27, అక్టోబర్ 2012, శనివారం

సమస్యాపూరణం - 860 (పొగ త్రాగనివాఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్.
(ప్రాచీనమూ, ప్రఖ్యాతమూ అయిన సమస్యే ఇది. 
మిత్రులు వైవిధ్యంగా ఎలా పూరిస్తారో చూడాలని ఆసక్తి!)

40 కామెంట్‌లు:

 1. గిరీశంగారికంటే భిన్నంగా చెప్పె ప్రయత్నంలో:
  తగురీతిఁ దైవ పూజలు
  నగుమోమున ధూపదీప నైవేద్యంబుల్
  సొగసుగ నిడి యగరొత్తుల
  పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్
  ఆయనే మళ్ళీ పుట్టి ఈ పద్యం చదివితే నన్ను ఇంగ్లీషులో గారంట్రీగా తిడతాడు:-)

  రిప్లయితొలగించండి
 2. పొగరెసగ బలికె నొక్కడు
  పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్
  జగతి నని, వినిన యొక్కడు
  పొగ కలవడి దుర్గతులను బొంది గతించెన్

  రిప్లయితొలగించండి
 3. "పొగలు గ్రక్కే" పూరణలు చేసిన శ్రీ చంద్ర శేఖర్ గారికి శ్రీ నేమాని గారికి అభినందనలు.

  "పొగ" రెక్కి పలికె నొక్కడు
  "పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్"
  పొగిలేడ్చి దున్న తలచెను
  "పొగనెందుకు త్రాగలేదు పోయిన జన్మన్".

  రిప్లయితొలగించండి
 4. చిన్న సవరణ తో..

  " పొగ గ్రక్కి" పలికె నొక్కడు
  "పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్"
  పొగిలేడ్చి దున్న తలచెను
  "పొగనెందుకు త్రాగలేదు పోయిన జన్మన్".

  రిప్లయితొలగించండి
 5. నగుచు కలకాలము బ్రతుకు
  పొగ త్రాగని వాడు ; దున్నపోతై పుట్టున్
  సగటు పశురీతి జీవన
  ము గడపు వాడు మరుజన్మము గలుగ నిలలోన్ !  నిగిడి గిరీశ మ్మిట్లనె
  “ పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్ "
  పొగ త్రాగని స్త్రీ మరి యే
  మగునో వచియింపలేదు మహిషం బౌనో !

  రిప్లయితొలగించండి
 6. నగవుల నిలయ పు మా టిది
  పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టు
  న్నగ మ్య గోచర మీ యది
  తగదయ్యా యిట్టి దీ య తమకు న్నిపుడున్

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారి స్ఫూర్తితో :

  ఖగ మొక్కడు దున్న నడిగె
  ను “ గతించిన జన్మ మేది నుడువుము నీకున్ ?"
  వగయుచు బదులు పలికె నది
  “ పొగత్రాగని వాడు దున్నపోతై పుట్టున్"
  (“ పొగ త్రాగని మానవుడను పుట్టితి యిటులన్ !")

  రిప్లయితొలగించండి
 8. గోలివారికి నెనరులు, కరెంటు పుణ్యమా అని ఈ రోజు మీ ప్రథమ పూరణ స్థానం నేను పుచ్చుకొన్నాన్ను.
  నాగరాజు రవీందర్ గారి ప్రశ్న
  "పొగ త్రాగని స్త్రీ మరి యే
  మగునో వచియింపలేదు మహిషం బౌనో !"
  బాగుంది, అయితే మహిషం కూడా పుంలింగమవటం వల్ల అది కుదరదేమో. ఏదోకటి యతి కలిసే స్త్రీ లింగ జంతువు కనిపెడదాం:-)
  మేము రోజూ పొగ త్రాగే మగువలను చూస్తుంటాము. మరి వారి గతేమిటో!

  రిప్లయితొలగించండి
 9. మగువల ప్రేమను పొందక
  గగనపు సౌరులను గనక గాలికి దిరుగన్!
  జగతిని వింతల నెరుగక
  పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్ !

  రిప్లయితొలగించండి
 10. పొగ త్రాగెడి తరుణుల గని
  వగ చెదరట పురుషులంత వాహ్వా యనుచున్ !
  తగదిది కొరతౌను మనకు
  పొగ త్రాగనివాడు దున్న పోతై పుట్టున్ !

  రిప్లయితొలగించండి
 11. గిరీశం ఉవాచ...
  “మైడియర్ వెంకటేశం! మన(తెలుగు)వా రుత్త మొండివారోయ్... సురేంద్రనాథ్ బెనర్జీ అంతటి పూర్ శంకరయ్య మాస్టారు ఎన్ని సార్లు చెప్పినా గ్రాంధికంలో వ్రాయాల్సిన పద్యంలో వ్యావహారిక పదాల వాడకం కంటిన్యూ చేస్తూనే ఉంటారు. (బుచ్చమ్మొదిన వింటున్నది కదా!) అగరు వత్తుల్ని అగరొత్తులు అనడం మోస్ట్ బార్బేరియస్ కదా! అక్కడ ‘సొగసైన యగరువత్తుల’ అని సవరిస్తే బాగుంటుందని ఇంగ్లీషువాడి పొగచుట్టమీద ఒట్టేసి చెప్తున్నాను...”
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ వినోదాత్మకంగా ఉంది. అభినందనలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పూరణ నీతిబోధకంగా బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘పొగిలి + ఏడ్చి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘పొగులుచు దున్న తలంచెను’ అందాం.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ మూడు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  చంద్రశేఖర్ గారి అభ్యంతరానికి సమాధానంగా ‘మహషిగ నౌనో’ అంటే సరి!
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘అగమ్య’ అని బేసి గణంగా జగణం వేసారు. సవరించండి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  కాకుంటే పొగత్రాగడాన్ని సమర్థించినట్టే ఉంది.

  రిప్లయితొలగించండి
 12. లింగ భేదాన్ని బాగుగా గుర్తు చేసి నందుకు మన తెలుగు గారికి కృతజ్ఞతలు.
  .....
  పొగ త్రాగని స్త్రీ మరి యే
  మగునో వచియింప లేదు మహిషిగ మనునో !

  రిప్లయితొలగించండి
 13. రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండవ పూరణ కూడా బాగుంది.
  కానీ ‘అయ్యో’ అని వగచెదరు కాని ‘వాహ్వా’ అని వగచుట?
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ సవరణ బాగుంది.

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా నిన్నటి పూరణలను సమీక్షించలేదెందుకనో ?

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  మూడు రోజులుగా విపరీతమైన తలనొప్పి. దాంతో పాటు జ్వరంగా ఉన్నట్లు ఒంటినొప్పులు, నీరసం. అందువల్ల నిన్నటి దత్తపది పూరణలను సమీక్షించలేదు. ఇప్పుడు ఆ పని చేయబోతున్నాను.
  నిజానికి ఉదయం తలనొప్పు కారణంగా కొత్త సమస్యకోసం ఆలోచించలేక ప్రఖ్యాతమైన సమస్యను ఇచ్చాను. గతంలో (మీతో పాటు) మిత్రులు పంపిన సమస్యలు సేవ్ చేసి ఉంచాను. కాని మా అబ్బాయి సిస్టంను ఫార్మాటింగ్ చేసినప్పుడు అవి మాయమయ్యాయి.

  రిప్లయితొలగించండి
 16. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  నాగరాజు రవీందర్ గారితో ఏకీభవిస్తూ :

  01)
  _______________________________

  పొగ త్రాగిన వగ దీరును !
  పొగ త్రాగనివాఁడు దున్న - పోతై పుట్టున్ !
  పొగరాయుని వలె ముదితలు
  పొగ త్రాగినచో మహిషిగ - బుట్టును ధరణిన్ !
  _______________________________
  మహిషి = గేదె= పట్టమహిషి = మహారాణి

  రిప్లయితొలగించండి
 17. శంకరార్యా ! మా(ప్రతీ )యింట్లో కూడా యిదే సమస్య !
  వాతావరణంలో మార్పులవల్ల !
  మందులు వాడుతూ తగినంత విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది !

  రిప్లయితొలగించండి
 18. పొగ త్రాగ వలదని యనగ
  మొగియుచు వాదించి యొకడు పొగరున బలికెన్
  “పొగ త్రాగుదు నే దప్పక
  పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్ !"

  రిప్లయితొలగించండి
 19. గిరీశం మాష్టారు చెప్పాక ఈ వేంకటేశం శిష్యుడొప్పుకోక తప్పుతుందా! తప్పుగమనించాను, బాగా నవ్వుకొన్నాను, మాష్టారు మీ సమయోచిత వ్యాఖ్య చూసి. అయితే మీ బుచ్చమ్మోదిన ఈ మధ్యే భువనగిరిలో కనిపించినట్టు వినికిడి, ఏమంచ్షారు?

  రిప్లయితొలగించండి
 20. చంద్రశేఖరా,
  నిజమే... యాదగిరి గుట్టకు నృసింహస్వామి దర్శనానికి వెళ్ళి వస్తూ భువనగిరిలో బుస్సు మారిందిట! పాపం గరీశం కూడా వెళ్దామనుకున్నాడు. కానీ అగ్నిహోత్రావధాన్లు ఏవో కోర్టు కాగితాలు చూడమంటే ఆగిపోయాడు.

  రిప్లయితొలగించండి
 21. అసలు కారణం అదికాదు.. మరెవరితో అనకండేం... బుచ్చమ్మకు తోడుగా పూటకూళ్ళమ్మ వెళ్ళింది. :-)

  రిప్లయితొలగించండి
 22. నాగరాజు రవీందర్ గారూ,
  మీ తాజా పూరణ బేషుగ్గా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  ‘ముదితలు’ అనే బహువచనం కాకుండా ‘ముదితయె’ అని ఏకవచనం వేద్దాం. ‘మహిషిగ పుట్టును’ అన్నారు కదా!

