ఛందస్సు - పాఠం 1
పద్యాలు వ్రాయాలనే ఉత్సాహం ఉండి, క్రొత్తగా ఛందస్సు నేర్చుకొనడానికి ప్రయత్నించే వారికోసం ఈ పాఠాలు. క్లిష్టమైన
ఛందస్సూత్రాల లోతుల్లోకి వెళ్ళకుండా సులభంగా అందరూ అర్థం చేసుకొనే విధంగా ఈ పాఠాలు
రూపొందుతున్నాయి. ఇవి పండితులకోసం కాక ఔత్సాహికులకోసం నిర్దేశింపబడ్డాయి. ఈ పాఠాల ఆధారంగా అభ్యాసం చేసి పద్యాలను వ్రాయడానికి ప్రయత్నించవచ్చు.
ఏమైనా సందేహాలు కలిగితే నిరభ్యంతరంగా ప్రశ్నించి నివృత్తి చేసికొనవచ్చు. ఇక మొదలు పెడదామా?
పద్యాల లక్షణాలను తెలిపే శాస్త్రం ఛందస్సు. సాధారంగా ఛందస్సును
వ్యాకరణంలో ఒక అంశంగా పాఠశాలల్లో చెప్తూ ఉంటారు.
కాని వ్యాకరణశాస్త్రం, ఛందశ్శాస్త్రం, అలంకారశాస్త్రం ఒకదానికొకటి సంబంధం లేక దేనికదే ప్రత్యేకమైనది.
ఏదైనా ఒక విషయాన్ని ఒక ‘పేరాగ్రాఫ్’లో చెప్పాలనుకోండి. ఒక పేరా కొన్ని వాక్యాలతో ఏర్పడుతుంది. ఒక
వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి . అలాగే ఒక పద్యం
తయారుకావాలంటే కొన్ని పాదాలు (లైన్లు) కావాలి. ఒక పాదం (వాక్యంలో పదాల వంటి) కొన్ని
గణాలతో ఏర్పడుతుంది. గణాలు కొన్ని అక్షరాలతో
ఏర్పడతాయి. పదాలు ఒక అక్షరంతో (రా, లే, తే, పో మొ.వి), రెండక్షరాలతో (పండు,
ఇల్లు, దేవి, భక్తి మొ.వి.), మూడక్షరాలతో (పలక, కడవ, చుట్టము, పద్యము, ఛందస్సు మొ.వి.), నాలుగక్షరాలతో (తలగడ,
శునకము, పవనము మొ.వి) ఏర్పడినట్లే
గణాలు కూడా ఒకటి, రెండు, మూడు, నాలుగు అక్షరాలతో ఏర్పడతాయి. వీటికి ప్రత్యేకంగా కొన్ని పేర్లు
కూడా ఉన్నాయి. (ఈ గణాల గురించి రెండవ పాఠంలో తెలుసుకుందాం).
వ్యాకరణంలో అక్షరాలు అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని మూడు విధాలు. ఉచ్చారణను బట్టి దంత్యాలు, తాలవ్యాలు, మూర్ధన్యాలు మొదలైన భేదాలూ ఉన్నాయి. కాని ఛందస్సులో అక్షరాలు
మొత్తం లఘువులు, గురువులు అని రెండే విధాలు.
లఘువులు :-
ఒక మాత్రాకాలంలో పలుకబడే అక్షరాలు లఘువులు. చిటిక వేస్తే ఆ శబ్దం
వినిపించిన కాలాన్ని మాత్రాకాలం అంటారు. లఘువుకు చిహ్నం I.
1)
అ-ఇ-ఉ-ఋ-ఎ-ఒ అనే హ్రస్వాలైన అచ్చులు లఘువులు.
2)
పై అచ్చులతో కూడిన హల్లులు లఘువులు. ఉదా|| క, ఖి,గు,తృ,దె,పొ మొ.వి. కొందరు పొరపాటున ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ మొదలైన మహాప్రాణాలను గురువులుగా భ్రమిస్తారు. కాని ఇవి లఘువులే.
3)
క్క,
గ్గి,
చ్చు,
ట్టె,
ప్పొ మొదలైన ద్విత్వాక్షరాలు, క్ర, క్ష్మి, చ్యు, స్ఫు మొదలైన సంయుక్తాక్షరాలు లఘువులే.
గురువులు :-
రెండు మాత్రల కాలంలో పలుకబడే అక్షరాలు గురువులు. గురువుకు చిహ్నం
U.
1)
ఆ-ఈ-ఊ-ౠ-ఏ-ఐ-ఓ-ఔ అనే దీర్ఘాలైన అచ్చులు గురువులు.
2)
పై అచ్చులతో కూడిన హల్లులు గురువులు. ఉదా|| కా, గీ, చూ, తౄ, దే, నై, పో, భౌ మొ.వి.
3)
అనుస్వారం (సున్నా)తో కూడిన అక్షరాలు గురువులు.
ఉదా|| అం, కిం, చుం, బృం మొ.వి. (ఇక్కడ ‘అ’ లఘువు. కాని సున్నా వచ్చి చేరినప్పుడు ‘అం’ ఒకే అక్షరంగా లెక్కింపబడుతుంది. దానిని పలుకడానికి రెండు మాత్రల
కాలం పడుతుంది. కనుక అది గురువయింది.)
4)
విసర్గతో కూడిన అక్షరాలు గురువులు. ఉదా|| మః, రిః, తుః మొ.వి. (ఇక్కడ ‘మ’ లఘువు. కాని విసర్గ వచ్చి చేరినప్పుడు ‘మః’ ఒకే అక్షరంగా లెక్కింపబడుతుంది. దానిని పలుకడానికి రెండు మాత్రల
కాలం పడుతుంది. కనుక అది గురువయింది.)
గమనిక :- తెలుగులో ప్రత్యేకంగా అరసున్నా ఉంది. ఇది కేవలం కంటికి కనబడుతుందే కాని పలుకబడదు, చెవికి వినిపించదు. అది ఉన్న అక్షరాన్ని పలుకడానికి ఎక్కువ కాలం అక్కరలేదు. కనుక
అది ఉన్న హ్రస్వాక్షరం లఘువే. ఉదా|| అఁట (ఈ పదాన్ని పలుకడానికి మనకు కేవలం రెండు మాత్రల కాలమే పడుతుంది.
కనుక ఆ రెండక్షరాలు లఘువులే). రాముఁడులో ‘ముఁ’, ఇఁకలో ‘ఇఁ’ మొదలైనవి లఘువులే.
5)
పొల్లు అక్షరాలతో కూడిన అక్షరాలు గురువులు. అచ్చు కలవని కేవల హల్లులు పొల్లు అక్షరాలు. (క్, గ్, చ్ మొదలైనవి పొల్లులు. ఇవి ‘అ’ అనే అచ్చు చేరినప్పుడు క, గ, చ అనీ, ‘ఇ’ అనే అచ్చు చేరినప్పుడు కి,గి,చి అని ‘ఏ’ అనే అచ్చు చేరినపుడు కే,గే,చే అనీ రూపాంతరం చెందుతాయి. ) ‘దిక్’ అన్నపుడు ‘ది’ లఘువు. దీనికి ‘క్’ అనే పొల్లు అక్షరం వచ్చిచేరినపుడు ‘దిక్’ అని ఒకే అక్షరంగా లెక్కించాలి. దీనిని పలుకడానికి రెండు మాత్రల
కాలం పడుతుంది. కనుక ఇది గురువు. ఉదా|| బగ్, అచ్, బజ్, షట్, గుడ్, సత్, విద్, నన్, అప్, సబ్, నమ్, నిర్, బిల్, బస్ మొ.వి. గురువులు.
6)
ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలుగురువులు.
