9, అక్టోబర్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 845 (కుంతికి నైదుగురు సుతలు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్. 

21 కామెంట్‌లు:

  1. వింతలు కావీ పలుకులొ
    కింతగ తడబడుచు శకునియే పలికె సుమా
    గంతులిడి కౌరవులు విన
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్

    రిప్లయితొలగించండి
  2. ద్రౌపది గాక పాండవులకు వేరుగా కూడా భార్యలు న్నారని చదివిన జ్ఞాపకం. వారిని దృష్టిలో పెట్టుకుని చేసిన పూరణ. అంతే గాదు, కుంతికి ఐదుగురు సుతులు అని కూడా అనలేము కదా. కానీ నకుల సహదేవులను కూడా తన కొడుకుల వలె చూచుకొన్న కారణంగా కుంతికి సుతులైదుగురు అన్నాను. పండితాళి ఒప్పుకోకపోతే మార్చగలను.
    కుంతిసుతు లైదుగురు వా
    రింతుల(జూచు కొనె నామె ప్రేమగ తన నం
    దంతుల మాదిరి యనదగు
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్.
    మనవి: నందంతి=కూతురు

    రిప్లయితొలగించండి
  3. అయ్యా శ్రీ చంద్రశేఖర్ గారూ!
    శుభాశీస్సులు.
    ధర్మరాజుకి ద్రౌపది మాత్రమే భార్య. వేరే ఏ భార్యయూ లేదు. మిగిలిన పాండవులకు మాత్రము వేరుగా భార్యలు ఉన్నారు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా ! సుతులు అని వ్రాయబోయి... సుతలు ...టైపాటు కాదు కదా?

    ఇంతేనా యని పూరణ
    గంతులనే వేసి వ్రాసి కంటిని నేనే
    భ్రాంతిగ " సుతులని " నిజమిది
    "కుంతికి నైదుగురు 'సుతలు' గుణసంపన్నుల్."

    రిప్లయితొలగించండి

  5. సొంతపు బ్లాగున 'శంకర'
    పంతులు 'సుతు' వ్రాయఁగ, టయిపాటున 'సుత'యై;
    వింతగు వాక్యమ్మిటులయెఁ
    "గుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్"!

    రిప్లయితొలగించండి
  6. ఇంతులు సుభద్ర ద్రౌపది
    కుంతిని భక్తిగ హిడింబి గొలిచిరి, విజయున్
    పంతమున పొందిన యిరువురు
    కుంతికినైదుగురు సుతలు గుణసంపన్నుల్.

    నాకు తెలిసిన కుంతీదేవి కోడళ్ళు గుణవంతురాళ్ళ గురించి చెప్పాను. హిడింబి కూడా భీముని షరతుకు ఒప్పుకొని దూరంగానే ఉండి కొడుకుని తండ్రి మీద ప్రేమతో ఉండేలా పెంచింది. ప్రమీల , నాగకన్యక ఉలూచి కూడా మంచి వారే , మిగతావారిగురించి నాకు తెలియదు కావున ఈ ఐదుగురి గురించి వ్రాశాను.

    రిప్లయితొలగించండి
  7. ఇంతులు సుభద్ర ద్రౌపది
    కుంతిని భక్తిని, హిడింబి- గొలువరె, విజయున్
    పంతమున పొందిన యిరువురు?
    కుంతికినైదుగురు సుతలు గుణసంపన్నుల్.

    రిప్లయితొలగించండి
  8. పంతము వలదని వేడిరి
    కుంతికి నైదుగురు సుతలు గుణ సంపన్నుల్
    హంతము నొందిరి వినకను
    సంతతి గాంధారి సుతలు శత దుర్మతులున్.

    రిప్లయితొలగించండి
  9. వింతగ బలికెడి మాటలు
    కుంతికి నైదు గురు సుతలు, గుణ సంపన్నుల్
    పంతులు పెంచిన పిల్లలు
    నింతియ మఱి కా క వారలీ శు ని భక్తుల్ .

    రిప్లయితొలగించండి
  10. సభలో కౌరవులు ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే , ఏమీ చెయ్యలేక చేతులు కట్టుకుని ఉన్న పాండవులను ఉద్దేశించి ..

    వింత గనుచుండె తమ కుల
    కాంతనుసభకీడ్చ నోడె గౌరవమిక నో
    యింతిని గాచని వీరలు
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్

    రిప్లయితొలగించండి
  11. పంతులు గారడుగంగా
    సుంతైనను జంకులేక సునిలకుమారుం
    డెంతయు తడబడ కిట్లనె
    కుంతికి నైదుగురు సతలు గుణసంపన్నుల్.

    రిప్లయితొలగించండి
  12. స్వంతముగా వ్రాయు మనుచు
    పంతులు విద్యార్థి కిచ్చె పలకా బలపం
    కొంత మరచి వ్రాసె బుడుగు
    " కుంతికి నైదుగురు సుతలు గుణ సంపన్నుల్ "

    (😝 బుడుగు "త"కు కొమ్మివ్వడం మరచిపోయాడు )

    అంతట గలిగిరి పుత్రులు
    కుంతికి నైదుగురు ; సుతలు గుణ సంపన్నుల్
    యెంతైన గావలె ననుచు
    కుంతి దలచె నేమొ మదిని కూరిమి వలనన్ !

    (" తనకు కుమార్తెలు కూడ వుంటే ఎంత బాగుండును ! " అని కుంతి ఒక్కసారైనా తలచి వుండ వచ్చును గదా ! )

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులకు నమస్కృతులు.
    రెండు రోజులుగా నా కంప్యూటర్ మానీటర్ చెడిపోయి మిత్రుల పూరణలపై, పద్యాలపై స్పందించలేక పోయాను. మన్నించండి. ఇంతకు క్రితమే మానీటర్ రిపేర్ అయి వచ్చించి.
    *
    ఈనాటి సమస్య నిజానికి ‘కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నల్’ అని ఉండాలని గుండు మధుసూదన్ గారు ఫోన్ చేసి సూచించారు. కాని ఆ సమస్యను పంపిన మిత్రుడు తాను కావాలనే అలా ఇచ్చాననీ, కవులు ఎలా పూరిస్తారో చూద్దామనీ, మార్చవద్దనీ తెలిపాడు. అలాగే ఉంచాను. చూద్దాం ఎవరెవరు ఎలా పూరించారో...
    *
    పండిత నేమాని వారూ,
    ‘శకుని మాటల తడబాటు’గా పూరించారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    కుంతి తన కోడళ్ళను కుమార్తెలుగా భావించిదన్న భావంతో పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘గుణసంపన్నుల్’ అన్నదానికి అన్వయం లేదు.
    *
    నేమాని వారూ,
    ‘ధర్మరాజుకి ద్రౌపది మాత్రమే భార్య. వేరే ఏ భార్యయూ లేదు’ అన్నారు.
    పూర్వగాథాలహరిలో ‘ధర్మరాజునకు ద్రౌపది గాక స్వయంవరలబ్ధ యగునామె దేవిక యను భార్యయుఁ గలదు. ఈమెయం దాతనికి యౌధేయుఁ డను పుత్త్రుఁడు కలిగెను.’ అని ఉంది. ఇంకా ‘ధర్మరాజు భార్య పౌరవతి అనునామె. ఆమెయందు దేవకుఁడు అను పుత్త్రుఁడు కలిగెను. ధర్మరాజునకు ద్రౌపది యందుఁ బుట్టినవాఁడు ప్రతివింధ్యుఁడు’ అని కూడా ఉంది.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అది టైపాటు కాదు. కావాలనే అలా ఇవ్వడం జరిగిందిని తెలిపాను.
    తప్పించుకు వెక్కింరించే విధంగా ఉన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    ‘సుతులు’ అంటే సమస్య ఏముంది?
    అయినా సమస్యను కిట్టించిన విధానం బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీరు సుతులు అనుకొని పూరించినట్టు అనిపిస్తున్నది. పద్యం బాగుంది.
    *
    సుబ్బారావు గారూ,
    వింతైన మాటలుగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కళ్యాణ్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    తడబడ్డ విద్యార్థి సమాధానంగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా బాగున్నాయి. అభినందనలు.
    ‘పలక బలపముల్’ అంటే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  14. అవును మాస్టారూ, నా పూరణ కూడా "కుంతికి కూతుళ్ళు" యెట్లా అనే దాని మీదే ప్రాముఖ్యత చూపింది. ...గుణసంపన్నుల్ మామూలు మాటగా తీసుకొన్నాను. ఇచ్చిన మీ మిత్రుడు కూడా ఆ పాయింట్ యెట్లా పూరిస్తారనే కదా వేచి చూసింది:-)

    రిప్లయితొలగించండి




  15. ఇంతులు కలరైదుగురా
    కుంతీసుతులకును ,సతులు కోడళ్ళైనన్
    ఎంతయు బ్రేముడి నెంచున్
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నల్.

    రిప్లయితొలగించండి




  16. ఇంతులు కలరైదుగురా
    కుంతీసుతులకును ,సతులు కోడళ్ళైనన్
    ఎంతయు బ్రేముడి నెంచున్
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నల్.

    రిప్లయితొలగించండి




  17. ఇంతులు కలరైదుగురా
    కుంతీసుతులకును ,సతులు కోడళ్ళైనన్
    ఎంతయు బ్రేముడి నెంచున్
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నల్.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు.
    మరియొక పూరణ...

    కుంతియను లేమ కనియెను
    చింతించుచు బాబు కొరకు చేడియ వరుసన్
    వింతనక, నేడు చూడగ
    కుంతికి నైదుగురు సుతలు గుణసంపన్నుల్.

    రిప్లయితొలగించండి
  19. మరియొక పూరణ...

    వింతగ నొకటే కాన్పున
    కుంతికి నైదుగురు సుతలు, గుణసంపన్నుల్
    చింతయె లేదులె నేడా
    యింతులకే పెండ్లి జేసె నెంతో వేడ్కన్.

    రిప్లయితొలగించండి
  20. సంతానము పాండవులే
    కుంతికి నైదుగురు; సుతలు గుణసంపన్నుల్
    కుంతికి లేనే లేరని
    పంతము పట్టగలవుర ప్రభాకర శాస్త్రీ?

    రిప్లయితొలగించండి