2, ఆగస్టు 2010, సోమవారం

సమస్యా పూరణం - 54

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...
ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.
వారాంతపు సమస్యా పూరణం - 3
చదువులు వ్యర్థమే కద ప్రశస్త సుఖాస్పద జీవనమ్ముకై.

8 కామెంట్‌లు:

  1. కంది శంకరయ్య! కలఁ గాంచినారలా?
    శుభము లెన్ని కవితఁ జొప్ప వచ్చు.
    అశుభ మేల పలుకు(ట?+అ) టరయంగ నెక్కడ
    ప్రేత కళ వహించెఁ బెండ్లికొడుకు?

    రిప్లయితొలగించండి
  2. వలచిన మగువ మదిఁ దలఁచుచు మరణించె
    నొకఁడు.వనితయుఁ దనను దలఁచి మృతి
    చెందె.ప్రేతములటఁ చెన్నుగ మనువాడ
    ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.

    రిప్లయితొలగించండి
  3. ఇచ్ఛ లేని పెళ్ళి ఎగ్గొట్ట నొక ఇంతి
    పిచ్చి పట్టినట్లు బెట్టు చేసె
    గాలి సోకెనేమొ కాబోలు యనిరంత
    ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారూ, మాయాబజార్ చిత్రాన్ని మళ్ళీ గుర్తు చేసారండీ!

    "చేతకానివాడు చేకొనగ శశిని
    మాయజేసె కృష్ణు మర్మమెరిగి
    పెండ్లివేడుకందు పిచ్చి వేషము జూసి
    ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు"

    రిప్లయితొలగించండి
  5. ప్రేమించినట్టుగ వంచించు ప్రియురాలు
    పెండ్లి యాడి భార్య పారి పోవు
    ప్రేమ పెండ్లి కాదు పెండ్లికి ప్రేమలేదు
    ప్రేత కళ వహించె పెండ్లి కొడుకు

    రిప్లయితొలగించండి
  6. చింతా రామకృష్ణరావు గారూ,
    "ఎక్కడి కుంజర యూధంబు దోమ కుత్తుకఁ జొచ్చెన్" పద్ధతిలో మీ పూరణ బాగుంది. ధన్యవాదాలు.

    రవి గారూ,
    ప్రేతాన్నే పెండ్లికొడుకును చేశారు. బాగుంది. అభినందనలు.

    నచికేత్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    సుమిత్ర గారూ,
    మంచి సందర్భాన్ని ఎన్నుకున్నారు. నిజమే! ఆ సమయంలో లక్ష్మణకుమారునిలో కనిపించింది ప్రేతకళే. బాగుంది. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ పద్యం నా సవరణలతో .....
    వలచినటు నటించి వంచించు ప్రియురాలు
    పెండ్లియాడి భార్య పెడముఖ మిడు
    ప్రేమ పెండ్లి కాదు పెండ్లికి ప్రేమేది
    ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.

    రిప్లయితొలగించండి
  7. నా పూరణలు
    (1)
    పెద్దవారు సెప్ప పెండ్లిచూపులు లేక
    సిద్ధపడెను పెండ్లి చేసికొనఁగ
    పెండ్లినాఁడు వధువు వికృతరూపముఁ జూచి
    ప్రేతకళ వహించెఁ బెండ్లికొడుకు.
    (2)
    పెండ్లి రేపనంగ పెండ్లికొడుకు తాత
    ప్రేతకళ వహించెఁ; పెండ్లికొడుకు
    తాత చావు వాయిదా పడవలె నంచు
    మూడు కోట్ల దైవములకు మ్రొక్కె.

    రిప్లయితొలగించండి