16, అక్టోబర్ 2012, మంగళవారం

పద్య రచన - 143

నేటినుండి దేవీ నవరాత్రులు ప్రారంభం
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

8 కామెంట్‌లు:

 1. నవరాత్రులలో దుర్గా!
  నవ విధముల నీదు రూప నామమ్ములె మా
  నవులే ధ్యానించినచో
  నవనాడుల శక్తి నిండి నవనవ లాడున్.

  రిప్లయితొలగించండి
 2. శ్రీమాత! శ్రీవిద్య! శ్రీమన్మహారాజ్ఞి!
  ....సింహాసనేశ్వరి! సింహవాహ!
  శ్రీ రాజరాజేశ్వరి! త్రిపురసుందరి!
  ....చిద్వహ్ని సంభూత! శ్రీమహేశి!
  శ్రీలలితాంబిక! శ్రీసదాశివకాంత!
  ....సద్గతిప్రద! సుధాసారకలిత!
  శ్రీచక్రరాజవాసిని! చంద్రశేఖరి!
  ....సర్వశక్తినిధాన! చారురూప!
  సర్వలోక వశంకరి! స్వర్ణగర్భ!
  సర్వవేదాంత సంవేద్య! జ్ఞానదాత్రి!
  సర్వవర్ణోపశోభితా! స్వప్రకాశ!
  సర్వమంగళాదేవి! నిన్ సంస్తుతింతు

  రిప్లయితొలగించండి
 3. శ్రీమాతను నే దలచెద
  క్షేమంబును గోరి సతము స్థిరచిత్తుడనై
  మామక కల్మషజాలము
  లా మమతానిలయ బాపు నతివత్సలతన్.

  జగదాధారవు తల్లీ!
  నిగమంబులు బలుకుచుండు నీమహిమల నో
  యగజాత! లోకపావని!
  యగణిత వైభవము లొసగు మఖిలంబునకున్.

  దయజూపు మమ్మ! మాపై
  జయసిద్ధుల నందజేసి సకలజగాలన్
  భయరహితుల నొనరించుచు
  రయమున ధార్మికత గూర్చి రక్షించు మికన్.

  నవరాత్రుల దీక్షలతో
  హవనంబులు చేయుచుండి యనవరతంబున్
  భవదీయ నామ మెల్లెడ
  నవనతులై దలచువారి కబ్బును సుఖముల్.

  నీవే జగదంబిక విక
  నీవే నను గావగలవు నిన్ను దలంతున్
  దేవీ! దుర్గామాతా!
  రావమ్మా! యశములొసగి రక్షించుటకై.

  రిప్లయితొలగించండి
 4. దుష్టశిక్షణ మరియునుశిష్ట జనుల
  కావ వచ్చిన జగదంబ ! కాళిమాత !
  దినము దినమును బూవులు దెచ్చి నీకు
  పూజసేతును దుర్గమ్మ! పోహ ళించు.

  రిప్లయితొలగించండి
 5. మహిషసూర వదను మహినందు కోరుతూ
  అదునుకొరకు బాకు పదునుపెట్టి
  తొమ్మిది దినముల్ల తొమ్మిది రూపాలు
  దాల్చి బ్రోచినావు ధరణు నీవు

  రిప్లయితొలగించండి
 6. నవవిధభక్తిపథములన్
  నవరాత్రులఁగొల్వదుర్గ నవరూపములన్
  భవనాశినియైకరుణ వి
  రివిగన్ గురిపించి బ్రోవ లీలలజూపున్

  రిప్లయితొలగించండి
 7. దేవీ నవరాత్రు లందున
  సేవింతుము నిను ప్రియముగ సేమంతుల తోన్ !
  కావుము తల్లీ దుర్గా
  నీవే జగతికి మూలమంచు నిను పూజింతున్ !

  రిప్లయితొలగించండి
 8. నవదుర్గా స్తోత్రరూపంగా మనోహరమైన పద్యాలను రచించిన కవిమిత్రులు...
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  పండిత నేమాని వారికి,
  సత్యనారాయణ మూర్తి గారికి,
  సుబ్బారావు గారికి,
  సహదేవుడు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జంగిడి రాజేందర్ గారూ,
  మీ ప్రయత్నం బాగుంది. అభినందనలు.
  ‘మహిషసూర’(మహిషాసుర) ‘వదను’(వధను) అన్నప్పుడు, ‘కోరుతూ (కోరుచు), దినముల్ల (దినములలో) అన్నప్పుడు భాషాదోషాలు. నా సవరణలతో మీ పద్యం....
  మహిషదైత్య వధను మహిలోన కోరుచు
  అదునుకొరకు బాకు పదునుపెట్టి
  తొమ్మిది దినములను తొమ్మిది రూపముల్
  దాల్చి బ్రోచినావు ధరణు నీవు
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ ప్రయత్నం బాగుంది. అభినందనలు.
  ఒకటవ, నాల్గవ పాదాలలో గణదోషం. ‘నవరాత్రు లందున’(నవరాత్రులలో), ‘మూలమంచు’ (గతి యని) అని సవరిస్తే సరి.

  రిప్లయితొలగించండి