23, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 857 (అష్టమి శ్రేష్ఠమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
అష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్.

21 కామెంట్‌లు:

 1. అష్టమియు నవమియును హరి
  కిష్టమగుట వెలిసె రామ కృష్ణులుగ ధరన్
  శిష్టుల రక్షకుడై కృ
  ష్ణాష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్

  రిప్లయితొలగించండి
 2. కష్టమె యష్టమి పనులకు
  ఇష్టముగా కృష్ణ, దుర్గ నే తలచిన కృ
  ష్ణాష్టమి కనగ మరియు దు
  ర్గాష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్.

  రిప్లయితొలగించండి
 3. కష్టములు గల్గు నందురు
  అష్టమి తిథి యందు పనుల నారంభించన్
  నష్టములు గల్గ వీ దు
  ర్గాష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభించన్

  రిప్లయితొలగించండి
 4. శిష్టుల రక్షింపంగన్,
  దుష్టుల శిక్షించి, కీడుఁ దొలఁగఁగఁ జేయన్
  స్పష్టతనిడె శుభకర దు
  ర్గాష్టమి! "శ్రేష్ఠమ్ము" పనుల నారంభింపన్!!

  రిప్లయితొలగించండి
 5. దుష్టాంతక నుమ గొలుచుట
  కష్టమి శ్రేష్ఠమ్ము, పనుల నారంబింపన్
  శిష్టాదిసకలజనులకు
  నిష్టం బా విజయదశమి యిలలో నెపుడున్.

  రిప్లయితొలగించండి
 6. అష్టము లరయగ మఱి కృ
  ష్ణా ష్ట మి శ్రే ష్ట మ్ము, పనుల నారం భిం పన్
  అష్ట మి నవమియు పాడ్యమి
  నష్టము లే గలుగ జేయు నరుడా ! వినుమా !

  రిప్లయితొలగించండి
 7. ఇష్టముగ నమ్మి కొలిచిన
  నష్టము లేదెపుడు మనకు నవమీ దశమిన్ !
  దుష్టమ్మును తొలగిం చగదు
  ర్గాష్టమి శ్రేష్టమ్ము పనుల నారం భించన్ ! !

  రిప్లయితొలగించండి
 8. సృష్టిని గల తిథు లన్నియు
  కష్టించెడివా రికెల్ల కలిమిని యిచ్చున్
  స్పష్టతతో చేసిన ప్రతి
  యష్టమి శ్రేష్టమ్ము పనుల నా రంభించన్

  రిప్లయితొలగించండి
 9. నిష్టగ కొలిచిన దుర్గను
  కష్టము కాదనుచు జనుల కాపాడు నిలన్ !
  సృష్టికి మూలము విజయ దు
  ర్గాష్టమి శ్రేష్టమ్ము పనుల నారం భింపన్ !

  రిప్లయితొలగించండి
 10. ఇష్టసఖీ!వేధించకఁ
  దుష్టిఁ ననుపరుండనిమ్ము దొరికెను సెలవే-
  స్పష్టమ్ము శాస్త్రమునఁ గా
  దష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్.

  రిప్లయితొలగించండి
 11. పూజ్య గురువులకు ,ఆదరాభి మానములను అందిస్తున్న ప్రియ సోదరులకు " విజయ దశమి శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 12. కవిమిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు!
  *
  ఈనాటి సమస్యకు చక్కని స్పందన వచ్చింది. మిత్రులు మంచి పద్యాలను అందించి ఆనందింపజేసారు. ధన్యవాదాలు.
  *
  పండిత నేమాని వారు, సుబ్బారావు గారు కృష్ణాష్టమి శ్రేష్ఠమన్నారు.
  గోలి హనుమచ్ఛాస్త్రి గారు కృష్ణాష్టమి, దుర్గాష్టమి రెండూ శ్రేష్ఠమన్నారు.
  నాగరాజు రవీందర్ గారు, గుండు మధుసూదన్ గారు, హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారు దుర్గాష్టమి శ్రేష్ఠ మన్నారు.
  గండూరి లక్ష్మినారాయణ గారు కార్యసాధకునకు అన్ని తిథులూ మంచివే అన్నారు.
  ఊకదంపుడు గారు పని ఎగ్గొట్టి విశ్రాంతి తీసుకొనడానికి అష్టమి మంచిది కాదని తప్పించుకున్నారు.
  అందరి పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. అభివందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 13. మిత్రులందరికీ విజయ దశమి శుభాకాంక్షలు !
  (శారీరక మానసిక జాలావస్థల వల్ల కొద్ది రోజులు మిత్రులకు దూరమయ్యాను)

  రిప్లయితొలగించండి
 14. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఇష్టం లేనప్పు డే యష్ట(తిథి)మైనా ఒకటే :

  01)
  _______________________________

  అష్టమి , దశమే గానీ
  ఇష్టత లేనట్టి పనుల - కే తిథి నైనా
  నష్టము గలుగును ! కనుకే
  యష్టమి శ్రేష్ఠమ్ము పనుల - నారంభింపన్ ???
  _______________________________

  రిప్లయితొలగించండి
 15. అష్టమైనా నవమైనా కష్ట పడకుండా అష్టాపదమెలా వస్తుంది?

  02)
  _______________________________

  అష్టాంగ యోగులైనను
  అష్టాంగము లలయకుండ - నాశ పడినచో
  అష్టాపద మందుట కే
  యష్టమి శ్రేష్ఠమ్ము పనుల - నారంభింపన్ ???
  _______________________________
  అష్టాపదము = బంగారము

  అష్ట-అంగములు :
  1. యమము
  2. నియమము
  3. ఆసనము
  4. ప్రాణాయామము
  5. ప్రత్యాహారము
  6. ధారణము
  7. ధ్యానము
  8. సమాధి [ఇవి యోగాంగములు]

  అష్ట-అంగములు :
  కరములు (2)
  పాదములు (2)
  భుజములు (2)
  7. ఱొమ్ము
  8. లలాటము [ఇవి శరీరాంగములు]

  రిప్లయితొలగించండి
 16. కష్టే ఫలిః యనిగదా ఆర్యోక్తి :

  03)
  _______________________________

  స్పష్టత గలిగిన వారికి
  నష్టము గలుగదు పనులను ! - నమ్మిక తోడన్
  కష్టించు వారి కెన్నడు
  అష్టమి శ్రేష్ఠమ్ము పనుల - నారంభింపన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 17. అష్టమి నాడు పుట్టిన శ్రీకృష్ణు డన్నింటా విజయుడే గదా :

  04)
  _______________________________

  దుష్టుల తుదముట్టింపగ
  అష్టమ గర్భమున నాడు - యక్షధరుండే
  అష్టమి జననము నొందెను !
  అష్టమి శ్రేష్ఠమ్ము పనుల - నారంభింపన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 18. కష్టపడే వాడికి అష్ట మొక అడ్డా ?

  05)
  _______________________________

  నష్టము గలుగదు నిష్ఠగ
  కష్టము నందిష్ట ముంచ - గలుగును జయమే
  అష్టమి నవమని వెఱవక !
  అష్టమి శ్రేష్ఠమ్ము పనుల - నారంభింపన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 19. అష్టమి జయతిధినిస్టుల
  ఇస్టార్తమ్ములను నిచ్చి నిక్కము నిలకున్
  తిస్తిత కర్మలకెప్పుడు
  అష్టమె శ్రేష్టమ్ము పనుల నారంభింప న్

  రిప్లయితొలగించండి
 20. అష్టమి సప్తమి నవములు
  శిష్టులకే తిథులు గాని శృంగారులకున్
  దుష్టులు భ్రష్టులు ద్రష్టల
  కష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్

  రిప్లయితొలగించండి