7, నవంబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం - 518 (దోచు కొనిన దొడ్డ దొరకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.
ఈ సమస్యను సూచించిన పండిత నేమాని గారికి ధన్యవాదాలు.

49 కామెంట్‌లు:

  1. ప్రేమరసమునింపి ప్రియురాండ్ర హృదయాలు
    కరుణ జూపి భక్తజన మనములు
    జ్ఞానకాంతి గూర్చి సాధు చేతస్సులు
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  2. పాల కడలి పైన పవ్వళించును గాని
    పాలు వెన్న దోచె, పట్టు వస్త్ర
    ములను కట్టు గాని ముదితల చీరల
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.

    రిప్లయితొలగించండి
  3. పద్యం వ్రాద్దామనుకున్నా కానీ నతులు అంటే అర్థమే తెలియదు.ఇంకేమి రాసేది?

    రిప్లయితొలగించండి
  4. శ్రీ నేమాని మహాశయులు అందించిన తెలుగుపలుకు పద్యం మధురంగా వుంది. వారికి ధన్యవాదాలు. వారి తేటగీతి చదివినపుడు కరుణశ్రీ గారి పద్యాలు గుర్తుకొచ్చాయి. మనం తెలుగువారిగా పుట్టటం అదృష్టం. అప్పయ్య దీక్షితులు గారన్నట్లు, "ఆంధ్రత్వమాంధ్ర భాషాచ బహు జన్మతప: ఫలం", అదే విశ్వనాధ సత్యనారాయణ గారి మాటల్లో "బహుజన్మకృత పుణ్య పరిపాకమున జేసి ఆంధ్రుడై ధాత్రిలో నవతరించు". ఆంధ్రుడై పుట్టినందుకు గర్విద్దాం, దివ్యమైనదీ చావు లేనిది తెలుగు భాష అని చాటి చెబుదాము.
    -చదువరులకు వీలుగా వుంటుందని ఇక్కడ కూడా పోస్టు చేస్తున్నాను. చంద్రశేఖర్.

    రిప్లయితొలగించండి
  5. భాస్కర రామి రెడ్డి గారూ,
    నిఘంటు నిర్మాణ దక్షులై అందరికీ అర్థాలను అందిస్తున్న మీకు అర్థం తెలియలేదా? మీ నిఘంటువులోనే ‘నతి’ అని కొట్టి మూడవ అర్థం చూడండి. నతులు అంటే ‘నమస్కారములు’

    రిప్లయితొలగించండి
  6. ఆర్యా..మీ సహాయం ఈ నిఘంటు నిర్మాణంలో ఎంతో తెలియనిది కాదు. మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. ఆలస్యంగా నైనా దీనికి తప్పక పద్యమిస్తాను. ఈరోజు ఇప్పటికిప్పుడే పద్యరూపాన్ని ఇవ్వలేనందుకు క్షంతవ్యుడని.

    రిప్లయితొలగించండి
  7. దొంగతనముఁ జేసి త్రోవఁ జూపితి వయ్య
    నిన్ను మించి నారు నేటి దొరలు
    నీకు నేల నింక నెయ్యమ్ము నిచ్చుట
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు !

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు . లక్కాకులసోమవారం, నవంబర్ 07, 2011 9:16:00 AM

    పద్య పద్య మందు పరమార్ధ మును జెప్పి
    భాగవతము మధుర ఫలము జేసి
    తెలుగు వారి కిచ్చి తెలుగు వారి మతులు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  9. గురువు గారూ, నమస్సులు. ఈ దినము గూగుల్ ఖాతా ద్వారా వ్యాఖ్యలు పెట్ట గలిగాను. ఎన్నాళ్ళు యిలా కొనసాగుతొందో చూద్దాము. పూర్వము వెంకటేశం గిరీశముతో ' మీ వలన నా కొచ్చిందల్లా చుట్ట కాల్చడం ఒక్కటే ' అన్నట్లు , చంద్రశేఖరం గారిని అడుగుతే చంద్ర భాసురము పట్టడము ఒక్కటే ఆయనకు తెలుసు. ఎందుకు వచ్చింది లెండి, నా పాట్లు నేను పడతాను.

    రిప్లయితొలగించండి
  10. పరమభాగవతులు ప్రహ్లాద ధృవబాల
    కులను బ్రోచినట్టి గొప్పదొరకు
    వడుగు రూపమెత్తి బలిరాజ్యవిభవమ్ము
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    చేరి మ్రొక్కి నట్టి జీవుల పాపపు
    ణ్యముల నీషణత్రయముల తాను
    తనది యన్న భావ తత్పరతల వేగ
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    చేరి యుండ లేదొ చూడమి కతమేమి
    వర్గషట్కదస్యబాధితుడను
    తాపహరికి నీకు దనుజుల దర్పంబు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  11. చదువులపహరించి జలనిధిడాగిన
    సోమకాసురుని విశేషబలము
    వమ్ము సేసి వాని ప్రాణంబు గర్వంబు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    అమృత మపహరించి యసురులు త్రావగా
    నున్న వేళ మోహినీ స్వరూప
    మెత్తి మోహపరచి మెల్లగా సుధనెల్ల
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    పుడమి చాపచుట్టి మున్నీటముంచెడు
    క్రూర కర్ము నొక్క కిటిగ నగుచు
    చంపి యసురుగర్వ సంరంభమంతయు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    బాలుడనక పట్టి భాగవతోత్తము
    హింస బెట్టి నట్టి హేమకశిపు
    అసురదర్పమెల్ల నరసింహమూర్తియై
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    సుతుల నుధ్ధరింప సుదతి యదితి వేడ
    తా నుపేంద్రు డగుచు తల్లి కొరకు
    వడుగు రూపమెత్తి బలిరాజ్యవిభవమ్ము
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    బ్రహ్మహంతలైన భ్రష్టుల గాలించి
    నిశిత పరశుధార పశువుల వలె
    సమయ జేసి సర్వక్షాత్రదుర్మానంబు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    సురవిరోది పంక్తిశిరు జంప నరరూప
    మెత్తి వాని నాజి మొత్తినట్టి
    హరుని వరము వలన నమరిన బలమెల్ల
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    వెన్నముద్ద లనగ మొనసి బ్రహ్మేంద్రుల
    గర్వ రాశు లనగ సర్వదనుజ
    బలము లనగ చెలుల వలువ లనగ
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  12. వేణుగానమహిమ విరిబోణి మనముల
    నల్లనల్లన మన నల్లనయ్య
    దోచుకొనియు, మనకు దొరబాబు గాకేమి?
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా చింతా రామకృష్ణా రావు గారూ!
    మీరు తొందరలో పద్యము వ్రాసినట్లున్నారు. మొదటి పాదములో ప్రాసయతి వేద్దామనుకొన్నారు. సిరిపతి - కోరి కొలువ : సిరిలో ప్రాస ముందు అక్షరము లఘువు (సి) దాని యతిస్థానములో కోరి లో ముందు అక్షరము (కో) గురువు. కాస్త సరిజేయండి.
    నేమాని సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  14. నా తప్పు నేనే చూచుకున్నాను. నా పద్యము 2వ పాదములో భక్త గణ మనములు అని వ్రాసి, టైపు చేస్తున్నపుడు తప్పుగా టైపు చేసేను. 2వ పాదము సరిజేస్తే, మొత్తము పద్యము ఇలా ఉంటుంది:

    ప్రేమరసము నింపి ప్రియురాండ్ర హృదయాలు
    కరుణ జూపి భక్త గణ మనములు
    జ్ఞానకాంతి గూర్చి సాధు చేతస్సులు
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  15. నేమాని వారికి నమస్కారాలు. మంచి సూచనలకు ధన్యవాదాలు. బహుకాలం పద్యరచనకు దూరంకావటం వలన చిక్కులు కలుగుతున్నాయి. ముఖ్యంగా యతుల విషయంలో. అధ్యయనం చాలా అవసరం నిజమే. హల్లుల మీదనుండే అచ్చులకి కూడా యతి వెయ్యాలని తెలిసినా అచ్చులకు యతులవిషయంలో నాకు కొంత గందరగోళం ఉన్నట్లుంది. పరిశ్రమచేయాలి యీ విషయంలో. మీ సూచనల మేరకు నా సవరణలు:

    నున్న వేళ మోహినీ స్వరూప --> నెంచు వేళ మోహినీ స్వరూప
    క్రూర కర్ము నొక్క కిటిగ నగుచు --> కిల్బిషాత్ము నొక్క కిటిగ నగుచు
    సమయ జేసి సర్వక్షాత్రదుర్మానంబు --> సకలకులము నణచి క్షాత్రదుర్మానంబు
    వెన్నముద్ద లనగ మొనసి బ్రహ్మేంద్రుల --> వెన్నముద్ద లనగ వేడ్క బ్రహ్మేంద్రుల

    దయచేసి యితర మైన యత్యాది భంగప్రదేశాలుంటే వాటిని గూడ యెత్తి చూపగలరు.

