21, నవంబర్ 2011, సోమవారం

ప్రాసభేదాలు - 4

ప్రాసమైత్రి - 4 
13) స్వవర్గజ ప్రాస - 
ఏకవర్గానికి చెందడం వల్ల, బాహ్యప్రయత్నంలో మహాప్రాణాలుగా ఉండడం చేత థ, ధలు, ఘోషాలు అవడం వల్ల ద,ధలు ప్రాసమైత్రికి చెల్లుతాయి.
ఉదా.
(అ).
సింధురము మహోద్రేక మ
దాంధంబై వచ్చులీల నాచార్యునిపై
గంధవహసుతుఁడు గవియ న
మంథరగతి నెవ్వఁ డాఁగు మనయోధులలోన్. (భార. ద్రోణ. 1-88)
(ఆ).
కా దన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ .... (భార. ఆది. 1-124)
(ఇ).
బాంధవసౌహృదప్రణయ భక్తివిశేషము లొప్ప నీమనో
గ్రంథి యడంగఁ జేయ నెసకంబునఁ బూనినవారు ... (భార. ఆర. 4-160)
 
14) ఋప్రాస -
యణాదేశసంధి వలన ఋకారానికి రేఫత్వము వస్తుంది. ఋకారానికి ఇటువంటి హల్సామ్యం ఉండడం వల్ల ‘పదాద్యంబులు ఋఌ వర్ణంబులు రల తుల్యంబులు’ అని సూత్రం చెప్పబడింది. ఈ కారణాల వల్ల ఋకారం రేఫంతో ప్రాసమైత్రికి చెల్లుతుంది.
ఉదా.
ఆఋషిపుత్త్రుఁడు గట్టిన
చీరలు మృదులములు నవ్యశిష్టములు మనో
హారులు నాతని పృథుకటి
భారంబును నొక్క కనకపట్టము వ్రేలున్. (భార. ఆర. 3-104)
 
15) లఘు యకార ప్రాస -  
లఘు యకారానికి, అలఘు యకారానికి ప్రాస చెల్లుతుంది. ‘యరలవలు లఘువులని యలఘువులని ద్వివిధంబులు. ఆగమ యకారము లఘువు, తక్కిన యకార మలఘువు’ అని వ్యాకరణ సూత్రం. దీనిని బట్టి సంధివలన ఆగమంగా వచ్చిన యకారానికి, సహజ యకారానికి ప్రాస కూర్పవచ్చు. ప్రాస వ్యంజన ప్రధానం కనుక ఈ ప్రాసభేదాన్ని చెప్పవలసిన పనిలేదు.
ఉదా.
శ్రీయుత గురువర్యునకును (సహజ యకారం)
మా యజ్ఞానమును బాపు మహితాత్మునకున్ (ఆదేశ యకారం)
 
16) అభేద ప్రాస -
‘లళయో రభేదః, లడయో రభేదః’ అనే సూత్రాల వలన లళడలు అభేదాలు కనుక వానికి పరస్పరం ప్రాసమైత్రి చెల్లుతుంది.
ఉదా.
(అ). కేళీ ...., ప్రాలేయాచల .... నిద్రవో, వే లావణ్య ..., జోల (రాజశేఖర చరిత్ర. 2-4)
(ఆ). పాలును ... వా, హ్యాళి ...., బాల ... ప్రో, యాలు ... (రామాభ్యుదయము. 1-8)
(ఇ).
ప్రల్లద మేది యిట్లు శిశుపాలుఁడు వజ్రహతాద్రితుల్యుఁడై
త్రెళ్ళెడు వానిదైన పృథుదేహము ... (భార. సభా. 2-69)
(ఈ).
కొడుకులుఁ దానును గుఱ్ఱపు
దళములఁ గరిఘటల భటరథవ్రాతములం ... (భార. ఉద్యో. 1-220)
(ఉ). జలనిధి ..., వెడలి ...., కడు ....తన, రెడు ... (ప్రభావతీప్రద్యుమ్నము. 1-5
7)

మరికొన్ని రేపటి పోస్టులో. దీనిపై స్పందించవలసిందిగా కవిమిత్రులకు మనవి.

3 కామెంట్‌లు: