4, నవంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 515 (కొంటెవాఁ డెదిగెను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కొంటెవాఁ డెదిగెను జగద్గురు వనంగ.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.
*********************************************************************************

29 కామెంట్‌లు:

  1. సన్య సించెను ప్రీతితో శంకరుండు
    పెద్దవాడయి పెండ్లాడి పిల్లల గని
    అమ్మ తోడను కలిసుండ మనసున నను
    కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ

    రిప్లయితొలగించండి
  2. చెలుల చీరెలు దాచెను చెట్టు పైని
    వెన్న పాల్ మీగడలు దోచె చిన్న నాట
    యాదవుండు గీతాచార్యుడయ్యె పిదప
    కొంటెవాడెదిగెను జగద్గురువనంగ

    రిప్లయితొలగించండి
  3. తూర్పు దిక్కున సవితృడు తొంగి చూసి
    కమల భామల నూరించి కబురు లాడె
    సన్నుతుండయి సప్తాశ్వ జవము తోడ
    కొంటె వాడెదిగెను జగద్గురు వనంగ.

    రిప్లయితొలగించండి
  4. కొంటె వాడె! దిగెను జగద్గురు! వనంగ
    బాణ సంఘాతి యోయన భామ రాధ
    గూడి రాసలీలలకునా గోప గోపి-
    కాజనము మై మఱచి జూడ కనుడు వింత!

    రిప్లయితొలగించండి
  5. నగవు లొలికింపగాజేయు నటులపాలి
    హాస్య మభినయించెడువిద్య కాద్యుడనిన
    పేరుగొన్నట్టి చార్లిచాప్లీను డన్న
    కొంటెవాడెదిగెను జగద్గురువనంగ


    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  6. మన్ను తిందునా నేనంచు మాయ జేయు
    వెన్న దొంగిలి తినుచుండు పిల్లవాడు
    తల్లి కొంగుకు చాటున దాగుచుండు
    కొంటెవాడెదిగెను జగద్గురువనంగ.

    రిప్లయితొలగించండి
  7. వేదములకెల్ల భాష్యంబునాది జెప్పి
    మిశ్రు నోడించి జగతిన మేటి యగుచు
    శర్వు ప్రతిరూపమగు బాలశంకరుకను
    గొంటె, వాడెదిగెను జగద్గురువనంగ.

    "వాడు" అనే శబ్దము వచ్చినది కావున ఇది శంకరుల గురువైన శ్రీ గోవిందపాదుల మాటలుగా అనుకోవాలని మనవి.

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందరి పూరణలు అలరించుచున్నవి.
    నాపూరణ లోని పలుకులు శంకరాచార్యుల తల్లి తోటి వారితో పలికిన పలుకులుగా భావించ వలసినదిగా మనవి.

    రిప్లయితొలగించండి
  9. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, నవంబర్ 04, 2011 12:20:00 PM

    సర్వ దేవతా సత్తాక సాయి నాధ !
    తలచి నంతనె వచ్చి యాదరము జూపి ,
    యండ నిలుతువు వేగ రమ్మనుచు , వేడు
    కొంటె - వాడె -దిగెను ,జగద్గురు వనంగ

    రిప్లయితొలగించండి
  10. గురువుగారికి, పండిత నేమాని వారికి ధన్యవాదములు తెలుపుతూ
    నిత్యానంద నేను జగద్గురువునని జెప్పు, అది
    ---------------
    జనులు జేరి నిత్యము నామ జపముజేయ
    గలిగెను విదేశ భక్తులు కలియుగమున
    కొంటెవాడెదిగెను జగద్గురువనంగ,
    రాస లీలలందుమునిగె రమణితోడ|

    రిప్లయితొలగించండి
  11. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, నవంబర్ 04, 2011 12:45:00 PM

    రార కన్నయ్య! రార వరాల పంట !
    రార వెన్నారగింప గారాల పట్టి !
    యని యశోదమ్మ నోరార తనను మురుసు
    కొంటె - వాడె - దిగెను ,జగద్గురు వనంగ

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్చాస్త్రి గారూ,

    మూడవ పాదములో యతి సరిపోలేదనుకుంటాను. "అమ్మ" కు బదులుగా "మాత" అని వ్రాస్తే సరిపోతుందేమో??

    రిప్లయితొలగించండి
  13. గురువుగారూ,

    నాదొక చిన్న సందేహము. నా పూరణలో "కొంటె" కు బదులుగా "గొంటె" అని వ్రాసినాను. ఇది సమ్మతమేనా?? సరిచూడవలసినది.

    రిప్లయితొలగించండి
  14. మగని పిలకకును మడఁతి పూజడకును
    .....ముడులు పెట్టుచు నాడు ముచ్చట పడె
    పెరుగు పాలను తాను పీక వరకు త్రాగి
    .....మిగిలిన వాటిని పగులగొట్టె
    సిగ్గన్నదే లేక చేడియ చీరలు
    .....చేతఁబట్టి వెడలె చెట్టు పైకి
    అరమరలను బెట్టె నత్త కోడళ్లకు
    .....పిల్ల తనంబున నల్లవాఁడు

    రాజ సూయమునందున పూజలొందె
    రాయబారముఁ జేసెను రాజ సభన
    గీత బోధించి జగతికి భీతి మాపె
    కొంటెవాడెదిగెను జగద్గురువనంగ!!

    రిప్లయితొలగించండి
  15. చిన్న నాటను చేయగ చిలిపి పనులు
    తల్లి చాటున ముద్దుల తనయు డనగ
    పెరిగె దిశలందు చిన్నయ " సూరి " బిరుదు
    కొంటె వాడెదిగెను జగద్గురు వనంగ

    రిప్లయితొలగించండి
  16. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఆదిశంకరుల ప్రస్తావనతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    అయితే ‘అనుకొంటె’ శబ్దప్రయోగం సాధువేనా అని ఆలోచించవలసి ఉంది.
    సంపత్ కుమార్ శాస్త్రి గారు చెప్పినట్లు మూడవ పాదంలోని యతిదోషాన్ని సవరించండి.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    గీతను బోధించి జగద్గురువైన కృష్ణుని గురించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    తిమిరాన్ని (అజ్ఞానాన్ని) తొలగించి వెలుగును (జ్ఞానాన్ని) నింపే సూర్యుడు జగద్గురువే. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    సమస్య పాదానికి చక్కని విరుపు నిచ్చారు. బాగుంది. అభినందనలు.
    ‘బాణసంఘాతి’ ...?
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    చాప్లిన్ ప్రస్తావనతో చక్కని పూరణ పంపారు. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    కొంటె కృష్ణుడు గీతాచార్యుడై ఎదినట్లు చెప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ‘కనుగొంటె’ చక్కని ప్రయోగం. మంచి పూరణ, అభినందనలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సాయినాథునిపై మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘వేడుకొంటె’ ప్రయోగం చింత్యం.
    కృష్ణునిపై మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    ఇందులోను ‘మురుసుకొంటె’ శబ్దం చింత్యమే.
    **********************************************************************
    వరప్రసాద్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    జిగురు సత్యనారాయణ గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరి అక్కయ్యా,
    16 సం. వయస్సుదాకా అక్షరం ముక్క నేర్వని చిన్నయ ‘సూరి’యై తెలుగుభాషకే ప్రామాణికమైన వ్యాకరణగ్రంథాన్ని రచించాడు. మంచి విషయంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. నిజంగా పెద్ద సమస్యయే. "కొంటెవాడెదిగెను జగద్గురువనంగ" అనగానే శ్రీకృష్ణుడో శ్రీ శంకరులో స్ఫురించటం జరుగుతోంది. శ్రీకృష్ణుడు మూనషరూపం ధరించాడు కాని ఆయన మానుషజననం గైకొనలేదు. అందుచేతనే ఆయన (మానసికంగా) యెదగటం అన్నమాట ఊహించలేనిది. శ్రీశంకరులు జన్మము నుండే పరమవైరాగ్యమూర్తి. ఆయన కూడా (మానసికంగా) యెదగటం అన్నమాట ఊహించలేనిది. దాంతో పూరణ చేయటానికి చేతులు రావటంలేదు. చిత్రమైన పరిస్థితి.

    రిప్లయితొలగించండి
  19. కరులడగలేదు వలదనె కాంచనములు
    బ్రహ్మచారిని కన్యలు బరువనెనిక
    పొడిగ మూడడు లడుగుచు పొట్టి గిటక
    కొంటెవాఁ డెదిగెను జగద్గురు వనంగ!
    సూచన: కొంటెవాడు + ఎదిగెను = కొంటెవాడెదిగెను

    రిప్లయితొలగించండి
  20. శ్యామలీయంగారూ, నేను ఆలోచించి చివరకు వామనుడిని ఆశ్రయించాను. ఇంకొక రకంగా కొంటెవాడె + దిగెను = కొంటెవాడె దిగెను అని కూడా అనుకోవచ్చుగదా!

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ ధన్యవాదాలు. కొంచెం మార్చాను. ఎలా ఉందంటారు?

    కొంటె వాడె! దిగెను జగద్గురు! వనంగ
    బాణ సంఘాతమో యన భామ రాధ
    గూడి రాసలీలలకునా గోప గోపి-
    కాజనము పులకింపగా కనుడు వింత!

    రిప్లయితొలగించండి
  22. చేరి బాబయ్యవద్దనేర్చినవన్ని
    చెలగి *గానప్రసూనాంబకు జెప్పువేళఁ
    జూడ బుడుగునునాకుదోచునెపుడిట్లు
    కొంటె వాడెదిగెను జగద్గురు వనంగ.

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా! దన్యవాదములు.
    సంపత్ శాస్త్రి గారూ ! ధన్యవాదములు.మార్పులు చేపులు చేయు తొందరలో జరిగిన పొరపాటది. సవరించుచున్నాను.

    శంకరాచార్యుల తల్లి తోటి వారితో పలికిన పలుకులు.

    సన్య సించెను ప్రీతితో శంకరుండు
    పెద్దవాడయి పెండ్లాడి పిల్లల గని
    నాదు తోడుగ కలిసుండు ననుచు దలచ
    కొంటె వాఁ డెదిగెను జగద్గురు వనంగ

    రిప్లయితొలగించండి
  24. జ్ఞాన సముపార్జనకును ధ్యాననిష్ఠ
    కున్ను,కార్యసాధనకువాక్శుద్ధికిన్ని
    చూతఫలమనుకొని సూర్యుఁగొన్న
    కొంటె వాడెదిగెను జగద్గురు వనంగ.

    రిప్లయితొలగించండి
  25. శ్రీగురుభ్యోనమ:

    సరస్వతీస్వరూపులైన కవిమిత్రులందరికి నమస్కారములు. నా పిల్లలకు శుభాశీస్సుల నందించినందులకు కృతజ్ఞతలు.

    శారీరక అస్వస్థత కారణంగా ఆలస్యముగా స్పందించినందులకు మన్నించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  26. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    గోపబాలుర గూడి - కొల్ల గొట్టెను పాడి
    గోప కాంతలు మరి - గొల్లు మనగ !
    కొమ్మపై కూర్చుండి - కోకలు హరియించి
    కొమ్మల నేడ్పించి - కులుకు వాడు
    కోనేరు లోనున్న - గోకర్ణమును బట్టి
    గోపాలకుల నెల్ల - కాపు వాడు
    గోవర్ధనము నెత్తి - గోటికొనను నిల్పి
    గోపతి గెల్చిన - గొల్లవాడు !

    గోవు గాపాడ ధర బుట్టి - గొప్పజూపి
    గొల్లవానిగ చరియించి - గోవు గాచి
    గోపకాంత యశోదకు - గుట్టు విప్పి
    కొంటె వాడెదిగెను జగ - ద్గురు వనంగ !
    __________________________________
    గోవు = భూమి = ఆవు

    రిప్లయితొలగించండి
  27. పాలు మీగడల్ దొంగిలె పరుల యింట
    తొయ్య్హలుల మానధనములు దోచుకొనియె
    వధువు నెత్తుకపోయి వివాహమాడె
    కొంటెవాడెదిగెను జద్గురువనంగ.

    ఆర్యా,నా పూరణలు కొన్నిమీ కాలంలో కనిపించడం లేదు ఎందు చేత?

    రిప్లయితొలగించండి