18, నవంబర్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 530 (భావింపగఁ గృష్ణుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
                      భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!
ఈ సమస్యను పంపిన లక్కాకుల వెంకట రాజారావు గారికి ధన్యవాదాలు.

46 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _____________________________________

    కావుము కృష్ణా యనుచున్
    సేవించిరి భక్త కోటి - స్త్రీలై తననే
    గోవిందుని లీలల, మరి
    భావింపగఁ గృష్ణుఁ డేక - పత్నీవ్రతుఁడే!
    _____________________________________

    రిప్లయితొలగించండి
  2. ఆ వేల భార్యలకు పతి
    వేవేలుగ రూపుదాల్చు వెన్నుని గనుమా
    జీవాత్మబంధ ములెరిఁగి
    భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!

    రిప్లయితొలగించండి
  3. జీవా నాటక పాత్రను
    ఏ విధముగ పాత్రధారి కేమంటవుగా
    ఆ విష్ణు పాత్ర ధారియె
    భావింపగఁ గృష్ణుఁ డేక పత్నీవ్రతుఁడే.

    రిప్లయితొలగించండి
  4. జీవుడు భవసాగరముల
    నేవిధముగ దాటగలడ? ధీశుండెవరో?
    పావని పుత్తడి కుజపతి
    భావింపగ,కృష్ణు,డేకపత్నీవ్రతుడే.

    పుత్తడి కుజ = బంగారు సీత

    అశ్వమేధయాగము చేసే సమయములో శ్రీరాముడు బంగారు సీతను పెట్టుకొని యజ్ఞము చేస్తాడని ఉంది కదా.

    తప్పేమో అని తోస్తున్నది. పెద్దలు ఏమంటారో చూడాలి.

    రిప్లయితొలగించండి
  5. మిత్రుల పూరణలు అలరారుతున్నాయి.

    భూవరు డొక్కతె భామను
    దా వనముల వీడు నునికి ద్వాపర మందున్
    భూవినుత పెక్కు రయ్యెను
    భావింపగ కృష్ణు డేక పత్నీవ్రతుడే !

    రిప్లయితొలగించండి
  6. శాస్త్రి గారూ,పావని అంటే హనుమంతుడు లేక భీముడు అని కదాండీ అర్ధము ?

    రిప్లయితొలగించండి
  7. నరసింహమూర్తిగారూ,

    తప్పును చూపినందుకు ధన్యవాదములు. పావని అంటే పవిత్రమైన అనే అర్థము వస్తుందుకున్నాను. ఇంతవరకు, పావని అంటే భీముడు, హనుమంతుడు, అని తెలీదండీ. పావని అంటే పవన ( గాలి ) సంబంధమైన అనే వ్యుత్పర్తి అనుకుంటాను.

    పావని కి బదులుగా పావన అంటె సరిపోతుందా?

    జీవుడు భవసాగరముల
    నేవిధముగ దాటగలడ? ధీశుండెవరో?
    పావన పుత్తడి కుజపతి?
    భావింపగ, కృష్ణు, డేకపత్నీవ్రతుడే!

    సరిపోయిందో లేదో??

    ఎందుకో మొదటినుండీ ఈ పద్యము మీద నాకు చాలా అనుమానముగానే వుంది.

    గురువు గారూ,

    సరిపోని పక్షములో ఈ పద్యాన్ని తొలగించవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వల్లభుడే పురుషుడు
    ద్యావా పృధ్వ్యాది యగుచు దనరు ప్రకృతి స్త్రీ
    గా వీక్షించెడి మునులకు
    భావింపగ కృష్ణు డేక పత్నీ వ్రతుడే !

    రిప్లయితొలగించండి
  9. సాయంకాలందాకా ఆగి విశ్లేషిద్దామనుకున్నాను గాని రాజారావుగారి పద్యం చదివాక తక్షణకర్తవ్యంగా యిప్పడే చెబుతున్నాను. రాజారావుగారి పద్యం పరమహృద్యం. నిగమైక వేద్యం. సంసారతాపత్రయశమనైక సత్యం. అధ్భుతం.