  రిప్లయితొలగించండి
 24. గురువు గారూ ! మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. ఈ నాటి ప్రశస్తమైన సమస్యకు ముఖ్యంగా రవీందర్ గారు చేసిన రెండవ పూరణలోని భావం అనుపమానం. దానికి చంద్రశేఖరులు చేసిన సూచన, గురువుగారు చెప్పిన సవరణ చాలా బాగున్నాయి. గిరీశం గారి సంభాషణలు అద్భుతం. చాలా రోజులకు హాయిగా నవ్వుకొన్నాం.

  రిప్లయితొలగించండి
 26. పొగ తలకెక్కిన వాడనె
  మొగమాటము లేక లంక పొగయాకునదో
  తగ బీడీ హుక్కాదో
  పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్.

  రిప్లయితొలగించండి

 27. తగునని వలచిన చిన్నది
  సొగసుగ తనదరికి చేర శోభనమందున్
  అగరొత్తుల పరిమళమౌ
  పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్!!


  రిప్లయితొలగించండి
 28. అగణితమగు సిగరేట్లను
  పగలును రేయనక త్రాగి పాడౌ వాడే
  బొగడును జెప్పుచు నొరులకు
  పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్.

  రిప్లయితొలగించండి

 29. నిగనిగ మెరిసెడి గ్లాసును
  మగువొక్కతె చేతికివ్వ మక్కువ తోడన్
  భుగభుగ పొంగెడి కాఫీ
  పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

  (పొగలు కక్కే కాఫీ అంటారుగా, ఆ విధంగా ప్రయత్నించాను..)

  రిప్లయితొలగించండి
 30. మిస్సన్న గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ మాత్రం తక్కువా? పొగ తలకెక్కితే ఫరవాలేదు. పొగరు ఎక్కితే ఇబ్బందే... పద్యం మాత్రం పొగరు తలకెక్కినవాడి మాటగానే ఉంది. చక్కని పూరణ. అభినందనలు.
  *
  పుష్యం గారూ,
  బహుకాల దర్శనం. సంతోషం!
  మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  “సమస్య పాదాన్ని సగం ఇవ్వవచ్చునా?” అని ప్రశ్నించారు కదా! ఇవ్వవచ్చు. సమస్యలను ఇవ్వడంలో పాద గోపనం, ఛందో గోపనం అనే పద్ధతులున్నాయి. పాదంలో సగమే కాదు, ఒక్కొక్కసారి రెండు, మూడు పాదాల సమస్యలు కూడా ఇవ్వబడ్డాయి అవధానాలలో.

  రిప్లయితొలగించండి
 31. మాస్టారూ, ఈ నాటి పూరణ చెప్పీచెప్పకుండానే పొగతాగే కవిమిత్రులను, పొగతాగని వారినించి వేరుచేసి పడేస్తోంది. తెలివైన సమస్య:-) గురజాడ వారా మజాకానా?

  రిప్లయితొలగించండి
 32. శంకరార్యా,

  కార్యవ్యగ్రత మూలముగా ఈ మధ్యన ఈ సభలో పాల్గొనే అవకాశము దొఱకుట లేదు. మీరు 'అగరొత్తులు' వ్యవహారికమని చెప్పిన వ్యాఖ్యను ఇప్పుడే చూసాను. సవరించి పద్యము:

  తగునని వలచిన చిన్నది
  సొగసుగ తనదరికి చేర శోభనమందున్
  అగరపు వత్తుల కమ్మని
  పొగ త్రాగనివాడు దున్నపోతై పుట్టున్

  ఈ సభలో అందరూ అవలీలగా రోజుకొక సమస్యను పూరిస్తున్నారు. మీ అందరకు మా సుజనరంజని మాస పత్రికలోని 'పద్యం-హృద్యం' శీర్షికలో కూడా పాల్గొనమని నా ఆహ్వానము.


  http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/oct12/padyamhrudyam.html

  రిప్లయితొలగించండి
 33. ఎగసిపడు విషాగ్నులనే
  నగజాపతి మ్రింగె మున్ను, నరులా పిదపన్
  పొగ త్రాగుట మొదలిడిరట
  పొగ త్రాగని వాడు దున్న పోతై పుట్టున్

  రిప్లయితొలగించండి
 34. పొగచుట్టల కాలములో
  "పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్"...
  సిగరెట్ల ధరలు జూడగ
  పొగ త్రాగిన వాఁడు దున్నపోతై పుట్టున్!

  రిప్లయితొలగించండి
 35. అగమును హనుమడు తేగా
  సగమది సంజీవి వ్రాలె సామల కోటన్
  పొగ చెట్టదియే శంకర!
  పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్

  రిప్లయితొలగించండి
 36. పొగరుగ తల్లియు దారయు
  తగవులు పడుచుండి గిల్లి తన్నుకు చావన్
  సిగరెట్టుల ఘుమఘుమలన్
  పొగ త్రాగనివాఁడు దున్నపోతై పుట్టున్

  రిప్లయితొలగించండి