26, నవంబర్ 2011, శనివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/2

                     అయ్యప్ప కథాగానం - 1/2

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
మధురం మనోహరం ఆనందభరితం
|| శ్రీకరం ||)

దత్తుడా తర్వాత దేహాన్ని వదిలేసి
        ఆ త్రిమూర్తులలోన ఐక్యమ్ము చెందాడు
        లీలావతి కూడ తనువు చాలించింది || లీలావతి ||
ఆమె మరుజన్మలోన - కరంభునికి
        కూతురై జన్మించెను - మహిషిగా
ఆమె పెదతండ్రి యైన - రంభునికి
        మహిషాసురుడు పుట్టెను - అన్నగా.

స్త్రీ చేతిలో తప్ప మరియెవరి చేతను
        మరణమ్ము లేకుండ బ్రహ్మచే వరమంది
        మహిషాసురుడు లోకకంటకుం డైనాడు || మహిషాసురుడు ||
దేవతలు ప్రార్థించగా - పరాశక్తి
        దుర్గగా అవతరించె - ఆ క్షణమె
లోకాల కాపాడగా - యుద్ధాన
        మహిషాసురుని చంపెను - ఆ తల్లి || శ్రీకరం ||

 
తన అన్న మహిషుని మరణవార్తను విన్న
        మహిహి దుఃఖముతోడ కుమిలిపోయింది
        దేవతలపై ఎంతొ పగ పెంచుకున్నది || దేవతలపై ||
"వరబలం ఉన్నప్పుడే - దేవతల
        నోడింతు" వని చెప్పెను - శుక్రుడు
గురువు చెప్పిన మేరకు - ఆ మహిషి
        తీవ్రతపమే చేసెను - వనమందు

అతిఘోర మైనట్టి ఆ మహిషి తపమునకు
        పదునాల్గు భువనాలు తల్లడిల్లెను నాడు
        ఆ తపోజ్వాలల్లొ అల్లాడిపోయాయి ||
ఆ తపో ||
బ్రహ్మదేవుం డప్పుడు - పొడసూపి
        "వరమేమి కావా" లనీ - అడిగాడు
"మరణమే లేకుండగా - నా కొక్క
        వర మివ్వ" మని కోరెను - ఆ మహిషి || శ్రీకరం ||


"పుట్టిన ప్రతిజీవి గిట్టుట సహజమ్ము
        మరణమ్ము లేకుండ వర మివ్వలే నమ్మ!
        అది తప్ప ఏదైన కోరింది ఇస్తాను" || అది తప్ప ||
అని బ్రహ్మ బదు లివ్వగా - ఆ మహిషి
        ఆలోచనే చేసెను - తీవ్రంగ
తన కోర్కె తీరునట్లు _ యుక్తితో
        వింతైన ఒక వరమునే - కోరింది

"హరి శంకరుల వల్ల జన్మించు పుత్రుండు
        పన్నెండు వర్షాలు ఒక మానవుని ఇంట
        సామాన్యమనిషిగా దాస్యమ్ము చేయాలి || సామాన్య ||
అటువంటి వాడు తప్ప _ ఇంకొకరు
        చంపకుండగ ఇవ్వవే - వరమును"
నాల్గు మోముల వేలుపు - తథాస్తని
        కరుణతో వరమిచ్చెను - మహిషికి || శ్రీకరం ||

 
బ్రహ్మ వరమును పొంది గర్వించి తన రోమ
        మూలాలలో వేల మహిషులను పుట్టించి
        తన సేనతో మహిషి స్వర్గమే చేరింది || తన సేనతో ||
ఆమెను ఎదిరించక - ఇంద్రుడే
        పారిపోయెను వేగమే - భయముతో
దేవలోకా న్నంతయూ - రక్కసులు
        కల్లోలమే చేసిరి - అప్పుడు

ఇంద్రసింహాసనం ఆక్రమించిన మహిషి
        సురపానమత్తయై ముల్లోకములలోని
        దేవతల మానవుల మునుల బాధించింది || దేవతల ||
మహిషి బాధల నోర్వక - దేవతలు
        బ్రహ్మకే మొరపెట్టిరి - కాపాడ
శంకరుడు వెంట రాగా - ఆ బ్రహ్మ
        వైకుంఠమే చేరెను - అందరితో || శ్రీకరం ||

 క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

1 కామెంట్‌:

  1. గురువు గారికి ధన్యవాదములు, చాలా విపులముగా వర్ణించితిరి. మీ తరువాయి భాగమును కోరుతూ
    వరప్రసాదు

    రిప్లయితొలగించండి