ఒక హల్లుకు అదే హల్లు వత్తుగా వచ్చినప్పుడు అది ద్విత్వాక్షరం. క్క, గ్గి, చ్చు, జ్జె మొ.వి. ద్విత్వాక్షరాలు. చుక్క, అగ్గి, చిచ్చు, గజ్జె మొదలైన పదాలను మనం చుక్-క, అగ్-గి, చిచ్-చు, గజ్-జె అని పలుకుతాము. పొల్లు అక్షరాలతో కూడిన అక్షరాలు గురువులని
తెలుసుకున్నాం కదా! దానివల్ల చుక్, అగ్, చిచ్, గజ్ గురువులౌతాయి. ఆ విధంగా చుక్క, అగ్గి, చిచ్చు, గజ్జె పదాలలో ముందున్న చు, అ, చి, గ అక్షరాలు గురువులవుతాయి.
7)
సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలు గురువులు.
ఒక హల్లుకు మరొక హల్లు వత్తుగా వచ్చినప్పుడు అది సంయుక్తాక్షరం. ‘చక్రి’ లో ‘క్రి’ సంయుక్తాక్షరం. ఈ పదాన్ని మనం చక్-రి అన్న విధంగా పలుకుతాము.
పొల్లు అక్షరం కారణంగా ‘చక్’ గురువవుతుంది. కనుక ‘చక్రి’లోని ‘చ’ గురువు. అలాగే అగ్ని,
సత్య,
విద్య, శిల్పి, కర్మ, హర్ష మొదలైన పదాలలో ముందున్న అక్షరాలు గురువులు. అక్షరమాలలోని ‘క్ష’ సంయుక్తాక్షరమే. కనుక ‘పక్షి’ అన్నపుడు ‘ప’ గురువే. కొందరు కృ, మృ మొదలైన ఋత్వం ఉన్న అక్షరాలను సంయుక్తాక్షరాలుగా పొరబడి దాని
ముందున్న అక్షరాన్ని గురువుగా భావిస్తారు. కాని ఋత్వం హల్లు కాదు, అచ్చు. క్+అ=క అయినట్లు క్+ఋ=కృ అవుతుంది. కనుక ‘వికృతి, అమృతము’ మొదలైన చోట్ల వి, అ గురువులు కావు.
గమనిక :- ‘అతఁడు త్యాగమూర్తి’ అన్నచోట ‘త్యా’ అనే సంయుక్తాక్షరం ముందున్న ‘డు’ గురువు కాదు. ఎందుకంటే అతఁడు అనేది తెలుగు పదం. దాని తర్వాత ఉన్న ‘త్యా’ అనే అక్షరం ‘డు’ పైన ఒత్తిడి తీసుకురాదు. అతఁడుత్-యాగమూర్తి అని పలుకము. కేవలం
ఊనిక లేకుండా అతఁడు-త్యాగమూర్తి అంటాం. కనుక ‘డు’ లఘువే. తెలుగు పదాల తర్వాత సంయుక్తాక్షరం ఉన్నా ఆ తెలుగు పదం
చివరి అక్షరం గురువు కాదని గమనించండి. ‘సూర్యజ్యోతి’ అన్నపుడు సూర్య, జ్యోతి అనే రెండు పదాలు సమాసంగా ఏర్పడం వల్ల ‘ర్య’ గురువు. ‘సూర్యుని జ్యోతి’ అన్నపుడు ‘సూర్యుని’ అనేది తెలుగు పదమయింది. కనుక అక్కడి ‘ని’ గురువు కాదు.
గురు లఘువులను గుర్తిద్దాం.....
1)
కమల (III) - అన్ని అక్షరాలు ‘అ’ అనే హ్రస్వాచ్చుతో కూడినందున అన్నీ లఘువులే.
2)
చిలుకలకొలికి (IIIIIII) - అన్ని అక్షరాలు హ్రస్వాచ్చులతో కూడి ఉన్నందున లఘువులే.
3)
ద్యుతి (II) - ద్యు అనేది సంయుక్తాక్షరమైనా
అది ‘ఉ’ అనే హ్రస్వాచ్చుతో కూడి ఉన్నందున లఘువే.