    రిప్లయితొలగించండి
  10. రాజారావు గారూ ! అందుకోండి అభినందన మందారమాల.
    శ్యామలరావు గారు చెప్పినట్లు విస్తార తారా స్థాయికి చేరిన మీ పూరణ అద్భుతం.

    రిప్లయితొలగించండి
  11. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, నవంబర్ 18, 2011 6:11:00 PM

    శ్రీ వారిజాంశులయ్యెడు
    శ్రీ, విద్యా, ధాన్య,ధైర్య సిరులెనిమిదిగన్
    శ్రీవాసుదేవు సతులను
    భావింపగ,గృష్ణు డేకపత్నీ వ్రతుడే

    ప్రయత్నం చేసేను, పెద్దలు చెప్పాలిమరి.

    రిప్లయితొలగించండి
  12. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, నవంబర్ 18, 2011 6:14:00 PM

    అభినందనలు రాజారావు గారూ.
    నేటి సమస్య ఎంతో అద్భుతంగా ఉంది అనుకుంటూ ఉండగా మరింత అద్భుతంగా ఉన్న పూరణ ఇచ్చేరు.

    రిప్లయితొలగించండి
  13. ఏ వారెవ్విధి తలచిన
    నా వారి ననుగ్రహింతు నటులే యనడే
    శ్రీవల్లభుండు గీతన్
    భావింపగ గృష్ణు డేక పత్నీ వ్రతుడే

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, నవంబర్ 18, 2011 7:56:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    ఆవనవాసపు దీక్షను
    జీవిత పరమార్థమనుచు జేసిన వానిన్
    పావన గుణ రామునిగా
    భావింపగ,కృష్ణుడేకపత్నీవ్రతుడే.

    (తండ్రి యాజ్ఞను పాటించటమే కర్తవ్యముగా భావించి వనవాసం చేసిన రామునిగా,కృష్ణుని భావించిన)

    రిప్లయితొలగించండి
  15. కార్యాలయంనుండి రావటం కొంత ఆలస్యం కావటంతో నాకు పూరణ చేయటానికి ఇప్పటికి తీరిక దొరికింది. నా పూరణలు కూడా చిత్తగించండి.

    తెలియని పెక్కు రనెడు మాట

    ఈవల నీ యష్టమహిషు
    లావల పదునారువేల లలనాణణులున్
    సేవించు భోగ పురుషుడు
    భావింపగ,గృష్ణు డేకపత్నీ వ్రతుడే?

    తెలిసిన కొంద రనెడు మాట

    గోవిందు డొకడె పురుషుడు
    నే వికృతి లేనివాడు నిఖిల ప్రకృతియుం
    సేవించు పత్ని యగుచున్
    భావింపగ,గృష్ణు డేకపత్నీ వ్రతుడే!

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారి పద్యం భూవరు డొక్కతె భామను.. పద్యం చాలా బాగుంది. కాని భూవిసుత అన్నది సాధుప్రయోగమేనా అని నా అనుమానం. భూసుత అన్నది కాక భూవిసుత అని అనటం వినలేదు.

    రిప్లయితొలగించండి
  17. ఏమీ నేమాని వారి గడుసుదనం. మీరనుకొంటే అలాగే యేకపత్నీవ్రతుడనే అంటాడట. నాకలా అర్ధం అయింది. చాలా బాగుంది పద్యం.

    రిప్లయితొలగించండి
  18. ఈ రోజు పూరణలు చేసిన
    వసంత కిశోర్ గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    లక్కాకుల వెంకట రాజారావు గారికి,
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారికి,
    పండిత నేమాని వారికి,
    శ్రీపతి శాస్త్రి గారికి,
    ‘శ్యామలీయం’ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    నన్ను మరో రెండు, మూడు రోజులు మన్నించాలి. సమయమూ, ప్రశాంతత చిక్కడం లేదు.

    రిప్లయితొలగించండి
  19. శంకరార్యా ! ధన్యవాదములు.మీరు నియమము తప్పకుండా ఈ పరిస్థితి లో కూడా మాకు తరగతులు నిర్వహిస్తున్నారు.శ్రీ సాయి నాథు కృప వలన మీకు త్వరగా త్వరగా సమస్యలు తొలగి ప్రశాంతత కలగాలని కోరుకొను చున్నాను. కొన్ని రోజులు విశ్రాంతిగా వుండండి.

    రిప్లయితొలగించండి
  20. అయ్యా గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    మీరు శంకరయ్య గారిని అభినందిస్తూ "వుండండి" అని వాడేరు. "వు" వాడకూడదు.
    ఎప్పుడు దిద్దుకుంటారో మరి?

    రిప్లయితొలగించండి
  21. అయ్యా శ్యామలీయం గారూ!
    యే యథా మాం ప్రపంద్యంతే తాం తథైవ భజామ్యహం - అనేది గీతా సూక్తియే కదా.
    అంతే కాదు - శ్రీ కృష్ణుని - అస్ఖలితపు బ్రహ్మచారి అని కూడా అన్నారు కదా.
    ఇందులో నేను కల్పించినది ఏమీ లేదు కదా. అంతా భగవంతుని లీల - ఇదంతా పరమాత్ముని లీల.

    రిప్లయితొలగించండి
  22. అందరి పూరణలు ప్రశంసించదగినవే.

    శ్యామలీయం గారు అజ్ఞాన జ్ఞాన స్థితులకు అతీతులు - వారి విశ్లేషణ అసామాన్యము.

    తమ్ముడు నరసింహమూర్తి "భూవినుత" అన్నాడు; భూవిసుత అని కాదు. ఆతని పద్యములో మొదటి పాదము ఇలా సరిచేస్తే నడక మరింత బాగుంటుంది:
    భూవరుడు భామనొకతెను - అని.

    శ్రీపతి శాస్త్రి గారూ - పావని అంటే పవిత్రురాలు అనే అర్థము కూడా ఈయబడినది శబ్ద రత్నాకరములో.

    రిప్లయితొలగించండి
  23. ఆర్యా ! నేమాని గారూ! తప్పు తెలుసు కున్నాను. ఇకనుండి జాగ్రత్తగా వుంటాను ... కాదు కాదు ... ఉంటాను. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  24. నేమానివారు సత్యం సెలవిచ్చారు. వారలా అన్న తరువాత ఒక కథ ప్రస్తావించాలని పిస్తోంది. చాలా కాలం క్రిందట మా స్నేహితురాలు జయలక్ష్మిగారు చెప్పిన కథ. ఒకసారి శ్రీకృష్ణులవారు పొంగి ప్రవహిస్తున్న నది ఆవలి యొడ్డున నున్న దూర్వాసులవారికి భోజనం పంపారట గోప స్త్రీలతో. యెలా నది దాటటం అంటే 'పరమ బ్రహ్మచారి' ఆజ్ఞ అని నదితో చెప్పిదాటి వెళ్ళమన్నారట. అలాగే వాళ్ళు నదిదాటి వెళ్ళి ఋషికి ఆహారం అందించి తిరిగి యెలా నది దాటి వెళ్ళటమా అని సంశయిస్తుంటే వారితో దూర్వాసులు 'సదోపవాసి ఆజ్ఞ' అని నదితో చెప్పిదాటమన్నరట. వాళ్ళలాగేచేసారట.

    మొదట నదిదాటి ఋషి వద్దకు వెళ్ళనపుడు స్వామీ కృష్ణుడు బ్రహ్మచారి యెలాగు అంటే ఆయన ప్రాజాపాత్యనియమం యెన్నడూ మీరనివాడు కాబట్టి బ్రహ్మచారియే అన్నాడట మహర్షి. తిరిగి వెళ్ళి యీ ఋషి సదోపవాసి యేమిటండీ అంటే శ్రీకృష్ణులవారు అన్నారట, మహర్షి కేవలం శరీరం నిలబెట్టుకునేందుకే భుజించారు సదాచార నియమాల ననుసరించి కాని జిహ్వచాపల్యం యేమాత్రం లేని వాడు. కాబట్టి ఆయని ఉపవసించేవాడే అని.