    రిప్లయితొలగించండి
  16. శ్యామలీయం గారూ! దొడ్డ దొరకు మీరు వివిధ రకాలుగా చేసిన నతులు బాగున్నవి.
    చిన్న సవరణలు చేయవలసి యున్నది.

    అసురదర్పమెల్ల నరసింహమూర్తియై.. లో.. యతి
    బలము లనగ చెలుల వలువ లనగ .. లో.. చివరి రెండు గణములు.

    రిప్లయితొలగించండి
  17. ఏదో జరిగింది - మనకు తెలియనిది. నేమానివారు నాకు చేసిన అమూల్య సూచనలతో కూడిన వ్యాఖ్య హఠాత్తుగా మాయమైనది!

    రిప్లయితొలగించండి
  18. శ్యామల రావు గారూ,
    నాకూ ఆశ్చర్యకరమే. నేమాని వారి వ్యాఖ్య ఎలా ఎందుకు మాయమయిందో నాకు అర్థం కావడం లేదు. నా మెయిల్ ఇన్ బాక్స్ లోని వ్యాఖ్యను కాపీ చేసి పేస్ట్ చేసున్నాను ....
    పండిత నేమాని వారి వ్యాఖ్య .......
    అయ్యా! శ్యామలీయం గారు చక్కని దశావతార స్తుతి చేసిన విధము చాల బాగున్నది. ప్రశంసనీయము- వారికి అభినందనలు. వారి పద్య రచనలో మంచి ధారాశుద్ధి ఉన్నది. భావము, ఆధ్యాత్మిక విజ్ఞానమునకు జోహారులు. చిన్న సలహా - యతులు, ప్రాస యతులు కొన్ని కొన్ని పద్యములలో సరిపోలేదు. యతి, ప్రాసయతి నియమములు వారు అధ్యయనము చెయ్యాలి. ముఖ్యముగా హల్లుకి హల్లుకే యతి వేస్తున్నారు గాని ఆ హల్లుల మీదనుండే అచ్చులకి కూడా యతి వెయ్యాలి అనే నియమము వారికి తెలియదు అని అనుకొంటాను. మరొక విషయము - పరశురామ స్తుతిలో 3వ పాదము : సమయజేసి సర్వ క్షాత్ర దుర్మానంబు - లో సర్వ క్షాత్ర అనే సమాసములో ర్వ గురువు అవుతోంది - అందుచేత గణ భంగము కనిపించుచున్నది. గ్రహించ గలరు.
    నేమాని సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రిగారి సూచనలకు ధన్యవాదాలు. సవరించినపాదాలు:
    అసురదర్పమెల్ల నరసింహమూర్తియై -> పరమదర్పమెల్ల నరసింహమూర్తియై
    బలము లనగ చెలుల వలువ లనగ -> బలము లనగ చెలుల వలువ లనగ వేడ్క

    సవరణలు అవుసరమైన యితర సందర్భాలను గమనిస్తే దయచేసి వాటినీ సూచించగలరు.

    రిప్లయితొలగించండి
  20. ఆర్యా! అవధాని గారూ! వ్రాతలో పొరపాటున పదాలు తారుమారయాయి. సరి చేసి వ్రాసాను. ధన్యవాదములు.

    సిరి పతి హరిఁ గోరి చేరి కొలువ నాదు
    దుష్ట గుణము లెల్ల తొలగ జేసి
    నాకు జ్ఞాన మొసగె. నాలోని మనసునే
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మసోమవారం, నవంబర్ 07, 2011 2:38:00 PM

    నీరు నిలువరించి నేలసారముబెంచి
    అన్నపూర్ణ బిరుద మాంధ్ర కొనర
    నార్య "కాటను"డయి ఆంధ్రుల మనసులు
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  22. కొడుకు హితవు గోరి కోట్లకు పడగెత్తి
    మూట ముల్లె సర్ది ముక్తి నొందె
    రాష్ట్ర ముఖ్య మంత్రి రారాజు! సర్వము
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  23. అయ్యా శ్రీ శ్యామలీయం గారూ!
    మీరు ఈరోజు తొలి విడతగా పంపిన 3 పద్యములలో, 3వ పద్యము 1వ పాదములో యతిలేదు.
    హల్లుల హల్లుల యతి మైత్రితోబాటు వాటి పైనుండే అచ్చులకు ఈ విధముగా యతిమైత్రి చూడాలి:

    అ, ఆ, ఐ, ఔ లకు
    ఇ, ఈ, ఋ, ౠ, ఎ, ఏ లకు
    ఉ, ఊ, ఒ, ఓ లకు

    అచ్చులపరంగా యతి చెల్లుతుంది. గ్రహించగలరు.
    నేమాని సన్యాసిరావు

    రిప్లయితొలగించండి
  24. నేమాని వారికి ధన్యవాదాలు. సవరించిన పాదం:
    చేరి యుండ లేదొ చూడమి కతమేమి --> శీతకన్ను వేయు చున్నావు నేనును

    రిప్లయితొలగించండి
  25. మంచి వాని కెపుడు మరియాద నీయరు
    ముక్కు సూటి నడత యెక్క దెవరి
    కవసరమ్ము తీరునటు తీపి మాటలన్
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు.

    రిప్లయితొలగించండి
  26. ఇంకొక ప్రయోగం. ప్రాస స్థానంలో 'న' ఉంచి, 'దోచు కొ తరువాత పాదవిభజన చేసి యీ సమస్యను కందంలో యిరికించి కూడా పూరణ చేయవచ్చును. నా ప్రయత్నం చిత్తగించండి:

    వనితల చీరలు వెన్నలు
    దనుజేంద్రుల తలలు భక్తి తత్పరు లగుస
    జ్జనుల మనంబులు దోచు కొ
    నిన దొడ్డ దొరకు నతులు మునిజన నుతునకున్

    రిప్లయితొలగించండి
  27. అయ్యా శ్యామలీయం గారూ!
    మీ 2వ సవరణలో యతి గురించి సవరించబోయారు గాని మళ్ళీ అదే పొరపాటు దొర్లింది. అంతేకాదు మీ క్రొత్త పాదములో "శీతకన్ను" అని సమాసము చేయవచ్చునా?

    రిప్లయితొలగించండి
  28. యతిభంగం కల "చేరి యుండ లేదొ చూడమి కతమేమి" అనే పాదాన్ని "శీతకన్ను వేయు చున్నావు నేనును" అని సవరించి కార్యంలేదు నేమానివారు చెప్పినట్లు. యతిక్రీడ కొంత ఉత్సాహభరితంగానే ఉంది. అదీగాక కార్యాలయంనుండి యింటికి వచ్చాను కాబట్టి మరింత మనసు పెట్టి ప్రయత్నస్తాను. మనలో మనమాట, శీతకన్ను అనేది దుష్టసమాసమే కాని జనప్రయోగ ప్రసిధ్ధమే. అదీ కాక నిఘంటువు కెక్కినది. కనీసం రవ్వా శ్రీహరిగారి నిఘంటువులో కెక్కింది.

    నేమాని వారూ, తొలి రెండు పాదాలు మార్చి యీ పద్యం పునర్నిర్మించి వ్రాస్తున్నాను. ఈ రోజు మీకు చాలా శ్రమ కలిగిస్తున్నా ననిపిస్తోంది

    వర్గషట్కదస్య బాధితుడగు నన్ను
    కావ కుందు వేమి కారణంబు
    తాపహరికి నీకు దనుజుల దర్పంబు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    ఈ సారి యీ పద్యంలో యతిబాగానే దట్టించానని భావిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  29. శ్యామలీయము గారూ, యతులు మీ వంటి భాషా నిపుణులు సుళువుగా పాటించగలరు. మీ పద్యాలు సుందరముగా ఉన్నాయి. ఇంకా వసంత కిశోర్ గారు రంగ ప్రవేశము చెయ్యాలి. గురువు గారికి బోలెడు పని!

    రిప్లయితొలగించండి
  30. గురు జన పద్య ,భావ ,వచ గుంఫిత శోభల దేలి - శంకరా
    భరణము నేడు' నా 'తెలుగు భారతి పావన కంఠ సీమ కా
    భరణము గా - మనోజ్ఞ యయి భాసిలె- నాదు మనంబు వేడుకన్
    పరి పరి నంద డోలికల పట్టుల నూయెల లూగె నెంతయున్

    రిప్లయితొలగించండి
  31. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    సంతోషం! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  32. అయ్యా, నాకు కనిపించినంత వరకు కందపద్యంలో ఇక్కడ ప్రస్తుతానికి కనిపిస్తున్న పూరణ వనితల చీరలు వెన్నలు....నతులు మునిజన నుతునకున్ అన్నది నేను పంపినదే. చిత్తగంచగలరు.

    రిప్లయితొలగించండి
  33. అయ్యా! శ్రీ ఎల్.వి.రాజారావు గారి ప్రశంసా పద్యమును చూచేను. అభినందనలు. మొదటి పాదములో గురుజన పద్య భావ వచ గుంఫిత అన్నారు కదా. వచ గుంఫిత అనే ప్రయోగమును పెద్దలు పరశీలించాలి. రస గుంఫిత అనే ప్రయోగము సముచితమేమో.

    రిప్లయితొలగించండి
  34. **********************************************************************
    పండిత నేమాని గారూ,
    అద్భుతమైన పూరణ. అభినందనలు.
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    దోచుకొనే దొరల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మధురమైన మీ పూరణ నిజంగానే మనస్సులను దోచింది. అభినందనలు.
    **********************************************************************
    శ్యామల రావు గారూ,
    దొడ్డదొరకు మీ వివిధరకాల నతులు చాలా బాగున్నవి. అభినందనలు.
    దొడ్డదొరకు నతులు దోచిపెట్టిన పెక్కు
    పూరణములు మోదమును గలుఁగఁగ
    చక్కఁజెప్పినట్టి శ్యామల రావను
    ‘శ్యామలీయ’మునకు నంజలింతు!
    గణయతుల గురించి నేమాని వారు, గోలి వారు చేసిన సూచనలకు స్పందించి సవరణలు చేసారు. సంతోషం!
    కందపద్యంలో మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    అద్భుతమైన పూరణ నిచ్చారు. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ
    కాటన్ ‘దొర’ ప్రస్తావనతో మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    ‘కమనీయం’ గారూ,
    మీ మొదటి పూరణ బాగుంది.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    నాతో పాటు మూర్తి గారూ మీకోసం ఎదురుచూస్తున్నారు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  35. **********************************************************************
    శ్యామల రావు గారూ,
    మన్నించాలి. పొరబడ్డాను.
    ఇప్పుడు సవరించాను.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    లక్కాకుల వారి పద్యానికి మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  36. గురువు గారు,
    మా వేణుధరునికి నా పూజను గమనించమని విన్నపం.

    రిప్లయితొలగించండి
  37. తేటగీతి లో నా పూరణ:
    విష్ణు మహిమలవి యనంత విధములు గద
    బలిని బంధించి దోచిన వామనునకు
    విష్ణువై ద్విపదములను విశ్వమెల్ల
    వరలి దోచు కొనిన దొడ్డ దొరకు నతులు.

    రిప్లయితొలగించండి
  38. వలపు వలలు విసరి వనితల మది దోచి
    తుంగ లోన త్రొక్కు తుట్ట తుదకు
    దొరికి నంత దొరకు తోయజాక్షి వలపు
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు
    -----------------------------------------
    రాజ కీయ మందు రాటు దేలిన వారు
    కోట్ల కోట్ల ధనము కొల్ల గొట్టి
    జనుల నోట మన్ను చక్కగా దట్టించి
    దోచు కొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  39. మాష్టారు గారికీ, పండిత కవిమిత్రులకు,
    శంకరాభరణంలో పద్యం వ్రాయటం అంటే అంత సులభం కాదు, ఒక ప్రామాణికత వుండాలి అనే గొప్ప స్థాయికి ఎదిగినందుకు చాలా ఆనందంగా వుంది. సాటి మిత్రుల పూరణలను శల్యపరీక్ష చేసి ఆరోగ్యకరమైన సలహాలిచ్చే పండితులు, కవి మిత్రులు నిష్ణాతులైన వారు. అట్టి వారి మధ్య ఒక పద్యం ప్రచురించగలగటమే ఒక అనుభవం, అదృష్టం. వారు అలానే కొనసాగించాలని మనవి.