4)
రామా (UU) - అన్ని అక్షరాలు ‘ఆ’ అనే దీర్ఘాచ్చుతో కూడినందున అన్నీ గురువులే.
5)
కావేరీ (UUU) - అన్ని అక్షరాలు దీర్ఘాచ్చులతో
కూడినందున అన్నీ గురువులే.
6)
శంకర (UII) - సున్నాతో కూడిన ‘శం’ గురువు. మిగిలినవి లఘువులు.
7)
హరిః (IU) - విసర్గతో కూడిన ‘రిః’ గురువు. హ లఘువు.
8)
అతఁ డనె నఁట (II II II) - త, న అక్షరాల తర్వాత అరసున్నా ఉన్నా అవి పలుకబడేవి కావు కనుక అవి
ఉన్న అక్షరాలు లఘువులే.
9)
వానల్ గురిసెన్ (UU IIU) - నల్, సెన్ పొల్లు అక్షరాలతో కూడినందున గురువులు.
10)
ముద్దు పెట్టుకొమ్ము (UI UIUI) - ద్దు,ట్టు,మ్ము ద్విత్వాక్షరాలు కనుక వాటి ముందున్నవి గురువులు.
11)
విద్యాలక్ష్మి (UUUI) - ద్యా,క్ష్మి సంయుక్తాక్షరాలు కనుక వాటి ముందున్నవి గురువులు.
12)
రాజద్రోహము (UUUII) - రెండు సంస్కృతపదాల సమాసం కనుక ‘ద్రో’కు ముందున్న ‘జ’ గురువు.
13)
రాజుకు ద్రోహము (UII UII) - ‘రాజుకు’ అన్నది తెలుగుపదం కనుక ‘కు’ లఘువే.
కొన్ని పద్యాల గురులఘువులను గుర్తిద్దాం....
1)
అల్పుఁ డెపుడు పల్కు నాడంబరముగాను
U I I I I U I U U I I I U I
సజ్జనుండు పల్కు చల్లగాను
U I U I U I U IU I
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా
U I U I U I I I U I U I U
విశ్వదాభిరామ వినుర వేమ.
U I U IU I I I I U I
2)
కమలములు నీటఁ బాసిన
I I I I I U I U I I
కమలాప్తుని రశ్మి సోఁకి కమలిన భంగిన్
I I U I I U I U I I I I I U U
తమతమ నెలవులు దప్పిన
I I I I I I I I U I I
తమ మిత్రులె శత్రు లగుట తథ్యము సుమతీ.
I I U I I U I I I I U I I I I U
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ యీ కృషి ప్రశంసనీయము. ఔత్సాహికులకుపయోగకరముగను కవివరులకు కరతలామలకముగను భాసిల్లునన సందేహము లేదు.
తొలగించండిthank you sir, maalaanti outsaahikulaku marinta prayojanakaram ....dhanyavaadamulu
రిప్లయితొలగించండిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి శుభాభినందనలు!
రిప్లయితొలగించండిగురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిశంకరాభరణం = గురువు లఘువు గురువు లఘువు లఘువు గురువు
రిప్లయితొలగించండిసరి ఐనదే నా నండీ ? = లఘువు లఘువు లఘువు లఘువు గురువు గురువు గురువు గురువు
జిలేబి
లఘువు గురువు లఘువు
జిలేబీ గారూ,
రిప్లయితొలగించండి‘ఐ’ గురువే. అదొక్కటే తప్పుగా లఘువుగా గుర్తించారు. మిగిలినవన్నీ సరిగ్గా గుర్తించారు.
లఘువుకు I, గురువుకు U చిహ్నాలు కదా...
శంకరాభరణం = UIUIIU
సరి ఐనదే నా నండీ = II UIU U UU
జిలేబి = IUI.
అన్నట్టు మీ ‘రాంపండు’ను ఛందస్సు నేర్చుకోమని చెప్పండి. అతని ‘తెలుగు చదువు’ ఎందాక వచ్చింది?