22, అక్టోబర్ 2012, సోమవారం

సమస్యాపూరణం - 856 (కీచకుఁడు పెండ్లియాడె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

10 కామెంట్‌లు:

  1. మృచ్చకటిక శకారులు పెచ్చు మీరె
    తెలిసి తెలియని మాటల తెలుపు నిట్లు
    లాగె ద్రౌపది చీరలు రావణుండు
    కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.

    రిప్లయితొలగించండి
  2. నాటకోత్సవములలోన నాట ప్రేమ
    వేడ్క ప్రోత్సాహ మెసగంగ వివిధ పాత్ర
    లను ధరించిన వారిలో లక్షణముగ
    కీచకుడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి

    రిప్లయితొలగించండి
  3. ఏసు రాములు మార్గాన నేగు చుండి
    పిచ్చి మాటలు బలుకుచు బేల వోలె
    ఏసు రాముని దరి జేరి యిట్లు బలికె
    కీ చకుడు పెండ్లి యాడె లంకిణిని మెచ్చి .

    రిప్లయితొలగించండి
  4. సాధ్వి సైరంధ్రికొఱకయి చచ్చెనెవఁడు?
    రామ దమయంతినిన్ నలుం డేమి సేసె?
    రావణుఁడు దేని మెచ్చి చేరంగఁ జనియె?
    కీచకుఁడు, పెండ్లియాడె, లంకిణిని మెచ్చి!

    రిప్లయితొలగించండి
  5. అజ్ఞాతవాసాన నలనాడు కృష్ణను
    కాంక్షించె నెవ్వాడు కామమునను?
    పరమభక్తుడు జాంబవంతుడర్పించిన
    కన్యకామణినంది కమలనాభు
    డేమి చేసెను? లంక కినుమడించిన శక్తి
    నెవరిని తాటించి యేగె హనుమ?
    దశకంఠు నెంతయో దయజూచి దీవెన
    లిచ్చె నెందులకప్పు డీశ్వరుండు?

    ఛాత్రగణములు మీరలాసక్తు లగుచు
    చెప్పుడని యన్న క్రమముగా నొప్పుమీర
    ఉత్తరంబులు కాగల వుత్తమముగ
    కీచకుడు, పెండ్లియాడె, లంకిణిని, మెచ్చి.

    రిప్లయితొలగించండి
  6. వెండి తెరపైన కనుపించు వెలుగు జిలుగు
    కనుల విందుగ జూపించు కధలు మెండు
    పొత్తు కుదరదు నొకదాని పొంత నొకటి
    కీచకుఁడు పెండ్లి యాడె లంకిణిని మెచ్చి !

    రిప్లయితొలగించండి
  7. నాడు కృష్ణను మోహించి నామ మడగె
    కీచకుడు ; పెండ్లి యాడె లంకిణిని మెచ్చి
    దైత్యు డొక్కడు ; కానది హనుమ వలన
    దారుణముగ జచ్చెను పుర ద్వారమందు.

    రిప్లయితొలగించండి
  8. వినగ చెంచుల కుండును వింత పేర్లు
    వెదురు గంప లల్లెడి వాని పేరు కీచ
    కుడని , లంకిణి యను పేరు బడసి యొకతె ;
    కీచకుడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి.

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ నటీనటుల పెండ్లి పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    హిందూ ఇతిహాసాల గురించి తెలియని క్రైస్తవుడి మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ క్రమాలంకార పూరణ బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీరూ క్రమాలంకారాన్నే ఆశ్రయించినా ప్రశ్నలు సీసపద్యంలో వేయడం బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    సినిమా వాళ్ళ కల్పనల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి