22, ఆగస్టు 2011, సోమవారం

సమస్యా పూరణం -434 (కృష్ణ జన్మాష్టమికి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద!

24 కామెంట్‌లు:

  1. నేటి యువకులు చాటింగు నిట్లు జేయు
    ముద్దు పేర్లవి క్రిస్, క్రిస్సు , ఇద్దరకును
    క్రీస్తు పుట్టిన రోజది క్రిస్మ సయిన
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద!

    రిప్లయితొలగించండి
  2. కొట్టుదురు గాదె పల్లెల నుట్టి, యెపుడు ?
    ఇరువదైదు డిశెంబరు నేమి వచ్చు ?
    ఆయుధంబెద్ది భీముడు, హనుమలకును ?
    కృష్ణ జన్మాష్టమికి - వచ్చు క్రిస్మసు - గద.

    రిప్లయితొలగించండి
  3. అందరకు శ్రీ కృష్ణాష్టమి - కృష్ణ జన్మదిన శుభాకాంక్షలు.

    కొట్టుదురు గాదె పల్లెల నుట్టి నెపుడు ?
    అని సవరణ.

    రిప్లయితొలగించండి
  4. క్రి.తము యుగమున పుట్టిన కృష్ణు నెన్ని,
    స్మ.రణ చేసిన చాలును. మరపు రాని
    సు.గతి ప్రాప్తించు. క్రి.స్మ.సు ప్రగణితమగు.
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రి.స్మ.సు. గద!

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి ధన్యవాదములు, నమస్కారములతో
    తే: దేవకీదేవి గర్భాన దేవదేవు
    డైన కృష్ణుడు జన్మించె, అష్టకష్ట
    ములను దీర్చగ ,ఆనంద ముగను జేయు
    కృష్ణ జన్మాష్టమిని నేడు తృష్ణతోడ |
    కనుల విందుగాను దవళ కాంతి కొఱకు
    దీపములుబెట్టి, జైకొట్టుదురులె యువత,
    ఇట్టి వేడుక గాంచిన చిట్టి వార్కి
    కృష్ణ జన్మాష్టమి కి వచ్చు క్రిస్మసు గద|

    రిప్లయితొలగించండి
  6. భరత దేశపు బిడ్డలు భాయి భాయి
    జాతి బేధాల నెల్లను జార విడిచి
    హిందు ముస్లిము క్రైస్తవ పొందు గుండ
    కృష్ణ జన్మాష్ట మికివచ్చు క్రిస్మ సుగద

    రిప్లయితొలగించండి
  7. ధర్మ రక్షణ చేయగా ధరణిలోన
    జనన మొందిరి పూజ్యులు జగతిమెచ్చ
    క్రీస్తు,కృష్ణుడు నొక్కరే క్రియలలోన
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద!

    రిప్లయితొలగించండి
  8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వాస్తవం. నాకు తెలిసిన ఒక కుటుంబంలో వాళ్ల అబ్బాయి (కృష్ణ సాయి)ని ‘క్రిస్’ అని పిలవడం విన్నాను. మంచి పూరణ.
    ఇక ప్రశ్నోత్తరరూపంలో ఉన్న మీ రెండవ పూరణ కూడా బాగుంది.
    అభినందనలు.
    *
    చింతా రామకృష్ణా రావు గారూ,
    ఓహ్! అద్భుతం. ధన్యవాదాలు!
    మీ పూరణలోని చమత్కారాన్ని వెంటనే గుర్తించలేక పోయాను. కాని అలా చుక్కలు కాకుండా ఇన్వర్టెడ్ కామాలలో పెడితా సులభగ్రాహ్య మయ్యేది. ఆ పని నిప్పుడు (మీరు అన్యధా భావించరనే నమ్మకంతో) నేను చేస్తున్నాను...
    ‘క్రి’తము యుగమున పుట్టిన కృష్ణు నెన్ని,
    ‘స్మ’రణ చేసిన చాలును. మరపు రాని
    ‘సు’గతి ప్రాప్తించు. ‘క్రి’‘స్మ’‘సు’ ప్రగణితమగు.
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు ‘క్రిస్మసు’ గద!
    *
    వరప్రసాద్ గారూ,
    పద్యం బాగుంది. కాని భావం కొంచెం సందిగ్ధంగా ఉంది. కొద్దిపాటి వివరణ ఇస్తే బాగుండేది.
    ఆరవపాదంలో యతి తప్పింది. ‘జైకొట్ట నోపు’ అంటే ఎలా ఉంటుంది?
    *
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘క్రైస్తవ పొందు గుండ’ దగ్గరే చిన్నలోపం. క్రైస్తవపదం విభక్తిప్రత్యయం లేకుండా ఉంది. ‘పొందుగ నుండ’ అనవలసి ఉంటుంది. ‘క్రైస్తవు లంద రలర’ అందామా?
    *
    మంద పీతాంబర్ గారూ,
    ‘ఏకం సత్!’ సూక్తిని మీ పూరణలో ప్రతిబింబించరు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. స్రేఏ గురుభ్యో నమః
    మిత్రులు చంద్రశేఖరులు తెలిపినట్లు నిన్న శనివారము శ్రీ మేడసాని మోహన్ వారి శతావధానము గాంచి వారి విద్వత్తుకు,సమయస్ఫూరణకు ధారణా శక్తికి ముగ్ధులమయ్యాము. శ్రీ అందెవోలు విద్యాసాగర్ గారిని కలిసినందులకు కూడా ఆనందము కలిగింది.పాండితీ ప్రావీణ్య సంపన్నుల వలన తెలుగు భాష ఔనత్యము మన సంప్రదాయ విలువలు ప్రాకట మవుతాయి.
    నా పూరణ;
    మతి భ్రమించిన ముదుసలి మనుజు డొకడు
    కాల దేశ మతము లన గణన పోయి
    యోగి యయ్యె, పలికె నా విరాగి నేడు
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద !

    రిప్లయితొలగించండి
  10. శ్రీ గురుభ్యో నమః
    మిత్రులు చంద్రశేఖరులు తెలిపినట్లు నిన్న శనివారము శ్రీ మేడసాని మోహన్ వారి శతావధానము గాంచి వారి విద్వత్తుకు,సమయస్ఫూరణకు ధారణా శక్తికి ముగ్ధులమయ్యాము. శ్రీ అందెవోలు విద్యాసాగర్ గారిని కలిసినందులకు కూడా ఆనందము కలిగింది.పాండితీ ప్రావీణ్య సంపన్నుల వలన తెలుగు భాష ఔనత్యము మన సంప్రదాయ విలువలు ప్రాకట మవుతాయి.
    నా పూరణ;
    మతి భ్రమించిన ముదుసలి మనుజు డొకడు
    కాల దేశ మతము లన గణన పోయి
    యోగి యయ్యె, పలికె నా విరాగి నేడు
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు క్రిస్మసు గద !

    రిప్లయితొలగించండి
  11. శ్రీ చింతా రామకృష్ణా రావు గారు అసాధారణ ప్రజ్ఞా సంపన్నులు. చక్కని పూరణ చేసారు.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    కృష్ణుడే క్రీస్తు క్రీస్తుయే - కృష్ణు డవని
    కృచ్ఛముల బాపి రక్షింప - క్షితిని వారు
    జనన మందిరి ! వారిని- మనన సేయ
    క్రిస్మసందున గలుగును - కృష్ణ జన్మ !
    కృష్ణ జన్మాష్టమికి వచ్చు - క్రిస్మసు గద !
    __________________________________

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 23, 2011 6:39:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    కవిమిత్రులందరు చక్కని భావములతో పూరణలు చేసినారు. శ్రీ చింతా రామకృష్ణారావుగారు క్రొత్తపుంతలు చూపించారు. అందరకు అభినందనలు

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 23, 2011 6:45:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    వచ్చి కోరగ నప్పుగా నిచ్చినారు
    కృష్ణజన్మాష్టమికి, వచ్చు క్రిస్మసు గద
    నాల్గు నెలలు గడచిన, నాడు మీకు
    తీర్చివేయుద ననుచును దెలుపుచుంటి

    రిప్లయితొలగించండి
  15. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఉన్మాది మాటలుగా చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సమర్థమైన పూరణ మీది. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 23, 2011 7:44:00 AM

    గురువుగారు ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  17. మా బండి చాలా చాలా లేటు.

    పెద్దలు శ్రీ చింతా రామకృష్ణా రావు గారి పూరణ అద్భుతంగా ఉంది.
    గోలి హనుమచ్చాస్త్రి, శ్రీపతి శాస్త్రి గార్ల పూరణలు అలరించాయి.

    కృష్ణుఁడీ ధర నణచ నికృష్ట మతుల
    కృష్ణజన్మాష్టమికి వచ్చు, క్రిస్మసు గద
    పాపులను రక్ష సేయగా ప్రభువు భువికి
    వచ్చి స్తోత్రము లందెడి పర్వ దినము.

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    పాపులను శిక్షించడాని కృష్ణుడు వస్తే, రక్షించడానికి యేసుప్రభువు వచ్చాడు :-)

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ ధన్యవాదాలు.
    మరి రెండు మతాల సారం అలానే కనుపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  20. శ్రీపతిశాస్త్రిబుధవారం, ఆగస్టు 24, 2011 11:42:00 PM

    మిస్సన్నగారు మీపద్యము, గురువుగారి వ్యాఖ్య రెండూ బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ పతి గారూ ధన్యవాదాలు.
    మీ పూరణలు కూడా ఎంతగానో అలరిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి