17, నవంబర్ 2011, గురువారం

సమస్యా పూరణం - 529 (కసి కసితో మ్రింగనెంచె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
             కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

35 కామెంట్‌లు:

  1. రసికులని శూర్పణఖ చన
    వెస రాముడు లక్ష్మణుడును వినకుండుటచే
    కుసుమాస్త్ర తప్తయగు ర
    క్కసి కసిగా మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!

    రిప్లయితొలగించండి
  2. వీలైనప్పుడు సమస్య పాదాలు తయారు చేసేవాడిగా ఆసక్తితో అడిగే ప్రశ్న - "కసి కసితో" అన్నచోట కసి అనే పదం పునరావృత్తమైనది. అది వ్యావహారికంలో చెల్లుతుంది గానీ, గ్రాంథికంలో అలా అనవచ్చా? అటువంటి పదప్రయోగం చేయవచ్చా? పండితులు, తెలిసిన వారు వివరించ గలరని మనవి. తెలిస్తే కొన్ని ప్రామాణిక ఉదాహరణలు ఇవ్వమని ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  3. శ్రీనేమాని వారి పూరణ వేరే రకంగా పూరించవచ్చనే దారి చూపింది. బాగుంది. కానీ నాసందేహం ఇంకా తీరలేదు. తెలిసినవారు స్పందించగలరు.

    రిప్లయితొలగించండి
  4. చంద్రశేఖర్ గారూ,
    పండిత నేమాని వారి పూరణ చూస్తే మీకు సమాధానం దొరుకుతుం దనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  5. చంద్రశేఖర్ గారూ,
    ‘కసికసిగా ఉందిరా ... ’ సినిమా పాటను మరిచిపోండి. మరో రకంగా ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  6. మాస్టారూ, ఆ పాట ఏమిటో నిజంగా నాకు తెలియదు. సినిమా జ్ఞానం తక్కువ. రక్కసి, వెక్కసి నాకూ తట్టినవి. కానీ సమస్య పాదాన్ని యదాతథంగా పూరించదలచిన తప్పగునా అనేది సందేహం.

    రిప్లయితొలగించండి
  7. కసి (విశేష్యం) = తీట, దురద; తమి, అపేక్ష, కోరిక; కోపము
    కసి (విశేషణం) = అల్పం (ఉదా. కసిగాటు)
    ఈ లెక్కన ‘కసి కసిగా’ శబ్దానికి ‘అల్పమైన కోపంతో’ అనే అర్థం తీసికొని పూరించవచ్చు.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    నేమాని వారి రక్కసి బావుంది !

    నేమాని వారి స్ఫూర్తితో :

    01)
    _____________________________________

    మసకము తీరక వగతో
    మిసమిసయను సీతను గని - మిక్కిలి పగతో
    విసవిస రక్కసి నగుచున్
    కసికసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!
    _____________________________________
    మసకము = సంభోగేచ్ఛ

    రిప్లయితొలగించండి
  9. మన తెలుగు - చంద్రశేఖర్గురువారం, నవంబర్ 17, 2011 8:40:00 AM

    ధన్యవాదాలు, మాస్టారూ.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ పండిత నేమాని వారి పూరణ అద్భుతము. కిశోర్ జీ చక్కని పద్యము చెప్పారు.

    అసురుల విధ్వంసమునకు
    గుసుమంబును బోలి యలరు కువలయ తనయే
    వెస నసురు జిక్కె విధియే
    కసి కసితో మ్రింగ నెంచె క్ష్మాసుత నకటా !

    రిప్లయితొలగించండి
  11. 'రసికుడు రావణ ప్రభువును
    రసికత పెండ్లాడ నీవు రాజ్ఞివె యనుచున్ '
    ఉసి గొల్ప నొల్లనన ర
    క్కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!

    రిప్లయితొలగించండి
  12. హనుమచ్ఛాస్త్రి గారూ,
    అన్యాయమండీ ... నేను సరిగ్గా ఇదే భావంతో పూరణ మొదాలు పెట్టి సగం పద్యం వ్రాసానో లేదో మీ పూరణ వచ్చింది. సరే .. మరో ఆలోచన చేస్తాను.

    రిప్లయితొలగించండి
  13. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, నవంబర్ 17, 2011 10:49:00 AM

    అసహాయశూరు, రావణు
    పసరికగా మదితలంచి పలుకుటగని యా
    అసురేశు దాసిగణములు
    కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా

    తొలిపాదం నాకెందుకో అదోలా అనిపిస్తోంది. ఎదైనా పొరపాటు జరిగిందా?? పెద్దలు దయచేసి పరికించండి

    రిప్లయితొలగించండి
  14. పస చెడి గర్భము నందే
    కసికసి తో మ్రింగ నెంచె క్ష్మా! 'సుత' నకటా !
    వెస' నాడ పిల్ల 'లను - నీ
    కసు మాలపు జాతి నుండి కావగ లేవా ?

    రిప్లయితొలగించండి
  15. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, నవంబర్ 17, 2011 11:33:00 AM

    పెద్దలూ!

    కొద్దికాలంగా నమనసులో మెదులుతున్న ఒక అనుమానం లేద సందేహం ఈరోజు మీ ముందుంచుతునాను. కాస్త చూడండి

    అసలు సమస్య నిర్మాణమునకు అంటూ నిర్ధిష్టమైన నియమాలు ఏమైనా ఉన్నాయా? లేక ఎలాగైనా సమస్య తయారు చేయవచ్చునా?

    1. కుంజరయూధంబు దోమకుత్తుక జొచ్చెన్
    2. ఎలుకలు తమకలుగులోని కేనుగు నీడ్చెన్

    పై రెండు సమస్యలనూ జాగ్రత్తగా చూస్తే అవిరెండూ అసాధ్యాలను చూపెడుతునాయి. కనుక కవి తన కల్పనా శక్తితో వాటిని సుసాధ్యాలుగా చెపుతాడు. అటువంటి(అసాధ్యమైన) విషయం కనుక సమస్యలో కనిపించకుండాపోతే ఆ సమస్యలను సమస్యలు అనవచ్చా??

    కొన్ని సమస్యలు ఎవరు పూరించినా ఒకే విషయముతో పూరింపబడేవిగా ఉంటాయి.వాటిలో విషయమును మార్చి చెప్పగలిగే అవకాసమే ఉండదు. అటువంటివాటిని సమస్యలుగా పరిగణించవచ్చునా??
    ఇదీ నా సమస్య, పెద్దలు కాస్త స్పందించాలని మనవి.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ ఆదిభట్ల వారూ!
    శబ్దములోనో, అర్థములోనో ఇంక ఏవిధముగనైనా ఒక అసామాన్య విషయమును కూర్చడము సమస్య యొక్క సామాన్య లక్షణము. సామాన్యముగా దానిని తగు మాత్రము బుద్ధి కుశలతతో పూరించి సమస్యను నివృత్తి చేస్తూ అర్థవంతముగా చేయుటయే ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశము. సమస్యను ఇచ్చిన వాడు దానిని పూరించిగల సమర్థుడై యుండాలి.
    ప్రతినిత్యము సమస్యలను తయారుచేయుట కొంత కష్టము కాబట్టి అప్పుడప్పుడు సమస్యలు కానట్టి పాదపూరణలు, వర్ణనల వంటి విషయాలను ఇవ్వడము తప్పనిసరి అవుతూ యుండవచ్చు.
    అసాధ్యమైన విషయాలను సమస్యలుగా ఇచ్చినపుడు కూడా కొన్ని ప్రత్యేక పద్ధతులలో పద్యమును పూర్తి చేస్తారు. ఉదా:
    (1) క్రమాలంకారములో పూరణ
    (2) ఏదో పిచ్చివాడో, మరొకడో పలికెను అనుట
    (3) కలయో, సినిమాయో, నాటకమో మొదలగునవి
    ఒక భావముతో ఒకరు పూరిస్తే మరొకరు అలాగే పూరించరాదని అనే నియమము లేదు. ఇది ఐఛ్ఛికము. స్వస్తి

    రిప్లయితొలగించండి
  17. అయ్యా! చంద్రశేఖర్ గారూ!
    ఒకే పదమును 2 సారులు వాడవచ్చునా? సరి సరి, మరి మరి, వడి వడి ఇటువంటి ప్రయోగాలు సామాన్యములే కదా. మరొక విషయము ముందు ముందు, కట్టకడ, తోట్టదొలుత మొదలైన ఆమ్రేడితములు ఉన్నాయి కదా. పునరుక్తి దోషము విషయము వేరు. పునరుక్తి "భక్తి విషయములో" దోషము కాదు. ఇతరత్రా దోషము అవుతుంది. ఈ సమస్యలో కసి కసి అనునది ఆమ్రేడితమే గాని పునరుక్తి కాదు.

    రిప్లయితొలగించండి
  18. అశోకవనములో సీతాదేవి శ్రీరామునికొఱకై వేచియుండుటను ఒక రాక్షసి సహించలేక సంహరింపబోయినదని ఒక ఊహ.

    అసురేంద్రుని వలదని తా
    పసిరూపుండైన రామభద్రునికొఱకై
    విసిగించెదవేయని ర
    క్కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!

    రిప్లయితొలగించండి
  19. ఈ సమస్యకు రామాయణకథాపరంగా తప్ప పూరణ రావటం దుష్కరం. ఇచ్చిన సమస్యలో క్ష్మాసుత అని నిర్దేశంచాక మరొకదారి కష్టం గదా.
    *సంపత్ కుమార్ శాస్త్రి గారి అసురేంద్రుని వలదని... పదయం మంచి ధారాశుధ్ధితో సరళంగా ఉంది.
    *నేమానివారి రసికులని శూర్పణఖ .... పద్యం రామాయణకథాఘట్టాన్ని చక్కగా ఆవిష్కరించింది. పద్యం బాగుంది. నేమానివారు మన్నించాలి నాకంత ధారాశుధ్ధిగా అనిపించలేదు. నాది హ్రస్వదృష్టి కావచ్చును.
    *వసంత కిశోర్ గారి మసకము తీరక ... పద్యం బాగుంది. కాని 'మిసమిసయను' అన్న ప్రయోగం నాకంతగా నచ్చలేదు.
    *గన్నవరపు నరసింహ మూర్తి గారి అసురుల విధ్వంసమునకు... పద్యంలో 'తనయే' అన్న ప్రయోగం సరిగాదనుకుంటాను. నిజానిక 'తనయయే' అనే పదం యీ స్థానంలో వాడాలి కాని గణభంగం కదా. సవరించాలి. 'కువలయ తనయే' బదులు 'కువలయ సుతయే' అంటే సరిపోతుంది.
    *గోలి హనుమచ్ఛాస్త్రి గారి రసికుడు రావణ ప్రభువును ... పద్యం బాగుంది. కోట్స్ వాడనవుసరం లేదని నా వ్యక్తిగతమైన ఉద్దేశ్యం.
    *ఆదిభట్ల కామేశ్వర శర్మగారి అసహాయశూరు, రావణు... పద్యం బాగుంది. ధారాశుధ్ధితో సరళంగా ఉంది. వారనుమానించినట్లు తొలిపాదంలో యేమీ లోపంలేదు. ఆ + అసురేశు అన్నచోట అయ్యసురేసు అని సంధిచేస్తేనే నడక మరంత సొగసుగా ఉంది నాకు.
    *రాజారావు గారి పస చెడి గర్భము... పద్యంలో సమస్యను వేరే కోణంలో పరిష్కరించారు. కసు మాలపు జాతి యేమిటో అర్ధం కాలేదు. పద్యం భావం నాకు లీలగా గోచరంచినా యథాతథంగా అర్ధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా శ్యామలీయం గారూ!
    మీ వ్యాఖ్యకు నా స్పందన. అన్ని పద్యములనీ ధారాశుద్ధితో వ్రాయలేము. ఎన్నో మంచి లక్షణాలున్న పద్యములో కూడా ఏదో ఒక లోపము ఉండవచ్చు. ఇక్కడ ప్రధాన పాత్ర శూర్పణఖ - అందుచేత పద్యము నడక అలాగే ఉండుట సహజమే. విషయమును బట్టియే కదా పద్యము ధార సొగసు వంటివి ఉంటాయి. భోజరాజును చూస్తేనే కవిత్వము పొంగుతూ ఉండేదిట. కుంజర యూధమ్ము దోమ కుత్తుక జొచ్చెన్ అనే సమస్యను తెనాలి వారు 2 విధాలుగా పూరించిన విధము తెల్లమే కదా. మీది హ్రస్వదృష్టి కాదు. సరి అయినదే. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. కుసుమసదృశమృదుగాత్ర స
    రసోక్తులుసలుపుచునుండరామునితోడన్
    మసలుచునట కాకము,ర
    క్కసి, కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!

    రిప్లయితొలగించండి
  22. శ్యామలీయం గారు,

    మీ అభినందనకు ధన్యవాదములు. కృతజ్ఞుడిని.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులకు ఒక చిన్న విన్నపము. సరదాగ వేరొక బ్లాగును వీక్షించుచున్నప్పుడు శ్రీ శ్రీ రచించిన సిప్రాలి గురించిన ఒక వ్యాసము చదవడము తటస్తించినది. అందులోని రెండు పద్యాలలో వున్న సందేహాలను తీర్చవలసినదిగా ప్రార్థన.

    ఓ! అంతా కవులే, అ
    ఆ ఇ ఈలైనరాని యంబ్రహ్మలె, మే
    మా ఋషులం అని, ఛీ
    ఛీ, ఎంతటి నవ్వుబాటు సిరిసిరిమువ్వా

    అనే ఈ పద్యములోని ప్రాస గురించి కొంచము చెప్పగలరా??

    అలాగే, జగణంతో జగడం కో
    రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా!
    నగలాగ వెలుగును గదా
    చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా!

    లో కూడ యతి మైత్రిని కొంచము వివరించ గలరా?? ర - ఠ చూడటానికి యతికుదిరినట్టె వుంది కానీ, పలికేటప్పుడు కాదు కదా. ర- ఠ లకు యతి సరిపోదుకదా??

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! సంపత్ కుమార్ శాస్త్రి గారూ!
    మీరు ఉదహరించిన శ్రీ శ్రీ గారి పద్యములను చూచేను.
    (1) మొదటి పద్యములో ప్రాసలో వేసినవి అన్ని అచ్చులే హల్లులు లేవుకాబట్టి ప్రాస సరిపోతుంది;
    2వ పద్యములో ర కు ఠకు యతి చెల్లదు. కాని శ్రీ శ్రీ గారి పద్యము కాబట్టి మూలములో ఎలాగ ఉన్నదో, తరువాతి కాపీలలో ఎలా మారిందో ఏమో అనుకోవాలి. శ్రీ శ్రీ గారు యతి తప్పు వేస్తారు అనుకోలేము.

    రిప్లయితొలగించండి
  25. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మగురువారం, నవంబర్ 17, 2011 9:54:00 PM

    శ్యామలరావు గారూ,
    నిజమే, అక్కడ అయ్యసురేశు అని సంధి చేస్తే చాలా సొగసుగా ఉంది. నాకు తట్టనేలేదు సుమా.

    ఇకపోతే మీరన్నట్టు క్ష్మాసుత అన్నాక రామాయణ పరంగానే పూరణ జరుగుతుంది. అంటే కొంత వరకూ ఆలోచనలనీ తద్వారా చేతులనీ కట్టిపడేసినట్లేకదా. భూమునుంచి పుట్టినది కనుక క్ష్మాసుత సీత అని అందరూ అనుకుంటారు. నేను మరోలా అనుకుని పూరణ చేద్దామనుకున్నాను, భూరుహము అంటే కూడా భూమినుండి పుట్టినది కదా, అది పెద్ద వృక్షమైనా కావచ్చు, చిన్న తీగయైనా కావచ్చు. కనుక ఒక చక్కని తీగ చూసి కసకస నమిలేద్దామని మేక అనుకుంది అన్నట్లుగా పూరణ చేద్దామని అనుకుని ఎందుకో మనసు మార్చుకున్నాను.
    ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఇలా ఆలోచనలకు నిర్బంధం కలిగించే సమస్యలను తయారు చేయటం ఎంతవరకు సమంజసం అనేది నా తొలి ప్రశ్నయొక్క అంతరార్ధం.
    విజ్ఞులు దీనిగురించి విపులంగా చర్చిస్తే సంతోషిస్తాను.

