1, నవంబర్ 2011, మంగళవారం

కవీనాం కవి:

కవీనాం కవి:

గణపతి ధ్యానము చేయునప్పుడు "కవిం కవీనా ముపమశ్ర వస్తమం" అని అంటాము. కవులందరిలో గొప్ప కవిగా వేదాలలో కొనియాడబడిన కవి గణపతి.
భగవద్గీతలో విభూతి యోగములో "కవీనా ముశనా కవిః" అని సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్మ తెలిపేరు. ఈ విధముగా భగవద్విభూతి గల కవి శుక్రాచార్యులు.
ఆదిత్య హృదయ స్తోత్రములో "కవి" అనే పేరు ఆదిత్యునికి చెప్పబడినది.
విష్ణు సహస్ర నామములలో కూడా "కవి" అనే పేరు విష్ణు మూర్తికి చెప్ప బడినది.
సమస్త సృష్టికి కారణమైన పరబ్రహ్మము మరియు బ్రహ్మ కూడా కవులే కదా.
ఇలాగ మన వైదిక ప్రపంచములోకి చూస్తుంటే ఎందరో దేవతా మూర్తులు "కవులు".
"క" అంటే నీరు, 'వి" అంటే పక్షి, వెరసి "కవి" అంటే నీటి పక్షి అని సెలవిచ్చారు తెనాలి రామకృష్ణ కవి.
కవి అల్లసాని పెద్దన
కవి తిక్కన సోమయాజి, గణుతింపంగా
కవి నేను రామకృష్ణుడ
కవియను పేరింక నీటికాకికి లేదే? (తెనాలి)
వైదిక కవి పరంపరను ఒక్క మారైనా తలచుకొనుట మన కనీస కర్తవ్యమే అవుతుంది.
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

18 కామెంట్‌లు:

  1. కవి చౌడప్ప శతకపద్యాల్లో ఒకదానిలో యీ విషయం ఉంది. పూర్తి పద్యం గుర్తుకు రావటం లేదు. కాని చివరి పాదం మాత్రం

    | కవి యను నామంబు నీటి కాకికి లేదే

    రిప్లయితొలగించండి
  2. శుక్రాచార్యులకు కవి అన్న పేరు లేదు. కవి అనే ఆయన కుమారుడో లేక వంశం వాడో కావటం వలన శుక్రాచార్యులను కావ్యుడని పిలుస్తారు.

    రిప్లయితొలగించండి
  3. అయ్యా!
    కవీనాముశనా కవిః అనే భగవద్గీతా సూక్తికి శుక్రాచార్యులు అని నేను భగద్గీత యొక్క వ్యాఖ్యలో ఎప్పుడో చదివేను. నాకు అలాగే నమ్మకము.
    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  4. అవునండి. శబ్దరత్నాకరము కూడా ఉశనుఁడు అన్న పదానికి శుక్రుఁడు అనే చెప్పింది. నా వద్ద నున్న గీతా వ్యాఖ్యలో కూడా అలాగే చెప్పబడింది.

    రిప్లయితొలగించండి
  5. సూర్యరాయాంధ్ర నిఘంటువులో ....
    కవి (విశేషణము) = కవిత్వము చెప్పువాడు, పండితుడు.
    కవి (విశేష్యము) = శుక్రుడు, వాల్మీకి, జలపక్షి, పండితుడు, కావ్యకర్త, బ్రహ్మ.... అని చెప్పబడింది.
    శబ్దార్థచంద్రికలో ...
    కవి = కవిత్వము చెప్పువాడు, పండితుడు, శుక్రుడు, వాల్మీకి ... అని చెప్పబడింది.
    ఆచార్య జి. ఎన్. రెడ్డి గారి ‘పర్యాయపద నిఘంటువు’లో ...
    శుక్రుడు = అసురేజ్యుడు, ఆస్ఫుజితుడు, ఒంటిగంటిగాము, కవి, కావ్యుడు .... అని చెప్పబడింది.

    రిప్లయితొలగించండి
  6. ‘కవి యల్లసాని పెద్దన’ పద్యం రామకృష్ణుని పద్యంగానే ప్రసిద్ధం. నా దగ్గర ఉన్న ‘కవిచౌడప్ప శతకం’లో ఈ పద్యం లేదు. వేటూరి వారి ‘చాటుపద్య మణిమంజరి’లో రామకృష్ణుని పద్యంగానే చెప్పబడింది.
    కాకుంటే నాల్గవ పాదం ‘కవియను నామంబు నీటికాకికి లేదే!’ నామంబు స్థానంలో ‘పేరింక’ అన్నది నాకు క్రొత్త.

    రిప్లయితొలగించండి
  7. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, నవంబర్ 01, 2011 3:48:00 PM

    కవి అంటే నీతి పక్షి అని చదవగానే నేను మొన్నీమధ్యనే NET లో చదివిన ఒక ప్రచురణ గుర్తుకు వచ్చింది. దాన్ని మన సహకవిపాఠకులకొఱకు ఇందులో ఉంచుతున్నాను.

