25, అక్టోబర్ 2012, గురువారం

సమస్యాపూరణం - 859 (రామునకు సీత సోదరి)

కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రామునకు సీత సోదరి.
(ఈ సమస్యలో ఛందో గోపన మున్నది. 
అది ఏ ఛందంలో ఇముడుతుందో మీరే ఆలోచించి తగిన పూరణ చేయవలసి ఉంటుంది)

25 కామెంట్‌లు:

 1. మా చిన్న ప్రయత్నము:

  రామునకు సీత సోదరి సోమవదన
  ఊర్మిళా మహిళామణి యుల్లమందు
  పరమ పూరుషుడనెడు భావమ్ము మెరయ
  భక్తితో నొనరించెను వందనములు

  రిప్లయితొలగించండి
 2. శుభమస్తని దీవించుచు
  నభినందన గూర్తు శంకరయ్య! హితైషీ!
  ఇభచర్మధారి శంకరు
  డభయమ్మిడి మిమ్ము బ్రోచు ననవరతమ్మున్

  రిప్లయితొలగించండి
 3. పతిని యెడబాసె పదునాల్గు వత్సరములు
  పిదప పతిగాంచెనూర్మిళ పదములంటె
  అవనిసుత గూడి యరుదెంచు హరిని జూచి
  రామునకు సీతసోదరి నమతులిడెను.

  రిప్లయితొలగించండి
 4. రామాంకిత రాజ్యమ్మును
  రామయ్యనె యేలుమంచు బ్రతిమాలుచు నా
  రామునకు సీత సోదరి
  యౌ మాండవి భరతసహితయై ప్రణతులిడెన్.

  రిప్లయితొలగించండి
 5. జనకుని జ్యేష్ఠ కొమరిత జాయ యగును
  రామునకు సీ త, సోదరి రమ్య వనిత
  రమ్య పేరున నొప్పిన రామ యామె
  సకల సుగుణాల రాశియు సద్వ నిత యు .

  రిప్లయితొలగించండి
 6. తనరు నర్ధాంగి యగుచు రామునకు సీత
  సోదరిగ నూర్మిళకు, నట్లె సుతగ జనక
  భూపతికి, నామె శ్రీదేవి పుష్కరాక్షి
  భూమిపై నవతరించిన భువనమాత

  రిప్లయితొలగించండి
 7. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  ఊర్మిళ :

  01)
  _______________________________

  రామునకు , సీత సోదరి
  రామానుజు డైనయట్టి - లక్ష్మణు సతియే
  రామామణియౌ యూర్మిళ !
  రాముని సేవించు భక్తి - లక్ష్మణు తోడన్ !
  _______________________________

  రిప్లయితొలగించండి
 8. శ్రీరామ భక్తుడిడె సీ
  తారాముల నామములను తనబిడ్డలకా
  శ్రీరాముని తలఁపుగ నా
  తీరుగ రామునకు సీత సోదరి యయ్యెన్.

  రిప్లయితొలగించండి
 9. రావణుని జంపి సతితో
  రాఘవు డరుదెంచె రామ రాజ్యమయోధ్యా
  రామునకు, సీత సోదరి
  కోమలి ఊ ర్మిళ యొసంగె కోరి నివాళుల్ .

  రిప్లయితొలగించండి
 10. రావణుని జంపి సతితో
  రాఘవు డరుదెంచె రామ రాజ్యమయోధ్యా
  రామునకు, సీత సోదరి
  కోమలి ఊ ర్మిళ యొసంగె కోరి నివాళుల్ .

  రిప్లయితొలగించండి
 11. మాండవి :

  02)
  _______________________________

  రావణాసురు జంపిన - రఘుకులేంద్ర
  రమణి మా సీతతో గూడి - రమ్యమలర
  రాజ్యభారము వహియించు - పూజ్యచరిత
  రక్షకుడ వీవె మాకింక - రాజు వనుచు
  రామునకు , సీత సోదరి - రమ్య,సుగుణ
  రామ, పతితోడ గూడి, ప్ర - ణామ మిడెను !
  _______________________________
  రామ - స్త్రీ(మాండవి)

  రిప్లయితొలగించండి
 12. వెఱచి సుగ్రీవు డెవరికి శరణు జొచ్చె ?
  తొలుత నాగటి చాలున దొరికె నెవరు ?
  చుప్పనాతి రాక్ష సెవరు చెప్పుటకును ?
  రామునకు, సీత, సోదరి - రావణునకు.

