18, ఆగస్టు 2011, గురువారం

ఛందస్సు - 1 (అఖండయతి)

.................... అఖండయతి .....................
యతిస్థానంలో సంధి జరిగినప్పుడు పరపదాద్యక్షరమైన అచ్చుతో యతిమైత్రి కూర్చడం ‘స్వరప్రధానయతి’. ‘రమ్ము + అనెను = రమ్మనెను’. ఇక్కడ ‘రమ్ము’ పూర్వపదం. ‘అనెను’ పరపదం. పరపదంలోని మొదటి అక్షరమైన అచ్చు (అ)కు యతిమైత్రి కూర్చాలి.
దా. న్ని బాధలఁ దీర్ప రమ్మనుచు పిలిచె.
ఇక్కడ పాదాద్యక్షరమైన ‘అ’కు, యతిస్థానంలో సంధిగతమైన పరపదాద్యక్షరమైన ‘అ’కు యతి కూర్చబడింది.
మరికొన్ని ఉదా.
తని ప్రాణమ్ముఁ దీయ నీ విష్టపడవు.
న్నమాటను చెప్ప నీ వులికిపడితె.
ఎంద రెన్ని చెప్పినను నీ కేమి లెక్క?
రుల బాధిందు పనికి నే నొప్పుకొనను.
ఈ ‘స్వరప్రధానయతి’ సర్వసాధారణం.
యతిస్థానంలో సంధి జరిగినప్పుడు అక్కడి అచ్చుకు గాని, హల్లుకు గాని యతి కూర్చడం ‘ఉభయయతి’. ఏకశబ్దంలా భాసిస్తూ అంతర్గతంగా స్వరసంధి జరిగినప్పుడే ఈ ఉభయయతి చెల్లుతుందని అందరూ అంగీకరించారు. [ఉదా. నాస్తి (న + అస్తి), అనంత (న + అంత), నారాయణ (నార + ఆయణ),. రసాయన (రస + ఆయన), సమాస (సం + అస)]. దీనిని అనంతుడు తన ‘ఛందోదర్పణము’లో ‘నిత్యసమాసయతి’ అనీ, దీనికే ‘అఖండయతి’ అని పేరున్నదనీ చెప్పాడు.
యతిస్థానంలో సంధి జరిగినప్పుడు అక్కడి హల్లుకు యతికూర్చడమే అఖండయతి. (అచ్చుకు యతి చెల్లవలసిన చోట హల్లుకు యతి చెల్లడం అఖండయతి). ‘రమ్మనెను (రమ్ము + అనెను)’ అనే చోట పరపదాద్యక్షరమైన ‘అ’కారానికి కాక పూర్వపదాంతాక్షరమైన ‘మ’కారానికి యతికూర్చడం అఖండయతి అవుతుంది.
ఉదా. మాదు బాధలఁ దీర్ప రమ్మనుచు పిలిచె.
ఇక్కడ ‘రమ్మనుచు’ లోని సంధిగత ‘అ’కారానికి కాక ‘మ’కారానికి యతి కూర్చబడింది.
అప్పకవి మొదలైన కొందరు లాక్షణికులకు (నాకు కూడా!) ఈ అఖండయతి ఇష్టం లేదు. అందువల్ల యతిభేదాల సంఖ్య ఎక్కువయింది.
మరికొన్ని ఉదా.
పిలిచి ప్రాణమ్ముఁ దీయ నీ విష్టపడవు.
పుణ్యవాక్కులు జెప్ప నీ వులికి పడితె.
కేశవుఁడు పిల్చె నన్న నీ కేమి లెక్క?
పొమ్మనుచు నిన్నుఁ దిట్ట నీ వోపలేవు.
పూర్వకవుల ప్రయోగాలు .........
భానుసహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్థయుక్తమై (కవిజనాశ్రయము)
డి యనంగఁ బొల్చు దేవాదిదేవ (కూచిమంచి తిమ్మకవి)
చూవె మనంబునఁ దలంచుచుండుదు నేనున్ (భారతము)
తిఁ గింకిరి పడక యోల మాసపడక (భారతము)
సారముం జేయవే సారసాభనయన (శృంగార నైషధము)
వెలయు నవ్విశ్వనాథు దేవేశుఁ గాంచి (హరిశ్చం.)
ప్రస్తుతానికి ఇంతే ...
అఖండయతి నాకు ఇష్టం లేదంటే నేను వ్రాసే పద్యాలలో ఉపయోగించను అని భావం. అంతే కాని ఎవరూ ఉపయోగించరాదని కాదు. చాలామంది అంగీకరించిందే కాబట్టి మీరూ ప్రయోగించవచ్చు.
కవిమిత్రులారా,
దయచేసి ఈ పాఠంపై మీ అభిప్రాయం చెప్పండి. మీ మీ ఖండనలను కాని, సమర్థనలను కాని తెల్పండి.
పాఠం చెప్పిన విధానం ఎలా ఉందో తెలియజేస్తే ‘ఛందస్సు’ పాఠాలను మొదలు పెడతాను.

19 కామెంట్‌లు:

  1. శంకరయ్య గారూ,
    మీరు బోధించిన తీరు అరటిపండు వొలిచి పెట్టినట్టు ఉన్నది. మీ చందస్సు పాఠాలకై ఎదురు చూస్తున్నాను. దయచేసి ప్రారంభించండి.
    భవదీయుడు
    ఫణి ప్రసన్న కుమార్

    రిప్లయితొలగించండి
  2. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, ఆగస్టు 18, 2011 5:52:00 PM

    గురువు గారూ,

    చాలా చక్కగా యతుల గూర్చి వివరించినారు. కానీ, నాదొక చిన్న సందేహము.

    కేశవుడు - నీకేమి అనే చోట యతి మైత్రి ( అఖండ యతి గూర్చి నాకు తెలియదు కానీ ) కుదరదని మాత్రము నేను అనుకుంటున్నాను. పూర్వ కవులెవరూ దీనిని సమర్థించినట్లుగా నాకు తెలియదు. నేను కూడ, మీ వలే, సర్వప్రధానయతిని మాత్రమే అంగీకరిస్తాను.

    మీ పాఠాలను మాత్రము ఇలాగే కొనసాగించాలని వినతి. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారూ , చాల దినాలకు తీరిక చేసికొని యిటుగా వచ్చినందులకు చక్కని ఫలమందించారు . మంచి పాఠం . కవిమిత్రులందరికీ బహుధా ఉపయుక్తమైన పాఠం . " // ఏకశబ్దంలా భాసిస్తూ అంతర్గతంగా స్వరసంధి జరిగినప్పుడే ఈ ఉభయయతి చెల్లుతుందని అందరూ అంగీకరించారు // " ఈ రకమైన ఉభయ యతి శాస్త్ర సమ్మతమే ! ఇకపోతే సాధ్యమైనంత , వీలు పడినంత , అందుబాటులో యతి మైత్రి కుదర్చడానికి మరొక్క పదం దొరికినంతలో వీలైనంత ' అఖండ యతి ' ని పరిహరించడమే మేలు ! సమస్యా పూరణల లాంటి సరదా పద్యాల సంగతి ఎలాగున్నా , రేప్పొద్దున పటిష్టమైన ప్రౌఢ కావ్య రచనకు పూనుకునే వారికి ఈ సూచన ఆలంబనమైతే సంతోషం.
    నేనూ చిన్ననాటి పద్యాల్లో ఈ అఖండయతి నుపయోగించి , అది కూడదని మా తాతగారి ద్వారా తెలుసుకున్న వాడనే !

    ( తేటగీతి మిగుల తేనెలే యొలికించు '
    నందమైన పద్య మాటవెలది ;
    కందపద్యము కవి కభిమాన ఛందమౌ
    వినర విష్ణునంద వినయచరిత ) ------- మూడవపాదంలో అఖండయతిని గమనింపవచ్చు . ఈ పద్యాన్ని మా తాతగారికి చూపిస్తే ఇందులోని దోషం తెలియజేయడంతో అప్పటి నుండి అఖండయతి మానివేశాను . ఇది మహా అయితే నా మూడవ పద్యమనుకుంటాను , అందుకే ఆనాటి శైశవ చ్ఛాయలు పద్యంలో గమనిస్తే మన్నింపగలరు !

    మొత్తానికి ఈ పాఠాలను మరింతగా బోధింపగలరని ప్రార్థన !!! ధన్యవాద పరశ్శతం !!!

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ అఖండయతిని కరతలామలకం చేశారు.
    అఖండయతి చూడడానికి బాగుండ వచ్చునేమో కానీ,
    కొంచెం పద్యాలతో సావాసం చేసే వారికి అక్కడికి వచ్చే సరికి
    బ్రేకు పడ్డట్లుగా అనిపిస్తుందనుకొంటున్నాను.
    విష్ణు నందనులు చెప్పినట్లు 'అన్యథా శరణం నాస్తి'
    అయినప్పుడు మాత్రం అఖండయతిని వాడుకోవచ్చు నన్నది
    నా అభిప్రాయం.
    మీరు మీ విద్యార్థుల కోసం చాలా శ్రమ తీసుకొని సరళమైన
    పాఠాన్ని అందించారు.
    శతాధిక ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. గురువు గారూ పాఠము చాలా బాగుంది.ప్రతి టాము,డిక్కు,హారీ మట్లాడగలిగే ఆంగ్ల భాష కంటె తెలుగు భాష క్లిష్ట మయినది,సొగసయినది.మీరలా పాఠాలు చెబుతుండండి. నేర్చుకొనే ఆసక్తి ( శక్తి సంగతి యెలా ఉన్నా ) మాకుంది.