    ఈ కథ సత్యాసత్యాలు యెలా గున్నా, శ్రీకృష్ణులవారు కేవలం నిర్వికార నిరంజన పరబ్రహ్మ స్వరూపమేకదా.

    రిప్లయితొలగించండి
  25. విశ్లేషించిన పెద్దలు శ్యామలరావు గారికి ,గోలి వారికి ,ఆదిభట్ల వారికి ,తదితర కవి మిత్రులకు అభివాదములు .నిన్నటి పూరణను ప్రశంసించిన మిస్సన్న గార్కి ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  26. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మశుక్రవారం, నవంబర్ 18, 2011 10:47:00 PM

    శ్రీ శ్యామలరావుగారూ
    ఈ కధ నేను కూడా మా తల్లిగారిద్వారా విన్నదే. ఐతే నేను విన్న మరొక విషయం చెపుతాను.
    శ్రీ కౄష్ణుడు బ్రహ్మచారిట. ఆ విషయం నలుగురికీ తెలియటం కోసమే నెమలి పింఛం ధరిస్తాడుట. ఐతే నెమలి పింఛానికీ బ్రహ్మచర్యానికీ ఏమిటి సంబంధం అంటే నెమళ్ళు ఇప్పటికీ సతానోత్పత్తికోసం శారీరకంగా కలుసుకోవుట, మగనెమలి కంటిద్వారా స్రవించే వీర్యమును గ్రహించి ఆడనెమలి గర్భం ధరిస్తుందిట. మరి ఇందులో నిజానిజాలగురించి అంతగా తెలియదు నాకు. ఇకపై తెలుసుకోవడానికి ప్ర్యత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  27. నారదుడు:

    నీవాచరింపఁ,సత్యా!
    నేవివరించినవ్రతంబు, నెగడి సపత్నుల్
    వేవురుమరికలుగనయిన,
    భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!

    రిప్లయితొలగించండి
  28. శ్యామలీయం గారు, ప్రాజాపాత్యనియమం అనగా నేమి? దయచేసి వివరించగలరు. ఈ పదం యొక్క భావం అర్థం కాలేదు.

    Vishnu Sarma

    రిప్లయితొలగించండి
  29. శ్రీ పండిత నేమాని అన్నయ్య గారికి, శ్రీ శ్యామలీయము గారికి నమస్సులు.అన్నయ్య గారు సెలవిచ్చి నట్లు భూవినుత అనే వాసాను. శ్రీరాముడు ఉన్న ఒక్క భార్యను అడవుల పాలు చేసాడని
    భూవరు డొక్కతె భామను అని వ్రాసాను.

    రాజారావు గారూ మిత్రులు,శ్యామలీయము గారు పొగిడినట్లు మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    సుదీర్ఘమైన వ్యాఖ్యలు, కధలు ఉన్నాయి. ఈ రాత్రి తీరికగా చదువుకోవాలి.

    రిప్లయితొలగించండి
  30. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
    రాజారావు గారి ప్రకృతి పరమాత్మ తత్వం అద్భుతం !

    రిప్లయితొలగించండి
  31. ఈ రోజుకూడా శ్రీ రాజారావు గారికే మొదటి ర్యాంకు.

    రిప్లయితొలగించండి
  32. నీవున్నేనును యదుక-
    న్యావళి వైదర్భి సత్య నరులును సురలున్
    జీవాధారున కొకటే
    భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!

    రిప్లయితొలగించండి
  33. రాజేశ్వరి నేదునూరి గారి పూరణ ....

    వివరింపగ బహు రూపము
    లవతారము లందు కనగ హరిహరు లొకటే !
    సేవింప దైవ మొకటని
    భావింపగ గృష్ణు డేక పత్నీ వ్రతుడే !

    రిప్లయితొలగించండి
  34. శ్యామలీయము గారూ మన్నించాలి. మీ రెండవ పూరణలో రెండవ పాదము గణములు సవరించాలి.

    రిప్లయితొలగించండి
  35. తప్పకుండా సవరించాలి.
    నే వికృతి లేనివాడు నిఖిల ప్రకృతియుం
    బదులుగా
    నే వికృతియు లేనివాడు నిఖిల ప్రకృతియుం
    అని మార్చితే సరిగా ఉంటుంది.

    సూచించిన నరసింహమూర్తిగారికి కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  36. ప్రజాయాహి మనుష్యాః పూర్ణా యని శృతి. అంతేకాక తైత్తిరీయోపనిషత్తులో ప్రజనశ్చ స్వాధ్యాయ ప్రవచనేచ అనియు ప్రజాతంతుం మా వ్యవఛ్ఛేథ్సీః అనియు చెప్పబడినది. అనగా మనుష్యడు సంతానమును పొందుటచేతనే పూర్ణుడగుచున్నాడు. కాబట్టి భార్యయందు సంతానమును పొందుటయనునది విధ్యుక్త కర్మము. వంశపరంపర కొనసాగించుట మనుష్యని కర్తవ్యము. ఇవి యీ వాక్యముల భావములు. భారతీయమయన జీవనవిధానమునకు ధర్మానుష్టానమే సర్వస్వము. సమస్త వేదోక్త సంస్కారములు, ఆశ్రమధర్మములు అన్నియు దానిలో బాగమే.సంతానమున పొందుట కర్తవ్యము గావున ఋతుకాలోచితముగ ప్రవర్తించి కేవలము ప్రజార్ధమే భార్యను కలియువాని ప్రవర్తన ప్రాజాపత్య బ్రహ్మచర్యమని పిలువబడును. ఆతడు సదా బ్రహ్మచారియే యని చెప్పబడును. యెందువలననగా పురుషార్ధములయందు సమ్యక్విధానమతో నడచుకొనుచు ముముక్షువగువాడును సదా బ్రహ్మమునందు అంతఃకరణమును నిలుపువాడును కావున.

    రిప్లయితొలగించండి
  37. సమస్యాపూరణం -530

    భావాతీతుడు ,ప్రేమన్
    సేవల్ గొనునే విధమున జీవాత్మలు సం
    భావించిన నిర్లిప్తత
    భావింపగ గృష్ణుడేక పత్నీవ్రతుడే.
    --------
    గోలిశాస్త్రి గారు ఇస్తున్న సమస్యలను కూడా శంకరాభరణం లోనే పూరించ మన్నారు.అందుకని 18-11-11న ఆయన ఇచ్చిన సమస్యకు పూరణం కింద ఇస్తున్నాను.
    'కూతురైన నేమి కొడుకైన నెక్కువా ?
    పిదప కాలమందు ప్రేమ జూచు
    కూతు గన్నదంచు కోపింప బోకు ,నీ
    ఆలి నంపుచుంటి నేలుకొనుము.
    -------

    రిప్లయితొలగించండి
  38. నాడు ఎనుమండు గురు భార్యలు
    ఆ పై పదునారువేల గోపికలు
    మరియు నొక్క రాధ,
    ఆ సర్వాంతర్యామి తనే అందరిలోన దరియై
    నేటికిఈ ఈ నెమిలి చెలిమి కోరు వారు పెక్కురు రీతిన
    భావింపగ కృష్ణుడు ఏక పత్నీ వ్రతుడే!

    రిప్లయితొలగించండి
  39. నేమాని పండితుల రాకతో శంకరాభరణానికి పరిపూర్ణత సిద్ధించిందని
    అనుకొంటే శ్యామలీయం గారి రాకతో బ్లాగుకు క్రొత్త చైతన్యం వచ్చిందని అనిపిస్తోంది. పెద్దలకు, వేత్తలకు వందనాలు.

    రిప్లయితొలగించండి
  40. ఏవృక్షము నందొదవెనొ
    నావృక్షము నాశ్రయించి నౌరాయనగ
    న్నావృక్షమునం దొరగును;
    భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!

    కృష్ణుడు = కోకిల

    రిప్లయితొలగించండి
  41. నీవలె నావలె మొదటన్
    కేవల మొకతెయ లతాంగి గృహిణిగ నుండన్
    వేవురు చేరుట ముందుగ
    భావింపగఁ గృష్ణుఁ డేకపత్నీవ్రతుఁడే!

    రిప్లయితొలగించండి