18, ఆగస్టు 2011, గురువారం

చమత్కార (చాటు) పద్యాలు - 125

..... కాటయ వేమన .....
ఉ.
మానుష దాన మాన బల మానితధర్మ రమా మనోజ్ఞరే
ఖానుతి భూతి విత్తములఁ గాటయ వేమన పోలు వాసవి
న్వానివిరోధి వానివిభు వానివిపక్షుని వానియగ్రజు
న్వానిమఱంది వానిసుతు వానియమిత్రుని వానిమిత్రునిన్.

(ప్రొ. జి. లలిత గారి ‘తెలుగులో చాటుకవిత్వము’ గ్రంథం నుండి)
కాటయ వేమన మానుషం (నరత్వం)లో వాసవిని, దానంలో వాని విరోధిని, మానం (అభిమానం)లో వాని విభుని (ప్రభువును), బలంలో వాని విపక్షుని (శత్రువును), మానితధర్మంలో వాని అన్నను, రమ (సంపదలో) వాని మఱదిని, మనోజ్ఞరేఖానుతి (అందం)లో వాని సుతుని, భూతి (ఐశ్వర్యం)లో వాని అమిత్రుని (శత్రువును), విత్తం (ధనం)లో వాని మిత్రుని పోలి ఉన్నాడని భావం!
కవిమిత్రులారా,
కాటయ వేమన ఎవరెవరితో పోలిక గలవాడో వివరించగలరా?
సమాధానాన్ని మెయిల్ చేయండి.

shankarkandi@gmail.com

8 కామెంట్‌లు:

  1. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మొదటి నాలుగు సమాధానాలు మరోసారి పరిశీలించండి. మిగిలినవి కరెక్టే.
    అక్కడ ఉన్నది ‘వాసవుడు’ కాదు, ‘వాసవి’. వాసవుని కొడుకు వాసవి.
    *
    మందాకిని గారూ,
    ‘విత్తంలో లక్ష్మీకాంతుని’ తప్ప మిగిలిన వన్నీ సరియైన సమాధానాలు.

    రిప్లయితొలగించండి
  2. మందాకిని గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ఇప్పుడు మీ యిద్దరి సమాధానాలు 100% సరియైనవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. వసంత్ కిశోర్ గారూ,
    చివరి సమాధానం తప్ప మిగిలినవన్నీ సరైనవి. మరొక్కసారి ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    ఇప్పుడు ‘ఆ ఒక్కటీ’ సరిపోయింది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. జి. శ్రీనివాస శాస్త్రి గారూ,
    ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. సంతోషం!
    మీ సమాధానాలలో ఒకటి తప్ప మిగిలిన వన్ని సరైనవి. అభినందనలు.
    నాలుగవ సమాధానం ఏకవచనమే! మరోసారి ఆలోచించండి.
    చివరి సమాధానంలో మీ రిచ్చిన రెండు ‘ఆప్షన్’లలో మొదటిదే సరి!

    రిప్లయితొలగించండి
  6. సమాధానం -
    కాటయ వేమన ....
    నరత్వంలో వాసవిని - వాసవుని పుత్త్రుడైన అర్జునుని
    దానంలో అర్జునుని విరోధి - కర్ణుణ్ణి
    మానంలో కర్ణుని విభుడు - సుయోధనుని
    బలంలో సుయోధనుని విపక్షుడు - భీముణ్ణి
    మానిత ధర్మంలో భీముని అన్న - ధర్మరాజును
    సంపదలో ధర్మరాజు మఱది - శ్రీకృష్ణుని
    అందంలో శ్రీకృష్ణుని సుతుడు - మన్మథుణ్ణి
    భూతిలో మన్మథుని అమిత్రుడు - శివుణ్ణి
    విత్తంలో శివుని మిత్రుడు - కుబేరుణ్ణి
    పోలి యున్నాడట!

    రిప్లయితొలగించండి
  7. సమాధానలు పంపిన వారు
    గన్నవరపు నరసింహ మూర్తి గారు
    మందాకిని గారు
    వసంత కిశోర్ గారు
    జి. శ్రీనివాస శాస్త్రి గారు.
    అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి