1, నవంబర్ 2011, మంగళవారం

ఔపవిభక్తికాలు

ఔపవిభక్తికాలు
ద్వితీయ మొదలైన విభక్తుల ఏకవచన శబ్దాలకు ముందు (సమీపంలో) చేరేవి కనుక వీటిని ఉపవిభక్తులు అంటారు. ‘ఇ, టి, తి’ అనే వర్ణాలు ఉపవిభక్తులు. వీటినే ఔపవిభక్తికాలు అంటారు. ఇవి చేరే పదాలను కూడ ఔపవిభక్తికాలు అనే అంటారు.
1) ఇ-టి-తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు.
ముందు చెప్పబోయే ఆయా సూత్రాలచేత విధింపబడే ఇ, టి, తి వర్ణాలు ఔపవిభక్తికాలు. ద్వితీయ మొదలైన విభక్తుల కారణంగా ఇవి వచ్చిచేరుతాయి. ఇవి కొన్ని చోట్ల పదాల తుది అక్షరాలకు ఆదేశం గాను, మరికొన్ని చోట్ల ఆగమం గాను చేరుతూ ఉంటాయి.
2) ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబు లగునపుడు నామంబులకుం గొన్నింటికిం బ్రాయికంబుగ నగు.
ఈ ఇ, టి, తి వర్ణాలు ద్వితీయనుండి అన్ని విభక్తులలో ఏకవచనం పరమైనపుడు కొన్ని శబ్దాలకు తరచుగా చేరుతూ ఉంటాయి.
‘కాలు’కు ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘కాలు + ను’ అవుతుంది. దానికి ‘ఇ’ చేరగా ‘కాలు + ఇ + ను = కాలి +ను’ అవుతుంది. ‘ఇకారం మీది కు, ను, వు అనే క్రియావిభక్తుల ఉత్వానికి ఇత్వం అవుతుంది’ అనే సూత్రం వల్ల ‘కాలి + ని = కాలిని’ అవుతుంది. అదే విధంగా ‘కాలు + చే = కాలిచే’ అవుతుంది.
‘నాగలి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ’నాగలి + ను’ అవుతుంది. దానికి ‘టి’ ఆదేశమై ‘నాగటి + ను -> నాగటిని’ అవుతుంది.
‘నేయి’కి ద్వితీయ ఏకవచన ప్రత్యయం ‘ను’ చేరినపుడు ‘నేయి + ను’ అవుతుంది. దానికి ‘తి’ చేరగా ‘నేతి + ను -> నేతిని’ అవుతుంది.
3) టివర్ణంబు గొన్నింటి యంతాక్షరంబున కాదేశంబును, గొన్నింటి కంతాగమంబును, గొన్నింటికిం బర్యాయంబున రెండును బ్రాయికంబుగ నగు.
‘టి’ వర్ణం కొన్ని శబ్దాల తుది అక్షరానికి ఆదేశంగాను, కొన్నింటికి ఆగమంగాను, కొన్నింటికి రెండూ వస్తాయి.
ఆదేశానికి ....
త్రాడు + ను -> త్రాటి + ను -> త్రాటిని
కాడు + ను -> కాటి + ను -> కాటిని
నోరు + ను -> నోటి + ను -> నోటిని
ఆగమానికి ....
అన్ని + ను -> అన్ని + టి + ను -> అన్నిటిని
ఎనిమిది + ను -> ఎనిమిది + టి + ను -> ఎనిమిదిటిని
వేయి + ను -> వేయి + టి + ను -> వేయిటిని
ఉభయానికి (ఆదేశ, ఆగమాలు రెండూ) ....
ఏమి + ను -> (ఆదేశం) ఏటి + ను -> ఏటిని;
.......................... (ఆగమం) ఏమి + టి + ను -> ఏమిటిని.
పగలు + ను -> (ఆదేశం) పగలు + ను -> పగటిని;
............................. (ఆగమం) పగలు + ఇ + టి + ను -> పగలిటిని.
మొదలు + ను -> (ఆదేశం) మొదలు + టి + ను -> మొదటిని;
.................................. (ఆగమం) మొదలు + ఇ + టి + ను -> మొదలిటిని.
రెండు + ను -> (ఆదేశం) రెండు + టి + ను -> రెంటిని;
............................ (ఆగమం) రెండు + ఇ + టి + ను -> రెండిటిని.
మూఁడు + ను -> (ఆదేశం) మూఁడు + టి + ను -> మూఁటిని;
................................. (ఆగమం) మూఁడు + ఇ + టి + ను -> మూఁడిటిని.
నూఱు + ను -> (ఆదేశం) నూఱు + టి + ను -> నూటిని;
.............................. (ఆగమం) నూఱు + ఇ + టి + ను -> నూఱిటిని.
4) హ్రస్వము మీఁది ‘టి’ వర్ణంబునకు ముందు పూర్ణబిందువు బహుళముగా నగు.
హ్రస్వాంతమైన శబ్దానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న బహుళముగా అవుతుంది.
అన్ని+ను -> అన్ని+టి +ను -> అన్నింటిని, అన్నిటిని.
‘అన్ని+టి+ని’ అన్నప్పుడు ‘న్ని’ అనే హ్రస్వానికి పరమైన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న వచ్చి ‘అన్నింటిని’ అవుతుంది. బహుళం అనడం వల్ల సున్నా రానప్పుడు ‘అన్నిటిని’ అవుతుంది.
ఎనిమిది+టి+ను -> ఎనిమిదింటిని, ఎనిమిదిటిని.
పగలు+టి+ను -> పగటి+ను -> పగంటిని, పగటిని
రెండు+టి+ను -> రెండిటి+ను -> రెండింటిని, రెండిటిని
మూఁడు+టి+ను -> మూఁడుటి+టి+ను -> మూఁడింటిని, మూఁడిటిని.
‘హ్రస్వముమీఁది’ అనడం వల్ల దీర్ఘముమీఁది ‘టి’ వర్ణమునకు నిండుసున్న రాదు. ఉదా... త్రాడు+ను -> త్రాటిని, ఏఱు+ను -> ఏటిని మొ.
ఇదే విధంగా ... కుందేలు+టి+ను -> కుందేటిని.
5) పదాద్యంబగు హ్రస్వంబుమీఁది టివర్ణంబునకు ముందు పూర్ణబిందు వగు.
పదంలోని మొదటి హ్రస్వాక్షరానికి ముందు ఆదేశంగా వచ్చిన ‘టి’ వర్ణానికి ముందు నిండుసున్న నిత్యంగా వస్తుంది.
కన్ను+ను -> కంటిని
‘కన్ను+ను’ అని ఉండగా ‘న్ను’కు ‘టి’ ఆదేశంగా రాగా ‘క+టి+ను’ అయి ఈసూత్రం వల్ల ‘కంటిని’ అవుతుంది.
మిన్ను+ను -> మిటి+ను -> మింటిని
ఇల్లు+ను -> ఇటి+ను -> ఇంటిని
పల్లు+ను -> పటి+ను -> పంటిని.
6) టితివర్ణంబులు పరంబు లగునపు డుత్వంబున కిత్వంబగు.
ఆగమాలుగా వచ్చిన ‘టి, తి’ వర్ణాలకు ముందున్న ఉత్వం ఇత్వం అవుతుంది.
రెండు+టి+కు -> రెండి+టి+కు -> రెండిటికి
మూఁడు+టి+కు -> మూఁడి+టి+కు -> మూఁడిటికి
నాలుగు+టి+కు -> నాలుగి+టి+కు -> నాలుగిటికి
పగలు+టి+కు -> పగలి+టి+కు -> పగలిటికి
మొదలు+టి+కు -> మొదలి+టి+కు -> మొదలిటికి
పెక్కు+టి+కు -> పెక్కి+టి+కు -> పెక్కిటికి
నెత్తురు+టి+కు -> నెత్తు+టి+కు -> నెత్తుటికి (ఇక్కడ మాత్రం ఇత్వం రాదు).
7) టివర్ణంబు పరంబగునపుడు క్రిందు, మీఁదు, ముందు, పువర్ణంబుల కత్వంబగు.
‘టి’వర్ణం పరమైనపుడు క్రిందు, మీఁదు, ముందు శబ్దాల తుది అచ్చుకు, శబ్దాల చివర ఉన్న ‘పు’ వర్ణానికి అత్వం వస్తుంది.
క్రిందు+టి+ను -> క్రిందటిని
మీఁదు+టి+ను -> మీఁదటిని
ముందు+టి+ను -> ముందటిని
మాపు+టి+ను -> మాపటిని
అప్పుడు+టి+ను -> అప్పు+టి+ను -> అప్పటిని.
మిత్రులారా,
ఇప్పటికి నేను తెలుసుకొన్నది ఇది. మీ సందేహాలను కాని, సవరణలను కాని, మీకు తెలిసిన అదనపు విశేషాలను కాని వ్యాఖ్యగా పెడితే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది.

12 కామెంట్‌లు:

  1. బావుందండి.

    కన్ను + ను = కన్నును->కంటిని.

    బహువచన రూపానికి సూత్రం వివరించగలరు.

    కన్నులు + ను = కన్నులను -> (కళ్ళను/కండ్లను అనవచ్చా?)

    రిప్లయితొలగించండి
  2. బాగుంది " ఔప విభక్తి కాలను గురించి " చక్కగా వివరించారు . ఇవన్నీ ఆకళింపు చేసుకుని ఆచరించ గలిగితే చాలు. అదృష్టమే . [ విద్యార్ధి దశ గుర్తుకు వస్తోంది. ] మీ కృషికి ధన్య వాదములు.

    రిప్లయితొలగించండి
  3. గురువుగారూ, చక్కని పాఠము. ఎంచక్కా విదేశాలలో ఉండి కూడా తెలుగు నేర్చుకో గలుగుతున్నాము. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. శంకరార్యా ! చక్కని పాఠం చెప్పారు ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  5. డా. మూర్తి మిత్రమా! "TECHNOLOGY WORKS, Sir". TECHNOLOGY మహిమ, మనుషుల మధ్య దూరము ఎక్కువైనను, మనసుల మధ్య దూరం తగ్గించటానికి ఉపయోగ పడేదే "టెక్నాలజీ". ఏదో Technologist గా కొంచెం SELF డబ్బా కొట్టుకొన్నాను సార్.

    రిప్లయితొలగించండి
  6. రవి గారూ,
    కన్ను, కను రూపాంతరాలు. బహువచనంలో కన్నులు, కనులు అనే అవుతాయి.
    కల్లు అంటే ఱాయి. దాని బహువచన రూపాలు కండ్లు, కండ్లులు. కండ్లు శబ్దానికి రాళ్ళు అనే అర్థమే తీసికోవాలి (ఉదా. వడగండ్లు).
    కళ్ళు ప్రయోగం వ్యాకరణ విరుద్ధం.

    రిప్లయితొలగించండి
  7. రవి గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    చంద్రశేఖర్ గారూ,
    ............. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారూ, మంచి వ్యాసం వ్రాసారు. ఇంతకాలం నిఘంటువులో ఇట "ఔపవిభక్తము" అని చూసినప్పుడల్లా, ఇదేంటబ్బా అనుకొనేవాడిని. ఈ వ్యాసంతో ఓ అవగాహన కలిగింది.

    రిప్లయితొలగించండి
  9. కళ్ళు అనే ప్రయోగం వ్యాకరణ విరుద్ధం. నిజమే. కాని మన లాక్షణిక భాష ఒక స్వరూపాన్ని సంతరించుకొని శతాబ్దాలు దాటింది. అది శిలాశాసనంలా మారకుండా ఉండి పోవాలని ఆశించటం మంచిది కాదేమో. జీవద్భాష యేదైనా కాలంతో బాటు మారుతూనే ఉంటంది. అది అనివార్యం. కొన్న ప్రయోగాలు భాషలో కొత్తగా వచ్చి చేరటమూ, కొన్ని జారి పోవటమూ మరి కొన్ని అర్ధ సంకోచ వ్యాకోచాదులు పొందటమూ జరుగుతుంటుంది. ఆపలేం కదా. అందుచేత, వ్యాకరణంకూడా కాలంతో పాటుగా తగువిధంగా మారక తీరదు. దురదృష్టం యేమిటంటే, తెలుగు వ్యాకరణం అనేది కొందరికి శిలాశాసనంగా మారిపోతే మరికొందరి అస్పృస్యం అయుపోయింది. దానితో మొత్తం వ్యాకరణం అనే దాని ప్రయోజనమే దెబ్బతింటోంది. వస్తాడు, తింటాడు లాంటి వేలాది నిత్య ప్రయోగాలు వందల యేళ్ళుగా వ్యాకరణం వేసే తాతాచార్యుల ముద్రకోసం వేచి యున్నాయి. అలాగే వందల యేళ్ళుగా కేవలం కవులు పండితులు మాత్రమే చదివీ వ్రాసీ యానందిచే వేలాది జనజిహ్వవిదూరమైన పదప్రయోగాలు కొల్లలుగా వ్యాకరణదీపకాంతి పుణ్యమా అని వెలుగుతున్నాయి. వ్యాకరణంలో సహజత్వానికి పెద్దపీట వేసి తిరుగ వ్రాయక పోతే భాషకు మరింత అన్యాయం జరగడానికి దోహదమౌతుంది.

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా ! చక్కని పాఠం చెప్పారు !
    ధన్యవాదములు !

    శ్యామలీయంగారూ ! ఔను ! మీరు చెప్పినది చాలా సరి యైనది !
    దానికోసం ఇంకో నన్నయభట్టు అవతరించాలి గదా !

    శంకరార్యులు ఇది గ్రామ్యం అన్నప్పుడల్లా నాకీ సందేహమే తలెత్తుతూ ఉంటుంది !
    అన్య భాషా పదాలు వాడితే లేని తప్పు గ్రామ్య పదాలు వాడితే వచ్చిందా యని !
    ఎన్నో మాండలీకాలతో అలరారే ఏ భాష అయినా జీవించి ఉందంటే కారణం
    గ్రామ్య భాషే గదా !

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు!శంకరాభరణం ఒక పరామర్శ గ్రంధంగా ఉపయోగపడుతుంది.

    రిప్లయితొలగించండి