30, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 863 (కారమ్మే పెంపుజేయు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

24 కామెంట్‌లు:

 1. పేరు ప్రతిష్ఠలు పెంచును
  పారము లేకుండ తృష్ణ బలపరచు సదా!
  ఔర! అధికార దురహం
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 2. భారీ ప్రాజెక్టులతో
  హోరాహోరీగ పోరి యున్నతి బొందన్
  వారించి తగవుల పరి
  ష్కారమ్మే పెంపు జేయు ఘనసంపదలన్!

  రిప్లయితొలగించండి
 3. శ్రీ శంకరయ్య గురువుగారికి ,శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు,

  మా బావ గారికి డెంగ్యు జ్వరము వచ్చిన కారణమున దసరా సెలవులకు సెలవు పెట్టితిని,ఇప్పుడు కొంచెం బాగున్నది .

  కారణ మడుగక నిచ్చెను
  ధారాళముగ వరములను తాపసులకు యా
  శ్రీరఘు రాముని దివ్యా
  కారమ్మే పెంపు జేయు ఘన సంపదలన్ .

  రిప్లయితొలగించండి
 4. శ్రీ శంకరయ్య గురువుగారికి , శ్రీ నేమాని వారికి పాదాభి వందనము జేయుచు

  రెండవ పూరణ
  =======*=====
  శ్రీ రాముని నోరూరగ
  నేరము బాపుమని వేడ,నెమ్మది తో బం
  గారపు కలలెల్లను సా
  కారమ్మే పెంపు జేయు ఘన సంపదలన్ .

  రిప్లయితొలగించండి
 5. వరప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  'తాపసులకు + ఆ' అన్నప్పుడు యడాగమం రాదు. 'తాపసులకు నా' అంటే సరి.

  రిప్లయితొలగించండి
 6. వరప్రసాద్ గారూ,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
  'కలలెల్లను' అనడం కంటే 'కలలన్నిటి' అంటే అన్వయక్లేషం తప్పుతుందని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
 7. పండిత నేమాని వారూ,
  ఈ కాలంలో అధికార దురహంకారమే సంపదలను పెంపొందింపజేస్తుందన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ, బాగుంది మీ పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 8. ధారాళం బయ్యె కనక
  ధారా స్తోత్రమున ధనము తాన్ శంకరు లా
  నారాయణిని గొలువ శ్రీ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్.

  చారుతర రూపమున సా
  కారము దాల్చిన నమలను గని మ్రొక్కు మహం
  కారమును వదలి ; యా శ్రీ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్.

  రిప్లయితొలగించండి
 9. ఔరా! దొంగలు దొంగలుఁ
  గోరి పరుల సొమ్ము పంచుకొన్నటులుగ న
  వ్వారికి మరి పరస్పర సహ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్.

  రిప్లయితొలగించండి
 10. పారాడు సంతు, సావిడి
  తారా డావులు, స్మితధర దైతాస్యముయున్,
  గౌరవమొప్పు యతిధిస
  త్కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్.

  రిప్లయితొలగించండి
 11. ఆరయ శీలమె సంపద
  పారము లేనట్టి తృష్ణ బాధించు నరున్
  కోరిక లందునను తృణీ-
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 12. నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  పరస్పర సహకారం సంపద పెంచునన్న మీ పూరణ బాగుంది. అభినందనలు. (అది దొంగలకే కాదు, అందరికీ వర్తిసుంది కదా!)
  మూడవ పాదంలో గణదోషం. ‘వారికిని పరస్పర సహ...’ అంటే సరి!
  *
  రామకృష్ణ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ‘దైతాస్యము’ అర్థం కాలేదు. ‘ఆస్యముయున్’ అనకుండా ‘ఆస్యంబున్’ అంటే బాగుంటుందేమో!
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. మాస్టారూ, సవరణకి ధన్యవాదాలు. నేను వ్యంగ్య ధోరణిలో వ్రాశాను. కలియుగంలో పక్కవాడు బాగుపడితే చూడలేని వాడు పరస్పర సహకారాన్ని ఇష్టపడకపోవటం మనం అనునిత్యం చూస్తూనేవున్నాము. ఇక దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొన్నట్లు రాజకీయనాయకులు పార్టీ తరతమ భేదం లేకుండా సహకరించుకోవటమూ చూస్తూనేవున్నాము. అంతా భ్రాంతియేనా, ఈ జగానా...

  రిప్లయితొలగించండి
 14. మీరిన సంపద గలిగిన
  వారికి పుత్రుని యొసంగ వాడికి చూడన్
  చేరును సిరి, దత్తత స్వీ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 15. గురువుగారూ ,
  దర్మపత్ని దరహాసం కోసం పడ్డపాట్లండీ

  స్మితధరదయితాస్యంబున్ అనవచ్చునంటారా

  భవదీయుడు

  రిప్లయితొలగించండి

 16. అంబారమ్మే పెంపుజేయు పైడి సంపదలన్
  అగ్గురారమ్మే పెంపుజేయు సిరి సంపదలన్
  అప్ప కప్పోరమ్మే అయ్యవారి టపా లం
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్ !


  జిలేబి.


  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 17. చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణలోని వ్యంగ్యాన్ని ముందే గ్రహించాను. కాని ఆ భావం సార్వజనీనమని తెలిపాను అంతే!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ మంచి పూరణలలో ఒకటి ‘స్వీకారము’ చేయదగింది. అభినందనలు.
  ‘పుత్రుని + ఒసంగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వారికి తన పుత్రు నొసగు వాడికి చూడన్’ అందామా?
  *
  రామకృష్ణ గారూ,
  ఇప్పుడు భేషుగ్గా ఉంది. ధన్యవాదాలు
  *
  జిలేబీ గారూ,
  స్వాగతం!

  రిప్లయితొలగించండి
 18. శంకరార్యా!చక్కని సవరణకు ధన్యవాదములు.
  సవరణతో..

  మీరిన సంపద గలిగిన
  వారికి తన పుత్రు నొసగ. వానికి జూడన్
  చేరును సిరి, దత్తత స్వీ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 19. సారము గననీ జీవిత
  భారపు బడుగులను జేరి భవితా దర్శుల్
  తూరిగ మేలిడు సరిసహ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 20. సారము గననీ జీవిత
  భారపు బడుగులను జేరి భవితా దర్శుల్
  తూరిగ మేలిడు సరిసహ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి
 21. ఈ రోజున లాలూతో
  మరు రోజున మోడితో కుమారా నితిషా!
  కరమిడి కరచెడి నీ మమ
  కారమ్మే పెంపుజేయు ఘన సంపదలన్

  రిప్లయితొలగించండి