14, ఆగస్టు 2010, శనివారం

సమస్యా పూరణం - 66

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ............
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!
వారాంతపు సమస్యా పూరణం - ( రోజు చివరి రోజు )
మాంసాహారమె శ్రేష్ఠమైన దనుచున్ మాన్యుండయెన్ విప్రుఁడే.

13 కామెంట్‌లు:

రవి చెప్పారు...

పిన్న వాఁడ నీవుఁ యన్నుల మిన్నవు
క్రూర రక్కసులను పోరు సల్పి
జంపి వైచి మఖము సలుపెఁడు గొప్ప తా
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!

chinna చెప్పారు...

srishti loni ea jeeviki nyunyata ledani
elugetti chate mana sanskriti .yogyatha nanusarinchi;
paamu,nandi,kaalabhairava,mooshikambu,gajaaswambulu ,kesarityaadi pasula golchi mukthi badayumayya!

కంది శంకరయ్య చెప్పారు...

చిన్నా గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతోంది. మీరు గద్యరూపంలో వెలిబుచ్చిన భావానికి పద్యరూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీలైతే రేపు ఉదయం పోస్ట్ చేస్తాను. ధన్యవాదాలు.

కంది శంకరయ్య చెప్పారు...

రవి గారూ,
మంచి సందర్భంతో పూరణ చేసారు. అభినందనలు.
నాకు తెలిసినంత వరకు "అన్నులమిన్న" శబ్దాన్ని స్త్రీ పరంగా వాడతారు. మీ పద్యంలో మొదటి పాదాన్ని
"పిన్నవాడ ననక వీరత్వముం జూపి" అని సవరిస్తే ఎలా ఉంటుంది?

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

మంచి యన్న నేమి మానవత్వ మొకింత
యెంచి చూడ జనుల కాంచ లేము.
కంచె చేను మేయ వంచకుల పూజించి
పసుల గొల్చి ముక్తి బడయు మయ్య

కంది శంకరయ్య చెప్పారు...

నేదునూరి రాజేశ్వరి గారూ,
పద్యం బాగుంది. అభినందనలుల్. మూడవ పాదంలో "వంచకుల పూజించి" అన్నచోట గణదోషం, విపరీతార్థం ఉన్నాయి. దానిని "వంచకుల త్యజించి" అంటే బాగుంటుందేమో!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

dhanya vaadamulu + august 15 SubhA kaamkshalu

కంది శంకరయ్య చెప్పారు...

చిన్నా గారి వ్యాఖ్యకు పద్యరూపం ......
సృష్టిలోని యెట్టి జీవికి న్యూనతఁ
గనని సంస్కృతి గల ఘనత మనది
పాము, నంది, కాలభైరవాశ్వాదుల
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!

కంది శంకరయ్య చెప్పారు...

నా పూరణ ......
ఈతిబాధ లంది యెటులొ యీ సంసార
జీవనమ్ముఁ గడిపి తీవు; జ్ఞాన
ధనులు, నీతిబోధ ఘనముగాఁ జేయు తా
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య!

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

ఆల మందలన్న నవి దేశ భాగ్యమ్ము
గోవు తల్లి వలెను గొప్ప గాదె !
మురళి లోలు డధిక ముచ్చట గాగాచు
పసులఁ గొల్చి ముక్తిఁ బడయుమయ్య !!

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

శంకరార్యా ! ధన్యవాదములు.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

నిరత తపము చేత, నిశ్చల భక్తితో,
ధ్యానమందు, నిత్య యాగమందు,
పరమపురుష నామ పఠనంబుజేయు తా
పసుల గొల్చి ముక్తి బడయుమయ్య.