    రిప్లయితొలగించండి
  26. ర-ఠ లకు రూపసామ్య యతిని శ్రీశ్రీగారు కనిపెట్టారు. ఆయన నిరంకుశలు కదా.

    చాలా యేళ్ళ క్రిందట (1971 లేదా 1972 అనుకుంటాను) పత్రికల్లో శ్రీశ్రీ మరియు సోమసుందర్ ఘర్షణ పడి పద్యాల్లో ఒకరినొకరు యెత్తిపొడుచుకున్నారు. ఒక పద్యం చివరి పాదం చూడండి:

    " రుచి తెలియని కండచీమ సుందరదోమా! "

    ఇందులో ఆయన రు-సు లకు చేసిన యతి నాకు ఆస్చర్యాన్ని కలిగిస్తుంది.

    రిప్లయితొలగించండి
  27. కామేశ్వర శర్మ గారు ఆలోచనలకు నిర్బంధం కలిగించే సమస్యలను తయారు చేయటం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న వేసారు. చాలా సంతోషం.
    అసలు సమస్య సృష్షించడమే కదండీ ఉద్దేశ్యం. అప్పుడే కదా సమస్యాపూరణం అయేది మరి! ఔచిత్యనికి భంగం లేకుండా యెలాంటి సమస్యనైనా సృష్టించ వచ్చు. ఒకచో ఔచిత్య భంగం ముప్పు పొంచియుంటే అవధాని చాకచక్యంగా దాన్ని పరహరించి సభాయోగ్యంగా పూరించాలి యెలా కష్టపడి యైనా సరే. తప్పదు.

    రిప్లయితొలగించండి
  28. నేను పంపిన పూరణ తప్పిపోయింది! మళ్ళీ ప్రయత్నిస్తున్నాను.

    అసితాంగు జూచి ప్రేముడి
    రుసరుస గని యతని సోదరుని సవతియె యీ
    కసుగాయ యని తలచి ర
    క్కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!

    నేమాని వారి ధోరణిలోనే సమస్యను రక్కసి అని పూరించాను. అయితే మరొక్క ఆమ్రేడితం జోడించాను. సాదాసీదా పూరణగానే వచ్చింది.

    రిప్లయితొలగించండి
  29. శంకరార్యా ! ధన్యవాదములు.
    శ్యామలీయం గారూ ! ధన్యవాదములు.మీ విశ్లేషణ, సోదాహరణ వివరణ చక్కగా ఉంటున్నాయి. ఎన్నో విషయాలు మీరు, మిత్రులు కొనసాగించు చున్న చర్చల వలన తెలుసుకొను చున్నాము.
    అందరకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శ్యామలీయం గారూ ! చాలా చక్కగా విశ్లేషిస్తున్నారు ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  31. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, నవంబర్ 18, 2011 8:29:00 AM

    చక్కని వివరణలు ఇచ్చిన పండిత నేమానివారికీ శ్రీ శ్యామల రావు గారికీ ధన్యవాదం

    రిప్లయితొలగించండి
  32. కవిమిత్రు లందరూ నన్ను మన్నించాలి.
    కొన్ని సమస్యల పరిష్కారం కోసం తిరుగుతూ ఉండడం వల్ల మీ పూరణలను చదివి వెంటనే స్పందించలేక పోతున్నాను. ఆ లోపాన్ని శ్యామలీయం గారు, పండిత నేమాని వారూ తీరుస్తున్నారు. అందరి పూరణల గుణదోషాలను పరామర్శిస్తూ సూచనలిస్తున్నారు. వారికి శతసహస్ర ధన్యవాదాలు.
    మిత్రులు ఉత్సాహంగా చర్చల్లో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం.

    రిప్లయితొలగించండి
  33. పసి మొక్కను నాటి వలచి
    విసుగన్నది లేక పెంచి వృక్షమ్మొనరన్
    రసికత లేని హుధుడుర
    క్కసి కసితో మ్రింగనెంచె క్ష్మాసుత నకటా!


    హుధుడు = hudhud cyclone

    రిప్లయితొలగించండి