23, ఆగస్టు 2011, మంగళవారం

సమస్యా పూరణం -435 (హస్తగతుఁడయ్యె సూర్యుఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
హస్తగతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ.
ఈ సమస్యను సూచించిన
కందుల వరప్రసాద్ గారికి
ధన్యవాదాలు.

40 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    అన్ని ప్రాణుల కెన్నడు - నభయ మిచ్చు
    ఆకసంబున పయనించు - అంబరీషు
    అద్దమందున బంధించి - యాడు కొనిన
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    రిప్లయితొలగించండి
  2. దమ్ము గలదని సూర్యుని ధ్వజము నిల్పి
    చెప్పిన ప్రజా రాజ్యమ్ము; 'చిరు'త పార్టి
    కాంగ్రెసు చెయిసాఛి పిలువ కలసి పోయె
    'హస్తగతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ'

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 23, 2011 7:39:00 AM

    హనుమచ్ఛాస్త్రిగారు మీ ప్రతిభకు
    సమయస్ఫూర్తికి జోహార్

    రిప్లయితొలగించండి
  4. శాస్త్రీజీ ! చక్కని పూరణ !

    ఇంతింతై వటుడింతై నప్పుడో అరక్షణం :

    01)
    __________________________________

    అసుర ప్రభువును మర్దించ - నచ్యుతుండు
    అఖిల జగముల నంతట - యాక్రమించు
    నట్టి సమయంబు నందున - యర్థ క్షణము
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    రిప్లయితొలగించండి
  5. శ్రీ పతి శాస్త్రి గారూ ! ధన్యవాదములు.
    సమస్య నిచ్చిన కవిమిత్రులు పై విషయాన్ని దృష్టి లో ఉంచుకునే ఇచ్చారనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  6. కిషోర్ జీ ! ధన్యవాదములు.
    చక్కని ఊహ చేశారు. చొరవకు క్షమించండి. మొదటి పాదము
    " బలిని దండించ వచ్చిన వామ నుండు " అంటే ....

    రిప్లయితొలగించండి
  7. శాస్త్రిగారికి కొనసాగింపు :

    03)
    __________________________________

    హస్తమును నేల గరిపింతు - ననుచు జెప్పి
    ఆశ యంబుల సోనియా - యంఘ్రి యుగళి
    అర్పణంబును జేసెను - యల్ప జీవి
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________
    అల్పజీవి - చిరంజీవి(ఇంకెంత మాత్రమూ ఈ పేరుకు అనర్హుడు )

    రిప్లయితొలగించండి
  8. శాస్తీజీ ! బానే ఉంటుంది గానీ - పాదాద్యక్షరంకోసం తాపత్రయం

    రిప్లయితొలగించండి
  9. బాల సూర్యప్రభా వర భాసమాను
    డంజనీ సుతు డాకాంక్షనర్కుని గొని
    పండటంచును మ్రింగగ పట్టుకొనియె.
    హస్తగతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ.

    రిప్లయితొలగించండి
  10. అమ్మ పెట్టెను గోరింట హస్తమందు
    ఆకసమ్మును చిత్రించె అందముగను
    హస్తగతుడయ్యె సూర్యుడత్యద్భుతముగ
    చంద్రుఁ తోడ తారకలును సరిగ నమరె.

    రిప్లయితొలగించండి
  11. రామ కృష్ణారావు గారిది బహు చక్కని పూరణ !

    చింతా వారి స్ఫూర్తితో :

    04)
    __________________________________

    బాలుడనలేము యాతండు - పరమ శివుడు
    బాల భానుని , పండని - భ్రాంతి జెంది
    భయము లేకించు కైనను - పవన సుతుడు
    బాల హనుమంతు డెగసెను - బలిమి తోడ
    పట్టుకొని తాను భక్షింప - బాల సూర్యు !
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    రిప్లయితొలగించండి
  12. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 23, 2011 8:50:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    ముదము నందుచు కుంతియు మోహమునను
    మంత్ర శక్తిని జూడగ మదిని దలచి
    వేడ్క కలుగగ జెప్పిన, వేదమంత్ర
    హస్తగతుడయ్యె, సూర్యుడత్యత్భుతముగ

    రిప్లయితొలగించండి
  13. మందాకినిగారూ ! చాలా బాగుంది !
    సూరుణ్ణే గాకుండా , ఆకాశం ,చంద్రుడూ , చుక్కలూ
    మొత్తం ఖగోళాన్నే కరతలామలకం చేసేసారు !

    రిప్లయితొలగించండి
  14. మిత్రుల పూరణలు,ఛలోక్తులు ముచ్చటగా ఉన్నాయి

    మునికి సేవలు జేయుచు ముదిత బడసె
    కోర్కె దీర్చగ నర్కుని గుంతి పిలిచె
    అతివ పిలుపుకు ముగ్ధుడై యవని జేరి
    హస్త గతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ !

    రిప్లయితొలగించండి
  15. శ్రీపతి శాస్త్రి గారూ ! కుంతీ హస్తగతుడైన సూర్యుడు చక్కగా నున్నాడు !

    రిప్లయితొలగించండి
  16. మూర్తీజీ ! మీకుంతి చేతిలో సూర్యుడు కూడా చక్కగా
    ప్రకాశించు చున్నాడు !

    రిప్లయితొలగించండి
  17. కిశోర్ జీ ధన్యవాదములు. శ్రీపతి శాస్త్రి గారి కుంతి ప్రధమ స్థానములో ఉంది. మాకింకా రాత్రి కదా ! మా కుంతి వెనుక బడింది.అయిన హనుమఛ్ఛాస్త్రి గారి పూరణకు తిరుగు లేదు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి గారూ , మూర్తి గార్ల స్ఫూర్తితో :


    05)
    __________________________________

    అవని నానాడు దూర్వాసు - నాదరించి
    అతివ కుంతియె మంత్రంబు - నందుకొనెను !
    ఆమె బ్రార్థించి నంతనే - యాదరించ
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    రిప్లయితొలగించండి
  19. గురువు గారికి ధన్యవాదములు, నమస్కారములతో
    చిరంజీవి నేడు చిరుజీవిగా మారుటపై
    తే:కండువాగప్పుటకు గూడ కదలకుండె
    నేడు కలహాల కాంగ్రేస్సు నేతలెల్ల,
    అమ్మ కిచ్చిన మాటపై యస్తమించి
    హస్తగతుడయ్యె సూర్యుడత్యద్భుతముగ |

    రిప్లయితొలగించండి
  20. మిత్రుల పూరణలన్నీ వైవిధ్యభరితంగా విలక్షణంగా ఉంది ఆనందాన్ని కలుగ జేస్తున్నాయి. నేను శాస్త్రి గారి బాటలోనే నడుస్తున్నాను .

    ఫేసు టర్నింగు నిచ్చిన బాసు గారు
    వేషమును మార్చ,మార్చగా భాష గూడ
    డిల్లి వెళ్ళెను పరివార మెల్ల ,రాహు
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడత్యద్భుతముగ!

    (రాహు = రాహుల్ గాంధి)

    రిప్లయితొలగించండి
  21. వరప్రసాద్ గారూ ! అస్తమించి హస్తగతుడయ్యాడా ? బావుంది !
    పీతాంబరధరా ! రాహు హస్తగతుడు !!! ఇది ఇంకా బావుంది !

    రిప్లయితొలగించండి
  22. నా పూరణ ....

    యదుకులాగ్రణి దోసిట నర్ఘ్య మిడఁగ
    హస్తగతుఁ డయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ;
    కాని యుత్తరక్షణమునఁ గలుగఁజేసె
    నేవగింపును గయుని నిష్ఠీవనంబు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీపతిశాస్త్రిమంగళవారం, ఆగస్టు 23, 2011 11:26:00 AM

    వసంత కిశోర్ గారికి, నరసింహమూర్తి గారికి ధన్యవాదములు. మిత్రులు చెప్పినట్లు నేటి సమస్య చలోక్తులతో,పురాణ కథలతో ఆహ్లాదంగా ఉన్నది. మన గురువుగారి పూరణ అద్భుతముగా ఉన్నది.

    రిప్లయితొలగించండి
  24. వసంత్ కిశోర్ గారూ,
    మీ ఐదుపూరణలూ వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నాయి. అభినందనలు.
    కవిమిత్రుల పూరణలును ప్రశంసిస్తూ మీ సహృదయతను చాటుకుంటున్నారు. ధన్యవాదాలు.
    సూర్యుణ్ణి అద్దంలో బంధించిన మొదట పూరణ బాగుంది.
    వామనుని కరకంకణమైన సూర్యుని రెండవ పూరణ మనోహరంగా ఉంది. కాని‘అసుర ప్రభువు, అర్ధ క్షణము’ అన్నప్పుడు ‘ర, ర్ధ’లు గురువులై గణదోషం వస్తున్నది. ‘అసురవల్లభు/ అసురవిభు బలి’ అనీ, ‘హరికిఁ జూడ’ అందామా?
    మూడవపూరణ చాలా బాగుంది.
    సూర్యుణ్ణి పట్టుకున్న హనుమంతుని నాలుగవ పూరన చక్కగా ఉంది. ‘అనలేము + ఆతండు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘బాలుఁ డనఁగలే మాతండు’ అంటే సరి!
    ‘దు’ర్వాసుని వృత్తాంతంతో ఐదవ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  25. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో ‘చెప్పిన ప్రజా ..’ అన్నచోట గణదోషం. ‘చెప్పినది/ చెప్పెనదె’ అంటే సరి!
    నిజానికి వరప్రసాద్ గారు పంపిన సమస్య ‘అస్తమించెను సూర్యుఁడు హస్తమందు’. దానిని నేను సవరించాను. కవిమిత్రులు పంపే సమస్యలను ఉన్నదున్నట్లు ప్రకటిస్తే ‘పంపిన సమస్య’ అంటాను. సవరణలు, మార్పులు చేసి ప్రకటిస్తే ‘సూచించిన సమస్య’ అంటాను. అదీ సంగతి!
    *
    చింతా రామకృష్ణారావు గారూ,
    నిజంగానే ‘అత్యద్భుతమైన’ పూరణ నిచ్చారు. పద్యం సర్వాంగసుందరమై భాసిస్తున్నది. మీ పద్య సూర్యుడు మాకు హస్తగతుడైనట్లు భావిస్తున్నాము. ధన్యవాదాలు.
    *
    మందాకిని గారూ,
    అరచేతిలో ఆకాశాన్ని చూపిన మీ పద్యం విశ్వరూపసామ్యాన్ని పొందింది. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ మంత్రబద్ధుఁడైన సూర్యుని పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ముగ్ధమనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    మొదటి పాదాన్ని ‘మునిని సేవించి మంత్రంబు ముదిత వడసె’ అంటే ఎలా ఉంటుంది?
    *
    వరప్రసాద్ గారూ,
    ‘అస్తమించి హస్తగతుఁడైన సూర్యుని పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణలోని చమత్కారం సర్వోత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. గురువు గారూ, వసంత కిశోర్ గారు,
    ధన్యవాదములు. మిత్రులందరి పూరణలూ అలరించాయి.

    మీ పూరణ చక్కగా కుదిరింది. ఏవగింపు పదం సందర్భానికి చక్కగా వినియోగించారు.
    ఒక్క సందేహం - గయోపాఖ్యానం కవుల కల్పనేకదా!

    రిప్లయితొలగించండి
  27. శంకరార్యా ! చెప్పి " న ప్రజా " ర గణం అవుతున్దనుకొన్నాను. సవరణకు ధన్యవాదములు.గయోపాఖ్యాన ఘట్టం తో చేసిన మీ పూరణ అద్భుతముగా నున్నది.
    కవి మిత్రులందరకూ "హస్తగతుడయ్యె సూర్యుడత్యద్భుతముగ"
    అందరకూ అభినందనలు,ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  28. మందాకిని గారూ,
    ధన్యవాదాలు. ‘గయోపాఖ్యానం’భారత, భాగవతాలలో లేదు. అది కవుల కల్పనే!
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా ! కృష్ణుని దోసిలి నందు సూర్యుణ్ణి మాకు దర్శింపజేసి
    ధన్యుల్ని చేసారు ! అభినందనలు !

    చక్కని సవరణలను సూచించి నందులకు మిక్కిలి
    ధన్యవాదములు !

    సవరణలతో :
    ఇంతింతై వటుడింతై నప్పుడో అరక్షణం :

    02 అ)
    __________________________________

    అసుర వల్లభు మర్దించ - నచ్యుతుండు
    అఖిల జగముల నంతట - యాక్రమించు
    నట్టి సమయంబు నందున - యర్థ లిప్త
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    చింతా వారి స్ఫూర్తితో :

    04అ)
    __________________________________

    బాలు డాతడు కాడులే ! - పరమ శివుడు !
    బాల భానుని , పండని - భ్రాంతి జెంది
    భయము లేకించు కైనను - పవన సుతుడు
    బాల హనుమంతు డెగసెను - బలిమి తోడ
    పట్టుకొని తాను భక్షింప - బాల సూర్యు !
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    శ్రీపతి గారూ , మూర్తి గార్ల స్ఫూర్తితో :


    05 అ)
    __________________________________

    అవని నానాడు దుర్వాసు - నాదరించి
    అతివ కుంతియె మంత్రంబు - నందుకొనెను !
    ఆమె బ్రార్థించి నంతనే - యాదరించ
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________

    రిప్లయితొలగించండి
  30. "సూర్యోదయమైన వెంటనే మరణించెదవు గాక "
    అని సుమతి భర్తైన కౌశికుని మాండవ్య మహర్షి శపిస్తే
    సూర్యోదయాన్నే ఆపేస్తుంది సుమతి :

    6)
    __________________________________

    అమిత కోపమ్ము శాపమ్ము - నాత డివ్వ
    అనుగు భర్తను గాపాడ - నామె దలచి
    అర్కు నుదయించ కుండగ - నాగుమనిన
    అతివ వినతిని యంశుడు - ఆగుదెంచె !
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!
    __________________________________
    ఆగుదెంచు = ఆగు

    రిప్లయితొలగించండి
  31. ఇన్ని మంచి పద్యాలున్న సమస్య క్రింద - నా పూరణ కూడా చూసుకొనవలనెనే స్వార్ధంతో- కిట్టించే ప్రయత్నం:

    వ్యాకరణముఁగిట్టింపనే నాత్ర పడితిఁ,
    గాని-సంధ్యవేళనిలచి కడలి కడను;
    అలిగి, చిత్రరచనఁజేయ, నందు సఖికి
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ - త్యద్భుతముగ!

    రిప్లయితొలగించండి
  32. సైన్ధ వాధము నీనాడు చంపు వాడ
    నన్న పార్థుని శపథమ్ము నమలు జేయ
    చక్రమును నింగి కెత్తెను క్షణము చక్రి
    హస్తగతుఁడయ్యె సూర్యుఁడ త్యద్భుతముగ!

    రిప్లయితొలగించండి
  33. పెద్దలు శ్రీ చింతా రామ కృష్ణా రావు, గురువుగారల పూరణలు మనోజ్ఞంగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  34. సగర తీరాన నేజేరి సొగసు జూడ
    అసుర సంధ్యల వలయాలు కసురు కొనగ
    కడలి అందాలు సంధ్యకు కన్ను గీటె
    హస్త గతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ

    అందరి పూరణలు ఎంత గానొ అలరిస్తున్నాయి ఇంతకీ నా సమస్య ప్చ్ !

    రిప్లయితొలగించండి
  35. రాయబారము సందర్భములో గర్వాంధులైన కౌరవులు శ్రీకృష్ణుడిని బంధించ పూనుకొనడము ' సూర్యుఁడు హస్తగతుడైనట్లు తలవడమే కదా !

    రాయబారపు వచనమ్ము రాజు వినఁడు
    హితము బలుకగ కృష్ణు డహితుఁడు నయ్యె
    దురిత యోచన దలచిరా దుష్ట తతియు
    'హస్త గతుఁడయ్యె సూర్యుఁ డత్యద్భుతముగ '

    రిప్లయితొలగించండి
  36. అక్కయ్య గారూ మీ పద్యాలను చదివి ఆనందించే వారలలో నేనొకడిని. తప్పులు దిద్దడము అలవాటయే గురువు గారు యీ కార్యానికి పూనుకొన్నారు.ఒకప్పటి వృత్తి ఆయన కిప్పుడు ప్రవృత్తి అయింది.అందుచేత నిరభ్యంతరముగా మనము వ్రాసుకు పోదాము. మీ పూరణ బాగుంది.

    రిప్లయితొలగించండి
  37. నమస్కారములు మూర్తి గారు !
    ఈ రోజు మనకి ఇక్కడ " భూకంపం " వచ్చింది గమనించారుగా ! అంటే నా పూరణ నిర్దోషం గా ఉండి ఉండాలి .మీ అందరి ఆదరణకి , అభిమానానికి ముఖ్యం గా ఓర్పుకి " కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  38. వసంత కిశోర్ గారూ,
    సుమతి ప్రస్తావనతో మీ ఆరవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘అంశుడు, ఆగుదెంచె’ శబ్దప్రయోగాలే పానకంలో పుడకలయ్యాయి.
    ‘అతివ వినతిని దినకరుఁ డాగినాఁడు’ అందామా?
    *
    ఊకదంపుడు గారూ,
    మనోహరమైన చిత్రాన్ని కళ్ళముందు ఆవిష్కరించారు. బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ప్రశస్తమైన వృత్తాంతంతో మీ పూరణ అలరించింది. అభినందనలు.
    అక్కడ ‘నింగి కెత్తిన క్షణము’ అంటే ఇంకా బాగుంటుందేమో?
    *
    నేదునూరి రాజేశ్వరి గారూ,
    మనోహరమైన ఊహతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    అక్క నిర్దోషంగా వ్రాస్తే తప్పులు దిద్దుదామని కూర్చున్న తమ్ముడేం కావాలి :-)
    ‘సగర’మనే శబ్దం లేదు. ‘సరగతీరాన’ అన్నదానిని ‘సాగరతటిని నేఁ జేరి సౌరు జూడ’ అని నా దిద్దుబాటు!
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    విశ్వరూపుడైనవానిని హస్తగతం చేద్దామన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  39. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
    శంకరార్యా ! సవరణలకు ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  40. గురువుగారూ ధన్యవాదాలు.
    మీ సవరణ మరింత అందాన్నిచ్చింది.

    రిప్లయితొలగించండి