21, అక్టోబర్ 2012, ఆదివారం

శ్రీ రాజరాజేశ్వరీ స్తుతి

శ్రీసదాశివ మనః శృంగార సుమవన
          సీమలో విహరించు భామ యెవరు?
సర్వలోకమ్ములో సర్వశోభాకర
          పురములో నివసించు తరుణి యెవరు?
వివిధ బ్రహ్మాండాల వెలుపల లోపల
          రాజిల్లు చైతన్య రాశి యెవరు?
అఖిల భూతమ్ముల కంతరంగములలో
          జ్యోతియై వెలుగొందు మాత యెవరు?
సర్వ శక్తి స్వరూపిణి సరసహృదయ
సర్వలోక విధాయిని శాంతరూప
రాజరాజేశ్వరీదేవి ప్రణవమయిని
ధ్యానమొనరించి భక్తితో నంజలింతు. 

కవిమిత్రులకు, బ్లాగు వీక్షకులకు శుభాకాంక్షలు!

                       పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

9 కామెంట్‌లు:

 1. సర్వలోకైకమాతయై జగతినేలు
  రాజరాజేశ్వరీదేవిరమ్యచరిత
  మంద మొప్పంగ వర్ణించి యనఘులైన
  పండితార్యుల కొనరింతు ప్రణతులేను.

  రిప్లయితొలగించండి
 2. @Sri gaariki dhanyavaadamulu.

  Sri HVSN Moorti gaariki Subhaasseessulu.
  హరి వంశ్యు మూర్తి కవివరు
  కరుణామృత దృష్టి గనుచు కామిత మిడుచున్
  పరమేశ్వరి ప్రోచుత యని
  సరసోక్తుల తోడ నాశిషములను గూర్తున్

  రిప్లయితొలగించండి
 3. మృణ్మయ భంజికల్ కనగ మేము ధరించిన యీ శరీరముల్
  కన్మరుగౌ నిమేషమున కాలుని చూపులు సోకినంతనే
  సన్మతి నిచ్చి నీ చరణ సన్నిధి నిల్పవె మమ్ము నెప్పుడున్
  చిన్మయరూపిణీ ! నిను భజించెద నీ నవరాత్రి వేళలో !

  రిప్లయితొలగించండి

 4. నవరాత్రుల సందర్భం గా అమ్మ వారి స్తుతిని అందించిన గురువులు శ్రీ పండితుల వారికి పాదాభి వందనములు

  రిప్లయితొలగించండి
 5. దుర్గమమౌ భవాటవిని దు:ఖితునై కనజాల కుంటి నే
  మార్గము త్రోవ జూప గదె మాలిమి దృక్కుల కాంతి రేఖలన్
  స్వర్గమదేల నాకు భవ సంచిత కిల్బిషముల్ నశించినన్
  భర్గుని రాణి! దుర్గ! విను ప్రార్థన మీ నవరాత్రి వేళలో!

  రిప్లయితొలగించండి
 6. నవనవలాడు జీవితము నవ్య సుశోభల, సర్వ సౌఖ్యముల్
  కువకువలాడు మా బ్రతుకు గూటను నీ కరుణార్ద్ర దృక్కులన్
  పవలును రేయియున్ తడియ! పర్వమె నిత్యము! నెన్న నీ మహ-
  ర్నవమిని నిన్ను గొల్చినను నాకమె చిన్మయ రూపిణీ ! తుదిన్.

  రిప్లయితొలగించండి
 7. శ్రీమతి రాజేశ్వరి గారికి వారి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.

  శ్రీ మిస్సన్న గారికి వారి కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు.
  వారి కలము మంచి స్తోత్రములను వెలువరించుచున్నది. శుభాభినందనలు.

  రిప్లయితొలగించండి