోరు కాంత బ్రష్టు రాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కె. ఈశ్వరప్ప గారూ,
      మీ పూరణ బాగున్నది.
      ‘..యనెడి’ టైపాటువల్ల ‘...యనిడి’ అయింది.

      తొలగించండి
  14. వ్రతము లెన్నొ చేసి వరముగా తామంచి
    పతిని కోరు కాంత;భ్రష్టురాలు
    పరపురుషుల మోహ పరవశంబునగాంచి
    జీవితమ్ము పాడు చేసుకొనును.
    స్త్రీకి సహజమైన సిగ్గును విడనాడి
    కాసులకొర కనుచు గస్తి పడుచు
    చేయ రాని పనులు చేయనెంచుచు పర
    పతిని కోరు కాంత భ్రష్టు రాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  15. నీమ నిష్ఠ లెల్ల నీటి పాల్జేయుచు
    భోగములను గోరి భూరిగాను
    వక్రబుద్ధితోడ నక్రమంబగునట్టి
    పతిని గోరు కాంత భష్టురాలు!!!

    పతి =పథము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారూ,
      మీ పూరణ బాగుంది.
      కాని ‘పతి’ శబ్దానికి ‘పథము’ అన్న అర్థం కేవలం పర్యాయపద నిఘంటువులోనే ఉంది. ‘నీమనిష్ట’లనరాదు. ‘నియమనిష్ట’ లనండి.

      తొలగించండి

  16. గురుదేవుల సూచన మేరకు సవరించిన పద్యము
    శాస్త పత్ని యగుచు సవతి సవతికొడుకు శార్ఙ్గ
    ధరుని గోరిన పిన తల్లి వోలె
    కోడి గమ్ములాడ గుప్తముగా నుప
    పతిని గోరు కాంత భ్రష్టురాలు

    రిప్లయితొలగించండి