31, అక్టోబర్ 2012, బుధవారం

సమస్యాపూరణం - 864 (శిలయే మృదుపుష్ప మట్లు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

 1. శిలయైన అహల్యాసతి
  జలజాక్షుని పదరజంపు స్పర్శ వలన స
  త్ఫలమొందె నుడుగ దోషము
  శిలయే మృదుపుష్పమట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 2. పలికెదవే హరి యంచును
  తల నరికెద మంచు భటులు తగ ప్రహ్లాదున్
  శిలపై నుంచిన క్షణమే
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 3. శ్రీ నేమాని వారి బాట లోనే....

  ఇల గౌతము సతి నిలచెను
  శిలగా మరి మారెతాను స్త్రీగా, తాకన్
  జలజాక్షుని పాద రజము
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 4. పలు హొయలొల్కెడు శిల్పము
  లలరించును డెందములను అల బేలూరన్
  వులి యలికిడి విన్నంతనె
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 5. ఫణి గారి బాణీలో

  ఇలలో జక్కన శిల్పికి
  తుల దూగెడు వారు గలరె తోచిన ప్రతిమన్
  మలచగ యులి చేబట్టిన
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 6. శిలకైన ప్రాణముల నిడు
  తుల లేని పరాత్పరునకు స్తోత్రము లనరే
  తల వంచి, దోష ముడిగిన
  శిలయే మృదుపుష్పమట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 7. అల నాడా రాముడు వన
  ము ల మార్గము బోవుచుండ ముకుళి త శిలను
  న్నల తి యహల్యను దాకగ
  శిలయే మృ దు పుష్ప మ ట్లు చెలు వొందె బళా .

  రిప్లయితొలగించండి
 8. అల నారదు నెడ పాడగ
  వెలువడె తుంబుర మధురపు వీణా నాదం
  శిల కరిగె నట జలమ్మై
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా !


  మలయగిరి నుండి దుముకుచు
  జలపాతము హోరు లెత్తి సాగుచు నుండన్
  శిలపై పుట్టెను ఱాపువు
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా !

  రిప్లయితొలగించండి
 9. జలజాక్షు గొలువ వలెనని
  తలచుచు తానమ్మొనర్ప తగిలెను నా చే
  తులకొక సాలగ్రామపు
  శిలయే మృదు పుష్పమట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి
 10. వలపుల తలపులతో క
  న్యలతాంతాకృతిఁశిల్పి నవనీతంబౌ
  శిలఁజలువ రాయిఁ మలచన్
  శిలయే మృదు పుష్పమట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి

 11. చలమున్ మరల ప్రవరుఁగని
  తలచెనిటుల కనులుమూసి తమకముతోఁ గౌ
  గిలినొదుగుచున్ వరూధిని-
  "శిలయే మృదుపుష్పమట్లు చెలువొందె భళా!"

  రిప్లయితొలగించండి
 12. పండిత నేమాని వారూ,
  రామ పదధూళి సోకి సుమకోమలిగా మారిన అహల్యావృత్తాంతంతో చక్కని పూరణ చెప్పారు.
  పువ్వులాగా చేత చిక్కిన సాలగ్రామాన్ని గురించిన మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు. ధన్యవాదాలు.
  *
  మిస్సన్న గారూ,
  ప్రహ్లాదుని భక్తి శిలను పుష్పంగా మార్చిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నేమాని వారిని అనుసరిస్తూ మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  ‘అమరశిల్పి జక్కన’ చిత్రం పాటను గుర్తుకు తెచ్చారు మీ పూరణతో. బాగుంది. అభినందనలు.
  పద్యం మధ్య విసంధిగా అచ్చులు రాకూడదు కదా. ‘అలరించును మన మనముల నల బేలూరన్' అందామా?
  *
  మిస్సన్న గారూ,
  ఫణి గారి మార్గాన్నే అనుసరించినా మీ నడక మీదే. బాగుంది.
  ఇక మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
  ఇక్కడో విషయం చెప్పాలని పిస్తున్నది.
  డా. సి.నారాయణ రెడ్డి గారు సినిమా రంగంలోకి రాకముందే ‘రామప్ప’ అనే నాటకాన్ని వ్రాసారు. అందులోనిదే “ఈ నల్లని రాలలో” పాట! సినిరంగంలోకి ‘గులేబకావళి కథ’తో అడుగుపెట్టిన చాలా కాలానికి ‘అమరశిల్పి జక్కన’ సినిమాలో పైపాటను వినియోగించుకున్నారు.
  సినారె గారి సినిమా పాటల్లో మొట్టమొదటిగా “నన్ను దోచుకొందువటే వన్నెల దొరసానీ” గుర్తింపబడుతున్నది.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ రెండు పూరణలూ బాగున్నవి. ముఖ్యంగా రెండవది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. రామకృష్ణ గారూ,
  మాయా ప్రవరుని కౌగిట ఒదిగి రాతిగుండె పువ్వైనది కదా అని వరూధుని భావంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. మిత్రులారా,
  అమెరికాలో శాండీ తుఫాను వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారట!
  గన్నవరపు నరసింహ మూర్తి గారు, ‘మన తెలుగు’ చంద్రశేఖర్ గారు, నేదునూరి రాజేశ్వరి అక్కయ్య ఆ దేశంలో ఏయే ప్రాంతాలలో ఉన్నారో? వారికి ఏ ఇబ్బంది కలుగవద్దని భగవంతుని ప్రార్థిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
 15. మాస్టారూ, తుఫాను ప్రస్తావనగా మా యోగక్షేమాలు విచారించినందులకు కృతజ్ఞులము. డా.మూర్తిగారూ, నేను టెక్సాస్ రాష్ట్రంలో ఉంటాము. మాకు ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. రాజేశ్వరిగారుండే ప్రాంతం కొంత ప్రభావితం అయింది. చాలామందికి కరెంట్ పోయింది మూడురోజులుగా. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయి.

  రిప్లయితొలగించండి
 16. గురువుగారూ ధన్వవాదాలు. ఈ నల్లని రాల గురించి మాకు తెలియని సంగతులు చెప్పేరు.

  రిప్లయితొలగించండి
 17. శిల్పము నూహించి కళ - వి
  కల్పముగానట్లు శిల్పి కాంచిన విధమున్
  నిల్పును నిశ్చిత రూపు - న
  శిలయే మృదు పుష్పమట్లు చెలువొందె బళా

  రిప్లయితొలగించండి
 18. శిల్పము నూహించి కళ - వి
  కల్పముగానట్లు శిల్పి కాంచిన విధమున్
  నిల్పును నిశ్చిత రూపు - న
  శిలయే మృదు పుష్పమట్లు చెలువొందె బళా

  రిప్లయితొలగించండి
 19. ఇలలో సుమములు పాపలె...
  అలవోకగ మనసు దోచి యద్భుత రీతిన్
  మలచగ యస్వీ హృదయపు
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

  పాప = బంగారు పాప (1954) సినిమా
  (మూలము Silas Marner novel by George Eliot)
  యస్వీ = యస్. వీ. రంగారావు

  రిప్లయితొలగించండి
 20. పిలచిన పలుకక పారెడు
  చెలియా! లాటరిని గెల్వ చెన్నుగ నాదౌ
  కలిమికి నీదౌ హృదయపు
  శిలయే మృదుపుష్ప మట్లు చెలువొందె బళా!

  రిప్లయితొలగించండి