12, అక్టోబర్ 2012, శుక్రవారం

పద్య రచన - 139

అల్లసాని పెద్దన
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

12 కామెంట్‌లు:

  1. పెద్దన్న భువన విజయపు
    పద్దెమ్ముల జెప్పు కవుల భళి రాయలె తా
    నద్దిర పల్లకి మ్రోసెను
    పెద్దగ "మను" చరిత నీది పెద్దన జేజే!

    రిప్లయితొలగించండి
  2. పెద్దన వారా నాడట
    పెద్దగ సమ్మానములను పేరిమి గనిరా
    సుద్దుల మఱి మఱి పలికెద,
    ప్రొద్దులు గ్రుంకెడు వరకును; పొలతీ , వినవే!

    రిప్లయితొలగించండి
  3. పూతమెరుంగులంచు నొక ముచ్చట గొల్పెడు పద్యమాలికన్
    బ్రీతిగ జెప్పి యాశువుగ వేడుక గూర్చుచు సత్కవీంద్రులన్
    ఖ్యాతి గడించె పెద్దనగ గాంచెను సత్కృతు లాంధ్రభోజ భూ
    నేత సభాంతరాళమున నిస్తుల వైభవరాజితో మహా
    చాతురితో రచించె విలసన్మనునామ్ను చరిత్ర దిగ్గజ
    వ్రాతమునందు నాద్యుడయి రాజిలె నాంధ్ర కవిప్రకాండులన్
    దాతగ నమ్మహామహుని తజ్ఞుని పూరుషరూప భారతిన్
    జేతమునన్ దలంచి నతిజేయుదు గూర్చుదు పద్యసంస్తుతిన్

    రిప్లయితొలగించండి
  4. అ ల్ల సాని పెద్ద నార్యుడ ! కవి వర !
    మను చరిత్ర రచన మహితు జేసె
    అల్ల సాని వారి యల్లిక జిగి బిగి
    యండ్రు నిజ ము నతు ల నం దు కొనుము .

    రిప్లయితొలగించండి
  5. అష్ట దిగ్గజ కవులకు నాద్యుడగుచు
    భువన విజయమ్ము సాగంగ భుజము నివ్వ
    గండ పెండేరమ్ముఁదొడిగి గారవింప
    పెద్దనార్యుల పొగడని వేది కేది?
    దివ్యుడీశానుడేలేనిదిక్కులేవి?

    రిప్లయితొలగించండి
  6. ఎవరు సంస్కృతాంధ్రము లందు కవిత జెప్పి
    మలయు కవితా వధూటికి మండనమ్ము
    కరము జేతురొ ! వారికి గండ పెండె
    రమ్ము బహుకరించెద నని రాయ లనగ

    సభికు లెల్లరు తలలూచ సంభ్రమమున
    వృత్తమాలిక నొక్కటి నుత్తరముగ
    పెద్దన జదువ బెంపార గద్దె డిగ్గి
    రాయ లాలింగనము జేసె రాజకవిని.

    రిప్లయితొలగించండి
  7. భువన విజయమందు కవనము సాగించె
    కృష్ణరాయలందు కూర్మినుంచి
    మనువుచరితమెల్ల మాన్యంబుగారాసి
    ఆంధ్ర పితరుడైన అల్లసాని

    రిప్లయితొలగించండి
  8. మనుచరిత్రముపేర మహనీయకావ్యంబు
    రచియించికవికులరాజువైతె
    కమనీయ పదజాల రమణీయభావముల్
    పలికించినట్టి విద్వాంసుడీవు
    పెద్దనార్యునిపేర ప్రీతినొందినవాడు
    అష్టదిగ్గజకవులకాద్యుడీవు
    కాలికితొడిగించె గండెపెండేరమ్ము
    నాంధ్రభోజునిచేతనబ్బురముగ

    మహితగుణశీలుడీవుసన్మాన్యుడీవు
    విబుధవరగణ పూజితవేల్పునీవు
    కవులకులదైవమైపొల్చు ఘనుడవీవు
    ప్రేమపూరితనతులివే పెద్దనార్య.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘పెద్ద’ అనిపించుకున్నవాడి గురించి చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    పెద్దన సుద్దులు చెప్పిన మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్య సంస్తుతి అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    పద్యం సంబోధనతో ఉన్నది కనుక ‘మహితు జేసె’ అన్నచోట ‘మహితు డీవు’ అందాం.
    *
    సహదేవుడు గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. టైపాటా? ‘గండపెండేరముఁ దొడిగి’ అంటే సరి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
    *
    జంగిడి రాజేందర్ గారూ,
    చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    ‘వ్రాసి’ అనడానికి ‘రాసి’ అన్నారు. ‘ఆంధ్రపితరుడు’ కాదు కదా ఆంధ్ర కవితా పితామహుడు. ‘ఆంధ్రుల నలరించె నల్లసాని’ అందాం.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ సీసపద్యం హృద్యంగా ఉంది. అభినందనలు.
    ‘పెద్దనార్యునిపేర ప్రీతినొందినవాడు’ను ‘పెద్దనార్యునిపేర ప్రీతినొందితి వీవు’ అనీ, ‘నాంధ్రభోజునిచేతనబ్బురముగ’ను ‘నాంధ్రభోజుడు నీకు నబ్బురముగ’ అనీ సవరిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి



  10. అంబరచుంబి సుందర మహాద్భుత భావవిరాజమౌ ప్రబం
    ధంబు రచించి రాయలను దన్మయు జేసి బహుత్కృతుల్ విశే
    షంబుగ బొంది దిగ్గజపు , సత్కృతి నందితి వౌర ,పాఠకుల్
    సంబరమొంద జేసితి ,రసాత్మక కావ్య మనోజ్ఞతన్ గడున్

    రిప్లయితొలగించండి




  11. అంబరచుంబి సుందర మహాద్భుత భావవిరాజమౌ ప్రబం
    ధంబు రచించి రాయలను దన్మయు జేసి బహుత్కృతుల్ విశే
    షంబుగ బొంది దిగ్గజపు , సత్కృతి నందితి వౌర ,పాఠకుల్
    సంబరమొంద జేసితి ,రసాత్మక కావ్య మనోజ్ఞతన్ గడున్

    రిప్లయితొలగించండి




  12. అంబరచుంబి సుందర మహాద్భుత భావవిరాజమౌ ప్రబం
    ధంబు రచించి రాయలను దన్మయు జేసి బహుత్కృతుల్ విశే
    షంబుగ బొంది దిగ్గజపు , సత్కృతి నందితి వౌర ,పాఠకుల్
    సంబరమొంద జేసితి ,రసాత్మక కావ్య మనోజ్ఞతన్ గడున్

    రిప్లయితొలగించండి