16, నవంబర్ 2011, బుధవారం

చమత్కార (చాటు) పద్యాలు - 134

                               అనామిక
ఒక రాజు తనసభలోని కవి తనను ప్రశంసిస్తూ చెప్పిన శ్లోకానికి సంతోషించి తన వ్రేలి ఉంగరాన్ని తీసి బహుమానంగా ఇవ్వబోయాడు. అంతలో అతనికో అనుమానం వచ్చించి. "బొటనవ్రేలును అంగుష్ఠ మనీ, చూపుడువ్రేలును తర్జని అనీ, నడిమివ్రేలును మధ్యమ అనీ, చిటికెనవ్రేలును కనిష్ఠిక అనీ అంటున్నాం. కాని ఏ పేరు లేనట్లు ఉంగరపు వ్రేలును అనామిక అంటున్నాం. దీనికి కారణ మేమిటో తెలిపి ఈ వజ్రపుటుంగరాన్ని బహుమతిగా పొందండి కవీశ్వరా!" అన్నాడు.
అప్పుడు ఆ కవీశ్వరుడు ఈ క్రింది శ్లోకాన్ని చెప్పి బహుమతిని అందుకొన్నాడు ....
పురా కవీనాం గణనా ప్రసంగే
కనిష్ఠికాధిష్ఠిత కాళిదాసః
|
అద్యాపి తత్తుల్యకవే రభావాత్
అనామికా సార్థవతీ బభూవ
||
(పూర్వం కొందరు పండితులు కూర్చుని కవులను లెక్కిస్తూ "మొదటి స్థానం కాళిదాసుదే కదా" అని ‘ఒకటి’ అంటూ చిటికెన వ్రేలు మడిచారు. రెండవ స్థానం ఎవరిదీ అని చాలా పేర్లను ప్రస్తావించినా ఏకాభిప్రాయం కుదరలేదు. చివరికి రెండవవ్రేలికి ఎక్కే కవి ఎవరూ దొరకక ఆ వ్రేలు ‘అనామిక’గా మిగిలిపోయింది)
పై శ్లోకానికి నా అనువాదం ........
పూర్వ మెప్పుడో పండితుల్ భూమిమీఁది
కవుల లెక్కింప మొదలిడి కాళిదాసు
పేరు చెప్పుచు చిటికెనవ్రేలు మడిచి
పిదప తత్తుల్యుఁ డగు కవి పేరు లేక
నా పిదపవ్రే లనామిక యని నుడివిరి.

(కోడీహళ్ళి మురళీమోహన్ గారి ‘తురుపుముక్క’ బ్లాగులో ‘అనామిక’ పోస్టు చూచి, వారికి ధన్యవాదాలతో ...)
http://turupumukka.blogspot.com/2011/11/blog-post_7761.html
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి ....
      నవరత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్.

13 కామెంట్‌లు:

  1. నా పూరణ ......

    భువిలో విద్యావంతుఁడు
    సవినయుఁడుగ మెలగి పేరు సాధింపఁడు; గౌ
    రవమును పొందఁడు; వ్రేలది
    నవరత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందరు వెదకిన నిలలో
      అందని ద్రాక్షగ మిగిలిన యాకవికులవ
      ర్యుం దమ్ముడనామికనా
      మం ధరియించె సతతం బమరు కనకముతో

      తొలగించండి
  2. మును గవుల గణనమందున
    కనిష్ఠికాధిష్టితుండు కాళీ దాసుం
    డని , తత్తుల్యుడు దొరకమి
    ననామికకు సార్థకాహ్వయమ్మిడిరి బుధుల్ !

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారూ!
    అనామిక గూర్చి మీ పద్యములోని భావముతో నేను ఏకీభవించలేను.
    విద్వాన్ సర్వత్ర పూజితః - అను లోకోక్తికి ఇది విరుద్ధము.
    విష్ణుమూర్తిని "అనుత్తముడు" అంటాము, అలాగే అధికమూల్యముండే వస్తువును అమూల్యము అంటాము. అదే కోవలోకి వస్తుంది అనామిక.
    భువి నధికమూల్యమగు వ
    స్తువనబడు నమూల్యమనుచు తోరమ్ముగ వి
    ష్ణువు ననుత్తముడు కద
    నవరత్నాంగుళి కలిగి యనామిక యయ్యెన్

    రిప్లయితొలగించండి
  4. పవమాన సుతుడ తులితుడు
    రవితేజపు ధాటికిని వెఱవడు వినయమం
    దవిరళమగు పేరతనికి;
    నవరత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్.

    పవమాన సుతుడు+అతులితుడు లో అసముడు అన్న అర్థంలో అతులితుడు అన్న శబ్దప్రయోగం సరియైనదేనా అని సందేహము.
    సుందరకాండలో హనుమంతుడు వానరవీరులందరూ నాకన్నా బలవంతులే అని వినయంగా చెప్పుకుంటాడు. సకల సుగుణశీలి అలా చెప్పటం వల్ల నవరత్నాలు పొదిగిన యుంగరము కలిగీ ఆ వేలు అనామిక గా మిగిలిపోవటాన్ని సరిగా గుర్తు తెస్తుందనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  5. నవ రత్నాంగుళి లేమిని
    నవరత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్
    భువి యుంగర వ్రేలనుచును
    కవి వర తెలుగింట నామ కరణము బొందెన్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గోలి హనుమచ్చాస్త్రి గారు అనామిక గురించి వ్రాసిన పద్యం తో ఏకీభవిస్తాను.
    నిన్నటి సమస్య నం.527కి నా పూరణ ;
    వెస,వీరబాలచంద్రుడు
    అసమానపరాక్రమమున నల పలనాటన్ ,
    అసిధారల కసి తీరగ
    పసిబాలుడు సంగరమున బగతుల నణచెన్

    రిప్లయితొలగించండి
  7. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మబుధవారం, నవంబర్ 16, 2011 9:18:00 PM

    ఇవాళ పనిలో చాలా హడావిడిగా ఉన్నాను అనే మాట కేవలం సాకు మాత్రమే. ఎంత కొట్టుకున్నా పదాలు కుదరలేదు. ఆహవనిపుణులైనప్పటికీ నకుల సహదేవులకు రావలసినంత గుర్తింపు రాలేదు మహా భారతంలో. అదే విధంగా నవరత్నఖచిత అంగుళీయకం దాల్చినప్పటికీ ఆ వేలు అనామిక అయింది అని రాద్ధామనుకున్నాను. కుదిరింది కాదు.

    రిప్లయితొలగించండి
  8. స్తవనీయు లయ్యు మృడుడై
    శివుడును - పార్వతి యపర్ణ - శివ సుతుడును తా
    నవని విశాఖుండయ్యెన్
    నవ రత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్

    రిప్లయితొలగించండి
  9. కవి చతురత యేమో యది
    సువాసినికి నిగమ శర్మ సోదరికిన్ పే
    రు వలదనుకొనె వికటకవి
    నవరత్నాంగుళి గలిగి యనామిక యయ్యెన్!!

    రిప్లయితొలగించండి
  10. కవులార ! తెలుగు వారికి
    భువిలో నుంగరపు వ్రేలు పొలుపుగ శ్రీ వై
    భవ చిహ్నము - సంస్కృతమున
    నవ రత్నాంగుళి గలిగి 'యనామిక 'యయ్యెన్

    రిప్లయితొలగించండి