4, నవంబర్ 2011, శుక్రవారం

ఛందస్సు - 3 (మువిభక్తి, ముకార యతులు)

మువిభక్తి, ముకార యతులు
1) మువిభక్తి యతి (పోలిక వడి)
ఒక శబ్దంలో ప్రత్యయరూపంలో ఉన్న ముకారం యతిస్థానంలో ఉంటే చెల్లే యతి మువిభక్తియతి.తే.గీ.
పున్నపుంసక తత్సమంబుల కడపల
దత్సమానాంధ్రదేశ్య శబ్దముల తుదల
గదిసిన మకార శృంగముల్ కావ్యములను
బొసఁగు మువిభక్తియతులన పుఫుబుభులకు. (అప్పకవీయం)
దీని ననుసరించి సంస్కృత పుంలింగ (వృక్షః, కాకః), నపుంసకలింగ (దైవమ్, వనమ్) శబ్దములు తత్సమాలుగా ప్రయోగించినపుడు (వృక్షము, కాకము, దైవము, వనము) కొన్నిటికి చేరే ‘ము’ అనే విభక్తి ప్రత్యయమునకు, వానితో సారూప్యం ఉండే కొన్ని దేశ్యశబ్దాల (బియ్యము, నెయ్యము) చివర ఉండే ముకారానికి పుఫుబుభులతో యతిమైత్రి చెల్లుతుంది.
పఫబభలకు మకారంతో యతి లేదు. అవి పూర్ణానుస్వారపూర్వక మయితేనే మకారంతో యతి చెల్లుతుంది. (ంప, ంఫ, ంబ, ంభ - మ; బిందుయతి). ఈ యతిభేదం వల్ల శబ్దాంతమందున్న ముకారమునకు, పుఫుబుభులకు మైత్రి చెల్లుతుంది. అంటే ఉకారంతో కూడిన పవర్గమంతా (పుఫుబుభుములు) తమలో తాము మిత్రాలవుతున్నాయి.
ఈ మైత్రికి హేతువు ముప్రత్యయ చరిత్ర వలన తెలుసుంది. మువర్ణం యొక్క పూర్వరూపం పువర్ణకం. ఉచ్చారణాసౌలభ్యం కోసం పకారం బకార మయింది. నాదవర్ణం యొక్క సాన్నిహిత్యం వలన బిందుపూర్వకాన్ని, వర్గపంచమాక్షర స్వరూపాన్ని పొంది పువర్ణకం బు, ంబు, మ్ము, ము రూపాలను పొందింది. కావ్యాలలో మువర్ణకానికి రూపాంతరంగా ంబు, మ్ము అనే ప్రత్యయాలు ప్రయోగింపబడ్డాయి. సరసపుమాట (సరసము + మాట) వంటి సమాసాలలో మువర్ణకానికి పువర్ణం ఆదేశమౌతున్నది. ఈ విధమైన భాషాచారిత్రక కారణాలవల్ల పందాంతంలో ఉన్న మువర్ణానికి పుబులతో, దానివల్ల ఫుభులతో మైత్రి ఏర్పడుతున్నది. దీనిని బట్టి ముకారంతో ఉకారస్వరవర్గానికి చెందిన ఉ ఊ ఒ ఓ లతో కూడిన పవర్గాక్షరాలన్నిటికి మైత్రి చెల్లుతుంది. అంటే ము - పుపూపొపో ఫుఫూఫొఫో బుబూబొబో భుభూభొభో లకు మిత్రాలు.
ఉదా ...
అ)
పుష్కరము సూక్ష్మమధ్యమ*ముగ నొనర్చె
ఫుల్లపంకేరుహము వక్త్ర*ముగ నొనర్చె
బొండుమల్లెలు దరహాస*ముగ నొనర్చె
భోజనృపనందనకు నిక్క*ముగ నజుండు (అప్పకవీయం)
ఆ)
బుట్టిన సదసద్వివేక*ములు గలిగిన దా (భార. ఆది. 5-58)
ఇ)
భూనుత ధాన్యంబు బీజ*ములు వణిజులకున్ (భార. సభా. 1.44)
2) ముకారయతి (చక్కటి యతి)
మువిభక్తి యతి యందు ప్రత్యయాత్మకమూ, పదాంతమూ అయిన ముకారానికి యతిమైత్రి చెప్పబడింది. తద్భిన్నమైన ముకారానికి యతిమైత్రిని ముకారయతి అని అంటారు.
క.
హెచ్చరికను పుఫుబుభులకు
నచ్చపు మాకొమ్ములే మహాకవులాదిన్
మెచ్చులుగ నిలిపి రచ్చట
నచ్చటను ముకారయతు లటంచును గృతులన్. (అప్పకవీయం)
మహాకవు లచ్చటచ్చట పదగతమైన సహజ ముకారంతో పుఫుబుభులకు పాటించిన యతిమైత్రి ముకారయతి. మువిభక్తియతి యొక్క సామ్యం వల్ల ముత్యము, సముద్ధతి, ముందు, వేము మొదలైన వానిలోని సహజ ముకారాలకు (అచ్చపు మాకొమ్ములు) పుఫుబుభులకు యతి చెల్లుతుంది. అచ్చటచ్చట అనడం వల్ల ఈయతి పరిమితప్రయోగం కలదని తెలుస్తున్నది.
ఉదా ...
అ)
స్ఫురదురు వీతిహోత్రుని స*ముజ్జ్వల మేరుసమాన గాత్రునిన్ (శ్రీరంగ మాహాత్మ్యము)
ఆ)
ముక్తకేశాంబరోజ్జ్వల*భూషుఁ డగుచు (భాస్క. రామా. యుద్ధ. 1765)
ఇ)
మ్రొక్కులు గైకొను సమస్త*భువనాధీశా (సులక్షణ సారము. 101)
ఈ)
భువన బీజంబు కైవల్య*మోక్షదాయి (భీమ. 5-50)
చివరి రెండు ఉదాహరణల వలన మువర్ణమే కాక మూ, మొ, మోలకు ఈ యతి చెల్లుతుందని తెలుస్తున్నది.
ఏతావాతా తేలిన దేమంటే ...
‘పుపూపొపో - ఫుఫూఫొఫో - బుబూబొబో - భుభూభొభో - ముమూమొమో’ లకు యతి చెల్లుతుంది.
(ఈ పాఠంపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి)

8 కామెంట్‌లు:

  1. అయ్యా! శంకరయ్యా గారూ!
    అందరికీ ఉపయోగపడే పాఠాలు చెప్పుచున్న మీకు ధన్యవాదాలు.
    ఇలా కొన్ని కొన్ని పాఠాలు కొనసాగితే బాగుంటుంది.
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  2. మాస్టారూ, పాఠం బ్రహ్మాండంగా వుంది. మీరు "ఏతావాతా తేలిన..." అనే వాక్యం చివరగా వ్రాసారు కాబట్టి నాకున్న సందేహం అడగకుండానే తీరింది. ప్రామాణికంగానూ వుంది, సామాన్య పదజాలం వాడి దానిని వివరించిన తీరు బాగుంది. అయితే అదివరలో అడిగినట్లు, మీ సుదీర్ఘ బోధనానుభావంలో విద్యార్ధులు లేక జనబాహుళ్యం సామాన్యం గా చేసే తప్పులు (common mistakes) చాలా చూసే వుంటారు. అవి ఒక సెక్షన్ పెట్టి అందులో కొన్ని ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది. వయోజనులకు counter examples ద్వారా నేర్చుకొంటే పాఠం గట్టిగా అతుక్కొంటుందని ఈ మధ్య రిసెర్చ్ ద్వారా తెలుసుకొన్న విషయము. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా ! చాలా చక్కని పాఠం ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  4. మంచి పాఠం తమ్ముడూ ! ఇంత విశదంగా ఆ రోజుల్లో తెలుగు మాష్టారు చెప్పారో లేదో గుర్తు లేదు గానీ , [ నేనే శ్రద్ధగా వినలేదో ] ఇప్పుడు మాత్రం చాలాబాగుంది. ఒక్కొక్కరు పాఠం చెబుతుంటే " మంత్రించి నట్టుగా వింటాం .అది ఎప్పడికీ గుర్తు ఉంటుంది . విద్యార్ధి దశకు పంపు తున్నందుకు ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  5. సరళమైన పదాలతో, ఉదాహరణలతో, నిష్ఠతో ఇష్టంగా పాఠం చెప్పుతున్న గురువర్యులకు వందనాలు.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారూ నమస్కారములు ,ధన్యవాదములు. అంతర్జాలములో ఉండడము వలన, చంద్రశేఖరుల వారు శలవిచ్చి నట్లు వయోజనుల మవడము వలన తప్పులు చేసినా ఫరవా లేదు. నాకు స్వానుభవము అదృష్ట వశాత్తు కలుగ లేదు గాని మా శ్రీ పేరి కామేశము మాష్ట్రగారు ముందో మొట్టికాయ తర్వాత పూర్తి వివరణ ( మువర్ణ యతి సరిపోయిందిగా ) యిచ్చే వారు. గుండె దడ ఉన్నా ఆయన పాఠాలు ఆనందించే వారము. ఇప్పుడా భయము లేకుండా సరదాగా నేర్చుకొంటున్నాము.

    రిప్లయితొలగించండి
  7. నాకు గుర్తుంన్నంత వరకు నేను పాఠశాలా దినాల్లో ఇంత శ్రధ్ధగా వ్యాకరణం ఛందస్సులు పట్టించుకున్నది లేదు. చిన్నతనం నుండి ప్రాచీనసాహిత్యం చదవటం అలవాటు కావటం వలన పరమవీరగ్రాంధికం అలవోకగా వ్రాయ గలగటం అనే తలబిరుసుతో సహా అనేకానేక కారణాలు. దానికి తోడు ఛందస్సులో వ్రాయగలగటం కూడా సులభంగానే పట్టుబడేసరికి నిర్లక్ష్యం పెచ్చు మీరిపోయింది. తరువాత శ్రధ్ధ కుదిరనా నేర్చుకొనే సమయం అవుకాశం రెండూ వృత్తిగత కారణాల వలన దొరకలే దెన్నడూ. మీ దయ వలన రిటైరయ్యాక ఇపుడు కలసి వచ్చింది. చాలా ధన్యవాదాలు మీకూ మీ పాఠాలకీ.

    రిప్లయితొలగించండి