5, అక్టోబర్ 2012, శుక్రవారం

విశేష వృత్తము - 27 (స్రగ్ధర)

మిత్రులారా! 
శుభాశీస్సులు.
ఈనాడు మనము ముచ్చటించుకొను చున్న విశేష వృత్తము - స్రగ్ధర.
స్రగ్ధర -
ఇది 21వ ఛందమైన ‘ప్రకృతి’లో 299393వ వృత్తము.
గణములు : మ ర భ న య య య
యతులు 2 చోట్ల : 8వ అక్షరము, 15వ అక్షరము
ప్రాస నియమము కలదు

ఉదా:
నా సామర్థ్యం బసామాన్యము త్రిజగములన్ గాంచె నెంతే ప్రశస్తిన్
నా సాటెవ్వారు హా హ నరులును గపు లీనాడు నన్ గాంచుడంచున్
జేసెన్ నాదంబు దిక్కుల్ చెదరెడు నటులన్ జెట్టి యింద్రారి బల్మిన్
వేసెన్ బ్రహ్మాస్త్రమంతన్ వివిధ కపులపై భీకరంబైన రీతిన్


చూచేరు కదా!  మనకు దేవతా స్తోత్రాలలో అనేక స్రగ్ధరా వృత్తాలు ఉంటాయి:

-- యా సా పద్మానస్థా విపులకటి తటీ పద్మ పత్రాయతాక్షీ ..  ..  ..

-- క్షీరోదన్వత్ ప్రదేశే శుచి మణి విలసత్ సైకతే మౌక్తికానాం ..  ..  ..

-- ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మ పత్రాయతాక్షీం  ..  .. 


స్వస్తి.
                            పండిత రామజోగి సన్యాసి రావు

7 కామెంట్‌లు:

 1. శ్రీవాణీ! నిన్ను పూజించి మనెదను సదా సేవ నే జేతునమ్మా!
  భావమ్మందుంచి యర్చింప దలచెద రమా పార్వతీ తోడ, రమ్మా!
  దేవీ! నీ నామమందే దృఢమయిన గతిన్ తీవ్ర విశ్వాసముంతున్.
  నా విశ్వాసమ్ము లోనున్న పదములవి వీణాధరీ నీవె నమ్మా!

  రిప్లయితొలగించండి
 2. చిన్న సవరణ.
  చివరి పదము నీవె నమ్మా కాకుండా నీవె సుమ్మా అని పరిగణించవలసినది.

  రిప్లయితొలగించండి
 3. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! మీ పద్యము బాగున్నది. తొలి ప్రయత్నములోనే మీరు మంచి పద్యమును వ్రాయ గలిగినందులకు శుభాభినందనలు.

  వాణీ! బ్రహ్మాణి! విద్యా! వనజభవ ముఖాబ్జాత దివ్యాసనస్థా!
  వీణాపాణీ! సువేణీ! విమల గుణగణా! వేదమాతా! శుభాంగీ!
  ఏణీనేత్రా! పవిత్రా! హిమకరవదనా! ఈప్సితార్థప్రదాత్రీ!
  క్షోణిన్ నే వ్రాలి నీ యంఘ్రుల కివె నతులన్ గూర్తు నో కీరపాణీ!

  రిప్లయితొలగించండి
 4. పారిజాతాపహరణ ఘట్టము:

  దేవోద్యానిన్ భటాలుల్, దివిజ తరులు కనన్, దివ్యవృక్షమ్ముఁ గొంచున్
  వేవేగన్ దాఁ జనంగన్; విదిత తరు లతల్ విష్ణుఁ బోవంగ నీఁకన్,
  బోవద్దంచున్ బతిన్ వే ముదితలు పిలువన్ బోవు ప్రాణేశు వోలెన్
  భావింపంగన్ గుజమ్మున్ బలువిధములుగన్ బారిజాతమ్మునాపెన్!

  రిప్లయితొలగించండి
 5. శ్రీ గుండు మధుసూదన్ గారు:
  శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. 1వ పాదములో 1 లఘువు ఎక్కువగా నున్నది. భావము ఉత్తమముగా నున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. గౌ. పండిత నేమాని వారికి నమస్కారములు!
  నిజమే, పొరపాటయినది. చూచుకొనలేదు! 'దివిజ'ను 'దివి'గ మార్చిన సరిపోవును!
  కృతజ్ఞతలతో...
  భపదీయవిధేయుఁడు...
  గుండు మధుసూదన్
  సవరించిన పూరణ......
  పారిజాతాపహరణ ఘట్టము:

  దేవోద్యానిన్ భటాలుల్, దివి తరులు కనన్, దివ్యవృక్షమ్ముఁ గొంచున్
  వేవేగన్ దాఁ జనంగన్; విదిత తరు లతల్ విష్ణుఁ బోవంగ నీఁకన్,
  బోవద్దంచున్ బతిన్ వే ముదితలు పిలువన్ బోవు ప్రాణేశు వోలెన్
  భావింపంగన్ గుజమ్మున్ బలువిధములుగన్ బారిజాతమ్మునాపెన్!

  రిప్లయితొలగించండి