    రిప్లయితొలగించండి
  40. డా. మూర్తి మిత్రులకు నాపై నున్న అనురాగానికి కృతజ్ఞతలు. ఏం చేస్తాం, దగ్గరకొస్తే సూది మందిస్తారు, దూరం జరిగితే గుఱ్ఱం ఎక్కమంటారు. అసలే నరసింహులు, మిమ్మల్ని శాంతింప జేయటం కష్టమే సుమా! ఏదో ఉడతా భక్తి గా ద్రావక, పానక, పానీయాలు సమర్పించుకొంటున్నాము. ఏమైనా గాని మీకు చంద్ర భాసురం అంటే మక్కువ. అహఁ, నా ఉద్దేశ్యం, చంద్రుని వెన్నెల అంటే ఇష్టం అని. మరి వచ్చేది కార్తిక పౌర్ణిమ కదా! అంతే మహాప్రభో, అంతే. ఇంకేమీ లేదు గాక, లేదు :-)

    రిప్లయితొలగించండి
  41. **********************************************************************
    మందాకిని గారూ,
    మీ పూరణ నా దృష్టికి రాలేదు. మౌజ్ చక్రాన్ని పైకీ క్రిందకీ త్రిప్పే క్రమంలో మీ పూరణను దాటవేసాను. మన్నించాలి.
    నల్లనయ్య దోచుకొన్నవాడైన మనకు దొరబాబే అన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    అది ‘విరిబోడి’. విరిబోణి అనరాదు.
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    తేటగీతిలో మీ పూరణ అదిరింది. చక్కని పూరణ. అభినందనలు.
    బ్లాగును గురించిన మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
    ఇక మీ మూర్తి గారితో మీ ‘సరస’ (చంద్రభాసురం రసమే కదా) సల్లాపాలు మాకు క్రొత్త కాదు కదా!
    **********************************************************************
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి (అదీ నిర్దోషంగా!). అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  42. 1.
    నిత్యమగుటచేత నేతలరాకయే
    భటులుచెఱసాలద్వారముకడ
    ఫలకముంచిరేమొపలుకస్వాగతమిట్లు:
    "దోచు కొనిన దొడ్డ దొరకు నతులు".

    రిప్లయితొలగించండి
  43. హమ్మయ్య .! తమ్ముడూ ! బాగున్నాయన్న మాట . శ్రమ పెట్ట కూడదు కదా ? అం.....దు........క......ని .
    ధన్య .......వాద......ములు.

    రిప్లయితొలగించండి
  44. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    శంకరాభరణం శంకరయ్యగారికి వందనములతో :

    01)
    _____________________________________

    ఉదయ సంధ్య మొదలు - ఉదరథితో పాటు
    పద్యములను వ్రాయ - పాదమిచ్చు
    అసుర సంధ్య ముగియ - అలుపది యనుకోక
    శంక దీర్చి మురియు - వంక యనక
    ఉభయ సంధ్యల యందు - ఉద్యోగ మనురీతి
    జీత బత్తె మనక - సేవ జేయు
    ఆంధ్ర మాత మురియ - ఆభరణము లెన్నొ
    ఆనతి నిడి యామె - కందజేయు !

    మిత్రులంత మేలు - మేలని పొగడంగ
    విబుధవరులు మెచ్చి - విదితు డనగ
    పిల్ల పాప యనక - యెల్లరి మనములు
    దోచు కొనిన దొడ్డ - దొరకు నతులు !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  45. అందరికీ నమస్కారం

    లోకవంద్యు వెదుక లోకంబుల దిరిగి
    స్రష్టకు శశిధరుకు శాపమొసగి
    యెడద తన్ను దొడ్డ ఋషి యహంకారమున్
    (లేదా)
    గుండె తన్నినాభృగువుయహంకారమున్
    దోచుకొనిన దొడ్డ దొరకు నతులు

    రిప్లయితొలగించండి
  46. **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో గణదోషం. ‘భటులు చెఱసాల’ను ‘భటులదె చెఱసాల’ అంటే సరి!
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    నా పైకే బాణాన్ని ఎక్కుపెట్టారు కదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    కళ్యాణ్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘శశిధరునకును’ అనవలసింది. అలా అంటే గణదోషం. అందుకని ‘శివునకును’ అంటే సరి. మూడవపాదంగా మొదటిదే బాగుంది.
    **********************************************************************

    రిప్లయితొలగించండి