  రిప్లయితొలగించండి
 13. చంద్రశేఖరులవారి స్ఫూర్తితో :

  03)
  _______________________________

  రామనవమికి పుట్టిన - రామ కృష్ణ
  రామనవమికే పుట్టిన - రామసీత
  రామమూర్తికి పిల్లలు - రమ్యగుణులు !
  రామునకు సీత సోదరి - గోములొలుకు !
  _______________________________
  ( రామునకు గోములొలుకు సీత సోదరి )

  రిప్లయితొలగించండి
 14. తిరిగి వచ్చిన రాముని స్వాగతిస్తూ భర్తతో గూడి మాండవి :

  04)
  _______________________________

  నళిన నేత్ర నిన్ను - కొలిచెద మిక మీద
  నగరి లోనికి దయ - నడువు మనుచు
  నమతు లిడెను రాము - నకు సీత సోదరి
  నగరి వెలుపల తన - నాథు గూడి !
  _______________________________

  రిప్లయితొలగించండి

 15. రామునకు సీత సోదరి
  ప్రేమగ నొక తోడు జూచి పెండ్లిని చేసెన్
  సోమున కిల్లరికమనుచు
  తామంతయు నుండెనొక్క దరి వేడుకగా.

  రిప్లయితొలగించండి
 16. నంది గ్రామంలో రాముని స్వాగతిస్తూ భర్తతో గూడి మాండవి :

  05)
  _______________________________

  నల్లనయ్య ! రార ! - నళినాక్ష ! రావయ్య !
  నరుల బ్రోవ , మరల - నయము గలుగ
  ననుచు ప్రణతి ,రాము - నకు సీత సోదరి
  నంది గ్రామమునను - నగుచు జేసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 17. నందిగ్రామంలో "ది" గురువౌతుందా ? ఐతే

  *****
  నంది గ్రామంలో రాముని స్వాగతిస్తూ భర్తతో గూడి మాండవి :

  05అ)
  _______________________________

  నల్లనయ్య ! రార ! - నళినాక్ష ! రావయ్య !
  నరుల బ్రోవ , మరల - నయము గలుగ
  ననుచు ప్రణతి ,రాము - నకు సీత సోదరి
  నాథు గూడి మిగుల - నగుచు జేసె !
  _______________________________

  రిప్లయితొలగించండి
 18. రామునకు సీత సోదరి
  యా మాండవి యవీయసులు నమస్కృతి జేయన్ !
  మేమెటుల బ్రతుక గలమిక
  రాముడు లేనట్టి కరణి రాజ్యము నందున్ !

  రిప్లయితొలగించండి
 19. కవిమిత్రులకు నమస్కృతులు.
  ఈనాటి ఛందోగోపన సమస్యకు మంచి స్పందన లభించింది. ఎంతో ఆనందంగా ఉంది.
  ఇప్పటికి వచ్చిన 16 పూరణలలో 6 తేటగీతులు, 7 కందాలు, 3 ఆటవెలదు లున్నాయి. అందరికీ ధన్యవాదాలు.
  *
  పండిత నేమాని వారూ,
  మీ పద్యం నాకు ఆనందాన్నీ, ఆత్మస్థైర్యాన్నీ కలిగించింది. ధన్యవాదాలు.
  మీ రెండు పూరణలూ వైవిధ్యంగా ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  ఫణి ప్రసన్న కుమార్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  మొదటి పాదంలో గణదోషం. "జనకుని జ్యేష్ఠ" అన్నప్పుడు "ని" గురువు కాదుకదా. "జనకనృపు జ్యేష్ఠ" అందాం.
  *
  వసంత కిశోర్ గారూ,
  గన్నవరపు వారు మీకు ప్రత్యేక శుభాకాంక్షలు పంపారు. అందుకున్నారా?
  మీ ఐదు పూరణలూ వైవిధ్యంగా బాగున్నాయి. అభినందనలు.
  *
  చంద్రశేఖర్ గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ క్రమాలంకార పూరణ బాగుంది. అభినందనలు.
  మూడవ పాదంలో యతిదోషం ఉంది. "చుప్పనాతి రాక్షసి దెట్టి చుట్టఱికము?" అంటే సరి!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. `యవీయసులు"..?

  రిప్లయితొలగించండి
 20. గురువు గారూ ! నేను తీసుకున్నది ప్రాస యతి - చుప్ప..... చెప్పు. తప్పంటారా ?!

  రిప్లయితొలగించండి
 21. శ్రీమదపర్ణా హృదయా
  రామునకును సోమునకు సురక్షిత బహు సు
  త్రామునకు సీత సోదరి
  రామా! సుగుణాభిరామ! రవికుల సోమా!

  రిప్లయితొలగించండి
 22. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ!
  శుభాశీస్సులు.
  మీ పద్యము 3వ పాదములో ప్రాస యతి వలన దోషము లేదు. శ్రీ శంకరయ్య గారే సమముగా దోషమును చూపించ లేదు. అసలు దోషము వేరు --
  చుప్పనాతి రాక్షసెవరు చెప్పుటకును అనే పాదములో రాక్షసి + ఎవరు = రాక్షసెవరు అని సంధి చేయరాదు. యడాగమము చేసి రాక్షసి యెవరు అనాలి. అందుచేత శ్రీ శంకరయ్య గారు సూచించిన మార్పు బాగున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 23. శంకరార్యా ! ధన్యవాదములు.
  శ్రీ పండిత నేమాని గారికి... మీ పూరణ
  శ్రీమదపర్ణా హృదయారామునకును సోమునకు...
  చాలా బాగుంది..

  రిప్లయితొలగించండి