    తెలుగువారికి అష్టావధానం అనగానే గుర్తుకొచ్చే జంటకవులు తిరుపతి వెంకట కవులు. ఓసారి వారు అవధానం చేస్తుండగా కాశీనాథ శాస్త్రి అనే పృచ్ఛకుడు ఆ జంటకున్న‘ కింకవీంద్ర ఘటా పంచావన ‘ అనే బిరుదును అపహాస్యం చెయ్యడానికి ఇలా వక్రభాష్యం చెప్పాడట.

    “ కింకవీంద్ర అంటే నీటి పక్షుల్లో గొప్పవైన అని, ఘటా అంటే గుంపు అని, పంచ అంటే వెడల్పయిన అని, అవనము అంటే ముఖం కలది అనీ అర్థాలు వస్తాయి. కనుక ఈ బిరుదుకు ‘ పెద్ద కొంగలు ‘ అంటే సరిగ్గా సరిపోతుంది “ అని వ్యాఖ్యానించాడు.

    దానికి ఆ జంట కవుల్లో ఒకరైన చెళ్ళపిళ్ల వెంకటశాస్త్రి గారు తడుముకోకుండా ఇలా సమాధానమిచ్చారు.....
    “నిజమే ! కాశీనాథుల వారు సెలవిచ్చినట్లు మా బిరుదుకు పెద్దకొంగలు అన్న అర్థం వస్తుంది. అయితే ‘ కా ‘అంటే నీరు, ‘ ఆశి ‘ అంటే తిరుగునని అర్థాలు వస్తాయి. కనుక ‘ కాశీ ‘ అంటే చేపలు అని అసలు అర్థం వస్తుంది. కాశీనాథులు కనుక పెద్దచేపలు అవుతుంది. అంటే ఆయన పాలిట మేము పెద్దకొంగలమే ! “ అన్నారట.

    ఇంకేముంది...! కాశీనాథుల వారి నోట మారు మాట వస్తే ఒట్టు.

    రిప్లయితొలగించండి
  8. శుక్రునికి కవి అనే పేరు ఉండే అవకాశం లేదు. పురాణాలు శుక్రుడు కవి కుమారుడని చెబుతున్నాయి. భృగువుకు కవి అనే పేరున్నదని, అందుకే భృగు కుమారుడైన శుక్రుడు కావ్యుడని కొన్ని పురాణాలు చెబుతుండగా, భృగుని కుమారుడైన కవికి శుక్రుడు కుమారుడని అందుకే శుక్రునికి కావ్యుడని పేరు అని మరికొన్ని చెబుతున్నాయి. ఉశానుడు అనేది శుక్రుని అసలు పేరు.

    రిప్లయితొలగించండి
  9. నమస్కారములు. పూర్తి పద్యము
    " కవి అల్ల సాని పెద్దన
    కవి తిక్కన సోమయాజి గణుతింపంగా !
    కవి నేను రామకృష్ణుడ
    కవి అను నామంబు నీటి కాకికి లేదే !
    ఇలాగే చాటు పద్యాల్లో ఉంది . ఇంకా మాగంటి " ఓఆర్జీ " లొ కుడా ఇలాగే ఉంది.
    ఒక చిన్న సందేహం. " పద్యం మధ్యలో " అ " వ్రాయ వచ్చునా ?

    రిప్లయితొలగించండి
  10. మరచా [ క్షమించాలి ]
    రెండు చోట్ల " తెనాలి వారి పద్యమనే ఉంది ]

    రిప్లయితొలగించండి
  11. ‘పూర్వగాథాలహరి’ చెప్పిన విశేషాలు ....
    భృగువుకు కవి అనే పేరుంది. అందుకే భృగువు (కవి) కొడుకు కనుక శుక్రునికి కావ్యుడు అనే పేరు వచ్చింది. భృగువు భార్య ఉశన. ఆమె కొడుకు కావున శుక్రునకు ఉశానుడు అనే పేరు కూడా వచ్చింది.
    మరోచోట భృగువు కొడుకు కవి అనీ. కవి కొడుకు శుక్రుడనీ చెప్పబడింది.

    రిప్లయితొలగించండి
  12. **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ఇలాంటి చమత్కారభరితమైన కథనాలను అవకాశం వచ్చినప్పుడల్లా పంపుతూ ఉండండి. చాలా సంతోషం. ధన్యవాదాలు.
    **********************************************************************
    ‘పూర్ణప్రజ్ఞాభారతి’ గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    చక్కని వివరణ ఇచ్చి సందేహనివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
    **********************************************************************
    రాజేశ్వరి ఆక్కయ్యా,
    ధన్యవాదాలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  13. పంచ వింశతి దేవతా స్తుతి

    ఇది సుమారు 150 సంవత్సరాల క్రితం రాయబడిందని ఒక ప్రముఖ వార పత్రిక ప్రత్యేకానుబంధంలో సుమారు 40 సంవత్సరాల క్రితం నేను చదివేను. నాటి విశఖ జిల్లా నేటి శ్రీకాకులం జిల్లాకు చెందిన కవికృతంగా ఉటంకించబడింది. కవి పేరు అలభ్యం.