    రిప్లయితొలగించండి
  6. చింతా రామకృష్ణారావు గారూ,
    ఫణి ప్ర్రసన్న కుమార్ గారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    డా. విష్ణునందన్ గారూ,
    మిస్సన్న గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు. మీ రిచ్చిన ప్రోత్సాహంతో త్వరలోనే ‘ఛందస్సు పాఠాలు’ ప్రారంభిస్తాను. ప్రస్తుతం ‘చిత్తుప్రతి’ సిద్ధం చేసుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  7. గురువుగారూ పూర్తి ఛందస్సు పాఠాలు ప్రారంభించే ముందు మేమందరం తరచూ తప్పులు చేసే యడాగమ నుగాగమ సంధుల మీద క్లాసు తీసుకొంటే బాగుంటుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  8. మంద పీతాంబర్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    మిస్సన్న గారూ,
    అలాగే. తప్పకుండా. ఒకటి రెండు రోజుల్లో ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  9. మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యంశుక్రవారం, ఆగస్టు 19, 2011 7:54:00 AM

    గురువు గారూ,
    మీ ఛందస్సు పాఠాల కోసం ఎదురు చూస్తున్నాను.
    - మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా ! చాలా చక్కని ఉపయుక్తమైన పాఠం !

    సందేహాలకు తావులేని విధముగా
    చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో
    ఉదాహరణలతో సహా మీరు వివరించిన తీరు అనన్యం !
    శత సహస్త్ర ధన్యవాదములు !

    ఔను ! యడాగమ నుగాగమాల మీద పాఠం అత్యంతావశ్యకం !
    ఎక్కువగా అందరూ తప్పులు చేసే దక్కడే !
    వెంటనే వివరించండి !

    రిప్లయితొలగించండి
  11. మాస్టారూ, మీ "చిత్తుప్రతి" అనే మాట నన్ను 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. మా తాతగారి వ్యాసంగం లో ఈ మాట వుండేది. ఈ రోజుల్లో ఆ మాట వాడేవారు లేరు.
    ఇకపోతే, మీరు చిత్తుప్రతి తయారు చేసుకొంటున్నారు కాబట్టి ఒక మనవి. ఉదాహరణలు ఇస్తున్న విధం బాగుంది. అలాగే counter examples, common mistakes కూడా ఇస్తే బాగుంటుంది. వయోజనులం కాబట్టి గ్రహించటానికి ఇంకా సుళువు అవుతుంది. క్రిందటి యేడాది ఈ విషయం మనవి చేసినట్లు గుర్తు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. తమ్ముని ఆశీర్వదించి
    అఖండ యతి గురించి అందరు చక్కగా చెప్పారు. ఇంకేముంది ? పాఠాలు మొదలు పెడితే ముదావహం తమ్ముడూ !

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిఆదివారం, ఆగస్టు 21, 2011 8:29:00 AM

    శ్రీగురుభ్యోనమ:
    ఎఒతోకాలంగా ఎదురుచూస్తున్నాను, ఛందస్సు నేర్చుకోవాలని. ముఖ్యముగా యతి గురించి చాలా సందేహాలున్నాయి.
    మీదయతో ఈనాటికి అవకాశం కలిగింది. దయచేచి కొనసాగింపప్రార్థన.
    నమస్కారములతో
    శ్రీపతిశాస్త్రి

    రిప్లయితొలగించండి
  14. శ్రీ.కందిశంకరయ్యగురువు గారు చక్కగాచెప్పారు.
    ధన్యవాదములు.
    🌺🌺👏👏🌺🌺👏👏🌺🌺

    రిప్లయితొలగించండి
  15. శ్రీ.కందిశంకరయ్యగురువు గారు చక్కగాచెప్పారు.
    ధన్యవాదములు.
    🌺🌺👏👏🌺🌺👏👏🌺🌺

    రిప్లయితొలగించండి
  16. గురువరా! శంకరార్యా.!!
    ఛందశ్శాస్త్రాభ్యసనమును మీ దయామయ ఆదరణ ద్వారా మరికొంత నేర్చుకోవాలని ఉన్నది.
    కొనసాగించగలరు.
    సంజీవులు

    రిప్లయితొలగించండి
  17. గురువుగారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి

    రిప్లయితొలగించండి