3, నవంబర్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 132

*********************************************************************************
చతుర్విధ కందం
*సురరాజ వినుత నిర్మల
చరితా! *పరమాంతరంగ! సజ్జన వరదా!
*నరవర! విశేష పావన
చరణా! *కరుణా నిధాన! సత్పథ నిరతా!

ఈ కందపద్యంలో 4 * గుర్తులున్నాయి. ఏ గుర్తునుండి మొదలుపెట్టినా పద్యాన్ని అర్థవంతంగా చదువుకొన వచ్చు. ఆ విధంగా 4 పద్యాలను ఇక్కడ చూడవచ్చు.

ప్రథమ కందం ....
సురరాజ వినుత నిర్మల
చరితా! పరమాంతరంగ! సజ్జన వరదా!
నరవర! విశేష పావన
చరణా! కరుణా నిధాన! సత్పథ నిరతా!

ద్వితీయ కందం ....
పరమాంతరంగ! సజ్జన
వరదా! నరవర! విశేష పావనచరణా!
కరుణా నిధాన! సత్పథ
నిరతా! సురరాజ వినుత నిర్మలచరితా!

తృతీయ కందం ....
నరవర! విశేష పావన
చరణా! కరుణా నిధాన! సత్పథ నిరతా!
సురరాజ వినుత నిర్మల
చరితా! పరమాంతరంగ! సజ్జన వరదా!

చతుర్థ కందం ....
కరుణా నిధాన! సత్పథ
నిరతా! సురరాజ వినుత నిర్మలచరితా!
పరమాంతరంగ! సజ్జన
వరదా! నరవర! విశేష పావనచరణా!

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
‘శ్రీమదధ్యాత్మ రామాయణము’ నుండి
*********************************************************************************

13 కామెంట్‌లు:

  1. గురువుగారూ నేమాని పండితుల అద్భుత సృష్టి యిది. అమోఘం.

    రిప్లయితొలగించండి
  2. చతుర్విధకందం చాలా బావుంది !

    అందించిన మీకూ , నేమానివారికీ ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  3. జిగురు సత్యనారాయణ గారు అప్పట్లో కొన్ని చతుర్విధ కందాలు వ్రాసినట్టు గుర్తు.

    రిప్లయితొలగించండి
  4. మిస్సన్న గారూ,
    వసంత కిశోర్ గారూ,
    రవి గారూ,
    ధన్యవాదాలు. జిగురు వారు వ్రాసిన విషయం తెలియదు. వారే స్పందించి ఆ పద్యాల వివరాలు తెల్పాలి.

    రిప్లయితొలగించండి
  5. కొంచెం శ్రమతీసికొని ఒక ప్రయోగం చేయవచ్చును. కంద పద్య గణ లక్షనాన్నే తీసుకొని గణితపరంగా యిలా యెన్ని విధాలైన కందావృత్తులు సాధించ వచ్చునో లెక్కించి చూడవచ్చును.

    నేమాని వారి ఆవృత్తి: *స నల భ | స *స జ భ స | *నల జ భ | స *స జ భ స

    గణితం చేసి మరిన్ని యితర ఆవృత్తులుకూడా కనిపెట్టవచ్చునేమో చూడాలని నా అభిప్రాయం.

    మనకు ఉన్న గణ నామాల సంఖ్య (భ,జ,స,నల,గగ) = 5
    కందంలో మెత్తం గణాల సంఖ్య 16
    కాబట్టి మొత్తం సాధ్యమయే కంద ప్రస్తారాల సంఖ్య 5 యొక్క 16వ ఘాతానికి సమానం. అంటే 1,52,58,78,90,625
    ఇది చాలా పెద్ద సంఖ్యయే. కాని అన్ని ప్రస్తారాలూ కందాలు కావు. యెందుకంటే జ-గణం స్థానంలో నియమం వగైరా వలన. అప్పుడు అన్నివిధాల సరయిన ప్రస్తారాలు మహా అయతే ఇందులో లక్షోవంతు ఉంటాయేమో.
    కంప్యూటర్ సహాయంతో పరిశోధించటం కష్టం కాదు.

    రిప్లయితొలగించండి
  6. మిత్రులారా!
    ఈ ప్రక్రియ పూర్వము ఉన్నదే. నేను చిన్నప్పుడు ఒక పద్యము చదివేను - ఈ క్రింద వ్రాస్తున్నాను:

    సుజ్ఞానయోగ తత్త్వ వి
    ధిజ్ఞుల్ భవబంధనముల ద్రెంచుచు భువిలో
    నజ్ఞాన పథము బొందక
    ప్రాజ్ఞుల్ శివు గొల్తు రచల భావన దవులన్
    (రచయిత పేరు గుర్తు లేదు).

    రిప్లయితొలగించండి
  7. **********************************************************************
    శ్యామల రావు గారూ,
    మీరు చెప్పిన విషయం బాగుంది. ఆలోచించదగిందే.
    **********************************************************************
    పండిత నేమాని గారూ,
    మీరు ప్రస్తావించిన పద్యం నేనూ విన్నాను. కాని ఎక్కడిదో నాకూ గుర్తుకు రావడం లేదు.
    **********************************************************************
    అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  8. గురువుగారికి నమస్కారములు,
    http://padyam.net/?p=40 లో చతుర్విధ కందము పై టపా చూసి ఉత్సాహముతో చేసిన ప్రయత్నమది. ఒక చతుర్విధ కందమును ఒక షడ్విధ కందమును వ్రాసాను. చంధో భంగము కాకుండా వ్రాయగలిగాను కాని అంత సొగసుగా లేదనిపించింది.

    తరుణీ! పరువపు వలపుల
    భరణీ! సుదతీ! ఘనకుచభరధర ముదితా!
    వరమంద గమన మోహన
    భరితా! సదమల సురుచిర వారిజ వదనా!

    సుదతీ! ఘనకుచభరధర
    ముదితా! వరమంద గమన మోహన భరితా!
    సదమల సురుచిర వారిజ
    వదనా!తరుణీ! పరువపు వలపుల భరణీ!

    వరమంద గమన మోహన
    భరితా! సదమల సురుచిర వారిజ వదనా!
    తరుణీ! పరువపు వలపుల
    భరణీ! సుదతీ! ఘనకుచభరధర ముదితా!

    సదమల సురుచిర వారిజ
    వదనా!తరుణీ! పరువపు వలపుల భరణీ!
    సుదతీ! ఘనకుచభరధర
    ముదితా! వరమంద గమన మోహన భరితా!

    రిప్లయితొలగించండి
  9. షడ్విధ కందము:

    సందర్భము:
    పార్వతీ దేవి తపస్సుకు మెచ్చి శంకరుడు వరమిచ్చిన పిమ్మట పార్వతీ దేవి చెలికత్తెల సంభాషణ.

    శివుడే గిరిజకు మగడగు,
    భవుడే సరసుడు,వలపున పరువపు స్మరుడే,
    ధవుడే హరుడిక, సతతము
    శివుడే మరుడగు గిరజకు చెలిమియమరగా!! 1

    గిరిజకు మగడగు భవుడే,
    సరసుడు వలపున పరువపు స్మరుడే, ధవుడే
    హరుడిక, సతతము శివుడే,
    మరుడగు గిరజకు చెలిమియమరగా శివుడే!! 2

    సరసుడు వలపున పరువపు
    స్మరుడే, ధవుడే హరుడిక, సతతము శివుడే,
    మరుడగు గిరజకు చెలిమియ
    మరగా శివుడే, గిరిజకు మగడగు భవుడే!! 3

    ధవుడే హరుడిక, సతతము
    శివుడే మరుడగు గిరజకు చెలిమియమరగా
    శివుడే గిరిజకు మగడగు,
    భవుడే సరసుడు,వలపున పరువపు స్మరుడే!! 4

    హరుడిక సతతము శివుడే,
    మరుడగు గిరజకు చెలిమియమరగా శివుడే,
    గిరిజకు మగడగు భవుడే,
    సరసుడు వలపున పరువపు స్మరుడే ధవుడే!! 5

    మరుడగు గిరజకు చెలిమియ
    మరగా శివుడే, గిరిజకు మగడగు భవుడే,
    సరసుడు వలపున పరువపు
    స్మరుడే, ధవుడే హరుడిక, సతతము శివుడే!! 6

    రిప్లయితొలగించండి
  10. జిగురు సత్యనారాయణ గారూ,
    అజ్ఞాత గారూ ఇచ్చిన లింకుతో నిన్ననే మీ పద్యాలను చూసాను. అద్భుతంగా ఉన్నాయి. మీ నైపుణ్యం అబ్బురపరచింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. జి ఎస్ జీ ! చాలా బావుంది !

    దీనిని చిత్ర కవిత్వ మంటారా ?
    బంధ కవిత్వ మంటారా ?

    శంకరార్యా చిత్ర కవిత్వ మననేమి ?

    రిప్లయితొలగించండి
  12. అయ్యా వసంత కిషోర్ గారూ!
    చతుర్విధ కందము షడ్విధ కందములు చిత్ర కవిత్వముల కోవలోకే వస్తాయి.
    నేను పూర్వము షడ్విధ కందమును చూడలేదు. శ్రీ జిగురువారి పద్యము బాగుంది. ఏదేని ఒక పటములో బంధింపబడితేనే బంధ కవిత్వము అంటారు అని నా నమ్మకము.

    రిప్లయితొలగించండి