    వన చర వనచర విప్రా
    వనిపద్వయ బుద్ధ కల్కి వర పుర హర మో
    హనమా జయవాగ్రవి కవి
    శని ఫణియుగ బుధ కుజ గురు చంద్రుల దలతున్!!

    ఈ కందపద్యంలో 25 మంది దేవతామూర్తులను స్తుతించేరు. దశావతారాలు, త్రిమూర్తులు వారి భార్యలు, నవగ్రహాలను స్తుతించేరు. అందులో "వాక్" తర్వాత 3వ పాదంలో "రవి, కవి" అని ప్రయోగం. కాబట్టి ఇక్కడ కవి అంటే శుక్రాచర్యులుగా అర్థం చెప్పుకోవాలి.

    ఇంతే కాకుండా ఇంకొక జన్మ లగ్న జాతకచక్రం లోని నవగ్రహాల ఉనికిని గురించి చమత్కారంగా చెప్పబడిన ఒక చాటువు -

    "రాజు మేకను బట్టగా లగ్నమైన
    జంపతులరేడు తేలుతో జట్టు గూడె
    మందు కవి గూడి మహిజుడు మకరమెక్క
    కుంభ సింహాల తలతోక కుదురుకొనగ
    విల్లు రవికిచ్చి కన్యకై వెడలె గురుడు"

    ఇందులో మందు అనగా శని, కవి అనగా శుక్రుడూ, మహిజుడు అనగా కుజుడు, ముగ్గురూ మకర రాశిలో ఉన్నట్టుగా సంకేతం.

    ఈ రెండు పురాతన చాటు పద్యాల్లో శుక్రున్ని కవిగా చెప్పడం జరిగింది.

    ఇంకా -

    పోతన గారు భాగవతంలో "కావ్యు నేత్రం - అడవన్ - ఏక నేత్రుడయ్యె నతడు" అని వామనావతార ఘట్టంలో గరికతో శుక్రుని కంటిని వటువు పొడిచిన విధానాన్ని వివరించారు. ఇక్కడ "కావ్యు" అంటే కవి యొక్క అని తద్ధిత రూపం వాడబడింది. కవి అంటే శుక్రుడు, ఆయన నేత్రం అని అర్థం.. అంతేకాని సరాసరి కావ్యుడు అన్న రూపానికి ఇక్కడ శుక్రుడని అర్థం చెప్పుకోలేం..!

    ఇవన్నీ ఒక ఎత్తైతే.. సూరి గారి "ఆర్య వ్యవహారంబుల దృష్టంబు గ్రాహ్యంబు" అన్న సూక్తి ఉండనే ఉంది.
    అందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. " శుక్రో దైత్యగురుః కావ్య ఉశనా భార్గవః కవిః " అని అమరకోశం.
    ఇందులో
    1. "కావ్య" అనేపదానికి - కవి అనే ఋషి కొడుకు అనీ,
    2. "కవి" అనే శబ్దానికి - చాతుర్యంతో వర్ణించే వాడు అనీ,
    3. "ఉశనా" అన్న పదానికి - అసురుల శ్రెయస్సును కోరుకునేవాడు అని వ్యుత్పత్యర్థాలు.

    గమనించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. దయచేసి ఉశనా అన్న పదానికి మీరు చెప్పిన అర్థంలో సంస్కృత వ్యుత్పత్తిని చెప్పగలరు. వీలైతే కవి , కావ్య శబ్దాలకు కూడా. మీరు చెప్పిన అర్థం వచ్చేలాగానే చెప్పగలరని మనవి.

      తొలగించండి
  15. శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ (సీనియర్) గారు మంచి వివరణ ఇచ్చేరు. వారికి మా అభినందనలు. మొత్తము మీద ఈ విషయము మీద మంచి మంచి భావములు వెలుగులోకి వచ్చేయి.
    ఆష్టావధాని రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి పితామహులు ఈ సీనియర్ శర్మ గారు. వీరు కూడా ఒక మంచి పద్య కవి.

    పండిత నేమాని

    రిప్లయితొలగించండి
  16. కవి పదం మీద ఇంతమంది కవి పుంగవులు కలిసి విడిగా కలివిడిగా జరిపిన చర్చ రసవత్తరంగా నున్నది. అందరకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. అయ్యా ! చర్చ మంచి రసవత్తరంగా సాగింది !
    సాహిత్యగోష్ఠిలో పాల్గొన్న సహృదయులందరికీ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి