5, ఆగస్టు 2011, శుక్రవారం

సమస్యా పూరణం -416 (కప్పులోనఁ బుట్టె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కప్పులోనఁ బుట్టెగద తుఫాను.

28 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    శ్రీకృష్ణుడు రుక్మిణీదేవికి పారిజాత పుష్పాన్ని ఇచ్చినవిషయం
    తెలిసినపుడు, సత్యభామ స్పందన :

    అనవిని వ్రేటువడ్డ యుర - గాంగనయుంబలె నేయి వోయ భ
    గ్గన దరికొన్న భీషణ హు - తాశన కీల యనంగ లేచి హె
    చ్చిన కనుదోయి కెంపు తన - చెక్కుల కుంకుమ పత్రభంగ సం
    జనిత నవీన కాంతి వెద - జల్లగ గద్గద ఖిన్న కంఠియై!
    (పారిజాతాపహరణం )
    అదీ సందర్భం :

    01)
    _____________________________________

    నారదుం డొసగిన - నవ పారిజాతమ్ము
    తమ్మికంటి కిడిన - తరుణ మకట !
    ముప్పు వచ్చె నాడు - మురళీ ధరునికి !
    కప్పులోనఁ బుట్టె - గద తుఫాను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  2. శ్రావణంబు ప్రీతి శంభున కని పతి
    కాదు లక్ష్మి కనుచు వాదము సతి
    రగడ పెద్ద దాయె జగడమ్ము తెగ దాయె
    కప్పులోనఁ బుట్టెగద తుఫాను.

    రిప్లయితొలగించండి
  3. వసంత మహోదయా ! మంచి సందర్భం, మించిన పూరణ!

    రిప్లయితొలగించండి
  4. కిశోర మహోదయా మూడవ పాదాన్ని ఒకసారి సరిజేయండి.

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !
    మీ భార్యా భర్తల సంవాదం భేషుగ్గా యున్నది !

    01అ)
    _____________________________________

    నారదుం డొసగిన - నవ పారిజాతమ్ము
    తమ్మికంటి కిడిన - తరుణ మకట !
    ముప్పు దెచ్చె నాడు - మురళీ ధరునకును !
    కప్పులోనఁ బుట్టె - గద తుఫాను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  6. ఆరు వేల యప్పు, ఆరేండ్లు గడిచెను
    తీర్చ మనుచు నడుగ తీక్షణముగ
    తమ్ము డన్న మధ్య తగవు పుట్టెను వారి
    కప్పులోనఁ బుట్టె గద తుఫాను.

    రిప్లయితొలగించండి
  7. అల్ప పీడనమ్ము అధికమై చెలరేగె
    వాయు గుండ మాయె వార్ధి లోన
    అవని ఇల్లు గాగ నాకసమే కప్పు
    కప్పులోనఁ బుట్టె గద తుఫాను.

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రీజీ ! భేష్ !
    కాఫీ కప్పును ఇంటికప్పు చేసేసేరే !!!

    రిప్లయితొలగించండి
  9. కిషోర్ జీ ! ధన్యవాదములు.
    వారి కప్పు , వారికి + అప్పు ; రెండు అర్థములు తీసుకోవచ్చు.
    మంచి పూరణ లిచ్చిన మీకు మిస్సన్న గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. 02)
    _____________________________________

    ఉప్పు తక్కు వయ్యె - నెక్కువయ్యె ననుచు
    నిప్పు ద్రొక్కు పతిని - నీరజాక్షి
    చెప్పలేని వ్యథను - చీదరించుకొనును !
    కప్పులోనఁ బుట్టె - గద తుఫాను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  11. 03)
    _____________________________________

    నాన్న దెచ్చిన నగ - నాకు నా కనుచును
    అక్క , చెల్లి తుదకు - అమ్మ నడుగ !
    పిన్న దాని కిచ్చె ! - పెద్ద దలిగెను !మే
    కప్పులోనఁ బుట్టె - గద తుఫాను !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  12. మిత్రులందరి పూరణలూ బహు చక్కగా ఉన్నాయి.

    ఇంటిలోని వారు వీథినిఁ బడిరయ్య!
    పెంకు లూడిపోయి పెచ్చు లేచె,
    కప్పు లోన; బుట్టె గద తుఫానిచ్చట
    నింగి పొంగులెత్తె, నేల పిలువఁ!

    రిప్లయితొలగించండి
  13. పదవు లొదులు కోరు బాధల బడగ లే
    రుద్య మించి నడువ రూరు కోరు
    బ్రతుకు చావు మధ్య బడిరి - టీ(T)కాంగ్రెసు
    కప్పు లోన బుట్టె గద తుఫాను

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  14. పిచ్చుకమ్మ గూడు బెట్టెను మాయింటి
    యందు; చిన్ని ప్రాణి యదిగొ పైన
    కప్పులోన బుట్టె గద; తుఫానొచ్చునొ,
    అల్ప పీడనమ్ము యనగఁ వింటి.

    చిన్నపిచ్చుకంటే ప్రేమ, తుఫాను అంటున్నారు , ఎలా రక్షించుకోవాలని ఆరాటం.

    రిప్లయితొలగించండి
  15. చక్కనమ్మ మఱచి చక్కెర కాఫీని
    భర్త కిచ్చె నతడు భగ్గు మనెను
    సుగరు పెరుగ నాకు చోద్యము నీకని
    కప్పు లోన బుట్టె గద తుఫాను

    రిప్లయితొలగించండి
  16. అప్పు దొరికె నంచు నమిత సంబరమున
    కారు నొకటి కొనె షికారు చేయ
    చమురు, వడ్డి రేట్ల చమురంటగా చేతి-
    కప్పు లోన బుట్టె గద తుఫాను

    రిప్లయితొలగించండి
  17. ' దేశవాళి పెంకు దివ్యము ' పతి యనె,
    ' శ్లాబు యింటి కిచ్చు డాబు ' సతియు !
    కీచు లాట జరిగె ! చూచిన యింటి పై-
    కప్పు లోన బుట్టె గద తుఫాను !

    రిప్లయితొలగించండి
  18. మొగపు ఛాయ హెచ్చు , మొటిమలు మాయమౌ,
    కురులు పెరుగు ననిన కొనెను క్రీము
    కలువ వంటి మోము కారు మబ్బాయె,మే
    కప్పు లోన బుట్టె గద తుఫాను!!!

    రిప్లయితొలగించండి
  19. వసంత కిశోర్ గారూ,
    ముచ్చటైన మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి అలరించాయి. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ నాలుగు పూరణలూ నవ్యభావాలతో నాణ్యంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ మధురంగా ఉన్నాయి. అభినందనలు.
    ‘తుఫాను + వచ్చునో’ ... తుఫానొచ్చునో ... ?
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    అత్యుత్తమమైన పూరణ మీది. అభినందనలు.
    ‘పదవులు + వదలుకోరు’ ... పదవులొదులుకోరు ... ? ‘ఒదలు’ శబ్దానికి వర్ధిల్లు అని అర్థం.
    ‘పదవులు విడలేరు’ అందాం!
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ, ధన్యవాదములు.
    ఒత్వం రాకూడదంటున్నారా? అయితే తుఫానున్నదొ అనవచ్చా!

    రిప్లయితొలగించండి
  22. ఒక జలచరం:

    వలదు బుజ్జికన్న, వలదుబంగారమా,
    వాయుగుండమిపుడె వాపు నొందె,
    పట్టి! రెండు నాళ్లు పైపైకిఁబోకుమా
    కప్పు లోన బుట్టె గద తుఫాను!

    రిప్లయితొలగించండి
  23. శ్రీపతిశాస్త్రిశనివారం, ఆగస్టు 06, 2011 7:03:00 PM

    శ్రీగుభ్యోనమ:

    పంటలన్ని కోసి పందిళ్ళలోచేర్చి
    ఎండబోసినాను బండపైన
    తడసిపోవునేమొ ధాన్యరాసుల పైన
    కప్పు లోన బుట్టెగద తుఫాను

    లోన = లోగడ

    రిప్లయితొలగించండి
  24. మిత్రుల పూరణలు చాలా పసందుగా ఉన్నాయి. మరి మా మెక్-డోనాల్డ్ కాఫీ !

    మెలత దెచ్చి యిడగ మెచ్చితి కాఫీని
    మెక్కుడోన లందు దిక్క దీఱె
    పక్క నున్న భార్య యొక్క పోటొసగను
    కప్పు లోన పుట్టె గద తుఫాను !

    రిప్లయితొలగించండి